ఇంద్రగంటి సాహిత్య సంచారం

ముత్తాతగారు సంస్కృత‌ వైయాకరణ సార్వభౌములు. రాజాస్థాన విద్వాంసులు. తాతగారు వ్యాకరణ పండితులే కాక సంస్కృతంలో గొప్ప కవి. తండ్రిగారికి తన బిడ్డని కూడా అటువంటి పండితుణ్ణి చెయ్యాలనే సంకల్పం. కుర్రవాడికి కోనసీమలో గురుకులంలో సంస్కృతాధ్యయనం. తర్వాత విజయనగరం సంస్కృతకళాశాలలోనూ, కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలోనూ ఉభయభాషాప్రవీణ చదువు.

ఆ రోజుల్లో ఒకవైపునుంచి భావకవిత్వపు గాలులు ముమ్మరంగా విసురుతున్నై. నవ్య సాహిత్యోద్యమం ఒకటి రూపు దిద్దుకుంటూ ఉన్నది. జాతీయభావనలు, ఆంగ్ల, వంగ సాహిత్య ప్రభావాలు, అభ్యుదయ, సామ్యవాద భావాలు ఆంధ్రసాహితీవేత్తల్ని ఉర్రూతలూగించిన‌ దశాబ్దాలవి.

ఆ కుఱ్ఱవాడు వంశపారంపర్యంగా తాను నేర్చిన ప్రాచీన సాహిత్య సాంప్రదాయమే గొప్పదని ఆ గాడిలోనే స్థిరపడి మడిగట్టుకుని కూర్చోలేదు. క‌రడుగట్టిన సనాతనవాదుల్లాగా కొత్తదనాన్ని పరిహసించి నిరసించలేదు. అలా అని కొత్తదనానికి మోజుపడి  ‘పాతొక రోత’ అనీ భావించలేదు. సంస్కారవంతులైన గురువుల ప్రోత్సాహంతో అతను విద్యార్థిదశలోనే సమకాలీన‌ సాహిత్య ధోరణుల్ని కూడా ఆకళింపు చేసుకున్నాడు. అధ్యయనం చేసి తనంత తానుగా మంచిచెడ్డల్ని బేరీజు వేసుకున్నాడు. ‘పాత’ ‘కొత్త’ల లేబిళ్ళకి అతుక్కుపోకుండా గుణదోషాల్నిబట్టి మంచిని మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు, పనికిరాని భేషజాల్ని తిరస్కరించాడు. ఆయనే శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.

సహజంగానే గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తికి ఉత్తమమైన సాహిత్యసంస్కారం కూడా తోడైతే ఆ వ్యక్తిత్వం ఎంతగా ప్రకాశిస్తుందో శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి గురించి తెలుసుకుంటే మనకి అర్థమౌతుంది. కొండలాంటి ఆయన వ్యక్తిత్వానికి అద్దంపట్టే పుస్తకం ‘ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి సాహిత్య సంచారం’. ఇది ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురించిన, ఆయన సాహిత్యవ్యాసాల, ఉపన్యాసాల సంకలనం.

ఈ పుస్తకంలోని తొలివ్యాసాలు ఒక విద్యార్థిగా మొదలై శ్రీ ఇంద్రగంటివారి సాహితీ సంచారం నవ్యసాహిత్యోద్యమంతో ఎలా పెనవేసుకున్నదో ఆసక్తికరంగా వివరిస్తాయి. ‘పూర్వసాహిత్యం అన్నంతమాత్రంచేత అన్నీ రత్నాలే అందులో పుట్టలేదు’, ‘ఎప్పుడైనా ప్రతిభగల వాక్కుకే గౌరవం జరుగుతుంది’ అని అంటూ ‘గురు’జాడతో మొదలైన నవ్యసాహిత్య బీజాలు ఉద్యమంగా ఎలా రూపుదాల్చాయో, అందులో తానూ పాత్రధారి ఎలా అయ్యారో, ఈనాడు చరిత్ర ప్రసిద్ధులైన తెలుగు సాహిత్య వైతాళికులతో తనకు పరిచయాలూ, అనుభవాలూ ఎలా నడిచాయో ఆసక్తికరంగా వివరిస్తారు శ్రీ ఇంద్రగంటి. నాటి సమకాలీన‌ సాహిత్యాన్ని దుమ్మెత్తిపోసిన‌ సాంప్రదాయవాదుల విమర్శలకి దీటైన సమాధానాలిస్తూ కొత్త సాహిత్యంలోని మెరుపుల్నీ, పాత సాహిత్యంలో కూడా కనపడే దోషాల్నీ ఉదాహరణపూర్వకంగా చూపించి మంచి సాహిత్యానికి పాత కొత్తల తేడాలేదని నిరూపిస్తారు.

‘కుక్కపిల్లా అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా కాదేదీ కవితకనర్హం’ – ఈమాట తెలియని తెలుగువాళ్ళుండరేమో. అయితే ఆధునిక కవిత్వంలోనే కాదు, ప్రాచీన సాహిత్యంలో కూడా కావ్యసామగ్రి కానిది అణువుకూడా లేదని అంటారు ఇంద్రగంటి. సంస్కృతసాహిత్యంలో విచిత్రమైన, బీభత్సరస ప్రధానమైన వర్ణనలూ, బహుదీనమైన దారిద్ర్యవర్ణనలూ కోకొల్లలు. చివరికి పెసరకట్టు కూడా కవితా వస్తువే. అలాగే కవిత్వంలో ‘నవ్యత’ కూడా మనం కొత్తగా కనిపెట్టిన వస్తువేం కాదు. ‘నవం నవం ప్రీతిరహో కరోతి’ అని ప్రాచీనులూ నవ్యతకోసం వెర్రిత్తిపోయినవాళ్ళే. కవిత్వం పాతదైనా కొత్తదైనా దాన్లో ప్రతిభ ఉంటేనే అది గొప్ప కవిత్వం అంటారాయన.

ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఒక‌ వ్యాసం ‘సాహిత్య సంచారం’. మ్యూజింగ్ లాగా సాగిన ఈ చిన్న వ్యాసంలో నిత్య పల్లవశీలమైన సాహిత్యం ఎన్నటికీ మోడు కారాదన్న ఆయన ఆకాంక్షా, ఆవేదనా పఠితల‌ గుండెల్ని తాకుతుంది. సాంప్రదాయాల్ని క్షుణ్ణంగా ఎరిగికూడా మార్పుని ఎంత విశాల హృదయంతో ఆయన ఆహ్వానించారో తెలుస్తుంది. ఇంద్రగంటివారు ప్రాచీన, నవీన సాహిత్యాల్ని బాగా ఎరిగినవారవడంచేత పాతకొత్తలకి అతీతమైన‌ సర్వకాలీనమైన ఒక మానవ చైతన్యాన్ని గుర్తించగలిగారు. అందుకే అయోధ్యలోని కైకలోనూ, లంకలోని విభీషణుడిలోనూ, శూద్రకమహాకవి రచనలోనూ కూడా ఆయన అదే నిత్యపల్లవశీలమైన విప్లవధోరణిని గమనించగలిగారు.

ఏదో ఒక సిద్ధాంత ధోరణిని బలంగా పట్టుకుని, ‘Either you are with us, or against us’ అనే ధోరణి ఈమధ్యకాలంలో చాలా ఎక్కువైంది, సాహిత్యంలో కూడా. ఇటువంటి ధోరణిలో ఉండేవాళ్ళకి అన్ని రకాల ధోరణులనూ, వాటి నేపథ్యాలనీ అధ్యయనం చేయాలనీ, సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలనీ, సమన్వయించుకోవాలనీ భావించేవాళ్ళు అర్థం కావడం కష్టం. ఇంద్రగంటివారికి ఈ విధమైన సమన్వయదృష్టి చాలా ఎక్కువ అని ఆయన వ్యాసాలు చదివినవారికి తేటతెల్లమౌతుంది. ఆయన తాను స్పృశించిన ప్రతి సాహిత్య విషయంలోనూ, దేనినీ నిరాకరించకుండా, అగౌరవపరచకుండా పరస్పర భిన్న ధృవాలుగా కనిపించేవిషయాల్ని కూడా చక్కగా సమన్వయపరుస్తూ కనిపిస్తారు. అందుకే కాస్త తీవ్రధోరణి కలిగినవారి నుంచి ఆయన కొద్దిగా గేలిచేయబడ్డారనిపిస్తుంది.

ఇంద్రగంటివారినడిగితే
ఏమిటంటారో తెలుసునా?
పులికి పిలక లేదనడం
చలికి తెలుగు రాదనడం
శ్రీనివాసరావు వ్రాస్తున్నది
మానిషాదగీతంలో ఉన్నది.

ఈ మాటలన్నది ఇంద్రగంటివారికి మంచి మిత్రుడైన శ్రీశ్రీ . ఈమాటల్ని కూడా ఇంద్రగంటివారెంత చక్కగా సమన్వయించారో, శ్రీశ్రీని ఆయన ఎంత గొప్పగా అర్థంచేసుకున్నారో ‘నాకర్థమైన శ్రీశ్రీ’ అన్న వ్యాసం చదివితే తెలుస్తుంది. అంతే కాదు, ప్రాచీన సాహిత్యాన్ని మథించి వంటబట్టించుకున్న శ్రీశ్రీ కవిత్వమూ, అందులోని సంకేతాలూ, భావశిల్పం, శబ్దనృత్యం తనకే మరింత విస్పష్టంగా బోధపడుతాయని ఆయన అంటారు. కేవల సిద్ధాంత రక్తితో కవిత్వంలో ఉండవలసిన చిక్కదనాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదనేది ఇంద్రగంటివారి అభిప్రాయంగా కనిపిస్తుంది. సాంప్రదాయ కవిత్వం గురించి కొద్దిగానైనా సరే దురభిప్రాయమున్నవారెవరైనా చదివితీరవలసిన వ్యాసమిది. అసలా వ్యాసమే చాలా ఆసక్తికరమైన ఒక‌ సంఘటనతో మొదలౌతుంది. ఈ ప్రజాకవితా యుగంలో భీమేశ్వరపురాణం చదువుతున్నందుకు ఒకాయన రైల్లో ఆయనను హేళన చేస్తే,  కులాసాగా ఆయన చెప్పిన సమాధానం మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది. అంతేకాదు విప్లవధోరణుల్నీ, సామాజిక సమస్యల్నీ పట్టించుకోకుండా దులపరించుకునే తత్వం ఆయనది కాదనీ, ఆయన లోతుగా ఆలోచించే, అభ్యుదయాన్ని ఎప్పుడూ ఆహ్వానించే విశాల హృదయులనీ అర్థమౌతుంది.

శ్రీశ్రీగారితో ఆయన పరిచయమూ అనుభవాలూ కొన్ని వ్యాసాల్లో చాలా ఆసక్తికరంగా వ్రాసారాయన. అలాగే కృష్ణశాస్త్రి, బాపిరాజు, జరుక్ శాస్త్రిగార్లతో ఆయన స్నేహం, అనుభవాలు ఎంతో ఆర్ద్రంగా అనిపిస్తాయి. ‘సాహిత్యభాణం’ అన్న వ్యాసంలో చలం సాహిత్యాన్ని గురించి ఇంద్రగంటివారి మాటలన్నీ చదివితీరవలసినవే. హిమాలయోత్తుంగమైన ఆయన వ్యక్తిత్వం, సంస్కారం అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయీ వ్యాసంలో.

తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని మంచి పరిచయవ్యాసాలూ, సమీక్షావ్యాసాలూ కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో. దేశి కవితల గురించీ, చిన్నకథ, కథానిక,  తెలుగునవల, వీరేశలింగం పంతులుగారి కథా సాహిత్యం మొదలైన విషయాల గురించి ఆయా వ్యాసాల్లో చర్చిస్తారు. గురజాడను ఆధునిక‌ వాల్మీకిగా సంభావిస్తూ వ్రాసిన అద్భుతమైన వ్యాసం మరొకటి ఉంది. అలాగే విశ్వనాధ‌ కల్పవృక్షం లోని శిల్ప సమీక్ష, వేంకటపార్వతీశకవులు, వేదులవారి ‘దీపావళి’ సమీక్ష మొదలైన‌ మరికొన్ని వ్యాసాలూ కనిపిస్తాయి.

ఇక ఈ పుస్తకంలోని సంస్కృత సాహిత్యాన్ని గురించిన వ్యాసాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క విందుభోజనం లాంటివి. ఇంద్రగంటివారు తాను స్వయంగా ఎంతటి పండితులైనా, ప్రౌఢమని భయపెట్టకుండా సామాన్యజనులకోసం అత్యంత సరళంగా ఆసక్తికరంగా సంస్కృత సాహిత్యాన్ని పరిచయం చేస్తారు.  ‘టెలిఫోన్ లో సాహిత్యగోష్ఠి’ అన్న వ్యాసం సంభాషణారీతిలో సాగుతూ సరళంగా కాళిదాసు రచనలని పరిచయం చేస్తుంది.

‘కుమారసంభవం’లో శివపార్వతులకి కల్యాణమైనాక సరస్వతీదేవి వరుణ్ణి సంస్కృతభాషలోనూ, వధువుని ప్రాకృత‍ంలోనూ ఆశీర్వదిస్తుంది. పోనీ పార్వతీదేవికి సంస్కృతం రాదా అంటే ఆమెను చిన్నతనంలోనే ‘ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః’. మరి ఎందుకు సరస్వతి రెండు భాషల్లో ఆశీర్వదించింది? దీనికి ఒక చక్కని సమాధానాన్నిస్తూ ‘సరస్వతికి రెండు ముఖాలు’ అన్న వ్యాసంలో సంస్కృత‍ప్రాకృతాలనాటి నుంచి నేటిదాకా నడుస్తున్న భిన్నధ్రువాల్లాంటి భాషావాదాల్ని చక్కగా సమన్వయం చేస్తారు ఇంద్రగంటి.

హేమంత ఋతువుని మన ప్రాచీన కవులెంత అందంగా వర్ణించారు! అలాగే వసంతాన్నీ! వాల్మీకి రామరావణుల్ని ఎలా చిత్రించాడు? భవభూతి సీతను ఎంత గొప్పగా చిత్రించాడు!! కుందమాల నాటకం ఎంత గొప్పగా ఉంటుంది!! కాళిదాస భవభూతుల్ని ఒకసారి పోల్చి చూసుకుంటే ఎలా ఉంటుంది? మహా ప్రౌఢమైన మాఘకావ్యాన్ని తెలుగులోకి అనువదించినవారెవరో తెలుసునా? అదికూడా ఎంత అందంగా అనువదించారో చూడాలని ఉందా? కాళిదాసుని మన జాతీయకవి అని ఎందుకు అనుకోవచ్చు? అలాగే ‘దీపశిఖా కాళిదాసు’ అని ఎందుకు అంటారు? సౌందర్యలహరి స్తోత్రంలో ఎంత అద్భుతమైన కవిత్వం ఉంటుందో తెలుసునా? ఆంధ్రులకి సంస్కృతం ఎంతవరకు కావాలి? ఈ విషయాలు వింటేనే ఆసక్తికరంగా ఉంది కదూ! మరి ఇంద్రగంటివారి మాటల్లో ఈ వ్యాసాలన్నీ చదివితే సాహిత్యాభిమానులకి పండగ కాక మరేమిటి?

నాకు మరీ ఆనందం కలిగించిన వ్యాసాలు మరికొన్ని. రామాయణంలో బుద్ధుడి ప్రసక్తి వస్తుందని మీకు తెలుసా? అది ఎక్కడ ఎలా వస్తుంది? అసలది సమంజసమేనా? బుద్ధుడి కాలం ఏమిటి? వీటి గురించి రెండు మంచి వ్యాసాలు ఉన్నాయి ఈ పుస్తకంలో.

అలాగే మరి రెండువ్యాసాల్లో మేఘదూతాన్ని గురించిన చర్చ- కేవలం వంద పైచిలుకు శ్లోకాలుగల మేఘదూతాన్ని మహాకావ్యంగా పరిగణించవచ్చునా? మరి అది పంచమహాకావ్యాల్లో ఒకటి ఎలా అయింది? మల్లినాథుడెందుకలా పరిగణించాడు? మరొక సంగతి. అసలు మేఘదూతమ్ లోని కథకి ఆధారం ఏమిటి? దాని మూలకథ మన పురాణాల్లో ఎక్కడైనా ఉన్నదా?

ఆసక్తికరమైన మరొక వ్యాసం – భవభూతి ఆంధ్రుడనడానికి మనకున్న ఆధారాలేమిటి?

ఇక సంస్కృత‍ నాటకాల్లో పాత్రపోషణ గురించి ఒక వ్యాసం, భాసుడి గురించీ ఆయన నాటకాల గురించీ నాలుగు వ్యాసాలూ ఉన్నాయి. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సరళమైన సంస్కృతంలో ఉంటాయి భాసుడి నాటకాలు. సంస్కృతంలో కావ్యప్రపంచానికి వాల్మీకి ఆచార్యుడైతే, నాటక ప్రపంచానికి భాసుడే మార్గదర్శి. అంతేకాదు, ఇంద్రగంటివారు చెప్పే ఒక ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే కాళిదాసు నాటక రచనవల్ల భాసుడి మార్గం మరుగునపడి సంస్కృతంలో నాటక ప్రక్రియకి అపకారమే జరిగిందట‌. అదెలాగో తెలుసుకోవాలంటే ‘నాటక మహర్షి భాసుడు’ అన్న వ్యాసం చదవవలసిందే.

ఇలా ఇంకా ఎంతైనా ఊరిస్తూ పోవచ్చును కాని సాహిత్యాభిమానులందరూ తప్పక చదవవలసిన పుస్తకం ‘ఇంద్రగంటి సాహిత్య సంచారం’.

(ఈ పుస్తకాన్ని నాకు బహుకరించిన సహృదయ మిత్రులు పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.)

పుస్తకం వివరాలు:

Saahitya Sanchaaram (Literary Essays in Telugu)

By: Sri Indraganti Hanumath Sastry (1911-1987).

Published by: Sri Indraganti Srikanta Sarma, Janakibala.

Distributors:

Navodaya Book House,

3-3-865, St. Opp. Arya Samaj,

Kachiguda, Hyderabad-500027.

Price: Rs. 195/-

 

You Might Also Like

7 Comments

  1. త్రిపుటి – ‘సరస్వతీ పుత్ర’ డా|| పుట్టపర్తి నారాయణాచార్య | పుస్తకం

    […] వారి సాహిత్య సంచారం (ఒక పరిచయం ఇక్కడ), రాళ్ళపల్లి వారి వ్యాససంకలనం, తిరుమల […]

  2. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

    ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి గారిని చదవటం ఒక విన్నూత్న అనుభవం.వారి సాహిత్యముతోపాటి వ్యాసాలూ చదివితీరాల్సినవి.ఆయన అభిప్రాయధార అర్థం చేసుకున్నవారికి అర్థమయినంత.పౌరాణికపాత్రలను తీసుకుని చిన్నకథల్లో భాగస్తులను చేసి నడిపించిన తీరు అద్భుతం.

  3. రవి

    నాకు ఈయన గురించి అంతగా తెలియదు. ఈ మధ్య ప్రెస్ అకాడెమీ వాళ్ళు పుస్తకాలు ఆన్లైన్ లో పెట్టిన తర్వాత వాళ్ళ తరంలో కొందరు ప్రముఖుల గురించి వింటున్నాను. అందులో చాలా మంది విశ్వనాథ సత్యనారాయణ అనే ఒక మహా వృక్షం నీడలో సేదతీరి, అక్కడ నుండి గడ్డకు వచ్చి బయట ప్రపంచం చూడకుండా, అదే మహా భాగ్యం అని బతికినవాళ్ళుగా ఉన్నట్టు కనబడింది. అంచేత మొదట ఎవరైనా సాహిత్యప్రముఖుల గురించి తెలుసుకోవాలనుకుంటేనే ఆలోచించవలసిన పరిస్థితి.ఆ ఉద్దేశ్యంతో ఈ పుస్తకం నవోదయాలో చూసి మనసు లాగినా, వదిలేసి వచ్చాను.

    ఇప్పుడు మీవ్యాసం చదివిన తర్వాత ఈయన గురించి తెలుసుకోవాలనిపిస్తూంది.

    1. nagamurali

      Couldn’t control my smiles looking at your comment, sitting at my desk in office. 🙂

  4. Srinivas Vuruputuri

    “రామాయణంలో బుద్ధుడి ప్రసక్తి వస్తుందని మీకు తెలుసా?”

    Is it in Ayodhya kAnda – in the Jabali-Rama exchanges? I did hear about this (May be, I read about it in Ambedkar’s ‘The Riddles of Rama and Krishna’. But I was not able to locate the original Sloka in Ramayana. The Sloka in the Jabali context talks about “naastikas” and not about the Buddha.

    ***

    Thanks for this interesting review. Another book added to my reading list. 🙂

    1. nagamurali

      Srinivas gaaru, Yes. Check verse number 34 in this link: http://www.valmikiramayan.net/ayodhya/sarga109/ayodhya_109_frame.htm . In this link they have interpreted the Sloka cleverly removing any reference to Buddha in the meanings. But this is the Sloka that is discussed in Sri Indraganti’s essay.

  5. సౌమ్య

    ఈ పరిచయం చూడగానే పుస్తకం తప్పక చదవాలి అనిపించిందండీ. మంచి పరిచయం అందించినందుకు ధన్యవాదాలు.

Leave a Reply