పుస్తకం
All about booksపుస్తకలోకం

December 14, 2012

శబ్బాష్ రా శంకరా :నాకు నచ్చిన కొన్ని తత్వాలు

More articles by »
Written by: సౌమ్య
Tags: ,

“శబ్బాష్ రా శంకరా” పుస్తకం గురించి బ్లాగుల ద్వారా చాలా విన్నాను. అయితే, చదవాలి అన్న కుతూహలం కలుగలేదు. భరణి గారిని అనుకోకుండా ఒకసారి విజయవాడ బుక్ ఫెయిర్లో కలిసి, కాసేపు మాట్లాడిన రోజు కూడా నాకు బాగా ఇష్టమైన “ఎందఱో మహానుభావులు” రాసిన మనిషిగా, “గ్రహణం” హీరోగా, “సిరా” దర్శకుడిగా చూసాను తప్పిస్తే, ఆయన ఇతర రచనలపై దృష్టి పడలేదు. కానీ, ఒకానొక శుభదినాన, కినిగె.కాం పుణ్యాన, “నక్షత్ర దర్శనం” చదివిన క్షణం నుండీ భరణి గారంటే రెండో రకం ఇష్టం మొదలైంది. ఆ పుస్తకం లో, నాకిష్టమైన ఎందరి గురించో రాసినవి టైప్ చేస్కుని సేవ్ చేస్కున్నా. ఆ తరువాత “పరికిణీ” చదివాను. అందులోనూ, కొన్ని చాలా నచ్చాయి. ముఖ్యంగా, వ్యంగ్యం…పదాల పొందిక… ఇక్కడ కూడా చాలా వాక్యాలు టైపు చేస్కుని సేవ్ చేస్కున్నాను. దాదాపు నెలరోజుల విరామం తరువాత “శబ్బాష్ రా శంకరా!” చదివాను. చిన్నదే అయినా, చక్కగా ఉంది. చదువుతున్నంత సేపూ, ఒక వందశాతమన్నా నాస్తికురాలినైన నేను శివభక్తి పారవశ్యం అనుభవించాను.  పుస్తకం గురించి చక్కటి పరిచయాలు ఇదివరలోనే వేణూ శ్రీకాంత్ గారు, సుజాత గారూ రాసారు. పుస్తకం.నెట్ లో కూడా మురళి గారు రాసారు. కనుక,  నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. నాకు చేతకాదు కూడా. నాకు బాగా నచ్చేసిన భరణీయాలు మాత్రం అందరితో పంచుకుంటున్నాను….

 

 

కన్నీళ్ళల్ల నే బుట్టినా పెరిగినా…
కన్నీళ్ళనే… కాలినా
ఒక్క బొట్టన్నా…స్ఫటిక లింగమైతే…
శబ్బాష్ రా శంకరా!

శంకర అంటేనే నాకు
షక్కర లక్క ఉంటాదయ్య
శివునాగ్నైతాది …సీమనైత
శబ్బాష్ రా శంకరా!

నీ అంతేడనో తెల్సుకోనీకి
కిందమీదైన్రు తోటోళ్ళు!
అంతే నీవని తెల్సుకోరేందిరా
శబ్బాష్‌రా శంకరా!

నాకా రావయ ఓనమాలు
బిల్‌కుల్ రాదయ ఛందస్సు!
నువ్వే యతివి-గణాలు సుట్టుముట్టూ
శబ్బాష్‌రా శంకరా!

మూడ్కండ్లుంటేనే రెండు ఇండ్లాయరా
శబ్బాష్ రా శంకరా

ఎన్నో గుళ్ళల్ల దేవులాడి
యాష్టొచ్చి గూసుంటే!
నా గుండెల ఘల్లుమన్నవులె
శబ్బాష్ రా శంకరా

నీళ్ళల్లుంటవు …. నిప్పులుంటవు
గగనంల..గాల్లుమంటవు
మట్టిల ఉంటవు….మనసులుండనంటవ్
శబ్బాష్‌రా శంకరా

పచ్చని చెట్లు గొడ్తె
భూమాతకు..గుండెల పొక్కబెడ్తె!
మాతోనే మా బొంద తవ్విపిస్తవా?
శబ్బాష్‌రా శంకరా

కష్టాలుంటెనె నీకు మస్కా
లేకుంటే కోన్‌కిస్క!
సంకటమొస్తెనె యెంకటయ్య యాది
శబ్బాష్‌రా శంకరా!

పక్కోడొక్కడు పచ్చగున్నడంటె
మా కడుపెంత ఉడుకైతదీ!
జర మా కండ్ల సల్లబడనీయవా
శబ్బాష్‌రా శంకరా

కవితల్ రావయ కాళిదాసోలె
తిన్నన్ లెక్క కన్నీయలె
బెకారోనికి భక్తినిస్తివయ్యా
 శబ్బాష్‌రా శంకరా

బతుకిచ్చే దొరవయ్య నువ్వు
బాంచను నీ కాల్మొక్త!
బతికుస్తుంటవు – సంప్కదింటవు
 శబ్బాష్‌రా శంకరా!!

*********************

పేరు: శబ్బాష్‌రా శంకరా
రచయిత: తనికెళ్ళ భరణి
పబ్లిషర్: సౌందర్యలహరి
ప్రతులు: అన్ని ప్రముఖపుస్తక షాపులలో దొరుకుతుంది
మూల్యం: 50/-About the Author(s)

సౌమ్య9 Comments


 1. sarath

  abdul kalam gari pustakamlo oka chota antaaru, parmanuvu lo electrons ela tiruguthuuntayante,pramasivudi taandavam laaga ani,allage aa parama sivudu thanikella vaari lona taanadava maadaga vachinatluga anipistunthi ee “shabhash ra sankara” chadivina,vinna kudanu…..hats off bharani gaaru,mee janma dhanyam. adhi chadivina ma janma dhanyam.


 2. varaprasad

  shabash barani,naku “SIVA” nunchi vilon gane choostanu,vilanisom lo ,carrectors different shades unnayani telusu gani neelo inta depth undani ippude telisindi.


 3. ఏల్చూరి మురళీధరరావు

  సౌమ్య గారు!

  అనుకోకుండా అయితేనేమి, అద్భుతమైన మాట అన్నారు. ఆలస్యంగా చదివినా, నాకెంతో సంతోషం కలిగింది. తనికెళ్ళ భరణి గారికి ఇంతమంచి కితాబు మఱొకచోట దొరుకుందనుకోను.

  “శబ్బాష్ రా శంకరా!” నేనూ చదవగలిగాను. దురదృష్టవశాత్తు నా దృష్టి అందులోని కవితాభివ్యక్తి పైన, ఆయన కవితాసామగ్రి పైన, ఆయన సాధించిన ఉక్తివైచిత్రి పైన, కావ్యసామాన్యకల్పమైన సంవిధానశిల్పం పైన నిలిచి, “ఒక మంచి పుస్తకం” అనే తప్ప అంతకంటె ఆత్మనీనమైన ఉన్నతకక్ష్యలోకి ఉద్గమించలేదు.

  మహానుభావులు శ్రీ ముత్తేవి లక్ష్మణయతీంద్రుల వారు అనేవారు: “నా కోసం ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో భక్తిభావంతో వచ్చి, నాలో దేవుణ్ణి చూసుకొని నాకు నమస్కరిస్తుంటారు. ఎప్పుడూ ఆ దేవుణ్ణే నమ్ముకొని, ఆయననే ఆరాధిస్తూ, ఆయనే సర్వస్వం అని నమ్ముకొన్న నాకు ఇంతమంది భక్తుల్లో ఆ దేవుడు ఒక్కసారైనా కనిపించలేదు. నిజానికి నాలో దేవుణ్ణి చూస్తున్న వీరికి నేను నమస్కరించాలి గాని, దేవుణ్ణి చూడలేని నేను ఎటువంటి నమస్కారానికి యోగ్యుణ్ణి కాను” అని.

  విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా వ్రాశారు: “ఆనందం, కావ్యానందం, బ్రహ్మానందం, మహానందం అంటాము గాని, నేను చదువుకొన్న, నేను వర్ణిస్తున్న ఆ ఆనందాన్ని నేను అనుభవించానా?” అంటే, ఒకే ఒక్కసారి రామాయణ కల్పవృక్షం వ్రాస్తున్న రోజుల్లో ఒకానొక లోకోత్తరమైన ఉపమానం స్ఫురించినప్పటి అలౌకికమైన సన్నివేశాన్ని ఆయన నెమఱువేసుకొని, “అది కాబోలు, ఆనందం అంటేను అనుకొన్నాను” అన్నారు.

  అంతటి మహాకవికి ఆ ఆనందం జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారి స్వానుభవంలోకి వచ్చిందన్నమాట!

  ఉపనిషత్తులలో, ధ్వన్యాలోకాదులలో చెప్పబడిన ఆనందాన్ని గుఱించి తెలిసి ఉండటం వేఱు; ఆ ఆనందాన్ని మనము అనుభవించటం వేఱు.

  కవితో సమానమైన హృదయం ఉండటమే “సహృదయత” అని లాక్షణికులన్నారు. ఆ సహృదయత కల్పించే ఐక్యానుసంధానమే భక్తిపారవశ్య భావన.

  “చదువుతున్నంత సేపూ, ఒక వందశాతమన్నా నాస్తికురాలినైన నేను శి-వ-భ-క్తి-పా-ర-వ-శ్యం అ-ను-భ-విం-చా-ను.” అని మీరు వ్రాసిన వాక్యం నాకు తెలుగు విమర్శ సాహిత్యంలో మిఱుమిట్లు గొలుపుతూ కనిపించింది.

  భద్రా స్తే పంథానః!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు


 4. Srinivas Nagulapalli

  భేషజాలు లేకుండా నచ్చిన పదాలను పంచుకున్న పరిచయానికి సౌమ్య గారికి కృతజ్ఞతలు.
  ఎందుకో ఇది రాయడానికి స్ఫూర్తిని కూడా ఇచ్చింది.

  ఎంతమంది నిను కొల్చినా
  ఎన్ని రకాలుగా పిల్చినా
  శివమెత్తిపోవుట తెలుగుకే సొంతం
  సరికాదంటావా శంకరా?

  నా భాష సంకరమాయె
  నా భావం పరేషానాయె
  అయినా జిమ్మెదారీ నీదే కదా
  కాదంటావా శంకరా?

  గజనర మిళిత దేహమే సంకరమాయె
  అయితేంది అతడు నీ పెద్ద కొడుకాయె
  తొలిపూజకు అతడె అర్హుడాయె
  షరతులున్నయా నీ దయకు శంకరా?

  నీళ్ళు ఇయ్యమంటె అందరికి
  నీళ్ళు మింగుతరు నేతలు
  విషం మింగి అమృతం ఇస్తవు
  సాటినీకెవరు శంకరా?

  కొంత అధికారం చేతికందగనె
  గుట్టలు గనులు గుటుక్కున బుక్కుతరు
  సర్వాధికారమున్న సర్వసంగపరిత్యాగివి
  సాటినీకెవరు శంకరా?

  కామించి పెండ్లాడుతరు
  దునియాలో ఏడైనా ఎప్పుడైనా
  కామున్ని మసిజేసినంకనే నీ కళ్యాణం
  సాధ్యమెవరికయ్య శంకరా?
  ======
  విధేయుడు
  _శ్రీనివాస్


  • పుస్తకం.నెట్ కు ఇంతకన్నా ప్రశంస వేరే లేదు.


  • sudheer

   ఆ ముక్కంటి మాట విన్న పాట విన్న ఒళ్ళు పులకరిస్తుంది మనసు మైమరచి పోతుంది. ఏదో తెలియని అనుభూతితో తన్మయత్వం కలుగుతుంది.
   మాట రాక మనసు ముగవొయె
   నిలువెల్లా తన్మయత్వముతో తడిసిపోయే
   ముక్కంటి మాట విన్నంతనే ముల్లోకాల దర్శనమాయె
   నీకు సాటి లేదు ర శంకరా.


 5. భాష సంకరమాయె !
  భావమా వంకర పోయె !
  బ్రతికించు భారమ్ము నీదె !
  బాపు మా శంకలను శంకరా !!


 6. నాకా రావయ ఓనమాలు
  బిల్‌కుల్ రాదయ ఛందస్సు!
  నువ్వే యతివి-గణాలు సుట్టుముట్టూ
  శబ్బాష్‌రా శంకరా!
  అద్భుతం
  భరణి “ఆటగదరా శివా” తత్త్వాలు కూడా బావుంటాయ్.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పరికిణీ – తనికెళ్ళ భరణి

భరణి గారి వ్యాసాలు (ముఖ్యంగా – “ఎందరో మహానుభావులు”) అప్పుడప్పుడూ చదువుతూ ఉండేదా...
by సౌమ్య
5

 
 
నక్షత్ర దర్శనం

నక్షత్ర దర్శనం

భరణి గారి “నక్షత్ర దర్శనం” చదివాను. నాకు చాలా నచ్చింది. అయితే, నేను ప్రత్యేకం పరిచ...
by సౌమ్య
4

 
 
శబ్బాష్‌రా శంకరా!

శబ్బాష్‌రా శంకరా!

రాసిన వారు: మురళీధర్ నామాల ******************* పేరు: శబ్బాష్‌రా శంకరా రచయిత: తనికెళ్ళ భరణి పబ్లిష...
by అతిథి
4

 

 

భరణికి ఒకట్రెండ్మూణ్ణాలుగైదు వీరతాళ్ళు!

ఇటీవలే ముగిసిన హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో తనికెళ్ళ భరణి నాటికలు పుస్తకరూపేణా ఆవ...
by Purnima
2