పుస్తకం
All about booksపుస్తకభాష

April 13, 2012

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం

More articles by »
Written by: అతిథి
Tags: ,
velcherubook

వ్రాసిన వారు: కే.వి.యస్.రామారావు
********
(ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు ఎంతోకాలం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్ సిన్, మేడిసన్ కేంపస్ లో కృష్ణదేవరాయ పీఠం ఆచార్యునిగా పనిచేసి అక్కడి నుంచి పదవీవిరమణ చేసి ప్రస్తుతం అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయంగా గుర్తింపూ, ఖ్యాతి తెచ్చే గురుతర బాధ్యతని ఏకాకిగా వహిస్తూ, భరిస్తూ నిరంతర కృషి సాగిస్తున్న ఈ ఎనభై ఏళ్ల యువ విమర్శకుడి శోధన, సాధన అనితరసాధ్యాలు. ఇప్పటికి ఎన్నో లోతైన పరిశోధనల్ని పుస్తకాలుగా, పరిశోధనా పత్రాలుగా ప్రచురించారు. నారాయణ రావు గారి గౌరవార్థం “సింపోజియా” లు కూడ జరిగాయి. ఆయన ఈమధ్యనే ఎనభై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా “పుస్తకం” పాఠకులకు ఆయన పరిశోధనా గ్రంథాల్ని కొన్నిటిని పరిచయం చెయ్యటం ఈ శీర్షిక లక్ష్యం.)

1974 లో నారాయణ రావు గారు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పి.ఎచ్.డి. పట్టా కోసం రాసిన సిద్ధాంత వ్యాసాన్ని పొడిగించి 1978 లో పుస్తకరూపంలో ప్రచురించారు. అదే ఈ “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం“. ఆ తర్వాత మరో రెండు ముద్రణలు అయ్యాయి. చివరిది 2009లో. ఎన్నో కోణాల్లో విప్లవాత్మకమైన రచన ఇది. అంతకు ముందు అలవాటుగా ఆచారంగా వస్తున్న సిద్ధాంత వ్యాసాల గ్రాంధిక భాషని తోసిపుచ్చి సరళమైన భాషలో రాయటమే కాదు, మరీ ముఖ్యంగా వాడే ప్రతి పదానికి స్పష్టమైన, నిర్ద్వంద్వమైన నిర్వచనాన్ని వాడారు. అంటే, వాడుక మాటలకి కవిత్వంలో వేరే అర్థాలు ఎలా ఉంటాయో అలాగే సాహిత్య విమర్శలో కూడ విమర్శకి సంబంధించిన విస్పష్టమైన అర్థాలు ఉండాలని ప్రతిపాదించి, ఆచరించి చూపారు. కనుక ఈ గ్రంథంలో మాటలు మామూలుగానే అనిపించినా వాటి అర్థాలు మాత్రం వాడుక అర్థాలు కావని వేరే సాంకేతికార్థాలు ఉన్నాయని మనం గ్రహించాలి. అలా గ్రహించి చదివితే తెలుగు కవిత్వం గురించిన విప్లవాత్మక ప్రతిపాదనలు ఎన్నో కనిపిస్తాయిక్కడ.

ఈ గ్రంథం లక్ష్యం తొలినాళ్ల నుంచి నాటివరకు తెలుగు కవిత్వంలో వచ్చిన మౌలికమైన మార్పుల్ని నిగ్గుతీసి ఆ మార్పులకు దారి తీసిన ప్రాథమిక కారణాల్ని స్పష్టంగా లెక్కతేల్చి ఈ వ్యవస్థ అంతటినీ ఒక సైద్ధాంతిక వ్యూహనిర్మాణం ద్వారా వివరించటం. ఇంతటి బృహత్తరమైన పనిని సాధించటంలో అంతకుముందున్న పరిశోధనలు అంతగా సహకరించకపోగా ఎక్కువభాగం అయోమయానికి, జారుడుతనానికి నిదర్శనాలుగా ఉన్న సందర్భంలో వాటినుంచి దూరంగా నిలబడి కొత్తచూపుతో వెయ్యేళ్ల పైగా విస్తరించిన తెలుగు కవిత్వాన్ని వీక్షించి ఎప్పుడెప్పుడు ఏయే సందర్భాల్లో ఏయే కారణాల వల్ల పెనుమార్పులు సంభవించాయో గుర్తించి సహేతుకంగా వాటన్నిటినీ వివరించటానికి ఒక సరళమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఈ గ్రంథం.

ఈ సిద్ధాంతం చూపిన ఒక ముఖ్యమైన ఫలితం – కవుల వల్ల విప్లవాలు రావని, కవిత్వ సందర్భంలో కలిగే పెద్ద మార్పులు మాత్రమే కవితా విప్లవాలకు దారితీస్తాయని. అలాగే కవి ఎంతటి ప్రతిభావంతుడైనా కవిత్వసందర్భానికి వ్యతిరేక దిశలో నడవటానికి ప్రయత్నిస్తే ఆ కవి రచనలు అప్పటి కవితావిప్లవంలో పాలు పంచుకోలేవని సోదాహరణంగా నిరూపిస్తుంది. గురజాడ ఇందుకు ఒక ముఖ్యమైన దృష్టాంతం. తర్వాతి కవులు గురజాడని ఎంతగా పొగిడారో అంతగానూ ఆయన కవిత్వాన్నుంచి పారిపోయారనేది కనిపించే సత్యం – ఎంతమంది ముత్యాలసరాలు రాశారు? ఎంతమంది గురజాడ జాడలో పాటలు రాశారు? ఇలా ఎందుకు జరిగిందో ఖచ్చితంగా వివరిస్తుంది నారాయణ రావు గారి కవితావిప్లవ సిద్ధాంతం. అలాగే తిరుపతి వెంకటకవులు ఎందుకు ఎవరికీ మార్గదర్శకులు కాలేకపోయారో వివరిస్తుంది.

విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు ఎలా ఉండాలో ఇప్పటికి మనకి ఒక స్పష్టమైన అవగాహన వుంది – ఏ సిద్ధాంతమైనా దాని పరిధిలోని విషయాలన్నిటినీ సమగ్రంగా సమూలంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా వివరించగలగాలి, అప్పటి వరకు తెలియని కొత్త విషయాల్ని ప్రతిపాదించగలగాలి. కవితావిప్లవ సిద్ధాంతానికి ఈ గుణాలున్నాయి. అలా కవిత్వవిమర్శకి కూడ విజ్ఞానశాస్త్ర స్థాయిని కలిగించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈ గ్రంథం.

ఇలాటి విస్తృతమైన సిద్ధాంతంతో పాటు “బోనస్” గా నారాయణ రావు గారు మరో ముఖ్యమైన పని కూడ చేసిపెట్టారీ గ్రంథంలో – అది ఒక్కో విప్లవ కాలం లోని పద్యాన్ని ఎలా చదివి అర్థం చేసుకోవాలనేది ఉదాహరణలతో చూపించటం. నన్నయ గారి పద్యాన్నీ శ్రీశ్రీ పద్యాన్నీ అర్థం చేసుకునే పద్ధతి ఒకటి కాదని అందరూ ఆలోచించకుండానే ఒప్పేసుకుంటారు; ఐతే ఖచ్చితంగా తేడా ఏమిటి అంటే చెప్పగలిగే వాళ్లు చాలా కొద్దిమంది, ఉద్దండ పండితుల్లో కూడ. కవితా విప్లవం అంటే అన్ని కవిత్వపార్శ్వాల్లోనూ మార్పులు వస్తాయని, కవిత్వభాష, కవిత్వ శ్రోత (లేదా పాఠకుడు), కవిత్వానుభవం, కవిత్వాస్వాదన, కవిత్వ విషయం – ఇవన్నీ మారతాయని గుర్తించి స్పష్టీకరించటమే కాకుండా ఏయే విప్లవంలో ఇవన్నీ ఎలా మారాయో కూడ చూపిస్తుందీ గ్రంథం.

“ఇది నా యుగం, నేనే ఈ యుగకవిని, నా వెనక ఇప్పటి కవిత్వం నడుస్తుంది” అని ఎప్పటికప్పుడు భుజాలు చరుచుకునే కవులు వస్తూనే వుంటారు. ఏ కవీ యుగకర్త కాడని, యుగాలే (అంటే కవితావిప్లవాలే) కవుల్ని తయారుచేస్తాయని, ప్రతిభ వున్న కవులు ఆ యుగధర్మానికి అనుగుణంగా కవిత్వం రాసి పేరుతెచ్చుకుంటారని ప్రతిభ లేని వారు యుగధర్మాన్ని గుర్తించకపోవటమో లేక గుర్తించినా దానికి ఎదురీదటానికి ప్రయత్నించటమో చేసి వెనకబడి పోతారని చాటుతుందీ సిద్ధాంతం. అలా, కవితావిప్లవాల్ని గుర్తించటానికి, ఆ విప్లవకాలాల్లో ప్రతిభావంతులైన కవుల్ని గుర్తించటానికి అవసరమైన సాధనాల్ని పాఠకులకి అందిస్తుందీ గ్రంథం. అంతేకాకుండా గత రెండు మూడు దశాబ్దాల్లో వచ్చిన కవిత్వమార్గాల్లో ఏవైనా విప్లవాత్మకమైనవి వున్నాయా, వుంటే వాటిలో ప్రధాన కవులెవరు? అప్రధాన కవులెవరు? అన్న ప్రశ్నలకు ఎవరికి వారే సమాధానాలు చెప్పుకోగలిగిన సాధనసంపత్తిని అందిస్తుంది. చివరగా, ముందుముందు తెలుగు కవిత్వంలో ఎలాటి విప్లవాలు రావచ్చో ఊహించటానికి అవసరమైన పరికరాల్నిస్తుంది.

తెలుగు కవిత్వం గురించి, సాహిత్యం గురించి ఏమాత్రం ఆసక్తి వున్నవారైనా తప్పక చదివి తీరవలసింది ఈ గ్రంథం. ఒకసారి కాదు, ఎన్నో సార్లు చదవాలి. ప్రతిసారి కొత్తవిషయాలు, రహస్యాలు బయటకు వస్తాయి. ఆషామాషీగా కాదు, పదపదాన్ని జాగ్రత్తగా విచారిస్తూ వివేచిస్తూ చదవవలసిన గ్రంథం. ఆలోచనామృతమైన పుస్తకం.

నవోదయ, విశాలాంధ్ర, తదితర పుస్తకవిక్రేతల దగ్గర ప్రతులు దొరుకుతాయి. వెల వంద రూపాయలు.
———————

పుస్తక పరిచయ కర్త: కె. వి. ఎస్. రామారావు, శాన్ రమోన్, కేలిఫోర్నియా, యు. ఎస్. ఏ.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.6 Comments


  1. […] డిగ్రీ సిద్ధాంతవ్యాసం (1978) ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం‘[2] అని తెలుగు సాహిత్య పాఠకులకి […]


  2. […] పరిశోధనలన్నిటికీ తొలిమెట్టు “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అని నా అభిప్రాయం. కనక ముందుగా […]


  3. ఇంత గొప్పపుస్తకం గురించి పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు.


  4. […] రావు గారి పరిచయం “తెలుగులో విప్లవాల స్వరూపం” సందర్భంలో ఇచ్చాను. ఇప్పుడు ఆయన సహ […]


  5. […] సాహిత్యం అలా రూపొందింది? అన్నది. “తెలుగులో కవితా విప్లవాల స్వరూపాలు” పరిచయం ఐన వాళ్లకి తెలుసు […]


  6. Jampala Chowdary

    ఈ పుస్తకం మొదట 1978లో, రెండవ సారి 1987లో ప్రచురించబడింది. ఇరవయ్యేళ్ళ తర్వాత, 2008లో తానా (Telugu Association of North America) ప్రచురణలు ఈ పుస్తకాన్ని, వెల్చేరువారు కొత్తగా వ్రాసిన చివరిమాటతో కలిపి ప్రచురించింది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
pingalisurana-eng

The Sound of the Kiss, or The Story That Must Never Be Told

వ్రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ******** by Velcheru Narayana Rao and David Shulman (వెల్చేరు నారాయణ రావు గారి రచనల పర...
by అతిథి
5

 
 
Girls-for-Sale-Kanyasulkam-Apparao-Gurajada

Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India

వ్రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ********** by Velcheru Narayana Rao “కన్యాశుల్కం” గురజాడ అప్పారావు గార...
by అతిథి
2

 
 
systemsofsubstance

Symbols of Substance: Court and State in Nayaka Period Tamilnadu

రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు ****** By: Velcheru Narayana Rao, David Shulman, Sanjay Subrahmanyam (మూడో రచయిత సంజయ్ సుబ్రహ్మణ్య...
by అతిథి
5

 

 
srinata

The Poet Who Made Gods and Kings

పరిచయం వ్రాసిన వారు: కే.వి.యస్.రామారావు ****** The Poet Who Made Gods and Kings by Velcheru Narayana Rao and David Shulman ఒక సంప్రదాయ కవ...
by అతిథి
5

 
 
samayaniki

A Poem at the Right Moment

పరిచయం చేసిన వారు: కె.వి.యస్. రామారావు ************** A Poem at the Right Moment by Velcheru Narayana Rao and David Shulman (నారాయణ రావు గార...
by అతిథి
3

 
 
a poem at the right moment

సమయానికి తగు… కవిత్వం (A Poem at the right moment)

రాసిన వారు: సాయి బ్రహ్మానందం గొర్తి ************************* మనందరం అనేక కవితా సంకలనాలు చదివాం; ఇంకా...
by అతిథి
7