క్యాబరే డాన్సర్

dancer

ఒక నవల అనగానే రచయిత ఇంట్లో కూర్చుని తన ఊహల్లోనే ప్రపంచాన్ని, ఆ కథ మొత్తాన్ని ఊహించుకుని  తనదైన శైలిలో రాసి పాఠకులకు అందిస్తాడు. అది కుటుంబ కథ ఐనా, సస్పెన్స్ ఐనా, ఏదైనా కావొచ్చు.  కాని మన సమాజంలో అందరికీ తెలిసిన వారు, కాని అందరిచే అసహ్యించుకోబడి చీత్కరించబడే “క్యాబరే డ్యాన్సర్ ” ల గురించి  దేశంలోని ప్రధాన నగరాలు తిరిగి ఎంతో పరిశోధించి రాసిన ఒక నవల … కాదు. ఒక వినూత్న ప్రయోగం ..  చల్లా సుబ్రహ్మణ్యం రాసిన “క్యాబరే డ్యాన్సర్”
క్యాబరే డ్యాన్సర్లు అంటే మన సమాజంలో ఏమాత్రం సదభిప్రాయం లేదు. వాళ్లు ఏక్కడినుండో ఊడిపడ్డవాళ్లు కారు. మనలా సాధారణ మనుషులే. వాళ్లకి మనసుంటుంది. కోరికలుంటాయి. ఆశలు.. స్పందన కూడా ఉంటుంది. కాని మగవాడికి సుఖాలకి, స్వార్ధానికి  తమ జీవితాలు పణంగా పెడుతున్నారు. తమవారిని కాపాడుకోవడానికి కొవ్వొత్తిలా కరిగిపోతున్నారు. ఈ నవల కోసం రచయిత దేశంలోని ప్రముఖ నగరాలలో 11 ఏళ్ల వయసు నుండి 48 ఏళ్ల వయసున్న క్యాబరే ఆర్టిస్టులతో ఇంటర్వ్యూలుచేసారు.  అందరూ  వాళ్లకి నైతిక విలువలు ఉండవని, సమాజాన్ని పాడు చేస్తున్నారని. డబ్బు, సెక్స్ కోసం ఎందరో మగవాళ్లని వల వేసి ఆడిస్తున్నారని అంటారు .. కాని అదంతా అబద్ధమని తేలుతుంది ఆ యువతుల మాటలు చదువుతుంటే. వారి నిజమైన బాధామయ గాథలను సమీకరించి ఒక నవలలా అందించారు రచయిత. మానవతా దృక్పథంతో చదివి , ఆలోచిస్తే ఎలాంటి రాతి గుండే ఐనా తప్పక కరుగుతుంది. అందుకే రచయిత ” ఈ నవల చదివి వదిలేయవద్దు. ఆలొచించండి. పరిష్కరించండి ” అని కోరుతున్నారు. ఈ నవల 1987 లో విడుదల ఐంది.

ఇక ముఖ్య కథాంశం.. సంఘంలో పేరున్న, డబ్బున్న పెద్దమనుష్యుల కొడుకులు  అందమైన అమ్మాయిలను అనుభవించడం. ప్రేమించామని చెప్పి మోసం చేయడం సర్వసాధారణం. అలాగే వారితో నీలి చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం, వాటితో వ్యాపారం చేయడం. వారికి బలైనవారెందరో అమాయకులున్నారు .  అలాగే చిత్ర కథానాయకుడు ఒక జర్నలిస్టు. క్యాబరే డాన్సర్ల జీవితాల మీద్ రిసెర్చ్ చేయాలని ఒక హోటల్ లోని డాన్సర్లతో ఇంటర్వ్యూ చేస్తాడు. ఈ క్రమంలో  అతనికి ఎన్నో ఊహించరాని, నమ్మలేని విషయాలు తెలుస్తాయి. ఒక డ్యాన్సరు  వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే  తనను ఈ వృత్తిలొకి దింపాడని చెప్తుంది. కొందరు కుటుంబ పోషణకోసం వేరే ఊర్ల నుండి వచ్చినవారు. తమ తోబుట్టువులు, పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని తాము హీనస్థితికి దిగజారి డబ్బు సంపాదించి ఇంటికి పంపిస్తుంటారు. అందులో ఒకామె గర్భవతిగా ఉన్నప్పుడు, పాప పుట్టిన నెలరోజులకే హోటల్లో డ్యాన్సు చేయాల్సి వస్తుంది.  ఒక అమ్మాయి, ఇంట్లో చదువుకుంటున్నాను అని చెప్పి ఈ వృత్తితొ తన తమ్ముడిని ఇంజనీరింగ్ చదివిస్తుంది.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొ కథ. ఈ వృత్తిలో ఎక్కువ కాలం కూడా మనడం కష్టమే. వయసు మీరాక వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తినడానికి తిండి దొరక్క బిచ్చెమెత్తుకుంటూ అతి దారుణంగా జీవిస్తారు.. మరణిస్తారు. యవ్వనంలో వారిని వాడుకున్న మగమహారాజులు తర్వాత అస్సలు పట్టించుకోరు పైగా అసహ్యించుకుంటారు.. ఇలా ఒక్కోరిది ఒక్కో చరిత్ర..
మగాడు చివరికి ఆడదాని శరీరంతో కూడా వ్యాపారం చేసి జల్సాలు చేస్తాడు. కాని ఆమె అవసరానికి ఆడుకోవడానికి ముందుకు రాడు. సమాజం క్యాబరే డ్యాన్సర్లను చీదరించుకుంటుంది. కాని వారితో వ్యాపారం చేసేది, వారి డ్యాన్సులు చూసేది, వారిని ఆటవస్తువులుగా వాడుకునే మగవాడిపై వేలెత్తి చూపదు. ఇద్దరూ సమాన భాగస్తులైన ఈ తప్పులో ఆడదానికే నిందలు, శిక్షలు కూడా. ఈ నవలలో డ్యాన్సర్లను ఇంటర్వ్యూ చేస్తున్న రచయిత చిత్రాలు, వారి మాటలు  కూడా పొందుపరచబడ్డాయి
రచన : చల్లా సుబ్రహ్మణ్యం
పబ్లిషర్స్ : నవజ్యోతి పబ్లికేషన్స్ .. విజయవాడ.

You Might Also Like

2 Comments

  1. కె.మహేష్ కుమార్

    ఎనభై,తొంభై దశకాలలో పరిశోధనాత్మక నవలలు రాసే కొందరు రచయితల హవా నడిచింది. ఆ సిరీస్ లో ఇదొక నవల.చిన్నప్పుడు చదివాను. ఫరవాలేదనిపించింది.

  2. మార్తాండ

    సెక్స్ విషయంలో జరిగే తప్పుల్లో ఆడ-మగ ఇద్దరి పాత్ర ఉంటుంది కానీ మగవాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆడది చేస్తే రంకు, మగవాడు చేస్తే శృంగారం. చల్లా సుబ్రహ్మణ్యం గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. “వార్త” ఆదివారం ఎడిషన్ లో కూడా అతని పర్సనల్ పాయింట్ పేజిలు చదివేవాడిని.

Leave a Reply