సురపురం,మెడోస్ టైలర్ ఆత్మకథ
రాసిన వారు: చంద్రలత
**************
ఒక్కోసారి ఊహిస్తే వింతగా తోస్తుంది. ఏడాది పొడవునా ఎండ. చెమట.వేడిమి.ఉడక.ఉక్కబోత. చిరచిర.గరగర. అలాంటి ఈ ట్రంక్ రోడ్డు మీద ఆ దేశంకాని దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఎర్రటి అంగీలు నల్లటి పంట్లాము తొడుక్కొని ..తోలు బూట్లలో పాదాలను బంధించి.. గుర్రాలపై ఎలా ఈ దండుబాటపై ఎలా ఊరేగే వారబ్బా..ఈ ఉడకకు ఊపిరే ఆడదే.. ఉక్కిరిబిక్కిరి అవరా మరి?” ..అని. మరి రాజ్యం వీరభోజ్యం అన్నారు కదా.. వీరుల వీరత్వం గురించి పక్కనబెట్టండి.హంగు ఆర్భాటం గురించి. “క్రొత్తగా సైనిక ఉద్యోగంలో చేరాలంటే హంగులు అవసరం. తగు దుస్తులు గుడారాలు ఇంకా ఎంతో సామాగ్రి కావాలి .ఇవే కాక అరబ్ గుర్రం కూడా..” అదండీ విషయం.
అప్పటికతను పదహారేళ్ళ పిల్లవాడు. లివర్ పూల్లో పుట్టాడు.తండ్రి వ్యాపారం అప్పుల్లో గల్లంతయ్యి, అప్పటికే బడి మానేసి, పనిలో పడ్డాడు. వచ్చే పోయే నౌకల్లో సరుకుల ఎగుమతి దిగుమతి వివరాలు రాయడం ఆ పిల్లవాడి మొదటి పని. ఆ తరువాత ప్రత్తి నాణ్యతను చెప్పడంలో మెళుకువ నేర్చాడు. ఆరోగ్యం దెబ్బతినింది. మరో పని వెతుకుతూ ,అతని తండ్రి బొంబాయి వెళ్ళే ఓడెక్కించాడు. సుమారు నాలుగున్నర నెలలఓడ ప్రయాణం తరువాత, నేలను తాకగానే, అతనికి ఉద్యోగం లేదని తెలిసింది. మరో ప్రత్యామ్నాయంగా .. సైన్యంలో చేరాడు. అదీ, మొదటి ఉద్యోగం ..హైదరాబాదు సంస్థానం లో. అక్కడ మొదలైన మెడోస్ టైలర్ ఉద్యోగ ప్రస్థానం…ముప్పైఆరేళ్ళ పాటు కొనసాగింది. అది సరిగ్గా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందు కాలం. 1824. అప్పటి చిన్నిచిన్ని రాజ్యాలు , అంతర్గత తగాదాలు,అప్పులు ఆర్భాటాలు, తాగుళ్ళుతందనాలు, వ్యభిచారాలు భ్రష్టాచారాలు..,కుట్రలూకుతంత్రాలు, వారసత్వాల పోరు ,అరాచకాలు అత్యాచారాలు , కప్పాలు ఎగవేతలు,ఇంటిదొంగలు దారిదోపిళ్ళు.. ఒక్కటేమిటి…అవీ ఇవీ అన్నీ ..ఒక్కక్కొటిగా …మెల్లిమెల్లిగా ..పిట్టపోరు పిట్టపోరునూ తీరుస్తూ …ఆ తెల్లపిల్లి మన ఇంట జొరబడడానికి అనుకూలమైన వైనాలన్నీ ….విశదంగా విడమరిచి ..చెపుతుంది.. మెడోస్ టైలర్ ..ఆత్మకథ.
అటు అల్లకల్లోలంలో ఉన్న ప్రజానీకపు ఆదరాన్ని…ఇటు అదుపుతప్పిన నిజాం రాచ వ్యవహారాల శైలిని చక్కదిద్దగలమన్న నమ్మకాన్ని …ఏక కాలంలో ఆంగ్లేయులు చూరగొనడానికి మెండోస్ దక్షత ఎలా తోడ్పడిందీ తెలుస్తుంది. “’ఇంగ్లీషు వాళ్ళు లంచాలు పుచ్చుకోరు. హైదరాబాదులో మంత్రి తీసుకొంటాడులే.” స్వయానా ఆ నిజాం చెల్లెలు “గుడారం పై ఇంగ్లీషు జెండా చూసి “తనకు రక్షణ దొరుకుతుందని శరణు కోరుతుంది.ఆమెను సురక్షితంగా పుట్టిల్లు హైదరాబదు కు చేర్పించి…ఆమె నమ్మకాన్ని నిలుపాడు. అంతే కాదు, అతని పై అధికారులు ,ఈ సమాచారాన్ని తమకు నివేదించ లేదన్నప్పుడు ,”ఆమె రహస్యంగా ఉంచమన్నది . ఉంచవలసి వచ్చింది” అన్నాడు సవినయంగా. దండుబాటపై ,అదేనండి, మన ట్రంకు రోడ్డు పై,ఆ నాటి ప్రయాణాలెలా సాగాయో ..చూడండి. “ఆ ఊరు ఒక లోయలో ఉంది.40మైళ్ళు అన్నారే కానీ తీరా వందమైళ్లకు పైగా వచ్చినట్లనిపించింది. మేము ఒక మర్రిచెట్టు కింద విశ్రాంతి తీసుకొంటూ నీడన వేడి ఎంతుందో చూడగా 114 డిగ్రీలు ఉన్నది, మా సైనికుడు ఒక్కొక్కరూ రెండు రోజుల ఆహారాన్ని మోసుకొస్తున్నాడు, 40 మణుగుల ప్రేలుడు సామాగ్రిని కూడా తీసుకు వస్తున్నారు, వారు ఎట్లా బాధ పడ్డారో చెప్పలేను .ఆ వేడి భరించలేక పంట్లాంలు విప్పేశారు.అన్నిటినీ కలిపికట్టి యెడ్లపైన వేసారు. హిందుమతకీర్తనలు పాడుకొంటూ విసుగులు చికాకులు వాటిల్లకుండా చేస్తున్నారు.”
-ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టడమే కానీ,ఎప్పుడు పూర్తి చేసానో స్పురణకు లేదు.
మా నడిగడ్డకు ఆవలి ఒడ్డున ఉన్న సురపురం (షోరాపూర్) కు పైతట్టునున్న రాయచూరుకు మధ్యన … జరిగిన చరిత్రకు ఒక సజీవ చిత్రం అవ్వడం వలన కావచ్చు. వితంతవు ,వ్యభిచారి,తిరుగుబాటుదారు,కుట్రదారు గా పరిచయం చేయబడిన రాణీ ఈశ్వరమ్మ….స్వాభిమాని..రాజమాత ..విదేశీదురాక్రమణ కు అడ్డుకటింట వేయ బూనిన ఒక నిస్సహాయ, గిరిజన మహిళగా ఆ మహారాణిని రాజమాతను ..మనం అర్ధం చేసుకోవచ్చా? పసితనంల్లోనే చేరదీసి, ఇంగ్లీషు పద్దతులతో పెంచుతూ వచ్చినా ..రాజయ్యి ..అటు కంపనీకి ఇటు వారికి ఆశ్రయమిచ్చిన నిజాంకు వ్యతిరేకిగా నిలబడ్డ వెంకటప్ప నాయక్ ను ..మనం కేవలం “తప్పుదోవ” పట్టినట్లుగా భావించగలమా? నిజాం అతనిని బందీని చేయడం, బ్రిటిష్ వారు క్షమాబిక్ష పెట్టేట్టుగా చేయడం ..చివరకు ఆ రాజకుమారుడు …పూర్తి బందోబస్తు మధ్యన ఉండగా అకారణంగా మరణించడం కేవలం జాతకం నిజమవ్వడం ” అన్న మూఢ నమ్మకం నిలబడడం కోసమేనా?ఆ దరిమిలా ,ధాన్యమూ, ప్రత్తి పంటతో పాటు అనేక సహజవనరులకు ఆలవాలమైన ఆ కృష్ణాతీరపు సురపురం రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసి పోవడం ..కేవలం వారసులు లేకుండా పోవడమేనా? అక్కడ నీలిమందు .,గంజాయి వనాల పంట పండడం కేవలం కాల మహిమేనా? ఇవన్నీ ముప్పిరిగొన్న ఆలోచనలు. ఇక, విజయనగరం ఆఖరి అనవాలుగా మిగిలిన ఆనెగొంది రాజా.. గురించి చదువుతున్నప్పుడు గుండె మెలిక పడదా? ఇలాంటి చారిత్రకాంశాలు ఎన్నెన్ని ఉన్నాయో ఇందులో.
మెండోస్ సతీమణి, మేరీ, తండ్రి పామర్ అనే ఆంగ్లేయ ఉన్నతాధికారి.తల్లి భారత రాజకుమారి. ఇక,విల్లీం బెంటిక్ నుంచి మెకాలే వరకు మెండొస్ కు పరిచయాలు ఉన్నాయి. బడి గడప దాటకపోయినా, జీవితం నేర్పిన పాఠాలతో ..పాటు బహుభాషాపాండిత్యం అటు అతని ఉద్యోగధర్మానికీ ఇటు అతనిలోని రచయితకూ ఒక ఉన్నత పార్శ్వాన్ని ఇచ్చింది. ఆనాటివారి అభిప్రాయాలను ఏ మాత్రం దాపరికం లేకుండా రాయడం బావుంది. థగ్గులు,బేడార్లు, అరబ్బులు ,”భారతీయులు జీవనం,వైవిధ్యాలు ,వీటి మధ్య ఇక ఇంగ్లీషు వాని జీవితం ..మనోజ్ఞమైన అనుభూతి ” ఈ విషయాలన్నిటినీ తన తండ్రికీ మిత్రులుకు లేఖలు రాయడంతో మొదలు పెట్టి టైంస్ పత్రికకు సుధీర్ఘకాలం “వ్రాయసగాడుగా” వ్యవహరించడానికి , భార్యాను ఇద్దరు బిడ్డలను పోగొట్టుకొన్న ..ఏకాకీతనము తోడయ్యింది. థగ్గుల ఒప్పుకోళ్ళు, సీత, తార,రాల్ఫ్ డార్నెల్.,..తదితర రచనలు చేసిన మెండోస్, ఇలా అంటారు,”భారతీయ జీవితాన్నీ కథలను ,గాథలను చక్కగా చిత్రీకరించవలసిన వాళ్ళు భారతీయ విద్యావంతులే!దేశీయమైన భాషలలో ప్రజలకు ఆప్యాయకరమైన కొత్త సాహిత్యం వెలువడాలి” చిలకమర్తి గారి “హేమలత ” నవలకు మెండొస్ ప్రేరణగా డా. గోపాలకృష్ణ గారు ముందుమాటలో,పేర్కొనడం గమనించాలి. తెలుగు నవల పై ఈ కొత్త నీటి ప్రభావం అధ్యయనం చేయదగ్గది..
చిత్రలేఖనము, బహుభాషాపాండిత్యము ..అతని కలానికి అందమైన రంగులద్దుతాయి.అందుచేతనేనేమో.. ఎక్కడా అతిశయోక్తులు పునరుక్తులు లేకుండా ,హాయిగా సాగుతుంది వచనం. మెండొస్ చెప్పిన ముఖ్యమైన విషయాలు ఎన్నో..”భాష నేర్షుకొనేప్పుడు నుడికారాన్ని చక్కగా అభ్యసించాలి.” “భాగ్యవంతులు పన్నులు సరిగ్గా చెల్లించరు.పేదలే నయం”,”కులీనులలో నెలకొన్న అవినీతి సాధారణ ప్రజలలో కానరాదు”‘”రక్షణ కోసం ప్రజల మీద ఆధార పడడం మంచిది. అన్నిటికన్నా ముఖ్యమైన సందేశం, భారతీయులను ప్రేమించి పాలించండి” నిజమే ,అతనా పని సమర్థవంతంగా చేశాడు. సురపురం సంస్థానం ప్రేమగానే బ్రిటిష్ సామ్రాజ్యసంద్రంలో విలీనం అయిపోయింది. సురపురం ప్రాంతాల్లో ఆడవాళ్ళు “ఉదయం ధాన్యం దంచేపుడు సాయంకాలం దీపం వెలిగించేప్పుడు” నిత్యం స్మరించే నామం మెండొస్ అని తెలిసినప్పుడు .. మహదబాబాకి జై ..అని దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెట్టినప్పుడు.. మనమూ ఆ అనుభూతిలో పడతాం. ఆపై, ఎందుకిలా అన్న ఆలోచన … “ఆ ఆంగ్లేయులను దేవదూతలుగా స్వాగతించిన” పరిస్థితులు ఏమిటో మనకు వలిచి పెట్టింది ఈ పుస్తకం.
మంచో చెడో ! మన ఆత్మపరిశీలనకు ఈ పుస్తకం నిఖార్సైన గీటురాయి. దక్కను పీఠభూమిలో థగ్గులకే పగ్గ వేసిన మన మెండొస్ ..చివరి పడవ ఎక్కబోయే ముందు సమస్త సామాగ్రి దొంగిలించబడడం .. కొసమెరుపు. మెండొస్ తో పాటుగా మనకూ మిగిలినవి, అతను మూటగట్టుకు వెళ్ళిన మాటలే. అనువాదం ఎంత సహజంగా ఉందంటే, మెండొస్ తెలుగులోనే రాసారేమో అనిపించేంతగా.అందుకు జి.క్రిష్ణ గారికి ధన్యవాదాలు. ఇక, ఆ నాటి చరిత్రను ..మా నడిగడ్డ ఇరుగుపొరుగు ను అవగతం చేసుకొనేందుకు నాకు ..ఓ చారిత్రక సంధిలో భారతీయ జీవితాన్ని అర్ధం చేసుకొనేందుకు మనందరికీ.. ఈ పుస్తకం ఒక ముఖ్యమైనది కాగలదు. రాజా చంద్ర ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు.
**************
సురపురం,మెడోస్ టైలర్ ఆత్మకథ,
అనువాదం “జి.కృష్ణ.
ప్రచురణ: రాజాచంద్ర ఫౌండేషన్,482,శాంతినగర్,కె.టి.రోడ్,తిరుపతి -517507 (0877)2232888
వెల: 100/-
ఏ.వీ.కే.ఎఫ్ కొనుగోలు లంకె ఇక్కడ.
varaprasaad.k
చంద్రలత గార్కి అభినందనలు. నిజానికి టైటిల్ వెరైటీ గా ఉందని సమీక్ష చదవడం మొదలు పెట్టాను,చివరి వరకు ఆగితే ఒట్టు.మీ రచనా శైలి అద్భుతహా,తప్పనిసరిగా ఇలాంటి మంచి పుస్తకాల్ని పరిచయం చెయ్యండి.
సౌమ్య
Interesting. Thanks for sharing.
చంద్ర లత
ధన్యవాదాలండి.
అనిపించింది కదా ….
బహుశా ఆమె తన ఏడేళ్ళ బిడ్డను పరాధీనం కాకుండా చేసి ఉంటే ,
మరో ఝాన్సి కీ రాణి అయి ఉండేదేమో..
బహుశా అతను పట్టుబడకుండా ఉంటే ,
మరో తాంతియా తోపే అయి ఉండే వాడేమో..
అతనిలోకి దూసుకుపోయిన ఆ తూటా ,
యాదృచ్చికం కాదేమో….
జాతకాలు, మూఢనమ్మకాలు,అంధవిశ్వాసాలు…
ఆనాటి అరాచకప్రభుతలో ..
పరప్రభుస్వామ్యాలకు రాచబాట వేసాయేమో….’అని.
మీరే స్వయం గా చదివి చూడ మనవి.
పారదర్శి
“ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టడమే కానీ,ఎప్పుడు పూర్తి చేసానో స్పురణకు లేదు.” పుస్తకం లోని విషయ ప్రభావమో, సమీక్షకురాలి రచనా ప్రావీణ్యమో కాని సమీక్ష కూడా ఉత్కంఠగా ఏక బిగిన చదివించి, అసలు పుస్తకం చదవటానికి ప్రేరణనిచ్చింది. ప్రచురణ కర్తలు రాజాచంద్ర ఫౌండేషన్, అనువాదకులు కృష్ణకు అభినందనలు.