“ప్రక్కతోడుగా నడిచే కథలు” టి.శ్రీవల్లీరాధిక గారి ‘తక్కువేమి మనకూ’
వ్యాసకర్త: డాక్టర్ మైథిలి అబ్బరాజు
************
శ్రీవల్లీరాధిక గారి కథలు చదువుతూ వుంటే పొగడపూలూ తులసీదళాలూ స్ఫురించటం యాదృచ్ఛికం కాదు. రచయిత్రి భావప్రపంచపు పరిమళం అదే. గడిచిన పదిహేను పదహారేళ్లుగా తను చేస్తూ వున్న సాహిత్య ప్రయాణాన్ని గమనించటం మంచి అనుభవం.
కథని ఇంత సరళంగా నిర్మించటం సులభంగా సిద్ధించేది ఎంతమాత్రమూ కాదు. రచయిత్రి దాన్ని అప్రయత్నంగా సాధించివుంటారనీ అనుకోలేము, కాని ఈ అలవోకతనం ముచ్చటగా వుంది. తను ఏం చెప్పదలచుకున్నారో ఎంత బాగా తెలుసో ఎలా చెప్పాలో కూడా అంత రూఢిగానూ ‘తెలిసి’ రాసిన కథలివి. ఈ కాంతి కేవలం అన్నమయకోశంలో అందేది కాదు.
రచయిత్రి అన్నిసార్లూ బీరుపోకుండా పాఠకుల better self ని గురి చూస్తారు. ఈ కథానాయకులూ నాయికలూ అందరానివారుగా అనుకోవటం ఎవరిని వారు తగ్గించుకోవటమే. అన్ని విధాలయిన బలహీనతలనీ సహించి సమర్థించడం వర్తమాన సాహిత్యంలో వున్నా ఇప్పుడు రాధికగారి మాటలు ఔషధప్రాయంగా వినిపిస్తున్నాయి. ఈవిడ ఆశించే ఆరోగ్యంలో కూడా ఏ వెలితీ లేదు, అది చాలావరకు పరిశుభ్రత మీద ఆధారపడినది! వైద్యశాస్త్రంలో social and preventive medicine కీలకమయిన అంశం. ఈ కథలు అలాంటివి. తక్కువేమీ మనకూ ఈమె ప్రచురించిన నాలుగవ కథా సంపుటి. ఇందులో పన్నెండు కథలున్నాయి.
సనాతన ధర్మాన్ని అనుసరించే నిర్మలమయిన జీవన విధానాన్ని చిత్రిస్తాయి దాదాపు అన్ని కథలూ. చిక్కుముడులు విప్పటమే కాదు, అసలు చిక్కులే రాకుండా ఎలా జీవించవచ్చునో హితవు చెప్తాయి.
మొదటికథ గురుత్వం. ఇహమూ పరమూ పరస్పర విరుద్ధాలు కావనీ, ఆముష్మికం కోసం నేర్చే చదువు ఐహికానికి కూడా వర్తింపచేసే సులువు వుంటే చాలుననీ చెప్తారు రచయిత్రి. సహధర్మచారిణి కథ లో ఒక ఇల్లాలి అభద్రతకి కారణం ఆమెకి ‘స్వేచ్ఛ’ ఇచ్చి సహకారం కోరకపోవటం అని ఆమె భర్త తో పాటు మనమూ తెలుసుకుని విస్తుపోతాము.. ‘ఇంతలో వుందా’ అని.
శ్రద్ధ అనే కథ చాలా ధైర్యంగా రాసినది. సంప్రదాయాలకీ విశ్వాసాలకీ కేవలం వర్తమానానికి వర్తించే నిర్వచనాలు ఇవ్వటం తెలివి తక్కువతనమనీ వాటి పరిధిని తెలుసుకోలేకపోతే ఆచరణ ఒక్కటే చాలుననీ చెప్పటానికి చాలా ధైర్యమే కావాలి. ఏ విధమయిన అస్పష్టతా లేని నిబ్బరం రాధిక సాధించారు కనుకే ఆ ధైర్యం. నియమాలూ నిబద్ధతలూ జీవితాన్ని సుగమం చేసి సృజనకీ తోడ్పడతాయని మనమంతా మరిచిపోయి చాలా కాలమే అయింది కనుక ఇప్పుడు కొత్తగా తిరిగి తెలుసుకోవచ్చు!
‘సత్యం’ కథలో సత్యాన్ని దర్శిచటం, ఆచరించటం మధ్య వున్న అంతరాన్ని చాలా చాలా సరళంగా మనం ఊహించని పాత్ర నోట వింటాము, తలఒగ్గుతాము. ఈ విషయమే మరింత బలంగా ‘ఎంపిక‘ కథ చెప్తుంది. మనం చేసే పోరాటాలు మన మీదికే తిరిగితే పట్టుకోవాలా వాటిని విడిచి పెట్టాలా? ఆ పాత్ర తో పాటు మనమూ బెంబేలు పడిపోతాము. రచయిత్రి అలా మనల్ని వదిలివేయరు, దారి చూపిస్తారు.
సంపుటిలో చాలా ముఖ్యమయిన కథ ‘లోభం‘. అస్తమానమూ గడియారం చూసుకుంటూ దాచుకున్న సమయాన్ని ఏమి చేసుకోవాలో తెలిసే వివేకం లేకపోతే ఎలా వుంటుందో సుతిమెత్తగా చెప్తారు. ఆ వెంపర్లాట లేనివాళ్లకి ఎంత హాయిగా వుంటుందో కూడా. నియమాలే లేని జీవనశైలి కాదు అది, నియమాలని పాటిస్తూనే అనుకోని విషయాలకి కూడా అవసరమయితే చోటు ఇవ్వగలగటం.
‘తక్కువేమి మనకూ‘ కథలోని నిత్య లాంటి కూతురో కోడలో ఒక దివ్యాశీర్వచనం వల్ల కానీ లభించరనిపిస్తుంది. బ్రతికేందుకు ధనం కావాలి, అది సరిపడినంత చాలు.. ఎక్కువ సంపాదించేందుకు ఏ విలువలూ వదులుకోనక్కర్లేదు. ఇది అంత చిన్న వయసులో తెలుసుకోవటం ఆమె ఆత్మశక్తి అనిపించినా శ్రీరామచరణాల శరణమే తనని అలా దిద్దిందని తనే చెప్తుంది. చదువుతూ వున్న మనకి కూడా ‘ఆహా’ అనిపిస్తుంది. ‘ఎల్లల నడుమ‘ కథ ఒక అన్వేషణ, ఒక ప్రయత్నం. యాంత్రిక జీవితంలోనే కాదు, గతం లోకి ప్రయాణించటంలోనూ శాంతి వుండదేమో అనిపించటం ఎందుకు? ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకుని జవాబు కోసం వెతకాలి. ‘శ్రీమాత్రే నమః‘ జనని నుంచి జగజ్జనని ని తెలుసుకోవటం. ఇంత చక్కటి పాఠాలు కదా తల్లులు పిల్లలకి నేర్పవలసింది! అంతకు ముందు ఆ తల్లులకీ తెలియాలి ఆ సంగతులు!
‘విముక్తి ‘ కథ గొప్పది. మనసుకి నచ్చినవి చేస్తూ పోతే అలా ఎన్నాళ్లు? తెచ్చుకోవలసినది నిగ్రహం కాని కొత్త ఆరాటాలు కానేకాదు. ఇద్దరు విరుద్ధులయిన సహోద్యోగుల మధ్యన జయంతి ముందు ఎవరివైపు మొగ్గుతుందో అక్కడ వ్యతిరేక పరిస్థితులు ఎదురయినప్పుడు ఎలా నీరసపడిపోతుందో ఆసక్తికరంగా చెప్పుకొస్తారు రచయిత్రి. విదేశయానం, ఉద్యోగం లో ఉన్నతి .. ఇవి పుట్టబోయే పాప కన్న ఎక్కువనుకునే తనకి తల్లి అమాయకంగా చెప్పే మాటల వెనుక ఎంత సంప్రదాయ స్థైర్యం వుందో కాస్త ఆలోచిస్తేగాని అర్థమవదు. జయంతి కి నచ్చటం మొదలుపెట్టిన మరొక సహోద్యోగిని ప్రియ నిజంగా బంగారుతల్లి. ఆమెలో నూతనమనిపించే సనాతన దృక్పథానికి, అది ఇచ్చే ప్రశాంతతకీ లోబడిపోతాము జయంతితో పాటు మనమూ.
‘సత్యానికి చేరువగా‘ రచయిత్రి ఎక్కిన శిఖరాలను చూపిస్తుంది. ఆధ్యాత్మికత ఇచ్చిన కరావలంబనతో సత్యం సాధించిన నిశ్చలత అంత ఎత్తయినది. ఆత్మీయులని కోల్పోవటం ఎన్ని దశలుగా ఒకరి మీద ప్రభావం చూపుతుందో ఆ దశలన్నిటినీ ఒక్క అంగలో అతను దాటటం ఆమె రాసిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. అది ఎంతమాత్రమూ అసాధ్యం కాదని తెలుసుకోవటం చక్కగా కళ్లు తెరిపిస్తుంది. అసాధారణమయిన మామయ్య, భర్త దాటిపోయిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించిన అత్తగారు, తన అపరాధ భావనలని తమ్ముడిమీద నిరసనగా ప్రదర్శించే అన్న, సాక్షిభూతురాలయిన అక్క, చివరికి సరయిన నిర్ణయం తీసుకున్న తల్లి… అందరూ ఎదటే తిరుగుతూ కనిపిస్తారు. ‘సౌందర్యం‘ చివరి కథ. ఆశా నిరాశా లేని దృఢత్వం ఒకరిది. ఆశ నిరాశల మధ్య తూగిపోయే మనసు మరొకరిది.ఏ మీ ఎదురుచూడని వారికి ఎదురయిన ప్రశంస లోని సౌందర్యం విస్మయపరుస్తుంది.
చదవటం మొదలుపెట్టిన పాఠకులూ అన్నీ చదవటం ముగించిన పాఠకులూ ఒకరు అవరు. ఈ కథల సారం వారిని వదిలిపోదు. కలిసి నడిచే, దారి చూపే తోడు రాధిక సాహిత్యం.
(పుస్తకం వెల 90 రూపాయ లు విశాలాంధ్ర, నవోదయ, సాహిత్య నికేతన్ (కాచిగూడ) లలోనూ, కినిగే లోనూ లభిస్తుంది.)
Dr. C. Jaya Sankar Babu
మైథిలి గారి కథాసంగలనం తక్కువేమి మనకూ గూర్చిన సమీక్ష ఆకర్షణీయం. రచయిత మైథిలి గారికి, సమీక్షకులు డాక్టర్ మైథిలి అబ్బరాజు గారికి హృదయపూర్వక అభినందనలు. పుస్తక వెల, పుస్తకం దొరికే చోటు తో పాటు పుస్తక ప్రచురణకర్తల చిరునామా, పుస్తకం ప్రచురితమైన సంవత్సరం కూడా సూచిస్తే బాగుంటుంది. భవిష్యత్తులో పుస్తకం.నెట్ ఈ వివరాలు పొందుపరచేందుకు సమీక్షకులను ప్రోత్సహించగలరు. – సి. జయ శంకర బాబు
Dr. C. Jaya Sankar Babu
మైథిలి గారి “తక్కువేమి మనకూ” కధల సమీక్ష చాలా బావుంది. రచయిత మైథిలి గారికి, సమీక్షకులు డాక్టర్ మైథిలి అబ్బరాజు గారికి హృదయపూర్వక అభినందనలు. పుస్తక వెల, పుస్తకం దొరికే చోటు తో పాటు పుస్తక ప్రచురణకర్తల చిరునామా, పుస్తకం ప్రచురితమైన సంవత్సరం కూడా సూచిస్తే బాగుంటుంది. భవిష్యత్తులో పుస్తకం.నెట్ ఈ వివరాలు పొందుపరచేందుకు సమీక్షకులను ప్రోత్సహించగలరు. – సి. జయ శంకర బాబు
P. Lalitha Rani
మైథిలి గారి “తక్కువేమి మనకూ” కధల సమీక్ష చాలా బావుంది. అన్ని కధలనూ విడమర్చి చెప్పిన తీరు పుస్తకాన్ని వెంటనే చదవాలనిపించే ఆసక్తిని రేకెత్తించింది. మైథిలి గారికి హృదయపూర్వక అభినందనలు.
mythili
ధన్యవాదాలండీ
kameswari yaddanapudi
మైథిలి గారు
మీ సమీక్ష ఎంతొ బాగుంది. తెలుగు సాహిత్యలోకం మిమ్మల్ని పిలుస్తోంది . అన్నమయకోశాన్ని గూర్చి మాత్లాదగల, భావించగల వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇంకా రాయండి
mythili
ఇది శృతపాండిత్యం మాత్రమేనండీ..
mythili
ధన్యవాదాలు సర్…చాలా సంతోషం నాకు మీ మాటలు వినటం నాకు !
S. Narayanaswamy
చాలా బావుందండీ. పుస్తకం చదవాలనే ఆసక్తి పెరిగేట్టు రాశారు పరిచయం. మీరు మరిన్ని పరిచయాలు, సమీక్షలు రాయాలని నా కోరిక (కొత్త కథలు కూడా).
సమస్యలని ఎత్తి చూపడమే కథా సాహిత్యంగా ఇప్పుడు తెలుగు కథలు చెలామణి అవుతున్నాయి. ఆనందమయమైన జీవితాన్ని గ్లోరిఫై చేసే మంచి కథలు రావాలి. శ్రీవల్లీ రాధికగారి రచన ఆ దిశగా సాగుతున్నట్లు తెలుస్తున్నది.