మహాత్ముని ఆస్థాన కవి

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తుమ్మల సీతారామమూర్తి గారు మరణించినపుడు వచ్చిన సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్)
******
తనను తాను “తెనుగు లెంక” అని ఆయన వ్యవహరించుకున్నారు. తెలుగువారు “అభినవ తిక్కన”గా ఆయనను అభిమానించారు. విమర్శకాగ్రణి కట్టమంచి రామలింగారెడ్డి “మహాత్ముని ఆస్థాన కవి” అని సంభావించారు.

బుధవారం రాత్రి తన ఎనభై ఎనిమిదవ ఏట నిండు వృద్ధాప్యంతో పండుటాకువలె రాలిపోయిన శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారికి ఇవన్నీ అన్వర్థ బిరుదాలే. ఆయన భౌతిక జీవితం పరిసమాప్తమైనా కవితా జీవితం మాత్రం కలకాలం కొనసాగుతుంది.

కొంచెం అటూ ఇటూగా ఆయన సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్తు కవులకు సమకాలికుడు. అయినా ఒక జాషువా వలె, ఒక దువ్వూరి వలె, సీతారామమూర్తి గారిది కూడా భిన్న మార్గం, ఒక ప్రత్యేక మార్గం, అది పూర్తిగా తనదే అయిన స్వతంత్ర మార్గం.

భారతదేశం పరాధీనత నుంచి విముక్తి కోసం గాంధీజీ నాయకత్వాన పోరాటం ప్రారంభించిన రోజులలో ఆయన వ్యక్తిగా, కవిగా కళ్ళు తెరిచారు. గాంధీజీ సత్యాగ్రహ సమర శంఖారావం ఆయనను ఆకర్షించింది. నాటి నుంచి ఆయన కవిత దేశభక్తికి అంకితమైంది. ఆయన గాంధీ పథానువర్తి అయ్యారు.

ఆ కాలంమున గౌతము/ డీకాలమునందు గాంధి యిద్దరు హింసా
వ్యాకుల జగతికి శాంతి/ శ్రీకరులు దయావిధేయ జీవన నిరతుల్

-అని ఒకచోట గాంధీజీకి బుద్ధునితో పోలిక తెచ్చి గాంధీ మార్గంలోనే యావజ్జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు.

“పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట” అని పోతన చెప్పుకున్నట్టు గాంధీజీ పట్ల గల గాఢ భక్త్యారాధనా భావమే సీతారామమూర్తి గారి చేత “బాపూజీ ఆత్మకథ”కు పద్యానువాదం చేయించింది. “మహాత్మా కథ”ను గ్రథియింప జేసింది. ఈ రెండు బృహత్కావ్యాలు ఈ శతాబ్దపు ఆంధ్ర భారతికి అమూల్యాంకారాలు. ఇవీ, ఇంకా గాంధీజీ పై ఆయన వ్రాసిన ఇతర కృతులే కట్టమంచి వారి నుంచి “తుమ్మల సీతారామమూర్తి మహాత్ముని యొక్క ఆస్థాన కవి. ఈ స్థానము శాశ్వతము” అన్న ప్రశంసను సంపాదించాయి.

మహాత్ముని మహిత జీవితం తర్వాత తుమ్మలవారికి కవిగా అమిత ప్రేరణ ఇచ్చిన మరొక గాఢ భావన స్వరాష్ట్రాభిమానం, స్వభాషానురక్తి. “నేను తెలుగువాడను అను నహంకారము నా కెక్కువ. ఈ యహంకారమే నన్ను కవిని చేసినది” అని తుమ్మల వారు స్వయంగా చెప్పుకున్నారు. ఈ గాఢ భావ ప్రభావ ప్రేరణతోనే ఆయన రాష్ట్ర గానం, ఉదయ గానం, మరెన్నో లఘు, గురు కావ్యాలు రచించారు. తెలుగు నుడికారానికి, తెలుగు భాషా మార్దవానికి, మాధుర్యానికి అవి లక్ష్యప్రాయాలైన రచనలు.

తుమ్మలవారికి పోతన అభిమాన కవి. అయినా ఆయన కవితలో తిక్కనతనమే ఎక్కువగా కనిపిస్తుంది. కట్టమంచి వారికి నన్నయత్వం కూడా కనిపించింది. విశ్వనాథ వారికి శ్రీనాథుడు, పెద్దన రీతులు సయితం కనబడ్డాయి. పురాంధ్ర కవితా సముద్రాన్ని అగస్త్యుని వలె ఆపోశనం పట్టినవారైనందున అన్ని పోకడలు ఆయనలో కనిపించడం లో ఆశ్చర్యం లేదు.

తుమ్మల వారి కృతులన్నిటిలో “నేను” అన్న లఘు కావ్యం విలక్షణమైనది, మృదుమధురమైనది. దానిలో ఆయన జీవిత తత్త్వం, కవితా దృక్పథం ప్రస్ఫుటాలవుతాయి.

మాటమాటయు వాగ్దేవి కోటగాగ / కోటలో దావు లెగజిమ్ము తోటగాగ
దోట సురలెడి క్రొందేనె తేటగాగ / దీర్చినది కైత, మెరుగుదిద్దినది కైత

-అని పేర్కొన్న సుకవితా లక్షణం తుమ్మల వారి కవిత్వానికి చక్కగా సరిపోతుంది.

రాష్ట్ర సిద్ధి కొరకు రక్తమ్ము గార్చిన / కవిని నేను గాంధి కవిని నేను
బడలి బడలి తల్లి బాసకూడెము సేయు / కవిని నేను దేశి కవిని నేను

-అని సగర్వంగా చెప్పుకున్న శ్రీ తుమ్మల ధన్యజీవి, ధన్యకవి. ఆయన స్మృతికి మా జోహార్లు.

మార్చి ౨౩, ౧౯౯౦
(March 23, 1990)

You Might Also Like

Leave a Reply