మరోసారి గిడుగు రామమూర్తి -వ్యాసాలు, లేఖలు

[ఆగస్టు 29 – గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి.]

(ఈ వ్యాసం 2007 సెప్టెంబర్ లో జరిగిన డీటీఎల్సీ వారి సమీక్ష-చర్చకు సంబంధించినది. వ్యాసం ప్రచురణకు అనుమతి ఇచ్చిన డీటీఎల్సీ వారికి ధన్యవాదాలు. ఈ వ్యాసం కాపీరయిట్లు డీటీఎల్సీ వారివి – పుస్తకం.నెట్)

అడుసుమిల్లి శివ (ముఖ్య చదువరి)

ఈ సారి చర్చించిన పుస్తకం మన ప్రచురణ, ఆచార్యులు చేకూరి రామారావు, నడుపల్లి శ్రీరామరాజు గార్ల సంపాదకత్వంలో వచ్చిన మరోసారి గిడుగు రామమూర్తి -వ్యాసాలు, లేఖలు . 1986లో మొదటిసారిగా ప్రచురించబడిన ఈ పుస్తకం, ఎన్నో మార్పులతో, చేర్పులతో తిరిగి 2005 లో DTLC ప్రచురణగా వచ్చింది. తొలి తెలుగు భాషా శాస్త్రవేత్తగా రామమూర్తి పంతులిగారిని గుర్తించి, ఆయన జీవిత విశేషాలను, సాహితీ సేవలను వివరిస్తూ అనేకులు వ్రాసిన వ్యాసాలు, వారితో ఎందరో సాహితీవేత్తలు జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు ఇందులో ఉన్నాయి. స్వయంకృషితో తెలుగు భాషా శాస్త్రవేత్తగా మారిన పంతులుగారి భాషాభిమానాన్ని, శ్రీముఖలింగ శాసనాల్ని పరిశీలించి చరిత్రాధ్యయనాన్ని సాగించిన వారిలోని
చారిత్రకవేత్తని, అన్నిటికన్నా మిన్నగా వాడుక తెలుగును విశ్వవిద్యాలయస్థాయి పాఠ్యగ్రంధాల్లోనూ, పరీక్షా పత్రాల్లోనూ ప్రవేశపెట్టడానికి వారు చేసిన నిర్విరామ, నిరంకుశ కృషిని ప్రస్తుతిస్తూ వ్రాసిన వ్యాసాల్లో రామమూర్తి పంతులుగారి ప్రతిభ మనకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. పంతులుగారితో ఏకీభవించని వారితో సహా అందరూ ముక్తకంఠంతో వారి బహుముఖప్రతిభను గుర్తు చేస్తూ ఉంటే, తన కర్తవ్య నిర్వహణలో ఎందరిని తానొవ్వక ఒరులనొప్పింపక ప్రభావితం చేశారో అర్ధమౌతుంది. గాంధీగారి అస్పృస్యతా నివారణోద్యమానికి సుమారు 30 సంవత్సరాల ముందే అంటరానివారుగా పరిగణింపబడుతున్న సవరలను దగ్గరకుతీసి, సంఘబహిష్కృతులైనా లెక్క చేయకుండా వారి అభివృద్ధికి పాటుపడిన సంఘసంస్కర్త రామమూర్తి పంతులుగారు. ఆయన వ్యావహారిక భాషా వాదంలో కూడా ఈ రకమైన సంఘసంస్కరణే మనకు కనపడుతుంది.

అప్పట్లో ఒకటి అరా అగ్రవర్ణాల్లో తప్పిస్తే మిగిలినవారంతా ఇంచుమించు నిర్క్షరాస్యులే, ఆర్ధికంగానూ సాంఘికంగానూ వెనుకబడ్డవారే. ఈ ఊబిలోంచి వీరిని బయటకు లాగాలంటే అక్షరాస్యత ఒక్కటే మార్గమని పంతులుగారు గుర్తించారు. అయితే వాడుకలో ఏమాత్రం పరిచయంలేని గ్రాంధిక భాషలోనే విద్యావిధానం కూరుకుపోయి ఉండడం, దానితో పరిచయం కేవలం అగ్రవర్ణాలకే పరిమితమవ్వడం చూసిన పంతులుగారు, విద్యావిధానంపై గ్రాంధికభాషకున్న ఉడుం పట్టును ముందుగా బద్దలుగొట్టాలని గుర్తించారు. వాడుక భాష పాఠ్య భాషైనప్పుడు సామాన్య ప్రజానీకానికి విద్యాభ్యాసం ఎంత దగ్గరవుతుందో అప్పట్లో వారు గుర్తించి ముందుగా అట్నుంచి నరుక్కురావడం పై ఆయనకున్న అవగాహన ఉన్నవ లక్ష్మీనారాయణ గారికి ఒక సందర్భంలో చెప్పిన మాటల్లో తెలుస్తుంది (చూ. పేజి. 190). ఉన్నవగారు కాంగ్రెసును ఎలా అభివృద్ధి చేయగలరో వివరిస్తూ, “మీ స్వరాజ్య ఉద్యమంలోకి ప్రజలందరూ రావలెననేటట్లయితే ప్రజలందరూ మీ ఉద్యమాన్ని ముందుగా అర్ధం చేసుకోవలెను. మీరు ప్రతి గ్రామమూ పోయి ప్రచారము చేయలేరు. అంతేకాదు. అట్లా చేయడానికి అంతరాయాలు కూడా వస్తవి. మీ ఉద్యమమంతా వ్రాతతోనూ కరపత్రాలు ప్రకటించడముతోనూ సాగవలెను. మీరిప్పుడు రెండు కోట్ల డెబ్భైలక్షల మంది ఆంధ్రులను విద్యావంతులను చేయడానికి నా మతము అంగీకరించేటట్లయితే ఒక మాసము రోజులలో సాధ్యమవుతుంది. ముందుగా వ్యావహారిక భాషలో మీ కరపత్రాలన్నిటినీ వ్రాసి అచ్చొత్తించండి. ఆ తరువాత తెలుగు అక్షరాలు, గుణింతమూ ప్రతివారికీ నేర్పడానికి గ్రామానికొక ప్రచారకుణ్ణి
ఏర్పాటు చేయండి. అక్షరాలూ, గుణింతమూ మామూలు తెలివితేటలు గలవాడు నేర్చుకోడానికి వారము పదిరోజుల కన్నా ఎక్కువ పట్టదు. ఎప్పుడయితే అక్షరాలూ, గుణింతమూ వచ్చిందో ఆ క్షణము నుంచీ మీ కరపత్రాలు మొదలయినవి
చదువుకోగలుగుతాడు. ఇంతకన్నా దేశములో విద్యవ్యాపింపజేయడానికి సులభమార్గము లేదు.”

వ్యావహారిక భాషోద్యమం ఆయనకు కేవలం భాషా ఉద్యమం మాత్రమే కాదు. అది ఒక ప్రచ్ఛన్న మహాసంఘసంస్కరణోద్యమం. బహుశః అది గుర్తించేనేమో అంతమంది పండితులు ఆయనకు ఎదురుగా పోరాడారు! తెలుగు భాష మనుగడ గురించి వ్యధ
చెందుతున్న ఎందరో భాషాభిమానులకి ఈ పుస్తకం ఎంతో స్ఫూర్తినిస్తుందనడానికి సందేహం లేదు.

2009 లో ఇదే రోజు గిడుగు రామమూర్తి పంతులు జీవిత చరిత్రపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవండి.

ఈ పుస్తకం ఏ.వీ.కె.ఎఫ్ సైటులో కొనుగోలుకు లభ్యం.

You Might Also Like

Leave a Reply