Mahatma vs Gandhi

“Losers blame their parents; Failures blame their kids.” ― Steve Toltz

అనగనగా ఓ మనిషి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు బతుకుని ఈడుస్తూ చెల్లుబాటయిపోవటం నచ్చని వ్యక్తి. తనకంటూ కొన్ని నిర్దిష్టమైన నమ్మకాలను ఏర్పర్చుకొని, వాటిని ఆసరాగా చేసుకొని  అంచెలంచెలుగా జీవితంలో ఎదిగినవాడు.

ఆ మనిషికో కొడుకు. తండ్రి పోలికలనే కాదు లక్షణాలనూ పుణికిపుచ్చుకున్నవాడు. ఎప్పటికైనా తండ్రిలా బతకాలని కలలు కనేవాడు. అలా తప్ప మరో రకంగా జీవించటం పాపమని భావించేవాడు.

కొడుకు ఎదిగిన కొద్దీ తండ్రీకొడుకుల మధ్య విభేధాలు హెచ్చి, ఆఖరుకి కొడుకు నాశనం అయిపోతాడు.

ఎన్నోసార్లు విన్నట్టు, చదివినట్టు, తెల్సినట్టు అనిపిస్తున్న కథ కదూ! ఇంటింటి రామాయణంలో ఒక అంకం అనిపించటం లేదూ?

ఈ కథలోని ఆ పాత్రలకు భారత స్వాంత్రంత్ర్యోద్యమం వేదికైతే, ఆ పాత్రలు మరెవరో కాదు: సాక్షాత్తూ జాతిపిత మహాత్మా గాంధి, ఆయన తొలిసంతానం హరిలాల్ గాంధి అయితే, అప్పుడు నేను పరిచయం చేయబోతున్న పుస్తకమవుతుంది.

ఇది ఎస్.దినకర్ జోషి గుజరాతిలో రాసిన నవల. దరిమిలా అన్యభాషల్లోకి అనువదించబడింది.నాటకంగా రూపాంతరం చెందింది. నేను ఆంగ్లానువాదం చదవడానికి పూనుకున్నాను. పరిచయ వ్యాసంలో “బ్రయోగ్రాఫికల్ నవల” అని రచయితే అనటంతో కొంచెం నిట్టూర్చాను. కాల్పనిక రచన ముంగిట్లో చరిత్ర ఉంటే నాకెటూ తోచదు; అందులో ఎంత నమ్మాలో, దేన్ని విస్మరించాలోనని. అదృష్టవశాస్తూ ఈ పుస్తకం ముందు తాహీర్ షా రాసిన ’ఇన్ అరేబియన్ నైట్స్’ అన్న పుస్తకం చదివాను. అందులో చిన్నారి, రాబిన్ హుడ్ కథలు విని, తండ్రి దగ్గరకు వెళ్ళి, “రాబిన్ హుడ్ నిజంగా ఉన్నాడా? అతడి అమ్మా, నాన్న ఎవరూ?” అన్న ప్రశ్నలు సంధిస్తుంది. అప్పుడు తండ్రి సమాధానం:

‘You see, stories are not like the real world; they aren’t held back by what we know is false or true. What’s important is how a story makes you feel inside.’

దీన్ని ఆధారంగా చేసుకొని, గాంధీల వ్యక్తిత్వాలను నిర్ధారించుకోడానికి కాక, వారి అనుబంధం బీటలు వారడం వల్ల నాకేమనిపిస్తుందో తెల్సుకుందామనే కుతూహలంతోనే చదివాను. ఆ భావావేశాల్నే ఇక్కడ పంచుకుంటున్నాను. రచయితే సెలవిచ్చినట్టు, ఇది ఒక పరిశోధనా గ్రంధం కాదు. ఒక నవలాకారుడి చేతిలో పడ్డ ఒకప్పటి నిజం. అందుకని దీన్ని చరిత్రకు గీటురాయిగా పరిగణించడానికి నేను సిద్ధంగా లేను.

ఇది గాంధీ కుటుంబ గాథ! హరిలాల్ బాపుకి తొలిసంతానం. కారణాంతరాల వల్ల అతడి పసివయస్సంతా బాపుకి దూరంగా గడిచిపోతుంది. తన తండ్రిని గురించి గొప్పగా చెప్పుకోవటం విని మురిసిపోయి, తానూ తండ్రంతటి వాడిని అవ్వాలని కలలుగనే హరిలాల్‍కు బాపు సాంగత్యంలో గడిపే అవకాశం వస్తుంది, ఎట్టకేలకు. దాన్ని అతడు చాలా వరకూ సద్వినియోగం కూడా చేసుకుంటాడు. కాకపోతే, తండ్రిలా అద్వితీయ విజయాలు సాధించాలని, అందుగ్గాను తండ్రి చేసినవన్నీ – చదువు విషయంలో, సత్యాగ్రహం విషయంలో – చేయాలని ఉవ్విళ్ళూరుతాడు. ఇదంతా ఒక ఎత్తైతే, తానంతగా ఆరాధిస్తున్న బాపూ కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించటం, తీసుకునే కొన్ని నిర్ణయాలు అసంబద్ధంగా ఉండడం, పైగా అభిప్రాయభేధాలొచ్చినప్పుడు మాటామంతీ జరపకుండా తన నిర్ణయాన్ని ఖారాఖండీగా అమలుచేయటం ఇలాంటివన్నీ అతణ్ణి బాధపెడతాయి. బాపూ అన్యాయం చేయగలడన్న ఊహనే తట్టుకోలేని వాడు, తానూ, తన కుటుంబంలోని ఇతరులూ ఆయన చేస్తున్న అన్యాయానికి బలి అవుతున్నారన్నప్పుడల్లా తీవ్రంగా కలవరపడతాడు. ఏదో చేసేయాలన్న తపనలో ఏదీ చేయకుండా పోతాడు. ఒక దిశా, దశా లేకుండా తెగిన గాలిపటెంలా ఎటు గాలి వీస్తే అటు పోతుంటాడు. ఇవ్వన్నీ కళ్ళారా చూస్తున్న బాపూ ఏదైనా చేసే లోపే పరిస్థితి చేయిదాటిపోతుంది.

ఢిల్లీకి రాజైనా అమ్మకు బిడ్డే అన్నట్టు, ఎంతటి మహాత్ముడైనా ఒక కుటుంబానికి పెద్దైనప్పుడు ఆ కుటుంబ బరువు బాధ్యత నిర్వహణలో తేడాలొస్తే కుటుంబాలు చిందరవందర కాగలవని నిరూపించే కథ ఇది.

తండ్రికొడుకులిద్దరి మధ్య అభిప్రాయభేధాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నా ఒకరి మీద ఒకరికి వల్లమానిన ప్రేమ. జాతీయ స్థాయిలో గాంధిజీ పేరును భ్రష్టుపట్టించాలని హరిలాల్ చేసిన ప్రతి ప్రతికార చర్య తర్వాత అతనిలో ప్రేమావేశం పొంగుకొచ్చి కుంచించుకుపోవటం జరుగుతూనే ఉంటుంది. అలానే, కొడుకు వల్ల ఎంతటి తలవంపులు వచ్చినా బాపూకీ అతడి మీద వాత్సల్యం నిండుగా ఉంటుంది. వీరిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్త్రరాలు నడుస్తూనే ఉన్నాయి.

When two elephants fight, it’s the grass that suffers most అన్న చందాన ఈ మహాత్మునికీ, గాంధికీ మధ్య జరిగిన యుద్ధంలో తీవ్రంగా గాయపడి, ఓడిన వారు కస్తూరి బా, గులాబ్. ఓ పక్క భర్త మాటకు ఎదురుచెప్పని భార్యగా, మరో పక్క కన్నకొడుకు పతనాన్ని కళ్ళారా చూస్తూ ఉండలేక బా పడిన ఆవేదన వర్ణానాతీతం. ఇక్కడో విషయం. గాంధిజీ నమ్మకాలూ, సిద్ధాంతాల వల్ల వారి కుటుంబం మొత్తంగా కష్టపడింది. అందులోనూ ’బా’ ఎక్కువగా! అలానే ఆయన తక్కిన పిల్లలు కూడా. కానీ వాళ్ళంతా అయితే సర్దుకుపోవడమో, లేక విస్మరించడమో చేయగలిగారు. ఆంగ్ల విద్యావిధానాన్ని వ్యతిరేకించిన గాంధి తన పిల్లలను ఆ చదువులకు పంపలేదు. ఇంటినుండే చదువు చెప్పే తీరిక లేదు. అలా వాళ్ళంతా బోటాబోటీ చదువులతో ఆగిపోయారు.

మనిలాల్ (గాంధీగారి కొడుకు) ఒక అమ్మాయికి ఆకర్షితుడైతే అది బాపు వద్దకు ఫిర్యాదు రూపేణ వస్తుంది. “ఏం చూసి మొహితడవైనావు?” అని నిలదీసిన బాపు, “ఆమె కురులు” అన్న సమాధానం రాగానే, ఆ అమ్మాయి కురులు కత్తిరించాలని శాసించడం విడ్డూరంగా అనిపించింది. “పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు” అన్నది కదా సూత్రం. ఒకవేళ అతడు జుట్టును కాక, మరే ఇతర అంగాన్నో సూచించి ఉంటే అప్పుడు గాంధి నిర్ణయం ఎలా ఉండేదో..

ఇలాంటి కొన్నింటిలో తీవ్రంగా నిరాశపరిచినా ఎదురుతిరిగే ధైర్యం లేకనో, లేక గాంధీజి ని అర్థం చేసుకోవడం వల్లనో అందరూ మామూలుగా ఉన్నారు. హరిలాల్ ఒక్కడే ఎదురుతిరిగాడు.

ఇహ, హరిలాల్‍ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించి, పూజించి, తన జీవితాన్నే అంకితమిచ్చిన గులాబ్‍కు వ్యథలు, చింతలు తప్ప మరేం ఇవ్వలేకపోయాడు. బాపూ ప్రతిరూపమైన తన భర్తకు అచ్చు అత్తగారిలానే వెన్నంటి ఉండాలన్న ఆమె కలలు భర్త తప్పుదోవ పట్టడంతో అణగారిపోయి, ఆమె త్వరగానే పోయింది. తనని అర్థం చేసుకునే ఆ ఒక్క ఆధారమూ పోయాక, హరిలాల్ పరిస్థితి అధ్వానమవుతుంది.

హరిలాల్ జీవితంలో చాలా కల్సిరాని విషయాలున్నాయి. గాంధిజీ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఇతడికి తండ్రి ప్రజాజీవితం పెద్ద అడ్డంకై కూర్చుంది. సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడ్డమే కాక ఒక నాయకునిగా ఎదుగుతున్న బాపు ఎంత ఆదర్శవంతుడైనాడో, అదే కారణం చేత ఎవరైనా ఇతడిని “జూనియర్ గాంధి” అంటే కుంచించుకుపోయాడు, తనకంటూ సొంత పేరు తెచ్చుకోలేకపోతున్నాననీ. అతడు చేపట్టిన వ్యాపారాలన్నీ బెడిసికొట్టాయి. గాంధీ నుండి విడిపడ్డాక తానో ’లూజర్’ అనిపించుకోకూడదనీ, అందుకని ధనవంతుడవ్వడమే మార్గమనీ తప్పుడు మార్గాలను ఎంచుకున్నాడు. సరైన మాటసహాయం లేక చెడుస్నేహాలకు లొంగి దురలవాట్లకు బానిసయ్యాడు. Transparency  అంటూ వీరిద్దరి మధ్య గొడవలని బాపూ పబ్లిక్ చేయటం వల్ల సందు చూసుకొని ఆ విభేధాలను వాడుకున్నవారూ ఉన్నారు.

పైవాటికన్నా ’బాపుకి నేనంటే ఇష్టం లేదేమో’ అన్న అనుమానం అతడికి తెల్సీతెలియని వయస్సులో నాటుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ అనుమానాన్ని వదిలించుకోలేకపోయాడు. ఆ అనుమానం పేట్రేగిపోయినప్పుడే తండ్రి మీద విపరీతాగ్రహంతో విచక్షణ కోల్పోయి చవకబారు పనులు చేసాడు. తల్లిదండ్రులకు తీరని క్షోభ పెట్టాడు. చేతికందొచ్చిన పిల్లలు  అకాలమృత్యువాతపడ్డప్పటి వేదన ఒక ఎత్తు అయితే, అనుదినం వారి జీవితాలను నరకప్రాయం చేసే ఇలాంటి చేజారిన బిడ్డల విషయంలో తల్లిదండ్రుల యాతనకు అంతులేదనిపించింది నాకు.

బాపూ కూడా ఎంతసేపూ తన సిద్ధాంతాలు, జనాలు తన గురించేమనుకుంటారోనన్న ఆలోచనలే గానీ వీటన్నింటి వల్ల తన కుటుంబం ఎంత త్యాగాలు చేస్తుందో గుర్తించక, గుర్తించినా దాన్ని మెచ్చుకోవటంలో విఫలమయ్యారు.

కాసేపు, పుస్తకం విషయానికొస్తే నవలా రూపంలో కథ చెప్పారు కాబట్టి ఆద్యంతం చదివించేలా రచన కొనసాగింది. హరిలాల్ మృతితో మొదలై హరిలాల్ అంత్యక్రియలతో ముగుస్తుంది. కథనం బాగుంది. ఇద్దరి గాంధీల దృక్కోణాలనూ, ఆలోచనలూ సరిసమానంగా చూపారు. కొన్ని ఘట్టాలు చదువుతుంటే మనసుకు కష్టంగా అనిపించింది. పుస్తకం చివర్న రిఫెరెన్సులూ గట్రా ఇవ్వలేదు. అంటే బహుశా నవల్లో ఉటంకించిన హరిలాల్-బాపూల ఉత్తరాలు అన్నీ కాల్పనికమైనవే అనుకుంటాను. చాలా అరుదుగా తేదీలను ఇచ్చారు. పుస్తకం అట్ట మీద గాంధీజీనే! ప్రతి చాప్టరు మొదట్లోనూ ఆయన బొమ్మే ఉండడం నన్ను నిరాశపరిచింది. ఈ రచన గాంధీ పోషించిన తండ్రి పాత్రను గురించే అయినా, ఇందులో మరెన్నో మానవీయ కోణాలున్నాయి. ఇది హరిలాల్ కథ! ఒక తండ్రికొడుకుల కథ. అలా సూచించే విధంగా కవర్ పేజి ఉండాల్సింది.

ఆంగ్లానువాదం బాగానే సాగింది. అక్కడక్కడా మాత్రం భయంకరమైన అచ్చుతప్పులున్నాయి; followers flowers అయ్యేంతగా.

చివరిగా, పుస్తకం నాలో మిగిల్చిన ఆలోచనలు:

౧. మన జీవితాలు అచ్చంగా మనవి కావు. మన అనుకునే ఎందరితోనో ముడిపడుంటాయి. మన ప్రతి కదిలకా వారిని ప్రభావితం చేయవచ్చు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి మొత్తం ప్రపంచాన్నే విస్మయంపజేసిన మోహన్‍దాస్ విజయం ఆయన కుటుంబానికి మాత్రం సుఖాలను దూరంజేసింది. అదే, తండ్రి మీద కోపాన్ని పెంచుకొని విచక్షణారహితంగా జీవితాన్ని గడిపిన హరిలాల్ పతనం వల్ల అతడితో సంబంధబాంధవ్యాలున్న ప్రతి ఒక్కరికీ తీవ్ర కష్టాన్ని కలిగించింది. మన జీవితంతో అల్లుకుపోయిన జీవితాల్లో మనవల్ల ఎంతటి కష్టనష్టాలొస్తాయో తేలిక కాదు!

౨. మహోజ్వలంగా వెలుగుతున్న దీపం దూరాల వరకూ కాంతిని ప్రసరింపజేసినా, దీపానికి అత్యంత సామీప్యంలో (immediate vicinity) చీకటే ఉంటుంది. ప్రజాజీవితం గడపాల్సి వచ్చేవారి కుటుంబాలు అలాంటి చీకటినే ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు చీకటిలో కల్సిపోతారు. కొందరు బయటకొచ్చేస్తారు. కొందరు అంతటి కాంతికి గుడ్డివాళ్ళై దారి కోల్పోతారు.

౩. గాంధి వంశంలో ఒక్క మోహన్‍దాస్ గాంధి మాత్రమే విశ్వవిఖ్యాతుడై మహాత్ముడై ఈనాటికి స్మరణీయుడైనాడు. ఆ ఘనజీవనానికి దిష్టి చుక్కలాగా హరిలాల్ జీవితం ముగిసింది అని అనిపించింది నాకు. కొందరి అభిప్రాయం బట్టి, గాంధిజీ తండ్రిగా విఫలమయ్యాడు. కానీ ఇది చదివాక నాకు అలా అనిపించలేదు. ఆయనదెప్పుడూ ఒకటే చింత, తాను చేస్తున్న సంఘసేవ వల్ల తన మనుషులకు undue advantages కలుగుతాయని. ఆ లెక్కల్లో చూసుకుంటే, పాపం హరిలాల్ కూడ ఎవరినీ నష్టపెట్టింది లేదు. మిగితా వారూ ఆయన పేరు వాడుకొని పైకి రావాలనుకున్నట్టు నాకు తెలీదు. కాకపోతే ప్రజాస్వామ్యంలో కుటుంబ పరిపాలన హవా నడుస్తూ, గాంధి ఇంటిపేరు మారుమ్రోగటం స్వకృత్యమో? విధి విలాసమో? 🙂

౪. ప్రజాదరణ పొందిన వ్యక్తుల జీవితాల్లో ఇలాంటి పార్స్వాలను దాచటం కన్నా ప్రజల్లోకి తీసుకురావడం మంచిదే! ఎంతకాదనుకున్నా వీరి జీవితాలు guides, if not how-to, at least ‘how-NOT-to’ guides.

Book Details: 

Mahatma vs Gandhi

Based on the life of Harilal Gandhi.

S. Dinakar Joshi

Translated by: Dr. Jayini Adhyapak

Publishers: Jaico Publishing House

Cost: Rs. 250 (Paperback)

Pages: 279

అరుణగారు పరిచయం చేసిన తెలుగు అనువాదం  మహాత్మునికి గాంధీకి మధ్య

 

 

You Might Also Like

3 Comments

  1. Srinivas Nagulapalli

    Purnima gaaru
    Generally as per masses, parents are held responsible for children’s
    failures, because often they love taking credit for successes too. It
    is ok to such extent that make parents ask what else they can do
    better. But not to extent where children blame them for everything.

    > ఆ తినే తిండి ఎలాంటిది, ఎక్కడ పడుకుంటున్నాం, ఎలాంటి గాలి పీలుస్తున్నాం అన్నవి కనీసం జీవితపు
    > తొలిదశలో మన ఇష్ట్తానుసారం కాదు గదా?

    నిజమే, అది అదృష్టం కూడా. అప్పుడు కూడా మన ఇష్టానుసారంగా, అంటే పిల్లలు చెప్పినట్లు తినడం,
    పడుకోవడం చేసేస్తే ఇంకేమన్నా ఉందా! అర్థరాత్రి ఆడుకోవడాలు అందినన్ని చాక్లేట్లు మింగడాలు:-) తొలిదశ
    దాటి పెరిగాక కూడా, అప్పటి స్థితులదే అంతా బాధ్యాత అనే ధోరణిలో ఒక్కటే లోపం. అది నచ్చని వాటికే
    కాని నచ్చిన వాటికి వర్తించక పోవడం! చిన్నప్పుడు ఇది ఇవ్వలేదు అదిచేయలేదు అన్నది వినిపించినంతగా,
    చిన్నప్పుడు సిగరట్టు ఇవ్వలేదు తాగడానికనో, పార్టీలు సినిమాలు చూపించలేదనో కినిసి సిగరెట్లు సినిమాలు
    ఇంకేదన్నా సరే నచ్చినవాటిని మానేసామన్న ధోరణి వినిపించదు కనిపించదు!
    =========
    Regards
    -Srinivas

  2. Purnima

    Srinivas gaaru:

    Steve Toltz (sorry, I can’t help but quote this guy) ఒక చోట అడుగుతారు… ఎవరైనా మానవ లక్షణాలను ఆసరాగా చేసుకునే అద్వితీయ విజయాలు సాధిస్తే అతణ్ణి దేవునితో పోల్చి ఆరాధిస్తాం గానీ అవే గుణగణాల వల్ల వారు పతనమైతే రాక్షసులుగా అంత త్వరగా అభివర్ణించమేం? అని. Our opinions or observations tend be opinionated, unknowingly ani anumaanam.

    నిజమే, చాలా భయంకరమైన బాల్యం ఉన్నవాళ్లు కూడా హరిలాల్ అంత బేలగా వ్యవహరించరు. Agreed.

    >> దీపానికి అత్యంత సామీప్యంలో చీకటి ఉంటే అది దాని ప్రసరణ లోపం కాదు, కాంతిని అడ్డుకనే పదార్థ స్వరూప స్వభానిదే!

    But why are parents held responsible for their children failures? దాన్నీ స్వభావం అనుకోలేమా?

    >> చివరిగా మన జీవితాలు అచ్చంగా, స్వచ్చంగా, పూర్తిగా మనవి మాత్రమే. ఎంతమందితో ముడిపడినా, ఎంత గాఢంగా బలపడినా, చాలా ఆశ్చర్యకరంగా, మన తిండి మనమే తినాలి, మన నిద్ర మనమే పోవాలి, మన శ్వాస మనమే పీల్చాలి, మన బతుకు మనమే బతకాలి.

    I do think so. But for argument’s sake..

    ఆ తినే తిండి ఎలాంటిది, ఎక్కడ పడుకుంటున్నాం, ఎలాంటి గాలి పీలుస్తున్నాం అన్నవి కనీసం జీవితపు తొలిదశలో మన ఇష్ట్తానుసారం కాదు గదా?

    Thanks for a thought stimulating comment. My lappy is acting up and typing in Telugu is a pain. Pardon for non-telugu expressions.

  3. Srinivas Nagulapalli

    మంచి సమీక్షకు ఆలోచింపజేసే మాటలకు కృతజ్ఞతలు.

    ఎవరో “జూనియర్ గాంధి” అని అంటేనే కుంచించుకుపోవడం, “లూజర్” అనిపించుకోకూడదని ధనవంతుడవ్వాలని ప్రయత్నించడం – ఇట్లాంటి అతి బేలతనం, బలహీనతలతో గాంధీ సొంతబిడ్డలు కానివారు సైతం నేటికీ హరిలాల్ వంటి జీవితానుభవాలు పొందడం, రాశిలో ఎక్కువ తక్కువ ఉన్నా, గుణంలో తేడాలేకుండా, చూడాలేకానీ మనచుట్టూ కనపడుతున్న విషయాలే, దృశ్యాలే అనిపిస్తుంది. అంటే గాంధీగారిని వెనెకేసుకురావడమో, పూర్తిగా సమర్థంచడమో కాదు. అతనిలో తప్పొప్పులెన్ని, వాటి ప్రభావమెంత అన్న విశ్లేషణ అంతకన్నా కాదు. అసలు ఆ పాటి పోషణ, సహాయం కూడా లేని, తండ్రులను పోగుట్టుకున్న, అసలు తల్లితండ్రులే లేని, మరింత దయనీయ స్తితిగతులనుంచి ఎదిగిన అనేకులను గమనిస్తే గుర్తిస్తే, నిజంగా మనిషి ఎదగని ఎత్తు ఉంటుందా అనిపిస్తుంది. ఇక ఇటువంటి నవలల చిత్రణలను వర్ణనలను సరిగ్గా బేరీజు వేసుకోవడానికి సాయపడుతుందని కూడా తోస్తుంది.

    దీపానికి అత్యంత సామీప్యంలో చీకటి ఉంటే అది దాని ప్రసరణ లోపం కాదు, కాంతిని అడ్డుకనే పదార్థ స్వరూప స్వభానిదే! దీపకంతి గుడ్డివాళ్ళను చేస్తుందేమో కాని, మానవత్వం ఎప్పుడూ కళ్ళను తెరిపించే కాంతి మాత్రమే.

    చివరిగా మన జీవితాలు అచ్చంగా, స్వచ్చంగా, పూర్తిగా మనవి మాత్రమే. ఎంతమందితో ముడిపడినా, ఎంత గాఢంగా బలపడినా, చాలా ఆశ్చర్యకరంగా, మన తిండి మనమే తినాలి, మన నిద్ర మనమే పోవాలి, మన శ్వాస మనమే పీల్చాలి, మన బతుకు మనమే బతకాలి.
    ============
    విధేయుడు
    -శ్రీనివాస్

Leave a Reply