ముసురు – ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ

ప్రముఖ రచయిత్రి  ముదిగంటి సుజాతారెడ్డి గారి ఆత్మకథ ముసురు పేరిట ప్రజాతంత్ర పత్రికలో ధారావాహికగా వచ్చిందట. ఇప్పుడు పుస్తకరూపంలో వచ్చింది. ఆత్మకథలు చదవటంలో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నా,  సినీనటులు భానుమతి, జమున రాసినవి తప్ప వేరెవరూ తెలుగు మహిళలు రాసిన ఆత్మకథలు చదివినట్లు గుర్తు లేదు. అందుచేత ఈ పుస్తకం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి. నాకు అంతగా పరిచయం లేని స్థలకాలాల గురించి రాసిన పుస్తకం కావటం కూడా ఇంకో కారణం.

సుజాత గారి తండ్రి గారి ఊరు నల్లగొండ జిల్లాలో నకిరేకల్లుకు దగ్గరగా ఉన్న ఆకారం. మాతామహుల ఊరు వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపురం దగ్గర ఉన్న వెంకటాద్రి పేట. దొరల కుటుంబం. మిట్టా వారు. ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలు కలసి ఒక మట్టికోట ముందు ఉన్న పెద్దబంగ్లాలో ఉండేవారు. ఒక మగబిడ్డ తర్వాత వరసలో పుట్టిన మూడో ఆడపిల్ల కావటంతో మగబిడ్డకోసం ఎదురుచూస్తున్న తల్లికి నిరాశ కలిగినా, ఆడపిల్లలంటే మోజు పడే తాతమ్మ, నాయనమ్మ ఈ పిల్లని బాగా ముద్దు చేసేవారు.
సుజాత గారి చిన్న వయసులో, అక్షరాభ్యాసం జరిగిన కొద్దిరోజులకు, ఒకరాత్రి కొందరు కర్రలతో బర్చీలతో వారి బంగ్లాకు వచ్చారు. “మేం చాలా చాలా చిన్నపిల్లలం. నిశ్శబ్దమైన చింతాకులమైన ఏదో గంభీరంగా ఒత్తిడులతో నిండిన ఆ వాతావరణంతో కూడిన దృశ్యాన్ని రాత్రి అంధకారంలో నూనెతో వెలిగే చిన్న చిన్న దీపాల వెలుతురులో నిలబడి చూసిన గుర్తు.” దస్తర్లు, రికార్డులు, ఇంట్లో ఉన్న తల్వార్లు, బర్చీలని ఆ గుంపు ముందు పెట్టారట. ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడూ మునపటిలా వైభవంగా లేదు. చాలామంది దొరలు, బాగా బతికే కుటుంబాల లాగానే వీరి కుటుంబం కూడా ఆంధ్రప్రాంతాలకు వలస వెళ్ళింది. కొన్నాళ్ళు గుంటూరు జిల్లా అద్దంకిలోనూ, ఆ తర్వాత నరసరావుపేటలోనూ, వారి కుటుంబం, మేనమామ కుటుంబం కలిసి నివసించారు. పెద్ద బంగ్లాలో ఆడబాపలు, నౌకర్లతో బతికిన కుటుంబం, ఊరి గాని ఊర్లో, ఇరుకుగదుల అద్దె ఇళ్ళలో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ, దూరంగా ఉన్న గుండ్లకమ్మ నుంచి మంచినీరు మోసుకు తెచ్చుకోవలసి ఉండటం కష్టమయింది.  కొత్త సంస్కృతితో వలసదార్లు పడే ఇతర ఇబ్బందులు సరేసరి.

తెలంగాణా విమోచనం జరిగి, కమ్యూనిస్టు పోరాటం ఉధృతం తగ్గాక వారు తమ ప్రాంతానికి తిరిగి వచ్చారు. వారి బంగ్లా ధ్వంసమై ఉంది. కొన్నాళ్ళు మేనమామల ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత నల్గొండకు మకాం మార్చారు. సుజాత 1950లో నల్లగొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నాల్గవ తరగతిలో చేరారు. అప్పుడే ‘వెల్లోడి’ ప్రభుత్వంలో స్కూళ్ళలో ఉర్దూ బదులు తెలుగు మాధ్యమం వచ్చింది. హెచెస్‌సి (టెంత్ క్లాస్)  పాస్ అయ్యాక ఇంట్లో ఒక చిన్న మహాబారత యుద్ధం జరిగింది. చివరకు, పెండ్లి కుదిరేంతవరకూ చదువుకుంటుంది అని కాలేజీలో చేరటానికి ఇంట్లో అంగీకరించారు. 1956లో రాజ బహద్దరు వెంకట రామా రెడ్డి మహిళాకళాశాల (ఆర్‌బివీఅర్ఆర్ ఉమెన్స్ కాలేజ్)లో పియుసీలో చేరారు. అక్కడే రెడ్డి హాస్టల్‌లో వసతి. ఇంగ్లీషు మాధ్యమంతోనూ, నగర సంస్కృతితోనూ కొన్ని ఇబ్బందులు. పియుసీ అయేటప్పటికి నల్గొండలో నాగార్జున కాలేజీ ఏర్పడింది. అక్కడ బి.ఏ మొదటి సంవత్సరం చదివాక గోపాల్ రెడ్డిగారితో 1959లో వివాహమైంది.

గోపాల్ రెడ్డి కుటుంబం ఆర్యసమాజానికి చెందినవారు. చిన్నతనంలోనే వారి తండ్రి గోపాల్‌రెడ్డిని అతని తమ్ముణ్ణి హరిద్వారం సమీపంలో ఉన్న కాంగ్లీలో ఆర్యసమాజపు గురుకులానికి పంపించి చదివించారు. అక్కడ గోపాల్‌రెడ్డి వివిధ భాషలు,  వేదాలు నేర్చుకుని, ముఖ్యంగా సంస్కృతంలో పాండిత్యం సంపాదించుకుని, సంస్కృతంలోనే ఎం.ఏ. చదివారు. ఆర్యసమాజపు ప్రభావం వల్ల వారి కుటుంబ సంస్కృతి వేరేగా ఉండేది. ఈ వైరుధ్యాలవల్ల పెళ్ళి ఎలా జరగాలి అన్న విషయంలో కొంత ఘర్షణ జరిగింది. పండిట్ గోపదేవ్, రుద్రదేవ్‌ల ఆధ్వర్యంలో చాలావరకూ ఆర్యసమాజ పద్ధతిలో వారి పెళ్ళి జరిగింది. పుస్తె కట్టడం, మట్టెలు పెట్టడం, కన్యాదానం ఆచారాలను మాత్రం పాటించారు.

పెళ్ళైన తర్వాత సుజాత ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీలో బి.ఏ రెండో సంవత్సరంలో చేరారు. అక్కడే ఎం.ఏ పూర్తి చేశారు. పిల్లలు వాసవిక, ఉదయనలకు జన్మనిచ్చారు. నృపతుంగ మల్టిపర్పస్‌స్కూల్‌లో తెలుగు టీచర్‌గా పని చేయడం మొదలు బెట్టారు. 1966లో జర్మనీలో ట్యుబింగెన్ విశ్వవిద్యాలయంలో జర్మన్‌భాషలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయటానికి గోపాల్రెడ్డికి స్కాలర్షిప్ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత సుజాత, వాసవికలు కూడా అక్కడకు వెళ్ళారు. అక్కడ లైబ్రరీలో పని చేశారు. యూరప్ దేశాలు పర్యటించారు. 1969లో జర్మనీ నుంచి తిరిగివచ్చాక కొన్నాళ్ళు మేక్స్‌మ్యుల్లర్ భవనంలో లైబ్రేరియన్‌గా పని చేశారు. తాను పియుసీ చదువుకున్న ఆర్‌బివీఅర్ఆర్ వుమెన్స్ కాలేజ్‌లోనే పార్ట్‌టైం లెక్చరర్ ఉద్యోగం వస్తే, ఉపాధ్యాయవృత్తి మీద ఆసక్తితో జీతం తక్కువైనా చేరారు. 1975లో తెలుగులో పిహెచ్‌డి పట్టా తీసుకున్నారు. 2000లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యారు. కుమార్తె వాసవిక ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి స్థానికుణ్ణి పెళ్ళి చేసుకుని అక్కడే నివసిస్తుంది. కుమారుడు ఉదయన ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేస్తూ, ఒక మరాఠీ అమ్మాయిని వివాహమాడాడు. గోపాల్ రెడ్డి గారు ఆర్ట్స్‌కాలేజ్ ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశాక సంస్కృతాంధ్ర పదకోశం తయారు చేశారు. ఆ తర్వాత హృదయ సంబంధమైన శస్త్రచికిత్స కాంప్లికేషన్స్ వల్ల మరణించారు.

సుజాతగారు తెలుగులో చాలా సిద్ధాంత, విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. సంస్కృత సాహిత్య చరిత్ర, ఆంధ్రుల సంస్కృతి- సాహిత్య చరిత్ర, నాటక లక్షణాలు, తెలుగు నవలానుశీలనం వంటి పుస్తకాలు ఆమెకు పేరు తెచ్చాయి. కాలేజీ రోజుల్లో కొన్ని కథలు రాసినా, ఆ తర్వాత 1985 వరకూ ఆమె మళ్ళీ సృజనాత్మక రచనకు పూనుకోలేదు. 1998లో వచ్చిన విసుర్రాయి కథాసంకలనం ఆమెకు చాలా పేరు తెచ్చింది. అప్పటినుంచీ చాలా కథాసంకలనాలు, నవలలు ప్రచురించారు. తెలంగాణా తొలితరం కథల సంకలనాలకి, వట్టికోట ఆళ్వారుస్వామి కథలకు (జైలు లోఫల) సంపాదకత్వం వహించారు. సుజాత గారు ఒక చారిత్రక సంధి సమయానికి ప్రత్యక్ష సాక్షి. మారుమూల గ్రామంలో ఫ్యూడల్ వ్యవస్థలో జీవితాన్ని ప్రారంభించి సమాజంలో వివిధ మార్పుల్ని దగ్గరనుండి చూశారు. అందుచేత ఈ ఆత్మకథ తప్పకుండా చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకంలో నాకు కొత్త విషయాలు, కొత్త పదాలు, కొత్త ఆచార వ్యవహారాలు చాలా తెలిశాయి.

ఈ ఆత్మకథలో ఆత్మస్తుతి బహు తక్కువ. పరనింద బొత్తిగా లేదు.. కానీ, దీంట్లో కూడా చాలా శాఖాచంక్రమణం ఉంది. నిజానికి ఆత్మకథ కన్నా, ఆలోచనలూ, అభిప్రాయాలూ, చారిత్రక విషయాలే ఎక్కువ. 19 పేజీల మొదటి ప్రకరణం ఆమె పుట్టుకతో మొదలైనా, దీన్లో ఆమె కుమారుడు మిలిటరీలో చేరి మరాఠీ అమ్మాయిని వివాహమాడడం, టీబీ మలేరియా రోగ నిర్ణయాలు, యోగ విద్య, అధర్వణవేదం, హారీ పాటర్, ఆక్యుపంక్చర్, దేవుడిపై విశ్వాసం, హేతువాదం, అగ్గిపెట్టెలూ, సబ్బుబిళ్ళలూ, చిన్నప్పటి ఆటలూ వగైరా విషయాలున్నాయి. మిగతా పుస్తకమంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఒకోసారి ఇవన్నీ అడ్డం రావటంతో ఆమె జీవిత కథాసూత్రాన్ని సాఫీగా పట్టుకోవడం కష్టమై, వెతుక్కుని ముళ్ళు వేసుకోవాల్సి వస్తుంది.
ఈ పుస్తకం సుజాతగారు తాను చూసిన, అనుభవించిన విషయాలు చెప్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చారిత్రక విషయాలు చెపుతున్నప్పుడు పర్వాలేదు, కానీ కొత్త విషయాలు బహు తక్కువ. ఆమె అభిప్రాయాలని మనతో పంచుకున్నప్పుడు మాత్రం – కొన్ని విశ్లేషణలు ఉపరితలం దాటకపోవడం, మరికొన్ని చోట్ల తర్కపు గెంతులు, అక్కడక్కడా కొన్ని అమాయకపు నమ్మకాలు,  అనవసర గ్రంథ విస్తరణ – వల్ల అప్పుడప్పుడూ ఇబ్బంది పెడుతుంది.

కొద్దిగా ఆశ్చర్యం కలిగించిన విషయం. తెలంగాణా గురించిన సాహిత్యంలో భూస్వాములను, దొరలను స్త్రీలను లైంగికంగా వేధించే వాళ్ళుగా, అక్రమసంబంధాలు పెట్టుకునే వాళ్ళుగా చూపడం ఉంది. సుజాతారెడ్డిగారి ఉద్దేశంలో ఇది వాస్తవికత మీద ఆధారపడినది కాదు. “దొరలు కుటుంబం కుటుంబగౌరవం, కుటుంబ తాహతుల గురించి ఆధారపడటమేగాని స్త్రీవాంఛలతో స్త్రీలవెంట పరిగెత్తేవాళ్ళు కాదు. అసలు వేశ్యలుండటం, వాళ్ళ నుంచుకోవటం, వాళ్ళ గానా బజానాలు అసలు వేరే ప్రాంతాల్లో ఉన్నట్లుగా తెలంగాణాలో లేనే లేవు…” తెలంగాణా జీవితాన్ని ప్రత్యక్షంగా చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు తెలంగాణా గురించి వ్రాసిన వ్రాతల్లోనే ఇట్లాంటి అక్రమసంబంధాలు చిత్రించబడ్డాయి అని సుజాతారెడ్డిగారి అభిప్రాయం. నేను ఇలాంటి విషయాల గురించి మొట్టమొదట చదివింది దాశరధి రంగాచార్యగారి చిల్లర దేవుళ్ళు పుస్తకంలో. ఆయన తెలంగాణా రచయితే కదా. ఆడబాపల్ని లైంగిక బానిసలుగా వాడుకొనే విధానం గురించి తెలంగాణా రచయితల రచనల్లో మనం చదవలేదా? ఈ విషయంలో ఉత్తర దక్షిణ తెలంగాణా జిల్లాల సంస్కృతులకు తేడా ఉందా? కమ్యూనిస్టు ఉద్యమం తర్వాత 1950కల్లా నల్గొండ జిల్లాలో కనుమరుగైన ఆడబాపల పద్ధతి, ఉత్తరతెలంగాణా జిల్లాలలో దొరల ఇళ్ళలో 1960లలో కూడా చూసినట్లు వేరే సందర్భంలో రచయిత్రి చెప్పారు.   ఏది ఏమైనా, రచయిత్రి తండ్రిగారి కుటుంబ జీవనం మనం సాహిత్యంలో చదువుకున్న దొరల జీవితాలకు, పద్ధతులకు చాలా దూరంలో ఉన్నట్లు ఈ ఆత్మకథను బట్టి అనిపిస్తుంది.

పుస్తకం అందంగా ముద్రించారు. అచ్చుతప్పులు బహు తక్కువ. భాష సరళంగా, చదువుకోవడానికి వీలుగా ఉంది. 1940-50లలో తెలంగాణా సాంఘిక జీవనం గురించి, 1960లలో జర్మనీ గురించీ తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.

ముసురు
అనుభవాలు – జ్ఙాపకాలు – ఆలోచనలు (ఆత్మకథ)
ముదిగంటి సుజాతారెడ్డి
2010
ప్రచురణ: రోహణం
2-2-1105/21
తిలక్ నగర్, హైదరాబాద్ -500 044
ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు
231 పేజీలు; రూ 250 (నా ప్రతిలో ఈ ధర కొట్టేసి రూ. 150 అని సిరాతో రాసి ఉంది).

 

You Might Also Like

6 Comments

  1. Balasubramanyam Perugu

    తెలంగాణ చరిత్ర మరుగున పడిపోతున్నది అనుకునే వారికిఒక సుబవార్త జైహింద్

  2. నేనే బలాన్ని – టి.ఎన్. సదాలక్ష్మి వ్యక్తిత్వచిత్రణ | పుస్తకం

    […] సుజాతారెడ్డిగారి ఆత్మకథ ముసురును ఇక్కడ పరిచయం చేస్తూ, తెలుగులో మహిళల […]

  3. పారదర్శి

    “1996లో జర్మనీలో ట్యుబింగెన్ విశ్వవిద్యాలయంలో జర్మన్‌భాషలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయటానికి గోపాల్రెడ్డికి స్కాలర్షిప్ వచ్చింది.1969లో జర్మనీ నుంచి తిరిగివచ్చాక కొన్నాళ్ళు మేక్స్‌మ్యుల్లర్ భవనంలో లైబ్రేరియన్‌గా పని చేశారు.”-సంవత్సరాల విషయం లో ఏదో తికమక ఉన్నట్లుంది. సవరించగలరు. జర్మనీలో ఎంతకాలం ఉన్నారు?

    1. Jampala Chowdary

      పొరపాటును సవరించాను.
      1966లో గోపాల్‌రెడ్డిగారు ట్యుబింగెన్ వెళ్ళారు; ఆ తరువాత కొంతకాలానికిసుజాతగారు వెళ్ళినట్లున్నారు.

  4. Jampala Chowdary

    తెలుగు మహిళల ఆత్మకథలు తక్కువగా ఉన్నాయి అని నేను అనుకొన్న వారంలోనే రెండు కొత్త పుస్తకాల వివరాలు తెలిశాయి.

    స్వాతంత్ర్య యోధురాలు, రచయిత్రి పొణకా కనకమ్మ గారి ఆత్మకథ ‘కనకపుష్యరాగం’గురించి వ్యాసం
    http://kavishilalolitha.blogspot.com/2011/08/blog-post_26.html

    తొలి దళిత మహిళా శాసన సభ్యురాలు, మంత్రి శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మి బతుకు కథ: “నేనే బలాన్ని” గురించి పరిచయం:
    http://hyderabadbooktrust.blogspot.com/2011/08/blog-post.html

Leave a Reply