మార్పుకు ప్రేరణ ఇచ్చే పుస్తకాలు

వ్రాసిన వారు: పలమనేరు బాలాజీ.
(వ్యాస రచయిత రచయిత కవి, కథా రచయిత, అనువాదకుడు, ఈ వ్యాసం వీక్షణం పత్రిక డిసెంబర్ 2010 సంచిక లో వచ్చింది. తిరిగి ప్రచురించేందుకు అనుమతించిన వీక్షణం పత్రిక వారికి ధన్యవాదాలు. వ్యాసాన్ని యూనీకోడీకరించిన నాగార్జున పవన్ కుమార్ కు ధన్యవాదాలు. – పుస్తకం.నెట్)

***************
మనిషితో గంట మాట్లాడ్డం కన్నా రోజులో ఓ గంటైనా పుస్తకాలతో గడిపితే ఎంత బావుంటుంది అన్నాడొక మిత్రుడు. పుస్తకాలు చదివి చదివి మాత్రం మనిషి మారకపోతే లాభమేమిటి అన్నాడు మరొక మిత్రుడు. నిజమే, పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యమో, మనుషులతో కలవడం, కలిసి ఉండడం, చర్చించడం కూడా అంతే ముఖ్యం. పుస్తకాలు చదువుతున్నప్పుడు మనమేమిటి? చదవక ముందు, తర్వాత మనమేమిటి? అనేవి చాలా ముఖ్యమైన విషయాలుగా నేను భావిస్తున్నాను.

కొత్త ఆలోచనల్ని, సంస్కారాన్ని పెంపొందించని పుస్తకాలు ఎన్ని చదివినా వృథాయే. మనలో స్పందన కలిగించేవే మంచి పుస్తకాలు అనుకుంటే మో, స్మైల్ సంపాదకత్వంలో యగళ్ల రామకృష్ణ జీవన వజ్రోత్సవ అభినందన సంచికగా తెలుగు సారస్వత మూర్తుల స్వీయ, జీవిత చరిత్రలోంచి కొన్ని మహోజ్వల సాహిత్య జీవన సత్యశోధనాంశాల పేరిట వెలువడిన ‘కొమ్మలు రెమ్మలు’ ఒక అరుదైన పుస్తకం. మిత్రుడి షష్టిపూర్తి సంవత్సరం సందర్భంగా 27 డిసెంబర్ 2005న వెలువరించిన ఈ పుస్తకంలో నూట తొంభై నాలుగు మంది మహానుభావుల గురించి మూడొందల నలభై ఆరు పేజీలలో ఉంది.

వెన్నెలకంటి సుబ్బారావు (1784-1839) ఆంగ్లంలో స్వీయ చరిత్ర రాసుకున్న ఆంధ్రులలో ప్రథముడే కాదు, ఇంగ్లీష్‌లోఉన్న శాస్త్ర విజ్ఞానం దేశీయులకు అవసరమని రాజారామమోహనరాయ్ కంటే ముందే తెలిపిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకథలోని ‘కాశీయాత్ర‘తో మొదలై రజనీకాంతరావుకు సంబంధించిన ప్రస్తావనతో ఈ పుస్తకం ముగుస్తుంది.

ఎన్నెన్నో విలువైన అలనాటి పుస్తకాల్లోంచి ఏరికూర్చిన ప్రతి పేజీ పాఠకులకు జీవితం పట్ల కొత్త దృష్టిని కలిగిస్తుంది. తెలుగు సాహిత్యకారుల గురించి కానీ, గొప్ప తెలుగు పుస్తకాల గురించి కానీ పరిజ్ఞానం లేని వాళ్లెవరైనా ఈ ఒక్క పుస్తకాన్ని చదవడం ద్వారా ఎన్నో వందల పుస్తకాల్లోని ప్రధానమైన విషయాలను, మూలాలను తెలుసుకున్న వారవుతారు. ఈ పుస్తకం రూపకల్పనలో స్మైల్, మో గార్లు తీసుకున్న శ్రద్ధ, ఓర్పు, నేర్పు ప్రతి పేజీలో కనిపిస్తాయి. 111 మంది జీవిత చరిత్రల్లోని ఆత్మకథల్లోని స్వకీయాలు వారి అంతరాత్మల్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. 82 మంది మహానుభావుల గురించి రాసిన పేజీలన్నీ సూక్ష్మంగా ఆయా వ్యక్తులు కలిగించిన ప్రభావం గురించి, వారి కృషి గురించి తెలియజేస్తాయి.

జీవితం పట్ల ఎవరి దృక్పథం ఏమిటి? సామాజిక సంఘర్షణ పట్ల వారి స్పందనలేమిటి అన్న విషయాలు తెలిసిన తరువాత జీవితంలోని అల్పత్వం, కోల్పోయిన జీవితం, పొందాల్సిన అనిశ్చితులు, అర్థం చేసుకోవలసిన సామాజిక జీవితం నన్ను కలవరపరిచి ఆలోచింప చేశాయి. మానవ సంబంధాల క్షీణత, అభివృద్ధి పేరుతో అగ్రరాజ్యాలు సాగిస్తున్న వలసరాజ్యాల స్థాపన ఆందోళన కలిగించాయి. జీవితాన్ని చూసే దృష్టి సవ్యంగా ఉండాలి. పరిస్థితుల్ని అర్థం చేసుకునే శక్తి మెరుగుపడాలి.

గొప్ప గొప్ప వాళ్లందరూ జీవితంలో చవిచూసిన ఆనంద విషాదాలు, కాలం వారిలో కలిగించిన మార్పు, జీవితాన్ని ఒక్కొక్కరు వివిధ సందర్భాల్లో విభిన్నంగా దర్శించి విశ్లేషించిన తీరు విస్మయం కలిగించాయి. జీవితం లోతు, విస్తృతి, సామాజిక సంబంధాలు, మానవ సంబంధాల నిర్వహణం, మనిషిని మంచివైపో, చెడువైపో ప్రేరేపించే సామాజిక, ఆర్థిక రాజకీయ భౌతిక, భౌగోళిక పరిస్థితులు, మనిషి మానవీయతను కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భం, అవసరాల గురించి ఈ పుస్తకం చాలానే చెప్పింది. ఎవరో సన్నిహితుడు భుజం చుట్టూ చేయి వేసి మనతోబాటే నడుస్తున్నట్లుంది ఈ పుస్తక పఠనం. స్వాతంత్ర్యానికి పూర్వపు పరిస్థితులు చరిత్ర పుస్తకాలుగా నమోదు అయితే అయి ఉండవచ్చు. కానీ మానవీయ దృష్టికోణంలోంచి చరిత్రను చూసిన మానవుల చరిత్ర ఈ పుస్తకం.

మనం ఎక్కడి నుండి బయలుదేరామో, ప్రస్తుత స్థితికి ముందు సమాజం ఎలాంటి అనుభవాల్ని పొందిందో ఈ పుస్తకం చెపుతుంది. మరోసారి మెల్లగా ఈ స్పందన రాస్తూ పుస్తకం పేజీల్ని తిప్పుతుంటే, రాయడం ఆగిపోతూ, పుస్తక పఠనంలో మునిగిపోతూ…తేరుకుని మళ్లీ స్పందనను కొనసాగిస్తున్నా. బాల్యం, యవ్వనం అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తాయి. యవ్వన ఉద్రేకాలు ప్రలోభపెడుతాయి. వృద్ధాప్యం మనిషిని భయపెడుతుంది. వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే, నిలుపుకోవడమే జీవితం. వ్యక్తిత్వం అంటే ఏమిటో, దాన్నెట్లా నిర్మించుకోవాలో చాలా మంది ఈ పుస్తకంలో చెప్పకనే చెప్పారు.

బహుశా ఈ పుస్తకాన్ని నేను చదవకుండా ఉంటే ఎన్నో కొన్ని ప్రలోభాలకూ, బలహీనతలకూ లోబడి ఉండే వాడ్నేమో. ఈ పుస్తకం చదివిన పాఠకులందరూ ప్రేమనీ, ఆప్యాయతనూ, అనురాగాన్నీ, సహానుభూతినీ పెంపొందించుకోవాలనే ‘మో’ కోర్కెను తప్పకుండా నెరవేర్చిన పుస్తకం ‘కొమ్మలు – రెమ్మలు’. నన్ను మార్చిన ఈ పుస్తకాన్ని నాకు బహుకరించిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారిని గుర్తు చేసుకుంటూ…

You Might Also Like

3 Comments

  1. Chandrasekar

    Kindly let me know, where this book available.

  2. Jampala Chowdary

    My note on this book the racchabanda e-mail group on July 8, 2006 can be seen at http://groups.yahoo.com/group/racchabanda/message/16064

  3. జొన్నవిత్తుల

    చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. అభినందనలు.

Leave a Reply