Symbols of Substance: Court and State in Nayaka Period Tamilnadu

రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు
******
By: Velcheru Narayana Rao, David Shulman, Sanjay Subrahmanyam

(మూడో రచయిత సంజయ్ సుబ్రహ్మణ్యం చిరుపరిచయం: ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ లో Center for India and South Asia కి founding director గా వున్న సంజయ్ సుబ్రహ్మణ్యం 1987 లో ఎకనామిక్స్ లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పి. ఎచ్. డి. చేసి అక్కడే కొన్నాళ్లు, తర్వాత పేరిస్ లో కొన్నాళ్లు, తర్వాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో పనిచేసి 2004 నుంచి UCLA లో పనిచేస్తున్నారు. ఆర్థికశాస్త్ర పరిశోధకుడిగా, చరిత్రకీ ఆర్థికవ్యవస్థకీ వున్న సంబంధం గురించీ, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేశారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, ఎన్నింటికో సంపాదకుడిగా పనిచేశారు.)

=====================================

పాశ్చాత్యులు భారత భూభాగపు చరిత్ర కోసం భారతీయ గ్రంథాల్లో వెదికినప్పుడు వాళ్లకి ఎన్నో సంకటాలు ఎదురయినయ్. దీనికి ముఖ్యకారణం అప్పటికి వాళ్లకు అలవాటయిన చారిత్రక ప్రమాణాలకు భారతీయ గ్రంథాలు లొంగకపోవటమే. దాంతో భారతీయ గ్రంథాల్లో వున్న విషయాల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక వాళ్లు చాలా తికమక పడ్డారు. చివరికి వాళ్లు చేసిన నిర్ణయం ఏమిటంటే భారతీయ రచయితలంతా కల్పన తప్ప నిజం రాసేవాళ్లు కాదని, ఇతర దేశాల నుంచి వచ్చి భారత దేశ పరిస్థితుల గురించి రాసిన వారి రాతలే భారతీయ చరిత్ర నిర్మాణానికి పునాదులు కావాలని. భారతీయ రచయిత రాసింది ఏదైనా ఒక విదేశీయుడి రాతలతో ఏకీభవిస్తే తప్ప అనుమానాస్పదం అయింది. ఈ ఆలోచనా ధోరణి ప్రభావం ఎంత పాదుకుపోయిందంటే, ఎన్నో కావ్యాల్లో అతని ప్రసక్తి ఉన్నప్పటికీ, అతనే ఒక కావ్యాన్ని రాసినప్పటికీ కృష్ణదేవరాయలనే రాజు వున్నాడా లేడా అనే సందేహం తీర్చటానికి నూన్యెజ్ అనే పోర్చుగీసు వ్యాపారి రాతలే ఆధారాలయ్యాయి. అతను తను స్వయంగా కృష్ణరాయల్ని చూసి అతనితో మాట్లాడానని రాయబట్టి సరిపోయింది కాని లేకుంటే చారిత్రక పరిశోధకుల దృష్టిలో కృష్ణరాయలు కూడ ఒక పుక్కిటిపురాణంగానే మిగిలిపోయేవాడు.

“పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్‌
ప్రాపకమిచ్చినట్టి రఘునాథనృపాలకు డేలియున్న తం
జాపురి మండలంబు”

అని జాషువా గారు “గబ్బిలం”లో అన్నట్టు కృష్ణరాయలు అస్తమించాక తెలుగు సాహిత్యవనం విరగబూసింది నాయకరాజుల కాలంలో, ఇప్పటి తమిళనాడు ప్రాంతంలో. ఐతే పాశ్చాత్యుల భావజాలాన్ని, విక్టోరియన్ శృంగారవ్యతిరేక విలువల్ని బాగా వంట పట్టించుకున్న మన మేధావులు పదిహేడవ శతాబ్ది తొలినుంచి పందొమ్మిదో శతాబ్ది చివరివరకు వచ్చిన మూడు వందల ఏళ్ల తెలుగు సాహిత్యాన్నంతటినీ ఒక్క మూట కింద కట్టి “క్షీణయుగం” అనే ఒక ముద్ర వేసి చెత్తకుండీలో పారేశారు. అప్పుడు వచ్చిన కొన్ని గ్రంథాల్ని ban చేయించారు. దాన్ని గురించి మాట్లాడటమే పరువు తక్కువ పని కింద భావించి వదిలేశారు.

ఈ ఆలోచనా ప్రవాహానికి ఎదురీదటం సామాన్యమైన విషయం కాదు. ఐతే ఆ పని చేశారు నారాయణ రావు, షుల్మన్, సుబ్రహ్మణ్యం లు. ఆ పరిశోధనల నుంచి తయారయిందే Symbols of Substance అన్న ఈ గ్రంథం. 1992లో ప్రచురితమైన ఈ పుస్తకం దక్షిణ భారత చరిత్ర గురించిన అంతర్జాతీయ పరిశోధనల్ని ఒక ఊపు ఊపింది. సాహిత్యగ్రంథాల్లో ఉన్న అన్ని విషయాలు సర్వత్రా అనుమానాస్పదాలు కావని, సరిగా పరిశీలించి విశ్లేషిస్తే సమాజస్వరూపాన్ని వాటినుంచీ గ్రహించవచ్చనీ నిరూపించింది. ఈ జటిలమైన శోధనకి ఈ రచయితలు ఆనాటి తెలుగు, సంస్కృత, తమిళ, పోర్చుగీస్, ఆంగ్ల, ఫ్రెంచ్ రాతల్ని ఆపోశన పట్టి చేసిన కొన్నేళ్ల కఠోర పరిశోధనల్ని నిగ్గుదీసి ఈ గ్రంథంలో పొందుపరిచారు. విప్లవాత్మకమైన భావాల్ని ప్రతిపాదించారు.

ఈ గ్రంథ రచయితలు వేసిన అతిముఖ్యమైన ప్రశ్న: ఏయే కారణాల వల్ల నాయకరాజుల కాలంలో వెలువడ్డ సాహిత్యం అలా రూపొందింది? అన్నది. “తెలుగులో కవితా విప్లవాల స్వరూపాలు” పరిచయం ఐన వాళ్లకి తెలుసు వ్యక్తులు కవితావిప్లవాల్ని కలిగించరని, వాళ్లు నివసించిన కాలంలోని “సందర్భం” విప్లవాలకి పునాది అని. కనుక నాయకరాజుల కాలంలో ఒకవిధమైన సాహిత్యం వచ్చిందంటే దానికి కారణభూతాలైన పరిస్థితులు, సందర్భం ఏవి? ఈ ప్రశ్న ఒక అద్భుతమైన సిద్ధాంతానికి దారితీసింది. (నిజానికి ఈ సిద్ధాంతం ఆంధ్రదేశంలో ప్రస్తుతం మన చుట్టూ కనిపిస్తున్న సామాజిక ప్రవర్తనలకి కూడ ఎంతగానో వర్తిస్తుందని పాఠకులే పసిగట్టొచ్చు) ఆ కాలంలో వచ్చిన సాహిత్యం అప్పటి సాంఘిక, సామాజిక స్థితులకి అద్దం పట్టిందని నిరూపించింది. అలా, సాహిత్యాన్నుంచి చరిత్రనీ చరిత్ర నుంచి ఆ సాహిత్యానికి దారితీసిన సందర్భాన్నీ నిగ్గుతీశారీ గ్రంథంలో.

తంజావూరు ఆంధ్ర రాజుల చరిత్ర” తొలినాయకరాజు విశ్వనాథుడు ఎలా సామంతుడిగా మొదలయాడో విశదంగా వివరిస్తుంది. “విశ్వనాథనాయకుడు” సినిమా ద్వారా మనకి కొంత పరిచయం వున్న కథే ఇది. తంజావూరు ప్రాంతంలో వచ్చిన ఒక చిన్న సమస్యని పరిష్కరించటానికి కృష్ణరాయలు నాగమనాయకుణ్ణి పంపుతాడు. అతను అక్కడి సామంతుణ్ణి ఓడించి మరొకడికి ఆ రాజ్యాన్ని ఇవ్వాల్సి వుంది. ఐతే, విరోధిని గెలిచాక నేనే ఇక్కడ సామంతుడిగా వుంటానంటాడు నాగన్న. చాలా రోజులు అటూ ఇటూ ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాక నాగన్నని శిక్షించటానికి కృష్ణరాయలు పూనుకుంటే ఆ పని తనే చేస్తానని నాగన్న కొడుకు విశ్వనాథుడు వెళ్లటం, వెళ్లి తండ్రిని ఓడించి తీసుకురావటం, అతని ప్రభుభక్తికి సంతోషించిన కృష్ణరాయలు అతనికి రాజ్యం ఇవ్వటం జరుగుతాయి. ఐతే ఈ సందర్భంలో చాలా ముఖ్యమైంది నాగన్న, కృష్ణరాయల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల సారం. కృష్ణరాయల వాదం తన ఆజ్ఞని పాటించమని ఐతే, నాగన్న పదేపదే తనకి రాజ్యం ఇస్తే పాండ్యుడి (కృష్ణరాయలు వాడికి రాజ్యం ఇమ్మని పంపించాడు) కన్నా ఎన్నో రెట్లు డబ్బు సమకూర్చి కప్పం చెల్లిస్తానని చెప్తుంటాడు. “Symbols of Substance” రచయితలు ఈ ఘట్టంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గమనిస్తారు. నాగన్న అదేపనిగా డబ్బు గురించి అంతగా ఎందుకు మాట్లాడాడన్న జిగీష తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఎన్నో లోతైన ప్రతిపాదనలకి దారితీసింది.

ఈ సందర్భంగా చిన్న నేపథ్యం: అప్పుడప్పుడే దక్షిణ భారతం cash economy గా మారుతోంది. అదివరకు రాజంటే భూమీశుడు , అతని అధికారానికి ప్రాతిపదిక భూమి. అప్పటి సమాజం ముఖ్యంగా రెండు తెగలుగా వుండేది – కుడిచేతి, ఎడమచేతి కులాలు. భూమి మీద ఆధారపడేవాళ్లు కుడిచేతి వాళ్లైతే వ్యాపారం మీద ఆధారపడేవాళ్లు ఎడమచేతి వాళ్లు (ఇంకొంచెం విశాలార్థంలో భూమికి కట్టుబడిని వాళ్లు ఎడమచేతి కులాల వాళ్లనుకోవచ్చు). ఇద్దరి మధ్య ఆచారవ్యవహారాలు చాలావరకు వ్యతిరేకంగా వుండేవి. కుడిచేతి కులాలకు భూమి ఆధారమైతే ఎడమచేతి కులాలకు డబ్బు ఆధారం.

విజయనగర రాజుల కాలంలో ఎడమచేతి కులాల వాళ్లు కొందరు వీరులై రాజ్యసంపాదన ప్రారంభించారు. నాగమనాయకుడు అలాటి వాడు. అతని దృష్టి డబ్బు మీద. కృష్ణరాయలిదీ చాలావరకు అలాటి దృష్టే కాని ఈ సందర్భంలో అంతకన్నా తన మాట నెగ్గించుకోవటం అతనికి ముఖ్యం. (కృష్ణరాయల పట్టుదల గురించి, మాట నెగ్గించుకోవటానికి ఎంతదూరం వెళ్లగలడనే దాని గురించి, ఆసక్తికరమైన ఉదాహరణలు A Forgotten Kingdom అన్న పుస్తకంలో నూన్యెజ్ రాతల నుంచి దొరుకుతాయి. ఆ పుస్తకం ఎలెక్ట్రానిక్ కాపీ ఇక్కడ ఉచితంగా దొరుకుతుంది.)

విశ్వనాథనాయకుడు సామంతరాజు కావటం “ధన కేంద్రిత వ్యవస్థ” కి ఒక ముఖ్య విజయంగా అనుకోవచ్చు. విజయనగర సామ్రాజ్య పతనంతో నాయకరాజులు స్వతంత్రులయారు. సముద్రానికి దగ్గరున్న రాజ్యాలు కావటంతో వాళ్లు వ్యాపారం ద్వారా బాగా సంపాయించారు. రాజుల్ని అనుసరించి ప్రజలు కూడ డబ్బు మీదే సత్తువంతా కేంద్రీకరించారు. డబ్బున్న వాడికి గౌరవం, లేనివాడు ఎంత విద్వాంసుడైనా వాడికి నిరాదరణ దక్కాయి. ఇది అప్పటివరకు ఉన్న కులవ్యవస్థని కూలదోసింది. డబ్బుకి ప్రాధాన్యం లేనప్పుడు (అంటే భూమికే ప్రాధాన్యం ఉన్నప్పుడు) సమాజంలో ఒక వ్యక్తి స్థానం అతని పుట్టుకతో స్థిరపడిపోయేది. పుట్టిన కులం బట్టి భవిష్యత్తు నిర్ణయించబడేది. ఐతే డబ్బుతో దాన్ని మార్చివెయ్యటం సాధ్యమైనప్పుడు అదివరకు కేవలం పుట్టుక (కులం) వల్ల సమాజంలో ఉత్తమస్థానాల్లో ఉన్నవాళ్లు డబ్బులేక కిందికి పడిపోయి కులం ఎలాటిదైనా డబ్బు పుష్కలంగా ఉన్న వాళ్లకి సేవకులు కావటం జరిగింది. రాజులూ, వ్యాపారులూ, వేశ్యలూ పండితులకీ కవులకీ ఆధారమయ్యారు. చరిత్రలో తొలిసారిగా వేశ్యలు రాజాస్థానాల్లో కవయిత్రులుగా గౌరవస్థానాల్లో వున్నారు. ముద్దుపళని లాటి వాళ్లు ఎందరో కవిపండితుల్ని పోషించటమే కాకుండా సొంతంగా కావ్యాలు రాశారు.

డబ్బు సంపాదన బాగా వున్న ఈ రాజులు ఖర్చు కూడ అంతకన్నా ఎక్కువే పెట్టారు. అలాగే పలుకుబడి వున్న ప్రజా నాయకులకీ పంచిపెట్టారు. అలా డబ్బూ వరాలూ వెదజల్లి రాజు దేవుడి స్థాయికి ఎదిగాడు. అదివరకు విష్ణ్వంశ సంభూతుడిగా భావించబడ్డ రాజు ఇప్పుడు ఏకంగా దేవుడై కూర్చున్నాడు. దేవుళ్ల గురించి రాసినట్టే రాజుల గురించి కవులు కావ్యాలు రాశారు. ప్రజలు రాజుని దేవుడిగా కొలిచారు. రాజు దేవుడిలాగా ఊరేగటమూ, ఉత్సవాల్లో పాల్గొనటమూ జరిగింది. చివరికి రాజు వేశ్య దగ్గరకు వెళ్లటం కూడ వాద్యసహకారంతో సహా ఒక బహిరంగ తతంగం ఐంది.

రాజే దేవుడు కావటంతో దేవుళ్లు మనుషుల స్థాయికి వచ్చారు (కొందరు దేవుళ్లు రాజు కన్న తక్కువ వాళ్లయారు). దేవుళ్ల గురించి రాసిన కావ్యాల్లో వాళ్ల శృంగారచర్యలు మనుషుల్ని మించిపోయినయ్. అక్రమసంబంధాలు ఒప్పులయాయి. సక్రమసంబంధాలు అనుమానాస్పదాలయాయి. “అహల్యా సంక్రందనం” ప్రకారం ఇంద్రుడూ అహల్యా మంచి వాళ్లు, అహల్య భర్త గౌతముడు చాదస్తుడు. అలాగే “శశాంక విజయం” లో తార, చంద్రుడు మంచిపని చేసిన వాళ్లు, బృహస్పతీ మిగిలిన దేవతలు మూర్ఖులు (అసలా కథకి “శశాంక విజయం” అని పేరు పెట్టటంలోనే కవిహృదయం కనిపిస్తోంది కదా !). ఈ భావజాలం ఎందాకా వెళ్ళిందంటే, “శశాంక విజయం” లో నీతులు బోధించే వారి గురించి తార చంద్రుడితో ఇలా అంటుంది –

లోకములోన కొందరబలుల్ సతులందనియింపలేక య
స్తోక మనీష నన్య పురుషుల్ తమ కాంతల నంటకుండ తా
టాకులలోన వ్రాసిరి “పరాంగన గూడిన పాప” మంచు న
య్యాకుల పాటు చూచి యిపు డాకులపా టెనయంగ నేటికిన్?

“చాతుర్వర్ణ వ్యవస్థ” అనేది కేవలం ఒక భావం. ఎప్పుడూ నిజంగా వాడుకలో ఉన్నది కాదు. ఐతే ఆ భావానికి ఒక ఉపయోగం ఉన్నది – రాజులైన వారికి తాము సూర్యవంశానికో చంద్రవంశానికో చెందిన క్షత్రియులమని చెప్పుకోవాలని తపన వుండేది, అలా వాళ్లు రాజ్యపాలనకి legitimacy సంపాయించుకునే వారు; వేదపురాణ వేత్తలైన బ్రాహ్మణులు వాళ్లకి అలాటి వంశపరంపరని సృష్టించి ఇచ్చేవాళ్లు. అలాటి బ్రాహ్మణుల్ని రాజులు గురువులుగా గౌరవించారు. అలా, నారాయణ రావు గారి మాటల్లో ఈ “పెద్ద బ్రాహ్మణులు” (ఈ విభజనలో గుళ్లలో పూజాపునస్కారాలు, ఇళ్లలో కర్మకాండలు జరిపేవాళ్లు “చిన్న బ్రాహ్మణులు”), క్షత్రియుల పరస్పర సహకారం అనాదిగా సాగుతూ వచ్చింది. ఐతే రాజు దేవుడైనప్పుడు అతన్ని ఇంకెవరో క్షత్రియుడిగా దీవించక్కర్లేదు కదా ! అలా రాజులకీ పెద్ద బ్రాహ్మణులకీ ఉన్న సంబంధం తెగిపోయింది నాయకరాజుల కాలంలో. అందరూ రాజుకి సేవకులయారు. విద్య వచ్చిన వాళ్లు ఏ కులం వాళ్లైనా రాజసభకి అర్హులయారు.

ఇంకా ఎన్నో పెనుమార్పులకు కారణమైంది నాయకరాజులు తెచ్చిన “ధన విప్లవం”. సమాజ విలువలు తల్లకిందులయాయి. మళ్ళీ వెనక్కు తిరగని దిశలో సమాజం కదిలింది. అప్పుడు నిర్దేశితమైన ఆ దిశ ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.

ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిన యుగాన్ని క్షీణయుగమనీ చెత్తకుప్పలో పారేయదగిందనీ పట్టించుకోకపోవటం మన లోటు. దాన్ని సరిదిద్దే దిశలో ఒక గొప్ప ప్రయత్నం ఈ Symbols of Substance అన్న గ్రంథం. నాయకరాజుల కాలం నాటి రచనల ఆధారంగా అప్పటి సమాజ స్థితిగతుల్నీ సాంఘిక వర్గాల పరిస్థితుల్నీ లోతుగా విశ్లేషించటమే కాకుండా అప్పుడున్న సందర్భంలో రాజ్యాలెలా నిర్మితమయ్యాయి, ఎలా పెరిగాయి, తరిగాయి అన్న విషయాల గురించి కూడ ముఖ్యమైన ప్రతిపాదనలు చేశారీ గ్రంథంలో. ఎంతో ఉత్సుకత కలిగించే మరో పార్శ్వం అప్పటి రాజులు ఎలా సంపాయించారు, ఎలా ఖర్చుచేశారు, ఎందుకు ఖర్చు చేశారు లాటి విషయాల గురించిన లోతైన పరిశోధన కూడ.

amazon.com లో ఈ గ్రంథం కాపీలు దొరుకుతున్నాయి. ఈ గ్రంథంలోని ముఖ్య విషయాల్ని ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి వ్యాఖ్యానంతో వచ్చిన “విశ్వగుణాదర్శ చంపువు” అన్న గ్రంథం “ముందుమాట” లో టూకీగా నారాయణ రావు గారు వివరించారు. అది అందరికీ అందుబాటులో వుండవచ్చు.

You Might Also Like

5 Comments

  1. ధూపం అభిమన్యుడు

    విశ్వనాథ నాయకుడు ఎడమ చేతి కులానికి చెందిన వాడని ఏ ఆధారాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రకటించారో తెలుసుకోవచ్చా…చరిత్ర తెలియ కుండా తప్పుల తడకలా తయారు చేస్తే ముందు తరాల వాళ్ళు ఇబ్బంది పడతారన్న జ్ఞానం కూడా ఉండదా రచయితలకు. విశ్వనాథ నాయకుడు అనే వాడిని రాజుగా చేసినట్లు ప్రకటించిన శాసనం కొటికం కైఫీయత్ దానిని పరిగణలోకి తీసుకోకుండా ఎలా నిర్ణయిస్తారు? అందులో స్పష్టంగా ఆయన కులం గురించి వివరించ బడింది. కుడిచేతి కులాలకు పెద్దలైన కులం వాడిని పట్టుకుని ఎడమచేతి కులం వాడుగా చిత్రీకరిచండం చరిత్ర అవుతుందా??? చరిత్రను చరిత్రగా రాయాలి తప్పుల తడకగా కాదు. విశ్వనాథ నాయకుడిని రాజును చేసింది శ్రీకృష్ణదేవరాయలు కాదు ఆయన తమ్ముడు అచ్యుత దేవరాయలు. తొలితరం చరిత్ర కారులు సరైన సమాచారం దొరకక పొరపాట్లు పడ్డారు. మనం మలితరం వారసులం మనకు అన్నీ అందుబాటులో వున్నాయి. వాటిలో అంతర్జాలం ఒకటి. ఇన్ని అవకాశాలను పెట్టుకుని కూడా చరిత్రను తప్పుల తడకగా నిర్మించడం ఎంతవరకు సమంజసం.

  2. Halley

    చాలా మంచి పరిచయం . పుస్తకం తప్పక చదవాలి అని అనిపించేటట్టు గా ఉన్నది . దీనికి సంబంధించిన “ఈమాట” ఆర్టికల్ చదివి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను .

  3. ఈమాట » సార్థకప్రతీకలు - ముందుమాట

    […] సార్థకప్రతీకలు (Symbols of Substance) అనే ఈ పుస్తకరచన కేవలం యాదృచ్ఛికంగా మొదలయ్యింది. దీని గ్రంథకర్తల్లో ఇద్దరు, 1987-88లలో ఫిలడెల్ఫియా నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, దక్షిణ ఆసియా అధ్యయనవిభాగం వారి సౌజన్యం వల్ల కలిశారు. ఇద్దరికీ 16-17వ శతాబ్దపు తమిళనాడుపై ఆసక్తి ఉండటం వల్ల మాటలు కలిశాయి. ఒకరికొకరు, తమకు కొరుకుపడని విషయాలు చర్చించుకున్నారు. వీరిలో సాహిత్య చరిత్రకారుడికి ఆర్థిక చరిత్రకారులు సేకరించగలిగే సాధికారమైన సమాచారమంటే మక్కువ. రెండవ వారికి ఆ శతాబ్దాల్లోని రాజాస్థానాలలో రచించబడ్డ తెలుగు, తమిళ గ్రంథాల ఆధారాలు — డచ్చి వారూ, ఆంగ్లేయులూ, పోర్చుగీసు వారూ భద్రపరిచిన అభిలేఖలకంటే — స్ఫుటంగా తోచాయి. చర్చ సాగినకొద్దీ వారి దృష్టికోణాలు కలిశాయి. ఆ ప్రాంతం దేశీయ వాగ్విశారదులకూ, అక్కడికి వలస వచ్చి అక్కడే స్థిరపడిన పరదేశస్థులకూ ఎలా గోచరించిందో నెమ్మదిగా బోధపడసాగింది. […]

  4. Jampala Chowdary

    >>ఈ గ్రంథంలోని ముఖ్య విషయాల్ని ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి వ్యాఖ్యానంతో వచ్చిన “విశ్వగుణాదర్శ చంపువు” అన్న గ్రంథం “ముందుమాట” లో టూకీగా నారాయణ రావు గారు వివరించారు. అది అందరికీ అందుబాటులో వుండవచ్చు.

    విశ్వగుణాదర్శం తానా ప్రచురణ; విజయవాడ, హైదరాబాద్ నవోదయాలలోనూ, ఇతర ముఖ్య పుస్తకవిక్రేతలవద్దా లభించవచ్చు.

Leave a Reply