సావిత్రిబాయి ఫూలే, రమాబాయి అంబేద్కర్ ల జీవితకథలు

ఇటీవలి కాలంలో పనిగట్టుకుని మొదలు పెట్టకపోయినా వివిధ రంగాలలో కృషి చేసిన భారతీయ మహిళల గురించి చదువుతున్నాను. ఒకటి చదవడం మొదలుపెట్టడం – అది ఇంకో పుస్తకానికి దారి తీయడం ఇలాగ నడుస్తూ వస్తున్నది. ఆ మధ్య “వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా” పుస్తకం చదువుతున్నప్పుడు సావిత్రిబాయి ఫూలే గురించి రాసిన పరిచయం, ఆవిడ రాసిన ఒక ఉత్తరం ఆంగ్లానువాదం చదివాను. రెండూ ఆవిడపై కుతూహలం రేకెత్తించాయి. దానితో, కొన్నాళ్ళ క్రితం కినిగె.కాంలో ఆవిడపై ఉన్న రెండు పుస్తకాలూ చదివాను. ఇదంతా జరగడానికి కొన్నాళ్ళ మునుపు – రమాబాయి అంబేద్కర్ గురించిన మరొక పుస్తకం కూడా చదివాను. ఈ మూడు పుస్తకాల గురించే ఇప్పుడు రాయబోతున్నది.
***

మొదట రమాబాయి అంబేద్కర్ గురించి చెబుతాను. సాధారణంగా, ఒక గొప్ప వ్యక్తి భార్య గురించి ఏదన్నా చెప్పబోతూ ఉండగానే, “ఆ…ఆయన భార్య కనుకే కదా మనకి తెలిసిందీ” అని పెదవి చప్పరించేసే వాళ్ళని నేను చాలా సార్లే చూశాను, చూస్తున్నాను. అయితే, ఆ ముక్క నిజమే అయినా కూడా, ఇలాగ “భార్య”ల కథలు చదివిన ప్రతిసారీ దాదాపుగా – వీళ్ళ సహాయసహకారాలే లేకపోతే వాళ్ళకి అంత పేరొచ్చేదా? అనే అనిపించేది నాకు. కొన్ని సందర్భాల్లో – ఆ భార్యకు తమకంటూ ప్రత్యేక ఉనికి, వ్యక్తిత్వం ఉన్న వారుగా, స్పూర్తి కలిగించేవారిగా కనబడేవారు (ఉదా: సరస్వతి గోరా). ఏదేమైనా, అనుకూలవతి అయిన భార్య దొరకడం మాత్రం గొప్ప అదృష్టం కాదూ? 🙂 ఈ పుస్తకంలో ఆ అనుకూల వతి అంబేద్కర్ ధర్మపత్ని రమాబాయి.

రమాబాయికి తనకంటూ ప్రత్యేకంగా జీవితం నిర్మించుకోవడానికి అంత వ్యవధి, అవకాశం ఉన్నట్లు తోచదు. పైగా, వారి కుటుంబ, సాంఘిక పరిస్థితులలో అది కుదిరేపని కాదేమో కూడా. కనుక, రమాబాయి కథ మొత్తంలో అంబేద్కర్ ప్రస్తావనే ఎక్కువగా ఉందీ పుస్తకంలో. అయితే, ఇక్కడ ఆయన కథని ప్రస్తావిస్తూనే కొన్ని సంఘటనల్లో రమాబాయి గురించి చెప్పినప్పుడు ఆవిడపై గౌరవభావం కలిగింది. కొన్ని సంఘటనల్లో, ఉదా: అంబేద్కర్ పైచదువులకి పోయినప్పుడు రమాబాయి ఆత్మాభిమానంతో, తన రెక్కల కష్టంతో నెట్టుకురావడం, ఆయన తన పనుల్లో పడి ఇంటినీ, ఈవిణ్ణీ పట్టించుకోనప్పుడు కూడా నెగ్గుకురావడం (ఆరోగ్యంగా లేకపోయినా) – ఒక విధంగా ఆలోచిస్తే, “స్త్రీ అణిచివేత” అదీ, ఇదీ అనుకోవచ్చునేమో కానీ – నాకు మాత్రం ఆవిడకి నమస్కారం పెట్టాలి అనిపించింది. ఇవన్నీ అంబేద్కర్ లాంటి ప్రముఖ భర్తలేని ఎందరో స్త్రీలు చేస్తూ ఉన్నారు, ఉంటారు కూడా – వారందరికీ రమాబాయి ప్రతినిధి ఈ కథలో. ఆవిడ తన గురించి తాను ఏదన్నా రాసుకున్నా/చెప్పుకున్నా బాగుండేది అనిపించింది. (జీవితచరిత్ర ఎంతైనా ఇంకోళ్ళు చెప్పేదే కదా!)

అంబేద్కర్ కు ఆవిడ ధర్మపత్నిగా అందించిన సహకారంతో పోలిస్తే ఆవిడకి అంబేద్కర్ భర్తగా అందించిన సహకారం చాలా తక్కువ అనిపించింది ఈ పుస్తకం చదివాక. ఆయన సాధించిన విజయాల్లో ఈవిడ పాత్ర, అనేక కుటుంబ సమస్యలను ఎదుర్కుని, కష్టాలు దిగమింగిన పద్ధతి – ఇవన్నీ ఒక పక్క ఆవిడ మీద గౌరవ భావాన్ని కలిగించినా, పుస్తకంలో మరీ ఎక్కువగా వర్ణించినట్లు కూడా అనిపించింది. ఒక్కోచోట చదువుతూ ఉంటే, భక్తులు తమ దేవత కథ రాస్తున్నట్లు ఉండింది. బహుశా ఆవిడ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు కాబోలు…అందుకే ఇలాగ తెలిసిన వాటి గురించే వర్ణించి వర్ణించి చెబుతున్నారు అనిపించింది. ఏదేమైనా “కార్యేషు దాసీ…” అన్న భావానికి, అనుకూలవతి అన్న పదానికి -అంబేద్కర్ జీవితంలో ప్రతీకగా నిలిచింది రమాబాయి – అని మాత్రం అనిపించింది ఈ పుస్తకం చదివాక.

రమాబాయి అంబేద్కర్ జీవిత చరిత్ర
హిందీ మూలం: శాంతి స్వరూప్ బౌద్ధ
తెలుగు అనువాదం: డా. జి.వి.రత్నాకర్
హైదరాబాదు బుక్ ట్రస్ట్ ప్రచురణ
౫౨ పేజీలు , వెల: నలభై రూపాయలు
పుస్తకం గురించిన పరిచయం హై.బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.
కొనుగోలుకు కినిగె పేజీ ఇక్కడ.

******


మహారాష్ట్రలో నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీ బా ఫూలే భార్య సావిత్రీబాయి. అయితే, ఈవిడ వ్యక్తిగత జీవితంలోనే కాక, క్రియాశీలక జీవితంలోనూ ఫూలే సహధర్మచారిణై, ఆయన మరణానంతరం కూడా ఆయన ఆశయపథంలో కొనసాగింది. అలాగే, ఒక రచయిత్రిగా, వక్తగా కూడా తన జీవితకాలంలో పేరు పొందింది. “సామాజిక విప్లవ కారిణి సావిత్రీబాయి” అన్న పుస్తకంలో – ఆవిడ గురించి బ్రజ్ రంజన్ మణి, సింథియా స్టీఫెన్, గేల్ ఆంవెట్, పమేలా సర్దార్, సునీల్ సర్దార్ లు రాసిన వ్యాసాలూ; కొన్ని బొమ్మలూ; సావిత్రి బాయి ఒకప్పుడు జ్యోతీరావు ఫూలే కు రాసిన మూడు లేఖలకి అనువాదాలు (వీటిల్లో ఒకటి Women writing in India లో కూడా అనువదించారు); ఆవిడ కవిత ఒకదానికి అనువాదం; ఫూలే దంపతుల ఆధ్వర్యంలో చదువుకున్న బాలిక ముక్తాబాయి అంటరానితనం గురించి రాసిన వ్యాసం; చివరగా – విక్టర్పాల్ సావిత్రి బాయిని గురించి రాసిన వ్యాసం; సావిత్రీబాయి జీవితంలోని ముఖ్య ఘట్టాల పట్టికా ఉన్నాయి.

ఈ పుస్తకం చదివాక – సావిత్రీబాయి గురించి ఇదివరకే నేను తెలుసుకున్న అంశాలకు కొత్తగా చేరిన విశేషాలు లేవు అని నేననను. కానీ, పుస్తకం రూపొందించిన విధానంపై కొన్ని సందేహలు/అభ్యంతరాలు ఉన్నాయి.

1) వ్యాసాలకి టైటిల్స్ గా వ్యాసకర్తల పేర్లు పెట్టడం ఇదే మొదటిసారి చూడ్డం. వ్యాసానికి టైటిల్ వ్యాస విషయం గురించి కాదా పెట్టేది?

2) విషయ సూచిక – మొత్తంగా సగానికి సగం టైటిల్స్ మిస్సింగ్ ఇక్కడ. ఇది డిజిటల్ వర్షన్ లోపమా? పుస్తకమే అలా ముద్రించారా? అన్నది అర్థం కాలేదు.

3) చివరిపేజీలో ఈ వ్యాస రచయితల వివరాలు ఉన్నాయి. అయితే, రచయితల పేర్లే లేవు! ఏది ఎవరి గురించో మనమే ఊహించుకోవాలన్నమాట.

4) ఫొటోలు వేసిన పేజీల్లో ఒకచోట ఏడమవైపు క్రింది ఫొటో మొత్తానికే ఎగిరిపోయింది కానీ, ఫొటో తాలూకా వివరణ మాత్రం ఉంది.

5) అనువాదం ఒక్కోచోట వీలైనంత క్లిష్టమైన వాక్యనిర్మాణంతోనూ, ఒక్కోచోట అతి సరళంగానూ ఉంది, అదెలా కుదిరిందో కానీ!

6) ఇది పుస్తకం మేకప్ గురించి కాదు కానీ, మామూలు సందేహం: ఒక చోట – “మహారాష్ట్ర మహిళా ఉద్యమ నాయకురాళ్ళు”…అంటూ “ఆనందీ బాయి జోషీ” గురించి రాశారు. అసలు ఉద్యమాలలో పాల్గొనేన్ని రోజులు ఆవిడ జీవించి ఉందా? అని సందేహం కలిగింది నాకు.

7) పుస్తకం చివర్లో ఇచ్చిన సావిత్రీబాయి జీవిత విశేషాల వివరం చూస్తే, ఆవిడ జీవితం గురించి బానే సమాచారం ఉంది అనిపిస్తుంది. అటువంటప్పుడు జీవిత చరిత్రే వివరంగా రాయక – కొన్ని సంగతులు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఇంతమంది వ్యాసాలు రాయడం ఎందుకు? అని సందేహం.

అయితే, ఈ గోలంతా అటు పెడితే – ఈ వ్యాసాల్లో ఉదహరించిన సంఘటనలు చదివితే మాత్రం ఆవిడ గొప్ప స్పూర్తివంతమైన వ్యక్తి అనిపిస్తుంది. విపరీతమైన వ్యతిరేకత మధ్య ఆవిడ స్త్రీ విద్య, వితంతు స్త్రీల రక్షణ, శిక్షణ కోసం చేసిన కృషి చూస్తే అబ్బురంగా అనిపించింది. అలాగే, జ్యోతీబా చేసిన పనుల్లో దేనికీ వెరవకుండా ఆవిడ అందించిన సహకారం కూడా. ఒకరికిఒకరు తోడూ-నీడై, ఒకరి ధైర్యం ఒకరై, ఒకరి ఆశయం కోసం మరొకరు కృషి చేసి – ఇలా సాగిన వీళ్ళిద్దరి ప్రయాణం గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవాలి అనిపించింది.

సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి -సావిత్రీబాయి ఫూలే జీవితం, ఉద్యమం
సంకలనం: బ్రజ రంజన్ మణి, పామెలా సర్దార్
ఆంగ్ల మూలం: A Forgotten Liberator : The Life and Struggle of Savitribai Phule, Mountain Peak, Delhi 2008.
తెలుగు అనువాదం: కాత్యాయని
హైదరాబాదు బుక్ ట్రస్ట్ ప్రచురణ
౭౨ పేజీలు , నలభై రూపాయలు
పుస్తకం గురించిన పరిచయం హై.బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.
కొనుగోలుకు – కినిగె లంకె ఇక్కడ.

****


ఇక మూడో పుస్తకం “నేనూ సావిత్రీబాయిని”- ఇది కూడా సావిత్రీబాయి గురించే కానీ, కథనంలో వైవిధ్యం ఉంది. మరాఠీ భాషలో ఒక గంటపాటు నడిచే ఏకపాత్రాభినయం వంటి ప్రదర్శనకు వోల్గా గారు చేసిన తెలుగు అనువాదం ఇది. సావిత్రీబాయి మనతో మాట్లాడుతున్నాట్టూ, తన కథ, తన “సేఠ్-జీ” కథా మనతో చెప్పుకుంటున్నట్లూ ఉంటుంది. వోల్గా గారి అనువాదమో, కథనంలోని వైశిష్ట్యమో కానీ, పై వ్యాసాల్లో అంతలావు మాటల్లో చెప్పిన సంగతిని తేలిక భాషలో, చాలా ఆసక్తికరంగా చెప్పారీ పుస్తకంలో. పై వ్యాసాల్లో వర్ణించిన ప్రధాన ఘట్టాలన్నీ ఇందులో కూడా ఉన్నవి. ఈ ప్రదర్శన కథా కమామిషూ కూడా చెప్పి ఉంటే బాగుండేది అని తోచింది.

ఈ పుస్తకంలో కొంచెం అయోమయం కల్గించిన అంశం ఒక్కటి ఉంది నాకు. “వుమెన్ రైటింగ్” పుస్తకంలోనూ, పైన చెప్పిన సావిత్రి బాయి పుస్తకంలోనూ – ముక్తాబాయి అన్న విద్యార్థిని రాసిందని చెప్పబడుతున్న వ్యాసం ఈ పుస్తకంలో మాత్రం రక్ష్మా అన్న విద్యార్థిని రాసిందన్నారు. అదొక్కటే అర్థం కాలేదు.

నేనూ, సావిత్రీ బాయిని
మరాఠీ మూలం: సుషమా దేశ్ పాండే
తెలుగు అనువాదం: ఓల్గా
ప్రచురణ: స్వేచ్ఛ ప్రచురణలు
ముద్రణ: ౨౦౦౫
వెల: యాభై రూపాయలు
ఆన్లైన్ కొనుగోలుకు కినిగె.కాం లంకె ఇక్కడ.

*****

ఇప్పుడెంటీ – పుస్తకాలు చదవాలా? వద్దా? అంటే మాత్రం నేనేమీ చెప్పలేను.

You Might Also Like

6 Comments

  1. 2012 – నా పుస్తక పఠనం | పుస్తకం

    […] విపరీతమైన ఆరాధనాభావంకలిగింది! * రమాబాయి అంబేద్కర్ జీవిత చరిత్ర * సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి […]

  2. varaprasad

    ramabhai,savitribhai iddaroo slaghaneeyule,endukante vari sahakaram lekunte vari bharthalaku antha gurtimpu vacchedikademo.

  3. pavan santhosh surampudi

    పేరు చూడగానే ఏవిటీవిడ ఈ మధ్య కేవలం ప్రఖ్యాతులైన భారతీయస్త్రీల గురించే చదువుతున్నట్టున్నారు అనుకున్నాను:) అలా చదివితే తప్పని కాదులెండి. ఊర్కే.

    1. సౌమ్య

      Focused reading, you see 😛

Leave a Reply