The Fifth Act – ఇంగ్మార్ బెర్గ్మాన్ నాటకాలు
“Images from his work shock us … and haunt us long after we’ve first seen them…” – అని Bergman గురించి ఎవరో అన్న మాట. మిగితా వారి విషయంలో ఏమో కానీ, నా విషయంలో మాత్రం, వీళ్ళెవరో నా మనసు చదివినట్లే మాట్లాడారు. ప్రముఖ స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమాలు ప్రపంచ సినిమా రంగంలో ఎందరికో ప్రేరణను కలిగించాయి..ఎందరినో ప్రభావితం చేశాయి. అయితే, బెర్గ్మాన్ ఒక దర్శకుడే కాదు.. రచయిత కూడా. తన సినిమాలు, వాటి తాలూకా స్క్రీన్ ప్లేలు కాకుండా అనేక నాటకాలు కూడా వ్రాశాడు. ప్రస్తుతం ప్రస్తావిస్తున్న పుస్తకం – ఆయన “mature years” (ఇది ఈ పుస్తకం గురించి విమర్శకులు వాడే పదం. ఇంతకంటే గొప్పగా నేను చెప్పలేను కనుక అదే వాడుతున్నాను.) లో రాసిన మూడు నాటకాల సంపుటి. మూడూ సినిమా, నాటకరంగాలకి సంబంధం ఉన్న కథాంశాలే. మొట్టమొదటిసారి ఈ పుస్తకం 2012 ఫిబ్రవరిలో అనుకుంటాను, మొదలుపెట్టాను. మొదటి రెండు నాటకాలూ చదివి ఆపేశా. ఇటీవలే ఒక వర్షం పడుతున్న ఆదివారం మళ్ళీ పుస్తకం మొదట్నుంచి చదివి పూర్తి చేశాను.
మూడు నాటకాలూ విడివిడిగా పరిచయం చేస్తాను. వీటికి ముందు బెర్గ్మాన్ రాసిన స్వగతం ఒకటుంది. అది కూడా ఒక నాటకం లాగే సాగుతుంది నిజానికి. కనుక, ఈ పుస్తకంలో నాలుగు నాటకాలున్నవి అనాలేమో!
Bergman’s monologue
ఇది ఈ పుస్తకానికి ముందుమాట కావాల్సినది. కావాల్సినది అని ఎందుకంటున్నా అంటే అయితే, మధ్య మధ్యలో నాటకాల తరహాలో – ఈ సీన్ లో ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ శబ్దాలు వినవస్తాయి..ఇక్కడ కథకుడు ఇలా చూస్తాడు..ఇలాంటి వర్ణనలు కూడా ఉంటాయి కనుక, ఇది కూడా ఒక మినీ నాటకంలా అనిపిస్తుంది చదివే వాళ్ళకి. బెర్గ్మాన్ తనకి చదవడం పై ఉన్న ఆసక్తి గురించి, తాను ఎలా రాయడం మొదలుపెట్టాడు? నాటకం రాయడానికి కథాంశాలు ఎలా ఎంచుకుంటాడు? తన సినీ ప్రస్థానం ఎలా సాగింది? తన ఆలోచనల్లో తరుచుగా మెదిలేవి ఏవి? వీటికీ ఈ నాటకాలకీ సంబంధం ఏమిటి? ఇలా..ఒక నేపథ్యం వివరిస్తాడు ఇందులో.
Play 1: After the Rehearsal
ఒక సీనియర్ నాటక రచయితకూ, అతని స్నేహితుడు-స్నేహితురాళ్ళ కుమార్తె అయిన ఒక యువనటికీ మధ్య జరిగే సంభాషణలా సాగుతుంది ఈ నాటకం. ప్రధాన పాత్రలు ఇవి రెండే అయినా, మధ్యలో గతం నుండి ఇంకో పాత్ర కూడా వస్తుంది కాసేపు. అతనూ, ఆమే, వీళ్ళ మధ్య ఆమె బిడ్డకి కాబోయే తండ్రీ, ఆమె తల్లికీ ఈ నాటక రచయితకూ గతంలో ఉన్న స్నేహమూ…అతని మెదడులో గతం, వర్తమానాల మధ్య తిరుగుతున్న ఆలోచనలు, ఆ యువనటికీ ఇతనికీ మధ్య ఉన్న ఆకర్షణ… ఆమె advances ని అతను హ్యాండిల్ చేసిన విధానం – ఇవీ ఈ నాటకంలో మూలాంశాలు. మధ్య మధ్యలో నాటక రంగం గురించి, ప్రదర్శనలు ఇవ్వడం గురించి, నటన గురించి, నటుల గురించి గొప్ప అనుభవంతో కూడిన వ్యాఖ్యానాలు – ఈ నాటకాన్ని ఆసక్తికరంగా ఉంచే అంశాలు అని నా అభిప్రాయం. ఆట్టే “కథ” అని ప్రత్యేకంగా లేకపోయినా, కథనం మాత్రం ఎక్కడికక్కడ తర్వాత ఏమిటి? అన్న ఉత్కంఠనీ, అలాగే వీళ్ళ క్లిష్టమైన అనుబంధాల గురించి ఆలోచననూ కలిగించింది.
అయితే, ఈ నాటకంతో పోలిస్తే నాకు తక్కిన రెండూ బాగా నచ్చాయి.
Play 2: The Last Scream: A Slightly Skewed Morality Tale
ఈ నాటకంలో ప్రధాన పాత్రలు నిజజీవితంలో ఉన్న పాత్రలే. కానీ, ఒక కాల్పనిక వాతావరణంలో జరుగుతుంది కథ మొత్తం. Georg af Klercker అని ఒక స్వీడిష్ నిశబ్ద చిత్రాల దర్శకుడు ఉండేవాడట. ఆయన, 1900 ల తొలి నాళ్ళలో మూడేళ్ళలో వరుసగా 25 సినిమాలు తీసి, విపరీతమైన ఖ్యాతినార్జించి ఉన్నట్లుండి మాయమైపోయాడు. కొన్నాళ్ళ తరువాత సినీ రంగానికి తిరిగి వచ్చినా విజయాన్ని చవిచూడలేకపోయాడట. ఇలాగ అట, అట అని ఎందుకంటున్నా అంటే, ఇతని గురించి నాకు ఆంగ్లంలో ఆట్టే సమాచారం దొరకలేదు. బెర్గ్మాన్ నాటకానికి ముందు రాసిన నాలుగు ముక్కలే ఇతని గురించి నాకు తెలిసిన కథ!
మొత్తానికి, నాటకం కథాంశం – Klercker తన ఒకప్పటి స్నేహితుడు, ఇప్పుడు సినీ రంగాన్ని శాసిస్తున్న movie moghul అయిన Charles Magnusson ని కలవడానికి అతని ఆఫీసుకి వెళ్తాడు. అక్కడేం జరిగింది? అన్నది కథ ఈ నాటకానికి. నిజానికి అది కథ కాదు ఏకపాత్రాభినయం అనాలి. ఎందుకంటే, నాటకం మొత్తం రకరకాల భావోద్వేగాలకి లోనవుతున్న Klercker ఏకధాటిగా మాట్లాడుతూనే ఉంటాడు. అక్కడోటీ, ఇక్కడోటీ మాగ్నస్సన్ ముఖ కవళికల గురించి ఇతను చెప్పే వ్యాఖ్యలే తప్ప, చివరి దాకా మాగ్నస్సన్ కి డైలాగులు లేవు. చివ్వర్లో ఏదో ఒకట్రెండు వాక్యాలంతే! Klercker ఏమో : ఒక పక్క స్నేహితుడంటాడు… ఒక పక్క “ప్లీజ్ ప్లీజ్…నాకో ఛాన్స్ ఇవ్వు” అంటాడు, ఒక పక్క “నీ రహస్యాలన్నీ నాకు తెలుసురా!” అంటాడు…”ఒక పక్క… తుపాకీ గురిపెట్టి కాల్చేస్తా అంటాడు”…. నాకేమో ఒక వైపున Klercker ఒక failure లాగా కనిపిస్తాడు. ఒకవైపు desperate అనిపిస్తాడు. మరో పక్క చాలా ధైర్యవంతుడిలా కనిపిస్తాడు… మరోవైపు పిచ్చివాడేమో? అనిపిస్తుంది. ఒకవైపు he did it! he did it!” అన్న భ్రాంతి కూడా కలిగింది నాకు… what is it? అన్న దానికి సమాధానం తెలియకపోయినా! ఇతగాడు ఇన్ని మాట్లాడుతూ ఉండగా, మాగ్నస్సన్ నోరెత్తకుండా చూస్తూంటాడు. మరి అతగాడు ఇతన్ని ఎందుకు రమ్మన్నాడు…రమ్మన్నాక తానున్న స్థాయిలో ఇతగాడ్ని గెంటేయగలిగి కూడా చివరి దాకా ఆ నాన్సెన్స్ అంతా ఎందుకు భరించాడు? ఇతగాడు ఎందుకొచ్చాడు? ఎందుకెళ్ళాడు? – ఇలాంటి ప్రశ్నలు బహుశా చివరికి ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు గానీ, ఆ పాత్రలు మట్టుకు వెంటాడతాయి.
అలాగే, సినిమా రంగం గురించి, అందులోని వ్యక్తుల గురించి Klercker వ్యాఖ్యలు, అనుభవాలు కూడా చాలా ఆసక్తి కరంగా ఉంటాయి. అతని గురించి ఆలోచనలో పడిపోక తప్పదు నాటకం ముగిసేవేళకి. రెండుసార్లు చదివాను గత సంవత్సర కాలంలో. రెండుసార్లూ What happened to Klercker? అన్న ప్రశ్న నన్ను వెంటాడింది. అన్నట్లు, డైలాగు లో చాలా చోట్ల – ఇది కెవ్వు, ఇది కేక… అనుకున్నా, ఒక్కటి మాత్రం జయాపజయాల ప్రసక్తిలేకుండా ప్రతి దర్శకుడి మనసులోనూ ఉండే ఆలోచన కాబోలు అనిపించింది. అది, Klercker తన మిత్రుడితో అనే ఈ మాట:
“I make my films, Charlie. I do my lighting, place my camera angles and I tell the actors to walk this way and do this, and there you’re supposed to cry and there you’re in a rage, and we keep on doing it and keep it up like the very devil and we never give up. And then the audience sits there one evening, and if we’re lucky they’ll cry where we decided they would cry and laugh when we want them to – right. You know all that. That is the whole mystery, Charlie”
గొప్ప నటులు జోడైతే, తెరపై చూట్టానికి అద్భుతంగా ఉంటుందనుకుంటా ఈ నాటకం!
Play 3: In the Presence of a Clown
ఈ కథలో కూడా ప్రధాన పాత్రలు చాలామటుకు నిజజీవిత పాత్రలే! అయితే, కథనం మాత్రం fictitious అనుకుంటాను… ఈ విషయం నిర్థారణగా చెప్పలేను. నాకు అర్థం కాలేదు. ఇందులో ముఖ్యమైన పాత్రలు – బెర్గ్మాన్ మేనమామ (అతని తల్లి కి సవతి-అన్న) అయిన Uncle Carl (అసలు పేరు: Carl Åkerblom), అతని భార్య Pauline. Uncle Carl ప్రస్తావన బెర్గ్మాన్ ఆత్మకథ లో కూడా కొన్నిసార్లు వచ్చింది. అలాగే, బెర్గ్మాన్ ఇతర సినిమాల్లో ఒకట్రెండింటిలో కూడా కనిపిస్తాడు ఈయన. ఇతర పాత్రల్లో కొద్ది నిముషాల పాటు – కార్ల్ సవతి తల్లి Anna Åkerblom, ఆవిడ కూతురు Karin Bergman కూడా కనిపిస్తారు. కరిన్ ఇద్దరు కొడుకుల (అంటే Ingmar Bergman కూడా) ప్రస్తావన indirect గా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే – ఇది వాస్తవ కథనాల ఆధారంగా, బెర్గ్మాన్ మార్కు creativity తో తీసిన కథేమో! అని.
కథ Uppsala University Hospital Psychiatry Department లో మొదలవుతుంది. కార్ల్ అక్కడ ఇన్-పేషంటు. తన ప్రేయసి పౌలిన్ ను చంపడానికి ప్రయత్నం చేసినందువల్ల మానసిక చికిత్స కోసం అక్కడ చేర్పిస్తారు. అక్కడే మరొక పేషంటు Vogler కలుస్తాడు. వీళ్ళు కలిసి Franz Schubert జీవితాన్ని ఒక fictitious love storyగా సినిమా తీసి, దాన్ని ప్రదర్శించాలి అనుకుంటారు. ఆ ప్రదర్శన, అక్కడి పరిణామాలు… కార్ల్ లో మధ్యమధ్యలో ఉన్నట్లుండి చెలరేగే ఉద్వేగాలు, అతని visions (అతనికి ఏదో మానసిక వ్యాధి కానీ, అదేమిటి? అన్నది ఎక్కడా స్పష్టం చేయరు.), వీళ్ళ మధ్య, అలాగే కార్ల్ కి, “టేబుల్ దగ్గర యాపిల్ పండును చూస్తూ తెల్లటి గౌనులో చూట్టానికి clown లా కనిపిస్తున్న” మృత్యుయువతికీ జరిగే సంభాషణలు – ఇదీ ఈ నాటకం కథ.
వీటన్నింటినీ కథనంలో బంధించిన విధానం ఈ నాటకాన్ని వెంటాడే నాటకంగా మార్చాయి (నా అభిప్రాయంలో… నా మట్టుకు నన్ను వెంటాడే నాటకంగా!). కార్ల్-మృత్యువు సంబంధం మరీ shocking గా అనిపించే అవకాశం లేకపోలేదు… కానీ, Bergman తీరే అంత. అలాంటి అవాక్కయ్యే, క్లిష్టమైన పదచిత్రాలకి కి నేను ఈసరికి అలవాటు పడిపోయాను కనుక, ఆట్టే ఉలిక్కిపడలేదు. ఒక్కొక్కసారి అర్థం చేసుకోవడం కంటే ఆ దృశ్యాన్ని picturise చేసుకుని feel అవడం ప్రధానమవుతుంది. బెర్గ్మాన్ విషయంలో నా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంటుంది. This is so Bergman like! అనిపించింది. ఈ నాటకం చదివాక – దానిలోని కథని వివరించడమూ, పఠనానుభవాన్ని వివరించడమూ నాకు ఇంతకంటే చేత కాదు కానీ – కల్పనని, వాస్తవాన్ని కలిపేసి, ఏది కల్పన? ఏది వాస్తవం? ఏది అతివాస్తవం? ఏది అధివాస్తవం? అన్న borders blur అయిపోయాయి అని మాత్రం చెప్పగలను. కార్ల్-పౌలీన్ ల మధ్య అనుబంధం, అలాగే మరొక ఇన్-పేషంటు వోగ్లెర్, అతని భార్య ఎమ్మాల మధ్య అనుబంధం – రెండూ అద్భుతాలలాగ అనిపించాయి నాకు.
ఈ నాటకాన్ని గురించి బాగా రాశారు అని నాకు అనిపించిన ఒక వ్యాసం ఇక్కడ. ఈ వ్యాసంలో “A parable about life, death, madness, and art, In the Presence of a Clown functions as a summation of all the themes that have obsessed Bergman throughout the years.” అంటూ సాగిన రెండు వాక్యాలు – ఈ నాటకం గురించి కరెక్ట్ వర్ణన నా దృష్టిలో. ప్రదర్శనగా చూస్తే బహు గొప్పగా ఉంటుందనుకుంటాను.
ఈ Vogler, Egerman పేర్లు Bergman కథల్లో తరుచుగా కనబడతాయి..ఎందుకో మరి!
***
Bergman మాటల్లో ఈ పుస్తకం గురించి చెప్పాలంటే:
“I wrote the texts in this book without giving a thought to their possible media, using a method something like that of the harpsichord sonats by Bach – though they are otherwise not comparable. They can be played by string quartets, wind ensembles, guitar, organ, or piano. I wrote them in the way I have been accustomed to writing for more than fifty years – it looks like drama but could just as easily be film, television, or simply texts for reading. It was by chance that “After the rehearsal” was made into a film for television and that “The Last Scream” was produced for stage. It was also my intention that “In the presence of a clown” should be played in the theater. .. .. “The Fifth Act” deals with my indefatigable companions: the stage, actors and film, movie theaters, cinematography…”
ఈ మూడు/నాలుగు నాటకాలు గొప్ప స్క్రీన్ ప్లేలు అవుతాయేమో ఇలాంటి కథాంశాలను మన పరిస్థితులకి మార్చి (అదే, ప్రేరణ పొంది) రాస్తే! అనిపించింది. మొత్తానికి, ఈ తరహాలో సాగే రచనలు మిమ్మల్ని ఆకట్టుకునే పక్షంలో (ఈ పుస్తకం మీకు లభ్యమయ్యే పక్షంలో) తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
***
పుస్తకం వివరాలు:
The Fifth Act
Ingmar Bergman
Translated by: Linda Haverty Rugg and Joan Tate
The New Press, New York, 2001
అమేజాన్.కాం వారి కొనుగోలు లంకె ఇక్కడ.
Leave a Reply