అరచేతిలో ఆకాశం
వ్రాసిన వారు: స్వాతి కుమారి
*********
ఆకాశమంటే పొగకాదు, చెల్లాచెదురైన ధూళి మబ్బుల సమూహం కాదు. పదార్ధమూ, శూన్యమూ కాదు. కొన్ని అస్తిత్వాలు లేవని చెప్పడానికి ఎంత గట్టి ఋజువులుంటాయో ఉన్నాయని తెలుసుకోవడానికి అంతకంటే బలమైన నమ్మకం ఆసరాగా ఉంటుంది; దైవం లాగా, ఆకాశంలాగా. ఆ నమ్మకాల్లో ఉండే గొప్ప నిశ్చింత, నిబ్బరం, ఆనందం, ఆహ్లాదం- ఇవే వాటి రూపాలు, రూపాంతరాలు, అస్తిత్వాలూ. తన రూపరహిత స్వరూపాన్ని నీటిలో చూసుకునే అకాశంలాగే కవిత్వమూ చదువరి పొందే తాదాత్మ్యతలోనే తనని తాను పోల్చుకుంటుంది.
గీటురాయి మీద బంగారపు నిగ్గు తేల్చడానికి అలవాటు పడ్డ చేతికి ఒక మంచి గంధపు చెక్క దొరికినప్పుడు; ఆపరేషన్ టేబుల్ మీద కత్తికి సుతిమెత్తని పూలగుత్తి తగిలితే; రాళ్ళూ, కత్తులూ, కళ్ళద్దాలూ, చేతితొడుగులు అన్నీ పక్కనపెట్టి విమర్శించకుండా, విశ్లేషించకుండా; తాళం పారేసుకున్న ఇనప్పెట్టెలో ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన పసితనంతో కాసేపు కరువుతీరా కబుర్లాడుకుని ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా ఏమీ ఎరగనట్టు తిరిగి పనిలోపడి మామూలుగా అయిపోగలగడం – అప్పుడప్పుడూ మాత్రమే సాధ్యపడుతుంది.
తెగింపుతో- కనబడ్డ ప్రతి ఒడ్డు మీదనుండి జీవితంలోకి దూకటానికీ, అనుభవాల ప్రామాణికత ప్రకారం ఏర్పడ్డ సూత్రాల ఆధారంగా బతికెయ్యడానికీ మధ్య ఏవో కొన్ని సంఘటనలు ఒక సరిహద్దు రేఖను గీస్తాయి. ఒకసారి దాటేసి ఇటు వైపొచ్చాక మాములుగా నడుస్తూ వెనక్కి వెళ్లడం వీలవదు. ఆ గీతకి అనుమానం రాకుండా పెద్దరికంగా నటిస్తూ ఎవరూ చూడనప్పుడు ఒక తొక్కుడు బిళ్లని అటు గిరాటేసి ఒంటికాలిపై గెంతేసి ఒక్క ఉదుటున ఆ వైపుకి దూకెయ్యాలంతే…
ఒక్కోసారి పిల్లలకి తాయిలాలివ్వకుండానే, బతిమాలకుండానే, అసలు వాళ్లని పట్టించుకోకుండా బల్లమీద కాగితాలు పెట్టుకుని మనమేదో రాసుకుంటున్నప్పుడు, ఎందుకో తెలీకుండా, విడి సందర్భాల్లో ఎంత బుజ్జగించినా ఇవ్వని ముద్దొకటి ఊహించకుండా పెట్టేసి తమ దారిన తాము ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు- పదాల పటాటోపం లేకుండా, తెలుసుకోవడం తప్ప మరే ఉద్దేశమూ లేకుండా వాళ్లడిగే ప్రశ్నల్లోని నిజాయితీలాంటి స్వఛ్ఛమైన ప్రేమొకటి మనమీద మనకి వెల్లువెత్తుతుంది.
—-
ఇవ్వాళ నా గీటురాయికి గంధపు చెక్కా, నా కత్తి మొనకి పూలగుత్తీ, గీతకి అటువైపు విసిరెయ్యడానికి తొక్కుడుబిళ్ళా, నా రాతల మధ్యలో ఊహించని విరామంలాంటి లేతముద్దూ ఒకేసారి దొరికాయి.
—-
“క్షణం జీవితం చాలనిపిస్తుంది. కల్పాలు బ్రతికినా చాలదనిపిస్తుంది.” అని బీవీవీ ప్రసాద్ గారి “ఆకాశం” కవితల్లో చదువుతున్నప్పుడు “దాక్కోవడం కవిత్వం, దొరికిపోవడం కవిత్వం” వెరసి ”నాకు నచ్చిన భావాన్ని నీకు నచ్చిన మాటల్లో చెప్పడం కవిత్వం” అని చెప్పుకున్నమాటలు, శబ్ధాలలోపల దాచి కవి పంచిపెడుతున్న కలల్లా కనిపిస్తాయి.
(ఈ కవితా సంకలనం 2011లో ప్రతి సంవత్సరం కాకినాడ లోని ఇస్మాయిల్ మిత్ర మండలి ఇచ్చే ఇస్మాయిల్ కవితా పురస్కారం పొందింది. ఈ పుస్తకం అందుకున్న ఇతర అవార్డులు – విశ్వకళా పీఠం, హైదరాబాదువారి స్నేహనిధి పురస్కారం 2012; గుంటూరు జిల్లా రచయితల సంఘం వారి సాహిత్య పురస్కారం 2011)
*********
ఆకాశం – బి.వి.వి.ప్రసాద్ కవిత్వం
పాలపిట్ట ప్రచురణలు, 2011
వెల: 70 రూపాయలు
కాపీలకు: palapittabooks@gmail.com
ప్రసాద్ గారి కవిత్వం ఆయన బ్లాగులో కూడా చూడవచ్చు.
ఈ సంపుటి గురించి మానస చామర్తి అభిప్రాయాలు ఆవిడ బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.
అరచేతిలో ఆకాశం | కల్హార
[…] (పుస్తకం.నెట్ లో ప్రచురితం) దీన్ని మెచ్చుకోండి:Likeదీన్ని మెచ్చుకునే మొదటివారు మీరే అవ్వండి. […]
Sateesh
ఈ పుస్తకం నాలో కలిగించిన స్పందన నా బ్లాగులో చదవొచ్చు.
BVV Prasad
‘ఆకాశం’ సంపుటిని ఎవరైనా ప్రేమతో, అది ఇచ్చిన శాంతివల్ల కలిగే సంతోషంతో తాకుతున్నపుడల్లా, హృదయం మరింత మార్దవమై, కళ్ళు చెమర్చుతున్నాయి.
జీవితం చాలా గొప్పది అనే మాట, జీవితంలో తగిలే ప్రతి తీవ్రగాయం నుండీ బయటపడినప్పుడల్లా నాకు నేను చెప్పుకొంటూ ఉంటాను.
అలాంటప్పుడు ‘జీవితమెలా ఉన్నా జీవించటమే ఆనందంగా ఉండగలిగితే చాలు’ అని ప్రతి భాధాతప్త హృదయంతోనూ చెప్పాలనిపిస్తుంది. మానవాళికీ, జీవితానికీ నేను రాసుకొన్న ప్రేమలేఖ ఈ ‘ఆకాశం’.
మనుషుల్లోలోపల ఎంత దుఃఖం, సంక్లిష్టతా గూడు కట్టుకొని ఉన్నాయో, మిత్రులు ఈ సంపుటి చదివి ప్రేమతో పలవరిస్తున్నపుడల్లా స్పష్టమవుతుంది. ‘కాలం కాని కాలంలో కవి బాధ్యతగా తన పాట తను పాడతాడు’ అని సంపుటి చివరి కవితలో రాసుకొన్నాను కాని, సరైన కాలంలోనే ‘ఆకాశం’ తనంత తాను ఈ కవిని వాహిక చేసుకొని మానవహృదయాలను తాకేందుకు వచ్చిందని అనిపిస్తూవుంది.
చదివి ఆనందించి ఊరుకోకుండా, పదిమందితో తమ ఆనందాన్ని పంచుకొంటున్న స్వాతిగారికీ, ఇతర మిత్రులకీ, మంచిపుస్తకాలకు వేదికగా నిలుస్తున్నందుకు పుస్తకం.నెట్ వారికీ నా కృతజ్ఞతలు.
ఈ సంపుటి ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి ఇక్కడనుండి కూడా పొందవచ్చును.
http://kinige.com/kbook.php?id=571&name=Aakaasam
Prasanna
అరచేతిలో ఆకాశం: when I began reading the commentary, it was as if I was going very close to the book. It is indeed nicely and effectively written. I must immediately buy the book and indulge into reading it. I had also gone through the bvv prasad gari blog. it has been a great experience. after a long period of time, felt like walking in total breeze of telugu kavitvam. long live such great persons and their writings!
Sateesh
దృశ్యం నుండి రహస్యం లోకి
ఉద్వేగాల నుండి స్వచ్ఛత లోకి
భయం నుండి స్వేచ్ఛ లోకి
శ్రమ తెలియక నడిపించే స్నేహం నా కవిత్వం
నా కవిత్వం పోరాడదు. బ్రతిమాలదు
తాను కూర్చుని మనని నడవమనదు. మోయమనదు
తవ్వినకొద్దీ పుట్టుకువచ్చే చీకటిగని కళ్ళముందు గుట్టపోసి భయపెట్టదు
నచ్చినట్లు ఎగిరేందుకు క్రొత్త ఆకాశాలని చూపిస్తుంది
మనం ఎన్నుకొన్న రెక్కల కోసం కొంచెం శక్తిని పొట్లం కట్టిస్తుంది
మన లోలోపలి జీవితేచ్ఛలా మన ఉనికి చాలు ఉత్సవమని భరోసానిస్తుంది
మనకు నిజమేకదా అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే.
పిల్లల్ని ప్రేమిస్తే చాలు అంటూవారినుండి ప్రేమించడం నేర్చుకుంటూ వారు ప్రేమించడం మర్చిపోకుండా కాపాడుకుంటే చాలని నిజాయితీగా మనసులా స్పందిస్తారు.
అసలు జీవితాన్ని అర్థం చేసుకోవడానికే ఈ పుస్తకం చదవాలనిపిస్తుంది. ప్రపంచరహస్యాలముడి ఏదో విప్పిచెప్పాడనిపిస్తుంది. చివరచూసినవాడు కవితలో పరిపూర్ణ జీవితాస్వాదనకు నిర్దేశం చేస్తూ సృష్టి వలయాన్ని దాటించే ప్రయత్నం లో మన చేయిపట్టుకు నడిచే మాటలు మంత్రాలవుతాయి..
” ఆనందిస్తే ఆకాశం పట్టనట్టు ఆనందించాలి
రోదిస్తే ప్రతి అణువూ కరిగిపోయేటట్టు రోదించాలి
సున్నితంగా ఉంటే ఆకాశం తాకినా చెలించిపోవాలి
కఠినంగా ఉంటే అణువైనా చొరబడలేనంత కఠినంకావాలి”
ఈ వాక్యాలు చదివినప్పుడు భతృహరి చెప్పిన వజ్రాదపి కఠోరానీ.. మృదూని కుసుమాదపి అన్నమాటకు సరికొత్త వ్యాఖ్యానం అనిపించకమానదు.
sarath chandra
meeru vrasina kavitha super ga vundi. malli malli chadavalani vundi.superb and fantastic