త్రిపుటి – ‘సరస్వతీ పుత్ర’ డా|| పుట్టపర్తి నారాయణాచార్య

ఒకానొక చక్రవర్తి, ఆయన ఆస్థానపండితుడు కూర్చుని చదరంగం ఆడుతూ ఉన్నారు. అప్పుడక్కడికొక దాసి మదిరారసం  తీసుకొని వచ్చింది. అప్పటికి చక్రవర్తి ఆ చదరంగం ఆటలో ఓడిపోయాడు. పండితుణ్ణి ఏం కావాలో కోరుకొమ్మన్నాడాయన. అప్పుడా పండితుడన్నాడూ –

న యాచే గజాళీం నవా వాజిరాజిమ్ న విత్తేఘచిత్తం మదీయం కదాపి |
ఇయం సుస్తనీ మస్తకన్యస్తహస్తా లవంగీ కురంగీ మదంగీ కరోతు ||

ఓ రాజా! నాకు ఏనుగులొద్దు, గుర్రాలొద్దు, డబ్బు గురించిన ఆలోచన లేదు. అందమైన చనుకట్టు, రూపము కలిగి, కాస్త తడబడుతూ మదిరారసం పోస్తోందే, ఈ జింకపిల్ల లవంగి నా వలన అంగీకరింపబడనివ్వు.

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? లవంగి అనే పేరున్న ఆ దాసిని చక్రవర్తి పండితునికి ఇచ్చేశాడు. ఆ పండితుడు ఆంధ్రుల జగన్నాథపండితరాయలు. చక్రవర్తి షాజహాను.

ఆ పండితుడు ఆమెను చేపట్టిన తర్వాత ఆమె సౌందర్యాన్ని వివిధ రకాలుగా ప్రశంసించినాడు.

 

యవనీరమణీ విపదశ్శమనీ కమనీయతమా నవనీతతమా |
ఉహి ఉహి వచోమృత పూర్ణముఖీ ససుఖీ జగతీహ యదంకగతా ||

యవనీ రమణి, ఆపదలలో శమం కూర్చేది, కమనీయమైన వాటిలో అగ్రగణ్యమైనది, వెన్నకన్నా మృదువైనది, ముద్దుముద్దు మాటలతో అలరించే గుండ్రని ముఖం కలది అంకంపైన చేరితే ఈ ప్రపంచం మహా సుఖవంతమౌతుంది. (వి-పద = ఇక్కడ శ్లేష ఏదైనా ఉందా?)

అలాంటి శ్లోకాల సంకలనం ’భామినీ విలాసమ్’ అన్న కావ్యంగా రూపొందినది. ఆ కావ్యాన్ని సాహిత్య అకాడెమీ వారికోసం పరిష్కరించినది శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. ఆ పుస్తకానికి ముందుమాట త్రిపుటి అన్న పుస్తకంలో ఒకానొక వ్యాసం.

సాహిత్యంలో వివాదాలు, నాడూ, నేడూ ఉన్నాయి. ఇవి తప్పవు. ఏది హితం, ఏది అహితం అన్నది తెలుసుకునే మథనంలో విమర్శలు పుడతవి. అప్పయ్యదీక్షితులకు, జగన్నాథ పండిత వర్యులకూ ఇటువంటి సాహిత్య వైరం ప్రసిద్ధమైనది. రసగంగాధరాన్ని తెనిగించిన జమ్మలమడక మాధవరామశర్మ గారు, పీఠిక వ్రాసిన రాయప్రోలు వారు ఇత్యాదులనేకులు ఈ గొడవల జోలికి వెళ్ళలేదు. ఎవరినీ సమర్థించనూ లేదు, నిరాకరించనూ లేదు.

అయితే ఆచార్యుల వారిది సూటి తత్త్వం, అనుకున్నది చెప్పడమే ఆయనకు తెలుసు. త్రిపుటి లోని ఈ వ్యాసంలో ఆచార్యుల వారు, అప్పయ్యదీక్షితులు, పండితరాయల వారి మధ్య విభేదాల గురించి చెబుతూ, పండిత రాయల వారి పాండిత్యంలో మెచ్చు తునకలను ఉదహరిస్తూ, అక్కడక్కడా విమర్శిస్తూ, మనోజ్ఞమైన రీతిలో పాఠకులను రంజింపజేస్తారు. ఆ పండితుల గొడవేమో కానీ, ఈ వ్యాసం వల్ల పాఠకుడికి చాలా చక్కని విషయాలు తెలుస్తవి.

***************************************************

సాహిత్య విమర్శల సంకలనాలు మనకు బోలెడు. ఇంద్రగంటి వారి సాహిత్య సంచారం (ఒక పరిచయం ఇక్కడ), రాళ్ళపల్లి వారి వ్యాససంకలనం, తిరుమల రామచంద్ర వారి సాహితీసుగతుని స్వగతమ్ ఇలా ఎన్నో. ఒక్కొక్క విమర్శకుడిది ఒక్కొక్క ’టోన్’. అది విమర్శకుని అభిరుచిని, అంతరంగాన్ని, ఉద్దేశ్యాలను, నమ్మిన సిద్ధాంతాన్ని చూచాయగా చెబుతుంది. దీన్నే పాశ్చాత్యులు ’Every criticism is an autobiography’ అంటున్నారనుకుంటా. విమర్శకుడి వ్యాసాలను ఒకట్రెండింటిని చదువగానే ఆ ’టోన్’ పాఠకుడికి అలవడుతుంది. అలా అలవడిన తర్వాత పాఠకుడికి కాస్త బోర్ కొట్టడానికి అవకాశమూ ఉంటుంది. ఈ పుస్తకంలో అలాంటి అవకాశం దక్కడానికి కాస్త కష్టపడాలి. చాలా విభిన్నమైన వ్యాసాలను ఒక్క చోట కూర్చడంలో సంకలనకర్తలు కృతకృత్యులయ్యారు. ఒక సామాన్య పాఠకుడు మొదలుకుని, మంచి అభినివేశం ఉన్న పాఠకుల వరకూ ఈ పుస్తకంలో విషయసంగ్రహం కూర్చబడి ఉంది.

***************************************************

ఈ వ్యాసావళికి కలికితురాయి (పుల్లెల రామచంద్రుల వారి) రామాయణం మీద ఆచార్యుల వారి పీఠికావ్యాసం. ఆ వ్యాసం పేరు – శ్రీమద్రామాయణ దర్శనం.

రామాయణాన్ని మంత్రశాస్త్రపరంగా, విశిష్టాద్వైతపరంగా, లాక్షణిక దృష్టితోనూ ఆచార్యుల వారు మహోజ్జ్వలమైన రీతిలో అనితరసాధ్యంగా పరిశీలించారు. అందులో ఒక చిన్న ఉదంతం – స్థాలీపులీకంగా –

వాలిని అంతం చేసిన తర్వాత సుగ్రీవుడు భోగాసక్తుడై సీతని వెతికిస్తానని రామునికిచ్చిన మాట మరిచిపోతాడు. అప్పుడు విషయం కనుక్కు రమ్మని రాముడు లక్ష్మణుని సుగ్రీవుని వద్దకు పంపుతాడు. అప్పుడు సుగ్రీవుడు భయపడి, తను చేపట్టిన భార్య తార ను లక్ష్మణునితో మాట్లాడమని పంపుతాడు. ఆ ఘట్టంలో వాల్మీకి తారకు ’ఈప్సితతమాం తారామ్’ అని చెబుతాడట. (’కోరుకోదగిన వాటిలో అగ్రగణ్యమైనది’) ఈప్సితతమా అని తారకు తగిలించిన విశేషణం తాలూకు పొట్టలో అర్థాన్ని ఆచార్యుల వారు వివరిస్తారు.

తార ఒక అప్సరస. సముద్రమథనంలో సుషేణుడనే వానరరాజుకు దొరుకుతుంది. ఆమెను అతడు పెంచి వాలికిస్తాడు. ఆమె మనసేమో సుగ్రీవునిపైన. సుగ్రీవుడికి ఆమె అంటే మొదటి నుండి మోహం. సుగ్రీవుడు కిష్కింధారాజ్యాన్ని పొందితే పొందాడులే, అది కాదు, ఆమె ను పొందటం అంతకంటే పెద్దవిషయం అని ఆ ’తమప్’ ప్రత్యయం వెనుక కథట!

ఇలాంటి విశేషాలు అనేకమైనవి ఈ వ్యాసంలో ఉన్నాయి. ఉత్తమ విమర్శకుడు కేవలం విషయాలను వివరిస్తూ వెళ్ళడు. అక్కడక్కడా పాఠకుడి బుద్ధిని పదును పెట్టటమూ అతని విమర్శలో భాగమే. ఈ వ్యాసంలో అక్కడక్కడా అలాంటి సూచనలున్నాయి. అలా అనర్ఘరాఘవాన్ని, ప్రతిమానాటకాన్ని, కాళిదాసు రఘువంశాన్ని అన్యాపదేశంగా ఆచార్యుల వారు సూచిస్తారు.

***************************************************

పదకవితాపితామహుడు అన్నమయ్య మీద ఆచార్యుల వారి వ్యాసం ఎన్నో కొత్త విషయాలు చెబుతుంది. సౌందర్య లహరి వ్యాసంలో శ్రీచక్రం వెనుక విశేషాలు, అర్చనా పద్ధతులు ఆచార్యుల వారు తప్ప మరొక్కరు వ్రాయలేరు. ఇంకా ’రాయలసీమ పలుకుబడులు’, శ్రీనాథుడు, సత్యభామ, ’పద్యంబొక్కటి చెప్పి’ – అన్న ఆంధ్రప్రభ శీర్షికలో ఆచార్యుల వారి తెలుగు పద్యాల తాలూకు వివరణలు, వారు సంపాదకత్వం వహించిన ఆధ్యాత్మికపత్రిక తాలూకు సంపాదకీయాలు, వసుచరిత్రలో నృత్యగీతాది విశేషాలు, యువకవుల కావ్యాలకు పీఠికలు, త్యాగరాజు నాదామృతం, నందిఘంట కవుల వరాహపురాణం పీఠిక – ఇలా ఎన్నెన్నో వైవిధ్యభరితమైన వ్యాసాలు త్రిపుటి లో ఉన్నాయి. ఇటువంటి వ్యాసాలు వ్రాయటానికి ప్రతిభతో బాటు, ప్రతిభకంటే ఎక్కువగా వ్యుత్పత్తి కావాలి. అది దండిగా ఉన్న పండితుడు శ్రీ పుట్తపర్తి నారాయణాచార్యులు.

ఈ వ్యాసాలు ఇలా ఉన్నవి కదా అని శైలి కూడా అలా ఉంటుందని, చమత్కారం పాలు తక్కువేమోనని సందేహపడకూడదు. ఈయన శైలిలో అక్కడక్కడా హాస్యం పరవళ్ళు తొక్కుతుంది. ఉదాహరణకు –

వసుచరిత్ర అనే ప్రబంధకావ్యంలో నాయిక గిరిక. ఈమెను వర్ణిస్తూ వసుచరిత్రకర్త ఈమె ’అరుణచరణ’, ’మోవితీపులాడి’, ’సురభిళాంగి’ – ఇలా వర్ణించాడు. ఆ విశేషాలు చెబుతూ మధ్యలో వ్యాసకర్త ఒక్క విసురు విసురుతాడు – ’ఇవన్నియు కవిత్వపు బజారులో  సాధారణముగా దొరుకునవే’ అట. ఈ నాయిక ఒకరోజు తన తోటలో విహరిస్తూ చివురుటాకులు తగిలి మూర్ఛపోయింది. ఇక్కడ మరొక విసురు – ’మనకిట్టి మూర్ఛలు తెలియవులెండు. ఇది ప్రబంధనాయికల గొడవ. మనము చదివి లొట్టలు వేయవలసినవి’. ఇలా మూర్ఛపోయిన యువరాణిని చెలికత్తెలు ’డయాగ్నైజు’ చేశారుట. – ఈ వ్యాసం ఇలాగే సాగి, నృత్య గీతాది విశేషాలలోకి వెళుతుంది.  నైషధీయచరితకారుడు శ్రీహర్షుని గురించి మరొక విసురు – “అడుగడుగునా అమృతాంజనము రాచుకొను భావములకు హర్షుడు భోషాణము” అట.

’త్రిపుటి’ – వ్యాససంకలనంలో మూడు విభాగాలు. మొదటి భాగం – నారాయణాచార్యుల వారి వ్యాసాలు, రెండవభాగం వారి పీఠికలు, మూడవ వ్యాసం ఆచార్యుల వారిపై ఇతర కవుల, అభిమానుల వ్యాసాలు.

’పొద్దు’ జాలపత్రికలో వచ్చిన జాలరచయిత చంద్రమోహన్ గారి వ్యాసం కూడా ఈ వ్యాససంపుటిలో చేర్చటం ఒక చక్కని ముక్తాయింపు. అయితే ఈ పుస్తకానికి నా వరకు ఒకట్రెండు కంప్లైంట్లు ఉన్నాయి. ముఖచిత్రం ఇంకా బావుండాలి. అక్షర స్ఖాలిత్యాలు, ముద్రారాక్షసాలు బాధించాయి. అయితే అవి దిష్టిచుక్కలుగా సరిపెట్టుకోవలసిందే.

౩౩౦ పేజీల అప్పటమైన విన్నాణానికి, అచ్చెరువు గొలిపే వైదగ్ధ్యానికి, అనుపమానమైన వ్యుత్పత్తికి, రసనిర్భరమైన మనోరంజనకూ ఈ పుస్తకం నెలవు. వెల 200/-. అన్ని పుస్తకాల అంగడులలోనూ దొరుకుతుంది.

****
పుస్తకం గురించి ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన ఒక పరిచయం ఇక్కడ, “సుధామ” గారు రాసిన పరిచయం ఇక్కడ. ఇతర వివరాలేవన్నా కావాలంటే పుట్టపర్తి వారి అమ్మాయి అనురాధ గారి బ్లాగులో సంప్రదించి చూడండి.

You Might Also Like

2 Comments

  1. రవి

    త్రిపుటి – పుస్తకం ఇప్పుడు కినిగె లో దొరుకుతోంది.

    http://kinige.com/book/Triputi

  2. kompella sarma

    మన సాహితీ వారసత్వ పరివారంలో తెలుగుతల్లి ముద్దుబిడ్డలైన మహాకవుల్లో అన్ని విధాల ప్రశంసించదగ్గ మహాకవి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. 28 మార్చి 2013 నుంచి పుట్టపర్తివారి శతజయంత్యుత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సంస్కృత సాహిత్యంలో ప్రతిభావంతుల గురించి మున్ముందుగా ప్రస్తావించాలంటే, ప్రథమంగా రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు మరియు పుట్టపర్తి వారిని ప్రస్తావించాకే, మిగతాకవుల్ని విశ్లేషించాలన్నది నా అభిప్రాయం. మా సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘తెలుగురథం’ (www.teluguradham.blogspot.com) శతజయంతి ప్రారంభోత్సవ కార్యక్రమం 28 మార్చి 2013 న శ్రీ త్యాగరాయ గానసభ (చిక్కడపల్లి, హైదరాబాదు) లో నిర్వహించ తలబెట్టాం. మన ప్రతిభావంతులకు నివాళి సమర్పించే కార్యక్రమాల్లో భాగంగా తలపెట్టిన ప్రయత్నంలో అందరూ పాల్గొని భాగస్వామ్యం వహించాలి.
    కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురథం (సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ)(kbssarma)

Leave a Reply