మనసు తడి ఆరనీకు – ఓం ప్రకాష్ నారాయణ వడ్డి కథలు
వ్యాసకర్త: శ్రీ అట్లూరి
*******
సినీ జర్నలిస్ట్ గా, కార్టూనిస్ట్ గా అన్నిటికి మించి హ్యూమనిస్ట్ గా మనకి పరిచయం ఉన్న ఓం ప్రకాష్ గారిని మనకి మరింత చేరువ చేసే కథలు ఈ మనసు తడి ఆరనీకు కథల పుస్తకం . దీంట్లో మొత్తం ఇరవై మూడు కథలు, రెండు ముందు మాటలు, రెండు పరిచయ వ్యాసాలు ఉన్నాయి.
ఓం ప్రకాష్ గారికి మన దేశం అన్నా మన సంస్కృతి అన్నా బోలెడు ప్రేమ. అలాగే స్త్రీ జన పక్షపాతి. కథల్లో ఆడవాళ్ళ మీద ప్రేమ, అభిమానం, గౌవరవము మెండుగా కనపడతాయి.
మొదటి కథ నాణానికి రెండో వైపు కథ మగవారికి భుజాలు తడుముకునేలా అనిపిస్తుంది, అలాగే రెండో కథ దిల్ హాయ్ తో – బస్ అమ్మాయిలు పరాయి రాష్ట్రంలో భాష తెలీకపోయినా ఎలా పాలల్లో చెక్కర లాగ ఇమిడి పోతారో తెలియ చెప్పడమే కాక మనందరిది ఒకటే భాష ఒకటే దేశం అన్నది స్పష్టంగా బలంగా చెప్పే కథ. మంచి కథ.
మూడో కథ అమ్మ అమ్ముడు పోలేదు. ఇది నిజం అమ్మ ఎప్పటికి అమ్ముడు పోదు. ప్రతి ఒక్కరికి తాము కట్టుకున్న ఇంటిమీద ఉండే మమకారం, ప్రేమ, అనుబంధం ఆవిష్కరించే కథ. ఇది చాల మంది ఇళ్ళల్లో జరిగే కథ. సొంత ఇల్లు అమ్మవలసి వచ్చిన ప్రతి వారికి ఉండే వ్యథ. ఇల్లు అంటే పేర్చిన ఇటుకలు కాదు పేర్చిన జ్ఞాపకాలు అని చెప్పే కథ.
నాలుగో కథ దారి తప్పిన కోయిలా..రా ఇలా, ఐదో కథ అత్మావలోకనం .. ఈ రెండు కథల్లో దాదాపుగా కథ ఒక రకమైన కథే. మొదటి కథలో విదేశి వ్యామోహాన్ని వదిలి మరదలి గీతోపదేశంతో దేశానికి వచ్చి దేశసేవ చేసే రాము. రెండో కథలో గ్రామం నుంచి వచ్చి పట్టణంలో బాగా సంపాదించి, అన్నివదిలి గ్రామానికి తరలి వెళ్ళాలి అనుకున్న సుధాకర్ కథ.
ఆరో కథ జాలి కోల్పోయిన మనిషి ఒక మనిషి తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి చివరి రోజుల్లో ఆసరా కోసం వెతకడం ఈ కథ. ఇది చదువుతుంటే నాకు ఒక రకంగా కొండపల్లి సీతారామయ్య గారి సంగతి గురుతుకు వచ్చింది కొన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా.
ఏడో కథ కోరిక, ఎనిమిదో కథ రేపటి పౌరుడు సమాజం పట్ల మన బాధ్యత గుర్తు చేసే కథలు. రెండు కథల్లో కూడా కథ రైలు ప్రయాణంతో ముడి పడి ఉన్నాయి. కొంచం తేడాతో సమాజానికి మనవంతు ప్రయత్నంగా ఏం చెయ్యగలమో చెప్పే కథలు రెండు కూడా.
తొమ్మిదో కథ ఓ కోకిల పునరాగమనం. ఈ కథలలో నాకు నచ్చని కథ ఇది ఒక్కటే. ఈ కథ లో ఓంకార్ మార్గరెట్ అన్న కన్వర్ట్ డ్ క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని తండ్రి కి హిందూ మతం మీద ఉన్న ప్రేమ, భక్తీ గమనించి మార్గరెట్ తో ప్రేమ కి స్వస్తి చెప్పాలనుకుంటున్న సమయం లో ఆ అమ్మాయి హిందువు గా మారడం తో పెళ్లి కి సిద్ధం అవుతాడు. చాల కారణాల వల్ల ఈ కథ నాకు నచ్చలెదు. ఇది ఇంకా maturity తో వ్రాయవచ్చు ఏమో అనిపించింది.
పదో కథ అంతర్నేత్రం, పదకొండో కథ సత్యం బ్రూయాత్. అంతర్నేత్రం కళ్ళు ఉండి మనం రోజు చాల వరకు చూసి కూడా చూడనట్టు గా వెళ్ళే వారి పైన చెంప పెట్టు లాంటి కథ. కళ్ళు లేని ఒక మామూలు లాటరి టిక్కట్లు అమ్ముకునే ఆతను మనకి మన జ్ఞానచక్షువులు తెరుచుకునేలా చేసిన కథ. సత్యం బ్రుయాత్ కథ మన కుటుంబం పై మనకి ఉన్న బాధ్యత గుర్తు చేసే కథ.
నేస్తం నాకంతే కావాలి కథ లో సుచిత్ర ని చూస్తే ముచ్చట వేస్తుంది తప్పకుండా. పెళ్లి చేసుకుంటా అన్న బావని నిన్ను స్నేహితుడిగా మాత్రమే చూసాను అన్న సుచిత్ర నిజంగా అభినందనీయురాలు. అలాగే నాకంటితో చూడు, స్వేచ్ఛ కథలు అమ్మాయిల వైపు నుంచి ఆలోచించే కథలు. వారి దృష్టి కోణం నుంచి చూసి కథ రాయడం నిజం ఒక రకంగా కత్తి మీద సామే. దాంట్లో రచయిత సఫలీకృతుడు అయ్యారు.
సీతాపతికి జ్ఞానోదయం అయ్యింది, మార్నింగ్ వాక్, నిన్న మొన్న లా లేదురా కథలు కాలక్షేపం కథలు అయినా మధ్య తరగతి మనస్తత్వాన్ని ఆవిష్కరించే కథలు. క్షమయా ధరిత్రి కథ మన అందరి అమ్మల కథ, ఇంటింటి కథ. మంచి కథ. మనకీ అనుభవం చాలదా కథ ఇప్పటి విద్యావ్యవస్థ మీదా, మధ్య తరగతి వాసులకి పిల్లల చదువుల పైన ఉండే అతి శ్రద్ధ వారిని ఎలా తయారుచేస్తోంది అన్నదాని మీద, మనం మరచిపోతున్న సంబందభాంధవ్యాల మీద కథ.
మనసు తడి ఆరనీకు కథ కొంచం ఒక రకంగా సినిమా జర్నలిస్ట్ ల అందరి కథే అనుకోవచ్చు ఏమో. దగ్గరగా ఆ తళుకులు చూసి మోసపోవడం సహజం. దానికి సమాధానమే ఈ కథ. అలాగే మనలో ఒకడు కాడు, మనవాడే నా కథలు కూడా మంచి కథలే.
రచయిత కి రాముడు అంటే ప్రేమ, కథల్లో చాలా వాటిల్లో నాయకుడు రఘురాముడే. కథల్లో కొన్ని ఆలోచింప చేస్తే, కొన్ని మనసుని తట్టి లేపుతాయి. అనవసరమైన వర్ణన లేదు. కుదిరితే తప్పక చదవండి. కినిగే లో లభ్యం.
Leave a Reply