పుస్తకమే మస్తకం

వ్రాసినవారు: ఆర్.వి.రామారావు
(అనుభవజ్ఞులైన పాత్రికేయులు, పాత్రికేయ అధ్యాపకులు, రచయిత, అనువాదకులు అయిన రామారావు గారు వ్రాసిన ఈ వ్యాసం “తెలుగు వెలుగు” సెప్టెంబర్ 2012 సంచికలో ప్రచురించబడింది. వ్యాసాన్ని పుస్తకం.నెట్లో ఉంచేందుకు అనుమతించిన రామారావు గారికి, అలాగే దీన్ని అందజేసిన సూరంపూడి పవన్ సంతోష్ కు మా ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
******
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో… మంచి పుస్తకం కొనుక్కో’

అన్నది హితోక్తి. ఉత్తమ గ్రంథాల విలువ అలాంటిది. అంతే కాదు… భాష బాగా అబ్బాలంటే పుస్తకాల్ని చదవడమే మార్గం. పుస్తకం మనిషికి మంచినేస్తం. అపారమైన జ్ఞాన సముద్రాన్ని ఆపోశన పట్టడానికి పుస్తకంలా పనికివచ్చేది మరొకటి లేదు. గ్రంథ పఠనం అలసట తీరుస్తుంది. సాహిత్య ప్రయోజనం చైతన్యస్థాయిని పెంచడమే కాదు… ఊరట కలిగించడం దిశానిర్దేశం చేయడం, అలసిన గుండెల సేద తీర్చడం కూడా.

‘తింటే గారెలే తినాలి వింటే మహాభారతమే వినాలి ‘ అన్నది నానుడి. అక్షరాస్యత అంతగా పెరగని రోజుల్లో వినడానికే ప్రాధాన్యం ఉండేది. చదువు వచ్చిన వారు చదువుతుంటే చదువు రానివారు విని విషయం గ్రహించే వారు. కాని ఇప్పుడు అక్షరజ్ఞానం క్రమంగా పెరుగుతోంది కాబట్టి ఎవరి సహాయం లేకుండానే జ్ఞానం సంపాదించుకోవచ్చు. వింటే మహాభారతమే వినాలి. అనడం చాలా ఔచిత్యంతో కూడిన మాట. మహాభారతంలో అనేకానేక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మహాభారతాన్ని నన్నయ తెలుగులో రాసినప్పుడు అది ఎవరెవరికి ఉపయోగపడుతుందో పెద్ద జాబితా ఇచ్చాడు.

ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని
ఆధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని
కవి వృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
ఐతిహాసికులితిహాసమనియు
పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ
యంబని మహిగొనియాడు చుండ
వివిధ వేదతత్త్వ వేది వేదవ్యాసు
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండజేసె భారతంబు

అంటే తన మహాభారతంలో ఎవరికేది కావాలంటే అది దొరుకుతుందన్నది నన్నయ భావం. అందుకే దానికి అంత ప్రశస్తి. రామాయణ, మహాభారతాలు చదవి వారికీ వాటిలో కథ స్థూలంగా తెలుసు. అవి మన సంస్కృతిలో అంతర్భాగం. ఒక తరం నుంచి మరో తరానికి వాటి విశేషాలు అందుతూనే ఉన్నాయి. అన్ని గ్రంథాలూ ఇంత మహత్తరమైనవి కాకపోవచ్చు. కానీ ఎంత చెత్త పుస్తకంలోనైనా ఎంతో కొంత తెలుసుకోదగింది ఉంటుంది.

మానవ శరీరంలోని అన్ని అంగాలకూ వాడే కొద్దీ అరుగుదల ఉంటుంది. మెదడు మాత్రం వాడే కొద్దీ రాటుదేలుతుంది. మెదడుకు పదును పెట్టడానికి పుస్తకాలు చాలా తోడ్పడతాయి. పాఠశాలలోనో, కళాశాలలోనో విద్యార్జన పూర్తి అయిపోతుందనుకోవడం అపోహే. చదువు నిరంతరంగా కొనసాగాల్సిన వ్యవహారం. చదవ నేర్చిన వారు మంచి పుస్తకాలు చదవక పోతే చదువురాని వారికీ వచ్చిన వారికీ తేడా ఉండదు అన్నాడు మార్క్ ట్వైన్. టీవీలు, ఇంటర్నెట్ ల వల్ల చదివే అలవాటు తగ్గిందన్నది వాస్తవమే. అయినా మంచి గ్రంథాలను ఉపయోగించుకునే వారి సంఖ్య ఇప్పటికీ గణనీయమే.

పుస్తక పఠన పద్ధతులు
చాలామంది పుస్తకాలు చదువుతారు. కాని చదివింది గుర్తుండదు. చదివిందంతా గుర్తుంచుకోవడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ చదువుతున్న కొద్దీ గుర్తుంచుకోవడంతోపాటు చదివిన విషయాన్ని ఆకళింపు చేసుకోవడం కూడా గొప్పవిషయమే. చదివి ఆకళింపు చేసుకుని అన్వయించుకునే శక్తి సంపాదించడానికి తమ ఆలోచనలు కూడా జోడించి సరికొత్త సూత్రీకరణలు చేయడం చివరి దశ. ఆ దశకు చేరుకున్నవారినే మేధావులు అంటాం. ఈ దశల్లో ఏదశకు చేరతామన్న దాన్ని బట్టి చదివిన చదువులవల్ల ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

1.సౌందర్యాత్మకత (aesthetics)
2.వాస్తవికత (realism)
3.తాత్త్వికత (ideology)

సౌందర్యాత్మకత

ఒక సినిమానో, నాటకమో చూసినప్పుడు, ఒక పుస్తకం చదివినప్పుడు మనకు అది నచ్చడానికి, నచ్చకపోవడానికి అందులోని సౌందర్యమే కారణం. అది మన మనస్సునో, కంటినో, హృదయాన్నో తాకితే అది సుందరంగా ఉన్నట్లు, అందులో సౌందర్యాత్మకత ఉన్నట్లు లెక్క. బాగుండటం, బాగోలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. సుందరత అనేది వైయక్తికమూ కావచ్చు. సార్వజనీనమైనదీ కావచ్చు. ఉదాహరణకు పూలన్నీ అందమైనవే. అందరికీ ఇష్టమే. కానీ ఆ పూలల్లో కొన్ని కొందరికి ఎక్కువ నచ్చుతాయి. మరికొన్ని అంతగా నచ్చవు. ఈ ఇష్టాయిష్టాలు వైయక్తికమైనవి. దీనినే subjective beauty అంటాం. పూలన్నీ అందమైనవేనని అనడం సార్వజనీనమైన (objective), లేదా వస్తునిష్ఠమైన సౌందర్యం. అదే సహజ సౌందర్యం.

ఈ సౌందర్యం చాలా వరకూ బాహ్యమైంది. దాదాపుగా దీన్ని అందరూ గ్రహించగలుగుతారు. ఆస్వాదించగలుగుతారు. అయితే కేవలం సౌందర్యం అన్నివేళలా ఆకట్టుకోకపోవచ్చు. ఆ సౌందర్యం కేవలం కాల్పనికం అయితే అందరికీ నచ్చదు. జీవిత వాస్తవికతతో మిళితమైన సౌందర్యం పాఠకుడి మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ సౌందర్యం ఆత్మను తట్టి లేపుతుంది. వాస్తవికతతో ముడిపడని సాహితీ సృజన కాలక్షేపానికి పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. అందులో వాస్తవికత పాలు తక్కువ కాబట్టి జీవిత వాస్తవికతను ప్రతిబింబించకపోవచ్చు. ఏ భాషలో అయినా ఈ రకం సాహిత్యమే ఎక్కువ. కాలక్షేపానికి మాత్రమే ఉపకరించే సాహిత్యం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. అది పాఠకుల సంఖ్యను, చదివే అలవాటు పెంపొందించడానికి ఉపకరిస్తుంది.

వాస్తవికత

మనం ఏ పుస్తకం చదివినా నచ్చిందో లేదో గమనించిన తర్వాత వేసుకునే రెండో ప్రశ్న అది వాస్తవమేనా అన్నదే. అది వాస్తవమైనదైతే, లేదా వాస్తవం కావడానికి వీలున్నదైతే ఆ రచన మనల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. జీవిత వాస్తవాల్ని రచయిత వాస్తవికతగా మలుస్తాడు. కేవలం జరిగింది జరిగినట్టు చెబితే అది వాస్తవాన్ని ప్రతిబింబించినట్లు లెక్క. ఈ వాస్తవంలోనూ వైయక్తికమైన అంశాలూ ఉండొచ్చు. సార్వజనీనమైనవీ ఉండొచ్చు. వ్యక్తుల అనుభవాల పరిధిని విస్తృతం చేసి వాటిని సమాజానికి వర్తింపజేయడమే వాస్తవానికి వాస్తవికత స్థాయి కల్పించడం. realism ఇదే.

వాస్తవికత ఉన్న సాహిత్యం అంతా మేలైంది కాకపోవచ్చు. సమాజాభ్యుదయానికి తోడ్పడకపోవచ్చు. ఉదాహరణకు ‘వేయిపడగలు’ నవలలో విశ్వనాథ సత్యనారాయణ అందించిన సౌందర్యాత్మకత అపారమైనది. ఆయన చిత్రించిన సంఘటనలు వాస్తవికతకు దర్పణాలు. భూస్వామ్య సమాజ పతనావస్థను నిజాయితీగా చిత్రించారు. వేయిపడగల్లో ఒక్కొక్క పడగే ఎలా రాలిపోయిందో చూపించారు. చివరకు ఆ నవలలో కథానాయకుడైన ధర్మారావు అన్న ఒక్క పడగ మాత్రమే మిగిలిందన్న సత్యాన్నీ అంగీకరించారు. భూస్వామ్య వ్యవస్థ అంతరిస్తున్నందుకు విశ్వనాథ పడే బాధను ఈ నవల కళ్లకు కడుతుంది. కానీ ఆ దశ దాటి మరింత మెరుగైన దశకు సమాజ పయనం విశ్వనాథకు నచ్చలేదు. మళ్లీ వెనక్కు వెళ్లాలన్నది ఆయన ఆలోచన. ఆయన master realist, but a reactionary philosopher. మంచైనా, చెడైనా సమాజం ముందుకే వెళుతుంది అన్న సత్యాన్ని విశ్వనాథ జీర్ణించుకోలేకపోయారు. ఇదీ ఆయన తాత్త్విక దృక్పథం.

తాత్త్వికత
ఒక గ్రంథం చదివిన తర్వాత దానినుంచి ఏం గ్రహించాం అన్న విషయాన్ని పాఠకులందరూ ఆలోచించలేకపోవచ్చు. నీతి కథల్లోలాగా సృజనాత్మక సాహిత్యంలో విధిగా చివరన నీతిబోధ, నీతి వాక్యాలు ఉండకపోవచ్చు. కానీ రచన అంతా చదివిన తర్వాత ఆలోచిస్తే ఏం నేర్చుకున్నాం అని తేలుతుంది. ఆ నేర్చుకునే అంశంతో మనం ఏకీభవించవచ్చు. ఏకీభవించకనూ పోవచ్చు. రచయిత చెప్పదలచుకున్న సందేశాన్ని ఆ రచయిత తాత్త్విక దృక్పథమే పట్టిస్తుంది. వాస్తవాంశాలను గ్రహించే శక్తిని అలవరచుకుని భవిష్యత్ కార్యాచరణకు పురికొల్పే తాత్త్విక దృక్పథం సమాజ అభ్యుదయానికి తోడ్పాటు అవుతుంది.

ఇక్కడే మరో చిక్కు ఉంది. రచయిత ఒక అంశాన్ని చర్చిస్తున్నప్పుడు మంచికి, చెడుకు ప్రాతినిధ్యం వహించే పాత్రలను సృష్టించవచ్చు. రచయిత తాత్త్విక దృక్పథాన్ని బట్టి అతను ఏ పక్షాన ఉన్నాడో స్పష్టం అవుతుంది. ఉదాహరణకు రామాయణంలో రాముడి పాత్రని తీర్చిదిద్దింది. రావణుడి పాత్రను మలిచిందీ వాల్మీకే. అయితే వాల్మీకి తన తాత్త్విక దృక్పథాన్ని ఆవిష్కరించే క్రమంలోనే ఆయన రాముడి వైపు ఉన్నాడా, రావణుడి వైపు ఉన్నాడా అని తేలుతుంది. వాల్మీకి ఉద్దేశం రావణుడి వంటి లక్షణాలున్న వారిని త్యజించాలని, రాముడి వంటి ఉదాత్త లక్షణాలున్న వారిని అనుసరించాలని. ఏ రచనకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ముక్తాయింపు

ఏ కళాఖండంలోనైనా సౌందర్యాత్మకత, వాస్తవికత, తాత్త్వికత అన్న మూడు అంశాలూ ఉంటాయి. వాటిని గుర్తించగలగడం పాఠకుడు, శ్రోత, ప్రేక్షకుడి పరిశీలనాశక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ శక్తిని ఎంతగా పెంపొందించుకుంటే కళను అంతగా ఆస్వాదించగలుగుతాం. కాలక్షేపానికి పనికొచ్చేవి ఏమిటో, జీవితాన్ని సుసంపన్నం చేసుకునే సాహిత్యం ఏమిటో వింగడించగలుగుతాం. ఈ దృష్టితో చదవడం మొదలు పెడితే ఉత్తమ సాహిత్యం ఏదో పసిగట్టడం అసాధ్యం కాదు. దాన్ని విశ్లేషించడానికి పనికొచ్చే ఉపకరణాలను అందిపుచ్చుకోవడం అలవడుతుంది. ఈ లక్షణం పాఠకుడిని ఉబుసుపోక చదివే దశ నుంచి ఉత్తమాభిరుచితో చదివే దశకు చేరుస్తుంది.

You Might Also Like

5 Comments

  1. vkrao

    vyasam vislesanto vundi.endukuc ela chadavalo nerputundi vyasam thanks

  2. kanista

    Purnima
    “ఈ నా అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా తెలియజేయడానికి కారణం సమీక్ష సమీక్షలా ఉండాలనే “కాంక్షే”
    పాఠకుడికి కలిగే అభిప్రాయాన్ని వ్యక్తీకరించినప్పుడు రూపొందే వ్యాసానికి, అదే పాఠకుడు అదే రచనపై సమీక్ష చేయబూనినప్పుడు వచ్చే వ్యాసానికి గల తేడాలెలాంటివి? – లాంటి విషయాల మీద ఓ సమగ్ర వ్యాసం ఎవరన్నా రాస్తారేమోనని చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నాం. మీకుగానీ ఆసక్తి ఉంటే మాకు రాసి పంపగలరు.
    వ్యాసంలోని విషయంతోనో, వ్యాసకర్తతోనో కేవలం విభేదిస్తూ వాదించటం కాకుండా, విభేదించటానికి గల కారణాలు వివరిస్తూ అభిప్రాయాలు పంచుకోవటం అరుదుగా అగుపడుతుంటుంది. Thanks for your comment here.

    Purnima
    …..

    పూర్ణిమ గారికి
    ”పాఠకుడికి కలిగే అభిప్రాయాన్ని వ్యక్తీకరించినప్పుడు రూపొందే వ్యాసానికి, అదే పాఠకుడు అదే రచనపై సమీక్ష చేయబూనినప్పుడు వచ్చే వ్యాసానికి గల తేడాలెలాంటివి?” అనే అంశాలపై సరైన వివరణలతో కూడిన వ్యాసం కావాలని, నాకు ఆసక్తి ఉంటే రాయమని మీరు పెట్టిన కామెంట్ చూసాను.
    మీరు రాయమన్నారు కదా అని నేను రాసేయొచ్చు అయితే నాకు తెలీని ఎన్నో ప్రక్రియలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. ఏ పనైనా తెలిసీ తెలియకుండా చేయడం సంస్కారం కాదని భావించే వాడిని, అందుకే మీరనుకున్న వ్యాసాన్ని రాసే పూర్తి సమర్థత ఉన్న వ్యక్తిని మీకు నేను సూచిస్తున్నాను. ఆయన శ్రీ ఆర్వీ రామారావు. మీరనుకున్న వ్యాసం తాలూకు భావాలు ఆయన ఈ మధ్యే తెలుగు వెలుగు పుస్తకంలో రాసిన వ్యాసంలో ప్రతిఫలిస్తున్నాయి. మీరు ప్రచురిద్దామనుకుంటున్న అంశాన్ని మొహమాటాలకు తావులేకుండా అద్భుతంగా రాయగల నేర్పు, ఓర్పు ఉన్న పండితుడాయన. మీకు ఆసక్తి ఉంటే ఆయన్ని సంప్రదించండి. ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఆయన్ని సంప్రదించవచ్చు.

    ఆయన తెలుగు వెలుగులో రాసిన కథనానికి సంబంధించిన లంకె ఇది.
    http://crm.eenadu.net/teluguvelugu/magazine.html#/76

    కనిష్ట
    పవన్ సంతోష్ గారు ఇదీ జరిగిన కథ, పూర్ణిమ గారు అడిగిన వెంటనే నేను మీరు ఇప్పుడు ప్రచురించిన వ్యాసానికి సంబంధించిన లంకెని అవగాహన కోసం ఆనాడే ఆమెకు సూచించాను. మీరు ఈ రోజు ఈ వ్యాసాన్ని పాఠకులకి అందించడం ఆనందకరవిషయం. మీరనుకున్నది నిజమే. నాకు ఆయనతో ప్రత్యక్ష పరిచయం ఉంది. ఆయన శిష్య కోటిలో నేనూ ఒకడ్ని

    అప్పటి చర్చని చదువేందుకు లంకె http://pustakam.net/?p=12160

    1. pavan santhosh surampudi

      ఇదంతా నాకు తెలియక యాదృఛ్ఛికంగా ఈ వ్యాసాన్ని ఆయన వద్ద అనుమతి తీసుకుని నేను పుస్తకం.నెట్ కు అందించాను. ఏదేమైనా మంచికే జరిగింది.

  3. kanista

    సదసద్వివేకచతురత కోసమే విద్యనభ్యసించాలని నాకు బోధించింది, ఈ గురువు. ఆ మహామహోపాధ్యాయుడి రచనా కౌశలాన్ని మరోమారు చదువుతూ పరిపూర్ణానందం పొందుతున్నాడీ శిష్యుడు.
    కనిష్ట

    1. pavan santhosh surampudi

      ఆయనకూ మీకూ ప్రత్యక్ష పరిచయం ఉందాండీ?

Leave a Reply