గోరాతో నా జీవితం – సరస్వతి గోరా

“గోరా” అని ఒకాయన ఉండేవారని, నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవారనీ మొదటిసారి నాకు ఎప్పుడు తెలిసిందో గుర్తు లేదు కానీ, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చెప్పిందన్న విషయం మాత్రం గుర్తుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలకి అందరిలా కాకుండా లవణం, సమరం,విజయం ఇలా పేర్లు పెట్టుకున్నారని విన్నాక చిన్నప్పుడు నాకు భలే వింతగా కూడా అనిపించింది. అదిగో, అప్పట్నుంచీ కుతూహలంగానే ఉన్నా, నేను ఎవరన్నా నాస్తిక వాదుల మీద కుతూహలం కలిగి చదవడం మొదలుపెడితే, వాళ్ళు ఎంతసేపూ అసలు నాస్తికత్వం అంటే మతం-తిట్టుడు (అదో రకం మతోన్మాదం అనిపిస్తుంది నాకు!) మాత్రమే అన్న తరహాలో ఉన్నట్లు నాకు తోచడంతో, గోరా గారి రచనల జోలికి కూడా పోలేదు. కానీ, సరస్వతి గోరా గారి “గోరాతో నా జీవితం” చదివాక, బహుసా వీళ్ళు వేరే రకం నాస్తిక వాదులేమో (ఫైనల్లీ!!) అనిపించింది. మామూలు సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాలలో పుట్టి పెరిగిన గోరా, సరస్వతి గార్లు తాము నమ్మిన సిద్ధాంతంపై నిలబడి, దాని వ్యాప్తి కోసం దేనికీ వెరవకుండా చేసిన కృషి కనీసం నా మట్టుకు నాకు చాలా అబ్బురంగా అనిపించింది.

గోరా, సరస్వతి ల వివాహం ౧౯౨౨లో(1922) జరిగింది. అప్పటికి పధ్నాలుగేళ్ళ సరస్వతి గారు ఇంకా సాంప్రదాయ కుటుంబాల్లో పెరిగిన అందరు అమ్మాయిల్లాగే ఉంటే, గోరా గారు నాస్తికత్వ బాటలో తొలి అడుగులు వేస్తున్నారు. అప్పుడు మొదట్లో మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ మొదలైన వారి ప్రస్థానం స్వతంత్ర సంగ్రామం లో పాల్గొనడం, సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, నాస్తిక కేంద్రం స్థాపించడం – ఇలా అంచెలు అంచెలుగా ఎలా సాగిందో, ఈ పుస్తకం చదివితే ఒక అవగాహన వస్తుంది. పుస్తకం చాలా మాములు భాషలో, ఆట్టే తీవ్ర భావజాలం-పదజాలం లేకుండా, “విషయం ఇదీ” అన్న తరహాలోనే సాగినా కూడా చాలా స్పూర్తివంతమైన జీవితం గడిపారు అనిపించింది చివరకి. ఈ “సింప్లిసిటీ” నాకు ఈ పుస్తకం బాగా నచ్చడానికి ప్రధాన కారణం అనుకుంటాను. తమ విషయాలే చెప్పినా, నాకు అవి సొంత డబ్బాగా తోచలేదు. “ఆత్మకథ అంటేనే సొంత డబ్బా, పరనింద” అన్నది ఈ పుస్తకానికి వర్తించదు :). ఎందుకంటే, ఇది సరస్వతి గారి జీవితం మాత్రమే కాదు – కొంతవరకూ ఆనాటి సంఘం కథ, గోరా గారి నాస్తికోద్యమం కథ, ఆంధ్రా లో అప్పటి స్వాతంత్రోద్యమం కథ కూడానూ.

ఒక్కో అధ్యాయం చదువుతూ ముందుకు సాగుతూ ఉండగా ఆవిడ “గోరాతో నా జీవితం” అని పేరు పెట్టినా కూడా, సరస్వతి గారంటే గోరా గారి భార్య కాదు, ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైన కథ ఉంది. గోరా జీవితంలో, ఆయన సాంఘిక కార్యకలాపాల్లో ఆవిడదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది అనిపించింది.

మొదటి అధ్యాయం “నా కథ తీరు” చదివితే, సరస్వతి గారి వ్యక్తిత్వం గురించి ఒక అవగాహన వస్తుంది. నా లాగా ఏమీ తెలీకుండా మొదలుపెట్టిన వారికీ సైతం, ఆవిడంటే ఏమిటో అర్థమవుతుంది. “గోరా సాధించిన ప్రతి దానికీ వెనుక నేను ఉన్నాను అంటారు. అది నిజమే. అలాగే నేను సాధించిన దాని వెనుక కూడా గోరా గారు ఉన్నారు.” అని ఆవిడ రాసినప్పుడు వర ముళ్ళపూడి గారు బాపు-రమణల గురించి రాస్తూ : “నాన్నకి, మామకి బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు బ్యాక్గ్రౌండ్ అయ్యారు” అన్న వాక్యం వెంటనే గుర్తొచ్చింది. అలాగే, “అన్యోన్య దాంపత్యం” అంటే ఏమిటో కూడా అర్థమైంది నాకు.

తరువాతి మూడు అధ్యాయాలు – పుట్టిల్లు, బాల్యం, వివాహం : వారి కుటుంబ నేపథ్యం, ఆనాటి సమాజం గురించి చెబుతాయి. ఈ మూడు అధ్యాయాలు మామూలుగా అందరి కథల్లాగానే ఉన్నా, ఈ నేపథ్యం తెలుసుకుని సరస్వతి గారి ప్రస్థానాన్ని గమనిస్తే అబ్బురంగా అనిపిస్తుంది (నాకు అనిపించింది). తరువాతి అధ్యాయం “అర్థం లేని అపోహ” నుంచి కొంచెం కొంచెంగా అప్పటి సమాజంలో తనకి నచ్చని విషయాల గురించి వ్యాఖ్యానిస్తూ, “గ్రహణం-గర్భిణీ స్త్రీలు” దగ్గరికి వచ్చేసరికి ఇక నెమ్మదిగా వీరిలో నాస్తిక భావనలు ఎలా పెరుగుతూ వచ్చాయో ఒక గ్రాఫ్ మొదలవుతుంది. నాస్తిక కేంద్ర స్థాపన, నాస్తికవాద ప్రచారం, నాస్తిక సదస్సులు – ఇవన్నీ ఒకవైపు. సత్యాగ్రహాలు, సంఘ సంస్కరణ, స్వాతంత్రోద్యమం, జైలు, గాంధీ ఆశ్రమంలో బస, స్వతంత్రం వచ్చాక కూడా ఇతర సాంఘిక ఉద్యమాలకి నాయకత్వం వహించడం -ఇదంతా వారి జీవితంలో మరో కోణం. ఇవేవీ కాక, ఇతరత్రా జీవన సమరాల కథ మరో వైపు : ఈ వివిధ కోణాల్లోనూ ఆవిడ సంతృప్తి కరమైన విజయాలు సాధించారనే చెప్పాలి. అందుకే “ఈ విధంగా నేను నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చాలా నేర్చుకోగలిగానని, కొంతైనా సాధించగలిగానని నాకు సంతృప్తి ఉంది” అని నమ్మకంగా రాసుకోగలిగారు.

ఈ పుస్తకంలోని ప్రతి వాక్యంలోనూ నిజాయితీ ఉన్నట్లు తోచింది నా మట్టుకు నాకు. సాధారణంగా బయటకి చర్చించని విషయాలు (ఉదా: వాళ్ళ పిల్లల్లో ఒకమ్మాయి పెళ్లి కాకుండా తల్లి కావడం) కూడా బాహాటంగా చర్చించడం; ఒక స్త్రీగా పందొమ్మిది వందల ఇరవైల్లోనే మూఢ నమ్మకాలకి వ్యతిరేకంగా వ్యక్తిగత నిరసన చూపడం; ఆ తరువాత కూడా ఒక గృహిణిగా తన నమ్మకాలకి-కుటుంబ బాధ్యతలకి, భర్త నాస్తికవాద ప్రచారానికి, భక్తి పరాయణులైన అత్త-మామలకి మధ్య ఉన్న వైవిధ్యాలని కూడా అధిగమిస్తూ ముందుకు సాగడం; ఈ ఉద్యమాలు వాటి మధ్య స్థిరమైన ఆర్ధిక వనరులు లేకపోయినా తొమ్మిది మంది పిల్లలని ప్రయోజకులని చేయడం – ఇలాగ, భిన్న కోణాలలో సరస్వతి గారి గురించి చదివాక, “గ్రేట్ లేడీ” అనిపించింది. చదివి రెండు వారాలు అవుతున్నా ఇంకా ఆ “గ్రేట్ లేడీ” భావన తగ్గలేదు. చదివిన వెంటనే అర్జెంటుగా ఈ పుస్తకం కొని వీళ్ళ పేర్లను నాకు పరిచయం చేసిన నా “గ్రేట్ లేడీ” అయిన మా అమ్మకి ఇండియాకి పంపాలి అనిపించింది.

ఐతే, ఈ పుస్తకంలో చెప్పిన వాటిలో నాకు నచ్చని విషయాలు లేవని కాదు. కొన్ని సంఘటనల్లో సరస్వతి గారి స్పందన గానీ, దానికి ఇచ్చిన వివరణ గానీ నాకు నచ్చలేదు (ముఖ్యంగా “బీఫ్ అండ్ పోర్క్” కార్యక్రమ నిర్వహణ). కానీ, అలాంటి నాకు నచ్చని అంశాలు ఉన్నా కూడా, తాము నమ్మిన సిద్ధాంతం కోసం, సమాజ శ్రేయస్సు కోసం వారు చేసిన కృషి, నాస్తిక కేంద్రం, ఇతర ఉద్యమాల నిర్వహణలో వారి నాయకత్వం- ఇవి అందించే స్ఫూర్తి ముందు ఇలాంటి చిన్న చిన్న నచ్చకపోవడాలు ఏపాటి? నా అభిప్రాయంలో ఇది మన వ్యక్తిగత మత భావనలతో సంబంధం లేకుండా అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. నామట్టుకు నాకైతే, కొని, ఇంట్లో పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన పుస్తకం.

పుస్తకం కినిగేలో ఈ-బుక్ గా కొనేందుకు, అద్దెకు తీసుకునేందుకు లభ్యం.
ముద్రణ వివరాలు:
గోరాతో నా జీవితం (My life with Gora)
సరస్వతి గోరా ఆత్మకథ (Autobiography by Saraswathi Gora)
ప్రథమ ముద్రణ – ౧౯౯౨, రెండవ ముద్రణ -౨౦౧౧
వెల: వంద రూపాయలు
కాపీలకు: నాస్తిక కేంద్రం, బెంజి సర్కిల్, విజయవాడ-౧౦.
ఫోను: ౦౮౬౬-౨౪౭౨౩౩౦ (0866-2472330)

You Might Also Like

2 Comments

  1. లలిత (తెలుగు4కిడ్స్)

    Sowmya, I feel glad when you introduce books that are available on kinige.com. I bought this book soon after reading your review. If like it after reading it, I will buy the print version too. Thanks, to you as well as kinige.com

  2. Sarath 'Kaalam'

    మా నాన్న నాగం గారు గోరాగారి అనుచరులు కాబట్టి సరస్వతి గోరా గారితో నాకు మంచి పరిచయమే వుంది నాకు. వారిని అప్పట్లో తరచుగా కలుసుకునేవాడిని. మీ పుస్తక సమీక్ష చదువుతుంటే విజయవాడ నాస్తిక కేంద్రంలో సరస్వతీ గారి సమక్షంలో నేను గడిపిన రోజులు గుర్తుకువచ్చాయి.

Leave a Reply