పుస్తకం
All about booksపుస్తకభాష

January 23, 2011

మహాత్మునికి గాంధీకి మధ్య

ముంబై… శరీరాలనూ మనసులనూ ఇబ్బంది పెట్టే జూన్ నెల వేడి… షివడీ హాస్పిటల్. భయంకరమైన రోగాలతో మరణించిన వ్యక్తిని మార్చురీలో దిక్కులేని శవంగా నమోదు చేసి కొన్ని గంటలు కూడా గడవలేదు. దానికోసమంటూ ఇద్దరు వ్యక్తులు రాగానే మెడికల్ ఆఫీసర్ ముఖంలో కాసింత రిలీఫ్ కనిపించింది. మరణ ధృవీకరణ పత్రంలోని ఖాళీలను పూరిస్తున్నాడు వైద్యుడు. మృతుని పేరు హరిలాల్, తండ్రి పేరు మోహన్ దాస్, ఇంటిపేరు గాంధీ, వయస్సు అరవై సంవత్సరాలు, మృతికి కారణం… వగైరా వగైరా. డాక్టరు ఈ రోగిని అసలు గుర్తించలేదు. మరణించిన రోగి పేరు సరే, తండ్రి పేరు దగ్గిరో, కనీసం ఇంటిపేరు దగ్గిరో డాక్టరు ఆగి ఆశ్చర్యపోతే? కానీ అతను గుర్తించలేదు.

కాలం ఎంత కౄరమైనది? యావద్భారతం బాపూ అని పిలుచుకున్న మోహన్ దాస్ గాంధీ పేరును – జాతిపిత పేరును ఆయన మృతి చెందిన ఆర్నెల్లలోపే ఈ డాక్టరు గుర్తించలేదు. బాపూ పెద్ద కొడుకు హరిలాల్ డెత్ సర్టిఫికెట్ను వచ్చినవారికి అప్పగించి తన బాధ్యత తీర్చుకున్నాడు.
మార్చురీలో‘ఎనిమిదో నెంబరు శవం’గా మాత్రమే గుర్తింపు పొందిన హరిలాల్ కథ ఏమిటి?

1906లో దండిగా నిండుగా కురిసిన వర్షపునీటితో పొంగిపొరలుతున్న హిందూ సముద్రపు జలరాశి మీద ఒక ఓడ. డెక్ మీద పందొమ్మిది ఇరవయ్యేళ్ల నవయువకుడు హరిలాల్. అవతలి తీరంలో దక్షిణాఫ్రికా. అక్కడ ఉన్నది తాను ప్రాణంగా ప్రేమించే బా, బాపూ, తమ్ముళ్లు మణిలాల్, రామదాసు. ఇవతలి తీరంలో తాను వదిలి వెళుతున్నది మూడు నెలలు కాపురం చేసిన నవ వధువు గులాబ్ ను. పెళ్లిమాట తలచుకోగానే హరిలాల్ నోట్లోకి చేదుగా ఉప్పగా ఉన్న వస్తువేదో వచ్చినట్టు అనిపించి సముద్రపు నీళ్లలోకి ఉమ్మివేశాడు. ‘నేనీ వివాహానికి అంగీకరించను. హరిలాల్కి పెళ్లి అయినా కాకున్నా ఫరవాలేదు. హరిలాల్ గురించి ఒక పుత్రుని విధంగా ఆలోచించడం ప్రస్తుతం నేను మానివేశాను’ తన వివాహం గురించి బాపూ అలా ఎందుకన్నారు? తన చిన్నప్పటి నుంచీ తండ్రి కోసం అలమటింపే. ‘అమ్మా, నాన్నగారు మన ఇంటికి ఎప్పుడొస్తారు?’ తల్లిని ఎన్నిసార్లో అడిగేవాడు.

ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చేయిపట్టుకుని ఆఫ్రికా వెళుతున్నప్పుడు తాను కూడా బాపూలాగా పెద్ద చదువులు చదువుకుంటానని, కళ్లెర్రజేసి ఆంగ్లేయుల్ని భయపెట్టాలని అనుకున్నాడు. తీరా ఆఫ్రికాలో అడుగుపెడితే అక్కడ బాపూ అందిస్తున్న చదువు తనకు తెలిసినదానికి పూర్తిగా భిన్నమైనది. ఆ చదువుతో తాను తండ్రిలాగా అవుతాడా? అప్పటివరకూ చదువుకున్న ఎక్కాలు, గుణింతాలు, కాఠియవాడ్ చరిత్ర… అంతా అక్కడే మర్చిపోయాడు. భారతదేశానికి వచ్చినా కుటుంబానికి దూరంగా గోండల్ స్కూల్లో, బొంబాయి ఎస్ ప్లనేడ్ స్కూల్లో.. ఎప్పుడూ తను ఒంటరివాడే.

అందరూ ఉన్న ఒంటరివాడు. ఈ తిరుగుడు వల్ల సరిగా సాగని చదువు. బాపూతో సమానంగా చదివిన బారిష్టర్లు వేలకొద్దీ రూపాయలు సంపాదించి ఇళ్లూవాకిళ్లూ సమృద్ధితో నింపుకుంటూ ఉంటే, ఆయన మటుకు ప్రాణికోటి అంతా తన కుటుంబమే అని ఎందుకనుకుంటారు? అలా అనుకునే వ్యక్తి తన కుటుంబసభ్యులను మాత్రం ఎందుకు ఆప్యాయంగా చూడరు? తానే కాదు, తమ్ముళ్లకూ చదువులేదు ఎందుకని? తాము ఏం చదవుతున్నామని అడుగుతున్నవారికి ఏం చెప్పాలి? హరిలాల్ మనసు పరిపరివిధాల పోతోంది. తీరం చేరుకున్న తర్వాత దక్షిణాఫ్రికా ఫినిక్స్ ఆశ్రమంలోని కఠిన నియమాలను చూసి హరిలాల్ విభ్రాంతి చెందాడు. ఉప్పు వెయ్యని వంట, రాత్రి భోజనంలో నల్లని టీ, డబుల్ రొట్టె. మరొకరోజు నారింజ, ప్లమ్ వంటి ఫలాలే భోజనం.

చిన్నపిల్లవాడు దేవదాసు అల్లరి మానిపించడానికి బా అతనికి ఇచ్చిన పంచదారతో ఆశ్రమం ఖర్చు పెరిగిందని ఎవరో ఫిర్యాదు చెయ్యడం, దానికి బాపూ అందరిలోనూ సంజాయిషీ కోరడం.. అతనికి విచారంగా అనిపించింది. తల్లి కాబోతున్న గులాబ్ ఆగమనం హరిలాల్ మనసుకే కాదు, ఫీనిక్స్ ఆశ్రమానికీ వసంత శోభను తెచ్చింది. అయితే బాపూ అరెస్టు అయితే ఉద్యమానికి నాయకత్వం వహించేవారెవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా హరిలాల్ ముందుకొచ్చాడు. సత్యాగ్రహం చేస్తానని ముందుకొచ్చినప్పుడు తన కళ్లముందు మూడు నెలల పసిబిడ్డ రామీ కదలాడింది. తెల్ల ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడే జనం తనను హరిలాల్గా కాకుండా ‘చిన్నగాంధీ’గా గుర్తిస్తున్నారన్న సత్యం అతనికి అర్థమయింది. తాను జైల్లో ఉంటే బాపూ బయట. బాపూ జైల్లో ఉంటే తాను ఆశ్రమంలో. తండ్రితో కలిసి ఉండాలన్న తన కోరిక మాత్రం ఎప్పటికప్పుడు ఎండమావిగానే ఉండిపోతోంది.

బారిష్టర్ హెచ్.ఎమ్.గాంధీ, బార్ ఎట్ లాగా తన పేరును చూసుకోవాలన్న ఆకాంక్షను బాపూ ఎందుకని పనిగట్టుకొని నెరవేరనివ్వటంలేదో అర్థంకాక హరిలాల్ మనసులో గూడుకట్టుకున్న అసంతృప్తి భగ్గుమని మండసాగింది. గాంధీకి కొడుకు కావటం వల్ల ఏదయినా ప్రయోజనం కలగడం మాట అటుంచి దానివల్ల తీరని నష్టం వాటిల్లుతోంది.ఇంతాచేసి చదవమని బాపూ ప్రోత్సహించినవారేమో దాన్ని మధ్యలోనే వదిలేసి వస్తున్నారు. ఈ పరిణామాలతో అతనిలో ఉద్విగ్నత పెరిగిపోయింది. తండ్రి నీడన ఉంటూ తానేమీ సాధించలేనన్న విషయం అతనికి అర్థమైపోయి ఆఫ్రికాను వదిలేసి వచ్చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యాడు.

బాపూ, బాలకు తెలియకుండా భారత్ కు వచ్చయ్యాలన్న తొలి ప్రయత్నం విఫలమైనా, మలిసారి బాపూ దగ్గరుండి పంపించేశారు. బొంబాయిలో దిగగానే, ఒక్కరోజు కూడా ఆగకుండా అహ్మదాబాదు చేరుకున్న హరిలాల్ వచ్చిన రోజే మెట్రిక్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి పేరును వాడుకోవడం తనకిష్టం లేకున్నా, గుచ్చిగుచ్చి ప్రశ్నించి ‘ఆహా, అంత గొప్పమనిషి కొడుకువా’ అంటూ అందరూ ఆకాశానికెత్తేయడం, సాయం చెయ్యడం అతనిలో పట్టుదలను మరింత
పెంచాయి. అయితే నిర్ణయాలు తీసుకోవడం వేరు, వాటిని అమలుపర్చడం వేరన్న విషయం హరిలాల్ కు ఎప్పటికప్పుడు తెలిసివస్తూనే ఉంది. కుటుంబం పెరగడం, తాననుకున్నట్టు చదువుకోలేకపోవడం, వ్యాపారాలేమీ కలిసిరాక సంపాదన లేకపోవడం, బాపూ కొడుకనే భారం – ఇవన్నీ కలిసి హరిలాల్ బలహీన మనస్తత్వాన్ని లొంగదీసుకున్నాయి.

ఎప్పటికప్పుడు బాపూ పద్ధతికీ తన లక్ష్యాలకూ మధ్య పెరుగుతున్న అంతరంతో హరిలాల్ చాలా
సంఘర్షణ అనుభవించాడు. అతను దురలవాట్లకు బానిసయ్యాడు. దుర్భర దరిద్రాన్ని నుభవించినా చెక్కుచెదరని భార్య గులాబ్ భర్తలో వచ్చిన ఈ మార్పును తట్టుకోలేకపోయింది. అనారోగ్యంతో మంచం పట్టి ఆమె మరణించడంతో తాను దిక్కులేనివాడయిపోయినట్టనిపించింది హరిలాల్కు. వ్యసనమనే పాతాళంలోకి అంతకంతకూ కూరుకుపోసాగాడు. ఒంటి మీద తెలివి లేని పరిస్థితుల్లో చిత్తం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. తండ్రిని విమర్శిస్తూ పత్రికల్లో బహిరంగ లేఖలు రాయడం. కొన్నాళ్లకు మళ్లీ పశ్చాత్తాపం. నలభై దాటిన వయసులోనూ తల్లిదండ్రులకు దగ్గర కావాలనే అతని కోరిక తీరే మార్గమే కనిపించేది కాదు. విపరీతమైన నిరాశ కమ్మేసిన మనసు, వ్యసనానికి
బానిస అయిన శరీరం – వెరసి హరిలాల్ ఒకరోజు ఇస్లాం స్వీకరించాడు. అబ్దుల్లాగా మారిపోయాడు. దేశమంతా సంచలనం రేగింది. బాబాపూలకు తీవ్రమైన హృదయఘాతం.

అలహాబాద్ నుంచి వార్థాకు వస్తున్న జబల్పూర్ మెయిల్. ఎక్కడికక్కడ గాంధీ దంపతులను చూడటానికి వేలాదిగా వచ్చిన జనం. అంత రద్దీలోనూ తమను చేరడానికి ప్రయత్నిస్తున్న బలహీనుడు హరిని, తమ పెద్ద కొడుకు హరిని గుర్తించింది కస్తూర్బా. ఆమె కళ్లు చెమ్మగిల్లాయి, పెదవులు వణికాయి. హరిలాల్ చిక్కిపోయాడు, ముందు పళ్లు ఊడిపోయాయి. బట్టలు మాసిపోవడమేకాక ఇంచుమించు చిరిగిపోయి పీలికలైపోతున్నాయి. కాళ్లకు చెప్పుల్లేవు. ముఖం దుమ్ము కొట్టుకుపోయి, కళ్లు లోతుకు పోయి ఉన్నాయి. కస్తూరిబాను చూస్తూనే హరిలాల్
నవ్వాడు. గట్టిగా అన్నాడు – ‘‘అమ్మ కస్తూరి బాకి జై!!’’ బా ఏమయినా మాట్లాడటానికి, అనుకోకుండా ఏర్పడిన ఆ సన్నివేశం కారణంగా ఏర్పడిన భావాతిరేకం నుంచి తేరుకోవడానికి ముందే హరిలాల్ తన చొక్కా జేబులోంచి ఒక బత్తాయిపండు తీసి బా ముందుకు చాపాడు.

‘‘అమ్మా, అమ్మా, ఈ బత్తాయిపండు తీసుకో. నేను నీకోసం తెచ్చాను.’’కంపిస్తున్న కంఠస్వరంతో
అందిస్తున్న హరిని చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. ఈలోగా తన సీటు నుంచి లేచి బాపూ కూడా కిటికీ దగ్గరికి వచ్చారు. ‘నాన్నా హరీ, నాకోసం ఏమీ తేలేదా?’ ‘మీకోసమా?’ హరి కూడా ప్రశ్నించాడు. ‘‘లేదు, ఇది నేను అమ్మ కోసమనే తెచ్చాను. మా అమ్మ పడిన కష్టం వల్లనే ఈనాడు మీరింత గొప్పవారు కాగలిగారనే నేను మీకు చెప్పవలసింది’’ బండి ప్లాట్ ఫారమ్ వదిలి వచ్చేసింది. దూరాన్నించి ఒక క్షీణమైన స్వరం రైలు పట్టాల చప్పుడు మధ్య వినిపించింది..

‘‘అమ్మ కస్తూరి బాకి జై’’ . కస్తూరి బా మనసు సహించుకుంటున్న దు:ఖభారాన్ని శరీరం సహించలేకపోయింది. మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు కూడా ఆమె మనసు పెద్దకొడుకు కోసమే తపించింది. ఆ స్థితిలో ఉన్న తనను చూడటానికి తప్పతాగి వచ్చిన హరిని చూసి ఆమె దు:ఖం పట్టలేకపోయింది. రెండు చేతులతోనూ తలబాదుకుంది. మర్నాడే తనువు చాలించింది. బా చనిపోయిన తర్వాత హరిలాల్లో తాను మరింత దిక్కులేనివాడయిన భావన కలిగింది. బాపూ
అంత్యక్రియలప్పుడు చేరిన జనసమ్మర్దంలో బిచ్చగాడివలె ఉన్న అతన్ని ఎవరూ బాపూ పెద్దకొడుకనుకోలేదు. చివరకు షివడీ ఆస్పత్రిలో డాక్టరు కూడా అతనో దిక్కుమాలినవాడనే అనుకున్నాడు.

‘మహాత్మునికి గాంధీకి మధ్య’ పుస్తకం ఇక్కడితో ముగిసిపోతుంది. కానీ వాళ్లిద్దరి మధ్య నడిచిన సంఘర్షణ పాఠకులను చాలాకాలం వెంటాడుతుంది. మానవ స్వభావాల్లోని వైరుధ్యం, మాటిమాటికీ నిరంతరం దాన్ని ఎదుర్కోవలసి రావడంతో ఏర్పడే సంఘర్షణ – తిరస్కారం నుంచి పుట్టే వ్యధ – పూర్తి విశ్వాసంతో జీవితాన్ని గడపాలనుకున్నా దానికోసం తపన పడుతున్నా కూడా అది అరచేతిలోంచి ఇసుకలాగా జారిపోతుంటే పుట్టే బాధ – కాలం నిర్దాక్షిణ్యంగా కొడుతున్న దెబ్బలు – వీటన్నిటిలో హరిలాల్ జీవితం ఎలా గడిచిందో ఈ నవల విశదీకరిస్తుంది.ఎన్నో ఆధారాలను సేకరించి, మహాత్ముని కుటుంబసభ్యులతో మాట్లాడి దినకర్ జోషీ గుజరాతీలో రచించిన ‘ప్రకాశవో పరభావో’ నవల ఎన్నో భాషల్లోకి అనువాదమయింది.

‘మహాత్మా వెర్సస్ గాంధీ’ ఆంగ్ల నాటకంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. కూచి కామేశ్వరి అనువాదంగా తెలుగులోకి ‘మహాత్మునికీ గాంధీకి మధ్య’గా మన ముందుకు వచ్చింది. ఈ పుస్తకం ఎక్కడ, ఎప్పుడు కనిపించినా తప్పక చదవండి.

ప్రచురణ : ఎమెస్కో బుక్స్
పేజీలు :320 ధర :125రూపాయలు.
www.emescobooks.comAbout the Author(s)

అరుణ పప్పు14 Comments


 1. […] అరుణగారు పరిచయం చేసిన తెలుగు అనువాదం  మహాత్మునికి గాంధీకి మధ్య […]


 2. ఎట్టకేలకు ఈ రచన ఆంగ్లానువాదం దొరకబుచ్చుకున్నాను. ఒక నాలుగైదు పేజీలు చదివాను. ఆసక్తికరంగా ఉంది. ఓ నెలలోపులో పూర్తి చేసి నా అభిప్రాయంతో తిరిగి వస్తాను.

  ఇంత చక్కని పరిచయం చేసినందుకు మళ్ళీ థాంక్స్!


 3. Nithin

  బావుందండీ. అసంగతమైన విషయాలను విస్మరించి, అవసరమైన మేర ప్రస్తావించడం, అదీ సంక్షిప్తంగా కాకండా వివరంగా ఇవ్వగలగడం అభినందించదగిన విషయం. పరిచయం బావుంది. ముఖ్యంగా ప్రారంభం…అదిరింది!.


 4. Supriya

  ee book eveninghour lo dorukuthundi.. daani cost 125/-


 5. […] గాంధీకి మధ్య’ నవల గురించి పుస్తకం డాట్ నెట్లో నా పరిచయం ఇక్కడ. దయచేసి మీ […]


 6. Giri

  I couldn’t find this book at http://www.emescobooks.com.
  Is there any way to order this on-line?


 7. హ్మ్మ్…
  గాంధీ గారి భార్యా, కుటుంబ సభ్యుల విషయంలో కొంచెమే తెలిసినప్పుడే మనసు చాలా కష్టపడుతుంది. ఇలా స్పష్టంగా తెలిసినప్పుడు ఇంకా బాధ వేసింది.
  కాదంబరి గారి వ్యాఖ్య లో అన్నట్లు, తల్లులమైన తర్వాత స్నేహితురాళ్ళం అనుకునే first child syndrome, మొదటి సంతానంతో ఉండే ఘర్షణ, అనుభవంలో అర్థమౌతోంది.
  ఐతే విపరీతమైన పరిస్థితులలో తీవ్రమైన పరిమాణాల గురించి ఇలా చదివి మనసు చెదరక మానదు.
  గాంధీ గారు కఠినంగానే వ్యవహరించారు అన్ని విషయాలలోనూ, ఆఖరికి తన స్వంత విషయాలలో కూడా.
  తనని తాను కూడా చాలా శ్రమకు గురి చేసుకున్నారు.
  It is a part of his personality, a part of whole package.
  Not a pleasant one.


 8. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

  అరుణ పప్పు గారు,
  పుస్తకం సంగతేమో కానీ మీ పరిచయం మాత్రం చాలా బావుంది.కళ్ళకు కట్టినట్లు వర్ణించారు


 9. చాలా హృద్యంగా గుండెల్ని పిండేట్టు సాగింది కథనం. వెంటనే చదవాలనిపిస్తోంది పుస్తకం. ధన్యవాదాలు అరుణ గారు..


 10. mitra kumar

  well said. It is not known to world that Gandhiji son has so much of bitter experiences in life. Hats of to your transilation. We have found Harlal with beard and teared off shirt before the eyes and it is narrated so heart touchingly.

  Thanks for the effort by the writer Aruna Pap.


 11. పూర్ణిమా,
  దీన్ని ‘ప్రకాశవో పరభావో’ పేరిట గుజరాతీలో రాశారు శ్రీ దినకర్ జోషీగారు. తర్వాత ఇది హిందీ, మరాఠీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదమయింది. కూచి కామేశ్వరిగారు అనువాదం ఇంగ్లిషు నుంచి చేశారా లేదా గుజరాతీ నుంచి చేశారా అన్నది స్పష్టంగా తెలియలేదు. దినకర్ జోషీగారు జూన్ 30, 1937లో భావనగర్ లో పుట్టారు. 41 నవలలు, 11 కథా సంగ్రహాలు, 10 కథా సంకలనాలు, రామాయణ మహాభారత ఇతివృత్తాలపై 9 అధ్యయన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, అనువాదాలు మొత్తం 110 పుస్తకాలను రాసిన రచయిత ఆయన.


 12. Purnima

  Ok.. so “Gandhi, My father” movie was based on this! Then, it must be read.

  On the same topic of Gandhi, I wanna read authentic books on Godse.. not particularly the assassination version, but everything before and after that. Any recommendations?

  @Kadambari: The original is in Gujarathi or english?

  @Aruna: Can you please give more details of the original? Btw.. well written article.


 13. Independent

  wow, I never heard of this book. Thank you so much Ma’am. Certainly needs to be there in my study room.


 14. నిజంగా గుండెలని పిండి చేసే సామాజిక అంశం ఇది.
  ఇక్కడ “మహాత్మా గాంధీ కుమారునిగా” చరిత్రకు ఎక్కింది.
  కానీ, సమాజంలో ఇలాంటి తండ్రీ కొడుకుల పరిణామాలు కనిపిస్తాయి.
  ఐతే, “మానసిక శాస్త్రం” అభివృద్ధి చెందాక,
  నాటి బాలలే పరిగి పెద్దైనాక నేటి ->)తల్లి దండ్రులు తమ పిల్లలను-
  ఈ కోణంలో పరికిస్తూ జాగ్రత్తగా పెంచుతున్నారు,
  కాబట్టి ఇలాటి సంఘటనలు ఇప్పటి సమాజంలో తగ్గిపోయాయని చెప్ప వచ్చును.
  గుజరాతీ భాషలో రచించిన దినకర్ జోషీ గారికి, తెలుగులోకి అనువాదంగా తీసుకు వచ్చిన
  కూచి కామేశ్వరి గారికి ధన్యవాదాలు.
  ఇలాటి రచనలు మన దేశానికి అత్యవసరము.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
Mahatma vs Gandhi

Mahatma vs Gandhi

“Losers blame their parents; Failures blame their kids.” ― Steve Toltz అనగనగా ఓ మనిషి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు బతుకుని ఈడుస్...
by Purnima
3