సాయంకాలమైంది – గొల్లపూడి మారుతీరావు
గొల్లపూడి మారుతీరావు గారంటే – ఒక నటుడిగా, చదువరిగా, సినీరచయితగా పరిచయం మొన్నమొన్నటిదాకా. ఆ మధ్య వారి “చీకట్లో చీలికలు” చదివాక ఆయనలోని నవలాకారుడు పరిచయమయ్యాడు. ఆ నవల శైలి పరంగా నచ్చినా కూడా, ఏమిటో, చిరకాలం నిలిచిపోయేంత పెద్ద గుర్తు కాలేకపోయింది. ఇన్నాళ్ళకి మళ్ళీ “సాయంకాలమైంది” నవల చదివాను. ఈయన పుట్టుకతోనే నవలాకారుడేమో అనిపించింది, ఈ కథనానికి 🙂 రెండు నవల్లూ కథాపరంగా అద్భుతంగా అనిపించనప్పటికీ, ఆపకుండా చదివించాయి. ఇప్పుడిక ఈ పోలికలు ఆపి, ఈనవల దగ్గరికే వచ్చేస్తాను. (ఈ నవల గురించి బ్లాగులోకంలో రెండు లంకెలు కనిపించాయి. తృష్ణ గారిది, మురళి గారిది)
నవల మొదలుపెట్టీ పెట్టగానే, చక్కటి తెలుగు భాష మంచి ఆనందాన్ని కలిగించింది. మొదటి కొన్ని పేజీల్లో చాలా పదాలకి తడుముకున్నాను. దానికి తోడు వైష్ణవ సంప్రదాయాల తాలూకా పదజాలం అసలేమీ అర్థం కాలేదు (వీటికి కాస్త ఫుట్నోట్ల రూపేణా వివరణలు ఇచ్చి ఉంటే బాగుండేది!). అయినప్పటికీ, చదవడం బాగా ఎంజాయ్ చేశాను. ఈ రకమైన “పఠనానందం” ఈ పుస్తకం చివరిపేజీ దాకా అలాగే కొనసాగింది.
కథ విషయం మీరు “నెమలికన్ను” మురళి గారి బ్లాగులో వివరంగా చూడవచ్చు. ఇది ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చేదట. పుస్తకం ముందుమాటలో ప్రస్తావించినట్లు నాకూ “వేయిపడగలు” (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన శ్రీవల్లీరాధిక గారి సమీక్ష ఇక్కడ) గురొచ్చింది ఈ కథాంశం వల్ల. దానితో పాటు “అమృతం గమయ” కూడా గుర్తొచ్చింది. అయితే, శైలి పరంగా ఈ మూడు పరస్పర భిన్నమైనవి. మూడింటిలో వాడిన భాష, మూడూ జరిగిన కాలాలూ కూడా వేరు. ఇక సీరియల్గా వచ్చినందుకు అనుకుంటాను, ప్రతి అధ్యాయానికీ ముగింపులో ఒక సస్పెంసు ఎలిమెంట్ ఉంది. కథనం స్క్రీన్ ప్లే లా కళ్ళకి కట్టినట్లు ఉంది. భాషా, సంభాషణలూ అలా కట్టిపడేశాయి. వేరొకరి ఇంట్లో చదివాను కనుక, ఉన్నపళాన ఇపుడు కోట్ చేయలేను కానీ, నిద్రముంచుకొస్తున్నా కూడా, చివరికంటా చదివి, తేదీ మారాకగానీ పడుకోలేదంటే, ఎంత ఆకట్టుకుందో అర్థం చేసుకోండి.
పాత్రల చిత్రీకరణ గురించి కూడా చెప్పాలిక్కడ. కొన్ని బలమైన పాత్రలు సృష్టించారు. నిజజీవితంలో ఇలాంటి పాత్రలు ఉంటాయా? అన్న మీమాంసను పక్కన పెడితే, నవనీతం, సంజీవి,కనబడ్డది కాసేపే అయినా మనసులో నిలిచిపోయే రేచకుడు, కొన్ని సంఘటనల్లో కూర్మయ్య, వెంకటాచలం – అద్భుతంగా చిత్రీకరించారు గొల్లపూడి గారు. దాదాపు ప్రతి ప్రాత్రా ఏదో ఒక సందర్భంలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేస్తుంది. అయితే, అన్నీ నవలా పాత్రలే అనిపించాయి. ఇందాక ప్రస్తావించిన మీమాంసలో పడితే, “ఉండవు” అనిపించిన సందర్భాలే ఎక్కువ నాకు. అయాన్ రాండ్ రోర్క్ పాత్రలాగా అన్నమాట! ఇంతకీ, నవలలో కథ నడిచిన కాలం ఎప్పటిదో అని ఒక నిర్థారణకు రాలేకపోతున్నాను.
ఇక, నచ్చని అంశాలు కొన్ని ప్రస్తావించక తప్పదు:
౧) చిన్నతిరుమలాచార్యుడి పాత్ర చిత్రీకరణలో కొంత వైరుధ్యం ఉన్నట్లు తోచింది. పుస్తకం మొదట్లో తండ్రి అంత్యక్రియలకోసం విదేశాల నుంచి వచ్చిన అతని గురించి చెబుతూ, అతనికి సంప్రదాయాల గురించి అవగాహనే లేదు అన్నట్లు భావన కలుగజేశారు. కానీ, చదివేకొద్దీ చూస్తే, అతనికి చిన్నప్పట్నుంచీ సంప్రదాయాలు వగైరాల గురించి చాలా తెలుసని తెలుస్తుంది. ఒకవేళ నిజంగా కాలగమనంలో, దశాబ్దాల విదేశీ జీవితంలో నిజంగానే అతను అన్నీ మర్చిపోయాడు అనుకున్నా, ఆ విషయాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. చిన్నతిరుమల విదేశీయానం తరువాత ఆ పాత్ర కథాపరంగానే కాదు, రచయిత చిత్రీకరణ పరంగా కూడా బాగా బలహీనపడిందని నా అభిప్రాయం.
౨)అమెరికాలో తెలుగువారి జీవితాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. కానీ, ఈ పుస్తకంలో చిత్రీకరించినంత దారుణంగా ఉండవేమో, ఎవరికో అలా ఉన్నంత మాత్రాన ఈ పుస్తకంలో పలు చోట్ల చేసినట్లు జనరలైజ్ చేసి రాయనక్కర్లేదేమో అనిపించింది.
చివరగా రెండు మాటలు:
౧) కథ, సంభాషణలు, పాత్రలు: అన్నీ ఒకట్రెండ్రోజులన్నా కనీసం వెంటాడతాయి
౨) పుస్తకం ఆపకుండా చదివిస్తుంది
-అని నా అభిప్రాయం. ఈ రెండు కారణాలూ చాలవు పుస్తకం చదవడానికి?
సూర్యుడు
@EveningHour:
Thanks for your clarification. I will have to wait 🙁
Regds,
~సూర్యుడు
EveningHour
@suryudu, @purnima, Unfortunately, the book is currently out of print.
సూర్యుడు
థ్యాంక్సండి, పూర్ణిమ గారు. ఆ వెబ్సైటులో గొల్లపూడిగారు పేరుమీద వెతికితే ఒక్క పుస్తకమూ కనపడలేదు, ఎలా ఆర్డరు చెయ్యాలి?
నమస్కారములతో,
సూర్యుడు
Purnima
@sooryudu: Contact eveninghour.com folks, they would ship it to Bangalore.
సూర్యుడు
బాగుంది రివ్యూ. మూడు రివ్యూలూ చదివాను, పుస్తకం చదవాలన్న కోరిక ఎక్కువౌతోందే తప్ప కొనుక్కుని చదవడం కుదరడంలేదు :(.
ఈ పుస్తకం బెంగుళూరిలో ఎక్కడదొరకొచ్చో చెప్పగలరా ఏవరైనా?
నమస్కారలతో,
సూర్యుడు