శతాబ్ది సూరీడు

రాసిన వారు: సుజాత
***********************

మాలతీ చందూర్ గారి నవలలు నాకు నచ్చుతాయి. పాత్రలన్నీ సాదా సీదా గా ఉంటాయి. ఆవేశపడవు. నేల విడిచి సాము చేయవు. కథంతా స్త్రీ చుట్టూ తిరుగుతున్నా ఆ పాత్రలు హంగామా చేస్తూ చిరాకు పుట్టించవు. ఆత్మాభిమానంతో, ఆత్మ విశ్వాసంతో ధీరత్వంతో ప్రవర్తిస్తాయి. పాఠకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకుంటాయి. అంతటి ఔన్నత్యంతో ఉంటాయి మాలతీ చందూర్ గారి నవలల్లో చాలావరకు స్త్రీ పాత్రలు!

దాదాపుగా అన్ని నవలలూ ఆలోచనలు రేకెత్తించే రచనలే! ఆలోచించు,మనసులోని మనసు,భూమిపుత్రి,హృదయ నేత్రి,ఏమిటీ జీవితాలు?,శిశిరవసంతం,శతాబ్ది సూరీడు…ఇలా ప్రతి ఒక్కటీ ఏదో ఒక విషయాన్నో, సమస్యనో, మనిషి మనసులోని సంఘర్షణనో గ్లోరిఫై చేస్తూ రాసినవే!

అందులో శతాబ్ది సూరీడు నవలంటే నాకు ప్రత్యేకాభిమానం! ఎలాంటి సంతోషానికీ నోచుకోని ఒక స్త్రీ నూరేళ్ళ నిండు జీవితం ఇది! బాల్యం నుంచీ తొంభయ్యారేళ్ళు దాటిన దశ వరకూ ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు,సంఘర్షణే ఈ నవల. ఇది వనిత మాసపత్రికలో సీరియల్ గా వస్తుండగా, ఆ పత్రిక ఆగిపోయినట్లు గుర్తు. ఈ పుస్తకాన్ని దాదాపుగా పదిమందికి బహుమతిగా ఇచ్చాను నేను.

శతాబ్దం మొదట్లో నలుగురక్కలు, ముగ్గురన్నల తర్వాత పుట్టిన కడగొట్టు పిల్ల సూరీడు. చిన్నది కావడంతో అతి గారాబం! ఏడేళ్ళకు పెళ్ళి, ఎనిమిదో యేట వైధవ్యం!ఈ లోపే తండ్రి మరణం!అక్కడితో సూరీడు ఎవరికీ పనికిరానిదైపోతుంది.సైను పంచెలు కట్టుకుని పెరట్లో అంట్లు తోముతూ, పొద్దున్నే సుమంగళుల కంట పడకుండా బతకడానికి అలవాటు పడుతుంది. తన ఈడు పిల్లలు పెద్ద మనిషి అయితే వేడుకలెందుకు చేస్తారో, తను పెద్దమనిషి అయితే “నీ బతుక్కి ఇదొక్కటే తక్కువ” అంటూ తల్లి ఏడుస్తూ ఎందుకు చావబాదిందో సూరీడుకు అర్థం కాదు.

తమ ఇంట్లోనే ఉంటుందని తీసుకెళ్ళిన అరవై ఐదేళ్ల మావగారు అర్థరాత్రి పదిహేనేళ్ళ సూరీడు కాలు గీకి, మరో రోజు నోరు నొక్కి మీద పడి పశువులా ప్రవర్తించబోతే సూరీడుకి శృంగారం అంటే అసహ్యం పుడుతుంది. తిరిగి అత్తవారింటికి వెళ్ళనని వచ్చిన సూరీడుకి అత్తవారు రెండు వేల రూపాయల మనోవర్తి పడేసి చేతులు దులుపుకుంటారు.

ఆ తర్వాత సూరీడుని అక్కాచెల్లెళ్ళు, అన్నలు ఎడాపెడా చాకిరీకి వాడేసుకుంటారు. పురుళ్ళకీ పుణ్యాలకీ గాడిద చాకిరీ చేయించుకోని “శుభకార్యం కదాని తెల్లచీర కొన్లేదు. ఈ పాత చీర ఉంచుకో”అంటారు.

పట్టలేనంత ఏడుపొస్తుంది సూరీడుకు ప్రతి సారీ!ఎవరూ కొంచెం కూడా “కన్ సర్న్” చూపించరు.

సూరీడు పెద్దక్క కూతురికి పురొడొచ్చే రోజులు కాబట్టి సహాయంగా రావాలని సూరీడుకు కబురొస్తుంది. పురిట్లో తల్లి చచ్చిపోయి పుట్టిన ఆడపిల్ల మిగిలిపోతుంది. ఎవరూ ఆ బిడ్డను దగ్గరికి తీయకపోతే సూరీడు పెంచుకుంటానని తెచ్చుకుంటుంది. అప్పటినుంచీ సూరీడుకు స్వార్థం ఏర్పడుతుంది. “నా బిడ్డ” అనే గర్వం!

మనోవర్తి డబ్బుల్తో సూరీడు పొలం, ఇల్లు కొంటాడు చిన్నన్న!

అక్కడినుంచీ సూరీడుకు ఆ పాప కమలే జీవితం! కమల జీవితం ఏ మలుపులు తిరిగిందీ, చివరికి సూరీడు “పురుషుడి కన్నెరుగని కన్య” గానే ఎలా జీవించిందీ…ఇదంతా ఆ తర్వాత జరిగే కథ!

ఇరవయ్యో శతాబ్దం మొదట్లో పుట్టి చివరి వరకూ జీవించిన ఒక స్త్రీ జీవితమంతా ఏ అచ్చటా ముచ్చటా,సంతోషమూ,సంబరం,సుఖం శాంతి లేకుండా గడపాల్సివస్తే?బతుకంతా చాకిరీ అయితే?

పాత్ర మనసులో చేరి అక్కడ జరిగేదంతా చూసినట్టుగా రాయడం మాలతీ చందూర్ గారికి అలవాటే! ఒక చిన్న ఉదాహరణ: తమిళ రచయిత్రి శివశంకరి రాసిన ” మలయన్ మరుపక్కం” అనే తమిళ నవలను తెలుగులోకి అనువదించారు.అందులో ఎంతో ప్రేమించి పెళ్ళాడిన భర్త యాక్సిడెంట్ లో మరణిస్తే భార్య అనుభవించే దుఃఖాన్ని వర్ణించిన తీరు పాఠకులను విస్మయపరుస్తుంది.(ఈ సీరియల్ పుస్తకంగా బయటికి రాలేదు)

మనసు అనుభవించే సంఘర్షణను అద్భుతంగా చిత్రీకరిస్తారు రచయిత్రి.అయితే ఇందులో సూరీడుకు అటువంటి సంఘర్షణ పెద్దగా ఏమీ ఉండదు. ప్రేమ,శృంగార భావనలకు సూరీడు మనసులో అసలు స్థానమే లేదు. మొదట్లో తననెవరూ పట్టించుకోవడం లేదని బాధపడినా,కమల తన చేతుల్లో పడ్డాక ఆ పిల్ల కోసం అన్నీ సమకూర్చుకోడం, తన కోసం పాటు పడటం తప్ప ఇంకేమీ తెలీదు సూరీడుకు! కమల సంతోషమే తన సంతోషం! అయితే కమల జీవితమంతా ఒడిదుడుకులే! అందుకే ఇందులో కమల పాత్రను, జీవితాన్ని కమల పక్కనే ఉండి గమనించిన ఫీలింగ్ పాఠకుడికి కల్గుతుంది .

స్త్రీలు మగతోడు లేకుండా బతకలేని రోజుల్లో అన్నీ తానై కూతుర్ని ప్రయోజకురాల్ని చేసిన ఒక ధీర వనిత కథ ఇది.

చివరి రోజుల్లో తొంభయ్యేళ్ళు పైబడ్డ వయసులో కమల కూతురి ఇంట్లో ఉండాల్సినపుడు సూరమ్మ చిత్త చాంచల్యంతో ప్రవర్తించిన తీరు, తన ఇంటిమీద మమకారంతో చెప్పకుండా ఆ వయసులో పారిపోయి తన వూరు చేరి ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోవడం,నాన్ స్టాప్ గా మాట్లాడ్డం,ప్రతి దానికీ గొడవ పెట్టుకోడం ఇవన్నీ చదువుతుంటే తొంభై దాటిన బామ్మలూ తాతయ్యలనూ చూసిన వాళ్ళకి “అవున్నిజవే, ఇవన్నీ నేను చూశా”అనిపిస్తుంది. ఇవన్నీ ఎంతబాగా పరిశీలించి రాశారా రచయిత్రి అనిపిస్తుంది.

చివరికి సూరమ్మ కు ఏ తొంభయ్యేళ్ళ నాడో మనోవర్తికింద లభించ డబ్బే పెట్టుబడిగా ఇంతింతై వటుడింతై పెరిగి ఆ డబ్బుతో కమల మనవరాలు అమెరికా వెళ్ళడంతో కథ ముగుస్తుంది.

పుస్తకం మూశాక, ఒక స్త్రీ సంపూర్ణ వ్యధాభరిత జీవితాన్ని దగ్గరుండి పరిశీలించిన అనుభూతి కల్గుతుంది. ఒకప్పుడు ఇలాంటి ఎన్ని చరిత్రల్ని కాలం తన గర్భంలో కలిపేసుకుందో, ఎంతమంది స్త్రీలు ఏ సుఖానికీ సంతోషానికీ,ఆదరణకూ,ప్రేమకూ నోచుకోకపోగా, “అభాగ్యవతులు”గా రోజంతా ఎవరి కంటా బడకుండా ఎంత దయనీయంగా బతికారో,ఒంట్లో సత్తువనంతా ఎంతమందికి ధారపోశారో,తమదైన కుటుంబమూ పిల్లలూ లేక మోళ్ళులా జీవితాల్ని ముగించారో(ఇంకా సూరమ్మ కొద్దిగా నయం) అన్న ఆలోచనలు రేగి కళ్ళు మసకబారతాయి.సూరమ్మ మాటిమాటికీ గుర్తొస్తూ ఒక పట్టాన వదిలిపెట్టదు.

మాలతీ చందూర్ గారి నవలల్లో తప్పక చదవాల్సిన నవల ఇది.

క్వాలిటీ పబ్లిషర్స్ ప్రచురణ
అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది.

*********************************
ఈ పుస్తకాన్ని ఆన్లైన్ లో ఏవీకేఎఫ్ వారి సైటు ద్వారా ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

మాలతి చందుర్ గారి ఇతర రచనలు ఏవీకేఎఫ్ సైటులో ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

You Might Also Like

4 Comments

  1. raani

    మాలతీ చందూర్ గారి ప్రత్యేకతే అది. ఆవిడ దేని గురించి రాసినా దాని గురించిన పూర్వాపరాల గురించి పూర్తి అవగాహన ఏర్పడితే తప్ప రాయడం మొదలు పెట్టరు. అందుకే ఆవిడ నవలలు కూడా ఆవిడ జవాబుల్లాగే ఆలోచనామృతాలై వుంటాయి. అలాంటి రచయిత్రి వుండటం తెలుగువారికి గర్వకారణం.

  2. వేణు

    మాలతీచందూర్ గారి పాత, కొత్తకెరటాలు చాలావరకూ చదివాను. కానీ ఆమె తెలుగు నవలలు ఇంతవరకూ చదవనేలేదు. మీరు రాసిన ఈ పరిచయం చదివాక, ఈ ‘శతాబ్ది సూరీడు’ చదవాలనిపిస్తోంది.

  3. narasimharao mallina

    మాలతీ చందూర్ గారంటే నా కెంతో గౌరవమూ మరియు ఇష్టమూ కూడా ఎందుకంటే ఆవిడ రచనలద్వారానే నాకు ఆంగ్లసాహిత్య పరిచయం కలిగింది. నేను మొట్టమొదటగా చదివిన ఆంగ్ల నవల గాన్ విత్ ది విండ్ ఆవిడ పుస్తక పరిచయం చదివిన తర్వాతనే నేను కొని చదివాను. అంతెందుకు? నా పుస్తకాల బీరువాలోని చాలా చాలా పుస్తకాలు నేను ఆమె పుస్తక పరిచయాలు చదివి కొన్నవే. అవిడ వ్రాసిన నవలలు కూడా కొన్ని నేను చదివాను. చాలా బాగా వ్రాస్తారావిడ.ఈ పుస్తకాన్ని కూడా సంపాదించి చదవాలి.ఎప్పటికైనా వారిని ఓసారి ప్రత్యక్షంగా కలసి కృతజ్ఞతలు నేఱుగా తెలుపు కోవాలనుంది.సాధ్యపడుతుందో లేదో తెలియదు.

  4. సౌమ్య

    ఇప్పటిదాకా వీరి నవలలు ఏవీ చదవలేదు కానీ, మీరిలా చెబుతున్నారు కనుక, త్వరలో ప్రయత్నిస్తాను.
    మాలతి చందూర్ గారు ఎన్నో పుస్తకాలని పరిచయం చేశారు తెలుగు పాఠకులకి. మీరు పుస్తకం.నెట్ లో మాలతీ చందూర్ గారిని పరిచయం చేస్తున్నారు అనమాట! 😛

Leave a Reply