Lolita – Nabokov

ఈ వ్యాసంతో పుస్తకం.నెట్‍లో ప్రచురిత వ్యాసాల సంఖ్య ఏడొందలకు చేరుకుంది. పుస్తకం.నెట్ ‍ను ఆదరిస్తూ వ్యాసాలు పంపిన
వ్యాసకర్తలకూ, చదువురలకూ, పుస్తకాభిమానాలకు మా ధన్యవాదాలు. మీ ఆదారాభిమానాలు ఇలానే నిల్చుండాలని కోరుకుంటూ – పుస్తకం.నెట్

నబొకొవ్(రచనల)తో నాకు పరిచయం ఏర్పడి మూడేళ్ళకు పైగా అవుతున్నా, నేనింత వరకూ ఆయన రచనలేవీ పూర్తిగా చదవలేదు. ఆయన కథో, నవలో తెరవడం. చదవటం మొదలెట్టటం. ఆదిలోనే అపూర్వ పదవిన్యాసమో, పదసమూహమో తారసపడ్డం. ఆ పదాలకు రెక్కలు పుట్టుకొచ్చి, సీతాకోకచిలుకల్లా ఎగరటం. వాటితో పాటు నా ధ్యాస కూడా! మళ్ళీ కొన్నాళ్ళకు పుస్తకం తెరవడం, కథ పునరావృతం. అసలు సరిగ్గా రాయబడని రచనలు చదవటం ఎంత కష్టమో, ప్రతి వాక్యంలోనూ ecstasyని పలికించి, చదువుతుంటే ఒళ్ళు పులకరించేలా చేయడంలో దిట్టలైన వారి రచనలు చదవడానికీ కష్టపడాలి అని తెల్సొచ్చింది, నబొకొవ్ రచనల వల్లే!

ఆయన కథలైతే అడపాదడపా చదివాను గాని, లోలిట అనే పుస్తకం చదవడానికి చాలా జంకాను. కథ స్థూలంగా చెప్పాలంటే, ఎన్ని శాపనార్థాలు పెట్టినా తక్కువే అనిపించుకునే ఒకడు, పన్నెండేళ్ళ తన సవతి-కూతురినే మోహించి, కామించి, మంచిజేసుకొని, మాయచేసి, అనుభవించి, ఆమె బతుకును చింపిన విస్తరి చేసిన కథ; లొలిత అని గూగుల్ చేసినా, పుస్తకం అట్ట వెనుకున్న కథా సారాంశం చదివినా ఇంతే ఉంటుంది. ఇది బాగా ప్రాచుర్యం పొందిన రచన కావటం చేత, అసలు రచనలో ఉన్న సంగతికన్నా, చుట్టూ జనాల ప్రతిస్పందనలు నన్ను గందరగోళానికి గురిచేసాయి. 1955లో ముద్రితమైన ఈ రచన, తొలినాళ్ళల్లో నిషేదాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత, అర్థ శతాబ్ధం దాటుతున్నా ఇంకా నోళ్ళల్లో నానుతోంది. ఇలాంటి కథాంశాలున్న మరో కొన్ని రచనలు చదివిన అనుభవంతో, ఇది కూడా కేవలం సభ్యసమాజం ఆమోదించని విషయాలను రహస్యంగా చదువుకొని తృప్తి పడే రచనేమోనని అనుమానం కలిగింది. మనిషిలోని అమానుషత్వాన్నీ,
అనైతికాన్నీ వెలుగులోకి తీసుకురావటం కోసం చెప్పకూడనవి విపులంగా వివరిస్తే సరే గాని, ఇలాంటి అంశాలను ఎన్నుకొన్న కొందరు రచయితలు, రాస్తున్నప్పుడు తమలోని, చదువుతున్నప్పుడు పాఠకుల్లోని చీకటి కోరికలను రెచ్చగొట్టడానికే రాసినట్టుంటారు. అలాంటి రచనలన్నా, రచయితలన్నా నాకు మహా చిరాకు!

మొన్నీ మధ్యే, “Reading like a writer” అనే పుస్తకం చదివాను. (ఈ పుస్తకం గురించి త్వరలో రాయాలని అనుకుంటున్నాను.) అది చదువుతుండగానే నబొకొవ్ వచనం మీదకు మనసు మళ్ళింది. ఈ సారి ఏదేమైనా, పుస్తకం పూర్తి చేసే దాక వదిలేది లేదని ఒట్టుపెట్టుకున్నాను. వచనం ఎంత కవ్విస్తున్నా, కథనం మీంచి  దృష్టి మరల్చకూడదని నియమం. ప్రయత్నం ఫలించింది.

పైన చెప్పినట్టు, కథ సారాంశం అంతే! చెరపబడ్డ పిల్ల చెప్పుంటే ఇదో దీన, విషాద గాధ అయ్యుండేది. మూడో కన్నుతో చెప్పుంటే, మనిషిలోని మురికిని తవ్వి చూపించే కథ అయ్యుండేది. కాని, ఇక్కడ కథ చెప్పేవాడు, స్వయానా the guilty! తన కోరికలేమిటో, వాటికి తాననుకుంటున్న కారణాలేమిటో, వాటిని సాధించడానికి తానేమేం ఉచ్చులు తయారుచేసుకున్నాడో, లేడిని ఎలా చంపాడో, లేడిపిల్లను ఎలా వలలో వేసుకున్నాడో.. అన్నీ “నిజమే చెబుతాను. నిజం తప్ప ఏమీ చెప్పను.” లాంటి కమ్మిట్మెంట్లు లేకుండా, “చదువరి”ని పూర్తిగా నమ్మి, తన కథ చెప్పుకొస్తాడు.  కాని, ఆ కబుర్లెంత ఆకట్టుకున్నాయంటే, లొలిట గురించి, ఆమెకు జరిగిన అన్యాయం గురించి పనిగట్టుకొని ఆలోచిస్తే తప్ప, నా ధ్యాస అటుగా పోలేదు.

నేను ఈ రచనను గురించి చెప్పేముందు, అసలు ఏ రచన్నైనా ఎలా చదువుతానో అన్నది చెప్తాను. కాఫ్కా రాసిన ’మెటమార్ఫసిస్’ కథలో ముఖ్యపాత్ర, పొద్దున్న నిద్రలేవగానే తానో పెద్ద బొద్దింకగా మారినట్టు గ్రహిస్తాడు. ఆ తర్వాతంతా వాడు ఏం పాట్లు పడతాడు, ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటారు అన్నది కథ. ఇందులో, వాడు బొద్దింకగానే ఎందుకు మారతాడో తెలీదు. బహుశ, ఒక మనిషిని తక్కిన వారంతా ఓ “పురుగు”లా చూస్తున్నారు అన్న భావన కలిగించడానికేమో! మనిషిని బొద్దింకగా మార్చటం, మాస్టర్‍స్ట్రోకా లేక ఉత్త చిరాకా?  అన్నది నాకు తెలీదు. ఒక పాఠకునిగా మాత్రం, వాడు బొద్దింకైనా, వాడి కాళ్ళూ చేతులూ పడిపోయినా, వాడింకేమైనా, ఆ కథను (నాకు తోచిన రీతిలో) అర్థంచేసుకోవటంలోగాని, అనుభవించటంలోగాని నాకు ఎలాంటి భేదాలూ ఉండవు. తనకే తెలీని కారణాల వల్ల, మనిషి మనిషిగా వ్యవహరించలేనప్పుడు (బొద్దింకగా మారటం వల్లా అవ్వచ్చు, ఇంకదేని వల్లనైనా అవ్వచ్చు) , లోకం అతణ్ణి ఎలా చూస్తుందని
అతడు అనుకుంటాడన్నదే మెటార్ఫిసిస్‍లో నేను చూసింది.

అలానే, ముళ్ళపూడి వెంకటరమణ అద్భుత సృష్టి ’కానుక’లో, అతడి ఆరాధ్యం కృష్ణుడే కావచ్చు, రాముడే కావచ్చు. సర్వోత్తమంగా తయారు చేయాలనుకున్నది వేణువే కావచ్చు, ఇంకోటేదైనా కావచ్చు. కాని, తన సృష్టించినది తన ఊహంత గొప్పగా ఉండాలి, అంతకు ఏ మాత్రం తక్కువున్నా ఒప్పుకోలేనివాని కథే అవుతుంది నాకు.

ఇప్పుడు, లోలిట లో మిస్టర్ హంబర్ట్ కామించిందీ, మోహించిందీ పన్నెండేళ్ళ అమ్మాయిని. అలా ఓ ఆడపిల్లను మాయచేసి చెరబట్టటంలో ఉన్న నీచత్వం, కౄరత్వం అన్నీ ఉండనూ ఉంటాయి. మనిషికి స్వతహాగా ఉండే కోరికలు, వాటిని అదుపులో పెట్టుకోడానికి అలవర్చుకున్న కట్టుబాట్లు, ఎన్ని గీతలు గీసుకొని కూర్చొన్నా, ఎన్ని ఆంక్షలు విధించుకున్నా వాటిని ఎదిరించాల్సి వచ్చినప్పుడు కలిగే అనిశ్చితి, అపరాధ భావనలు.. ఇదంతా ఒక పార్శ్వం.
కాసేపు, హంబర్ట్ ప్రేమ, మోహం, వ్యసనం లోలిట కాదు, ఒక చిన్న సిసాడు డ్రగ్ అనుకుందాం. (నేరం, అనైతికం, అమానుషం, చట్టవ్యతిరేకం.. లాంటివన్నీ దెబ్బకి ఎగిరిపోతాయి.) ఆ డ్రగ్ వీడికి దొరికితే హ్యాపీ ఎండింగ్! దొరక్కపోతే ట్రాజెడీ! అనుకునే వీలు లేకుండా ఒక మెలిక ఉంది. ఆ డ్రగ్ దొరికినా, దాని ప్రభావం వీడి మీద కేవలం రెండేళ్ళ వరకే ఉంటుంది. (మనకే మృత్యువనే expiry dateతో ఉన్నామనుకుంటే, మన కోరికలకు ఇంకా ముందే expiry!) డ్రగ్ దొరికాక, ఓ పక్క దానికి పూర్తిగా వశమైపోతూనే, మరో పక్క అది ఎంతో కాలం తనతో నిలువదు అన్న నిజం కాల్చేస్తుంటే, మనోడు నిజానికి-మైకానికి మధ్య ఊయ్యాలాట ఆడుకుంటుంటాడు. ఆ ఆట చూసి తరించాలి. కామీట్రాజెడీల పరాకాష్ట! చదువుతున్నంత సేపూ, నవ్వుతూనే ఉన్నాను. (హంబర్ట్ కి అవకాశం ఉంటే, నన్ను మర్డర్ చేసేవాడే, అలా నవ్వుతున్నందుకు.)

ప్లాటోతో నాకు బొత్తిగా పరిచయం లేదు గాని, అతడు ప్రతిపాదించిన, “ముందు నాలుగుకాళ్ళ మనిషి, శాపవశాత్తూ ఆడ-మగగా విడదీసి, విసిరేయబడి, జీవితాంతం ఇంకో సగం కోసం వెతుక్కోవటం”లో కామెడీ (నా లెక్కల్లో) అంతా ఎక్కుడుంటుంది అంతే, కష్టమో, నష్టమో పడి ఇంకో సగాన్ని కలుసుకున్నా, దానితో మమేకం కావటం కుదరదు. తిరిగి నాలుగు కాళ్ళ మనిషి కాలేడు. తన ఉనికికి కీలకమైనది తనలో కలసిపోదు. ఎదురుగా నుంచుని గుడ్లప్పగించి చూస్తుంది. అదో స్వతంత్ర జీవి. దానికో లోకం. ఎంత పరితపించినా, తల్లకిందులుగా తప్పస్సు చేసినా ఒక్కటవ్వలేవు. ప్రతి మనిషి, తన సొంత లోకమనే నీటి బుడుగలో ఉంటాడు అనుకుందాం. అతడు ఏదైనా బంధం కావాలని కోరుకున్నప్పుడు, అవతలి వాళ్ళు ఈ బుడుగలోకి బుడుక్కున వచ్చేయాలని కలలుగంటాడు. కానీ, అవతల వాళ్ళకీ సొంత లోకపు బుడగలుంటాయిగా?! వాళ్ళు వచ్చినా, ఆ నీటిబుడుగలతో సహా వస్తారు. అప్పుడు ఇద్దరూ “బంధం” అనే ఇంకో పెద్ద బుడుగలోకి అడుగిడి, పక్కపక్కనుంటూ, దాన్నే కలిసుండడం అనుకుంటారు! ప్చ్!
ఇది ఇంకో పార్శ్వం.

జోగి, జోగి బూడిద రాసుకుంటే బూడిద రాలుతుందని వింటమే తప్ప చూళ్ళేదు. కానీ, ఒకడి ఖర్మ కాలుతుండగా, గాలొచ్చి, ఈ నిప్పు రవ్వను అత్యంత దగ్గరగా ఉన్న మరో కాలడానికి-సిద్ధంగా-ఉన్నానని-తెలీని ఖర్మ మీద పడేస్తే, అప్పుడు రెండూ మూకుమ్మడిగా కాలి, మాడి మసై, బూడిదే మిగులుతుంది.  అది ఈ కథలో సుస్పష్టంగా కనిపిస్తుంది. పరిస్థితులు కొంచెం కష్టపెట్టుంటే, పాపం, వీడీ పనులు చేసేవాడు కాదేమో! అదృష్టం దరిద్రం పట్టినట్టి పట్టి, హంబర్ట్ కి అన్నీ  కలిసొచ్చి, రెండు జీవితాలు నాశనమయ్యాయి. మరో పార్శ్వం.

ఇలా ఒక prism నుండి అనేక రంగుల కాంతులు పుట్టుకొచ్చినట్టు, లొలిట అనే నవల్లో చాలా కనిపిస్తాయి. వాటిల్లో ఏ ఒక్కటీ మితిమీరకుండా, అన్నింటినీ సరైన మోతాదులో అందించటం అమోఘం. “I think like a genius. Write like a distinguished author. Speak like a child.” అని నబొకొవ్ తనని గురించి తాను చెప్పుకున్నారు. ఈ రచన చదివితే, మొదటి రెండు వాక్యాల విశ్వరూపం కనిపిస్తుంది.

ఓ పక్క అపరాధభావనతో కుమిలిపోతున్నా, మరో పక్క నిప్పులాంటి కోరిక కాల్చేస్తున్నా, హాంబర్ట్ గొంతునుండి హాస్యం ఒలుకుతూనే ఉంటుంది. వాళ్ళ నాన్నని “salad of racial genes” అనటం, తన పేరుని వివిధ ప్రాంతాలకు చెందిన మనుషులు పలికే తీరుని యధావిధిగా రాయటం, తన భార్య మరొకరిని ప్రేమిస్తుందని చెప్పినప్పుడు తాను తలుపేసి వెళ్ళిపోవటాన్ని ఇలా చెప్పటం లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే:

“…vibration of the door I had slammed after them still rang in my every nerve, a poor substitute for the backhand slap with which I ought to have hit her across the cheekbone according to the rules of the movies.”
ఇలాంటి కథల్లో ఎక్కువగా కనిపించే, అసభ్యపదజాలం, వినకూడని, అనకూడని పదాలు, మనిషిలోని పశువుని అభివర్ణించడానికి పూనుకోవటం లాంటివి ఇందులో ఉండవు.

పీకలోతు ప్రేమలో మునిగిన వాళ్ళు, అనుక్షణం ప్రేమికుల నామస్మరణ చేస్తారు కదా.. ఇది హంబర్టిష్ స్టైల్..

“Lo-lee-ta: the tip of the tongue taking a trip of three steps down the palate to tap, at three, on the teeth. Lo.Lee.Ta.”
కొంచెం ఫిలాసఫీ..

I have often noticed that we are inclined to endow our friends with the stability of type that literary characters acquire in the reader’s mind. No matter how many times we reopen “King Lear,” never shall we find the good king banging his tankard in high revelry, all woes forgotten, at a jolly reunion with all three daughters and their lapdogs. Never will Emma rally, revived by the sympathetic salts in Flaubert’s father’s timely tear. Whatever evolution this or that popular character has gone through between the book covers, his fate is fixed in our minds, and, similarly, we expect our friends to follow this or that logical and conventional pattern we have fixed for them. Thus X will never compose the immortal music that would clash with the second-rate symphonies he has accustomed us to. Y will never commit murder. Under no circumstances can Z ever betray us. We have it all arranged in our minds, and the less often we see a particular person the more satisfying it is to check how obediently he conforms to our notion of him every time we hear of him. Any deviation in the fates we have ordained would strike us as not only anomalous but unethical. We would prefer not to have known at all our neighbor, the retired hot-dog stand operator, if it turns out he has just produced the greatest book of poetry his age has seen.

వచనం గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఇంకేదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. దాని గురించి మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది, అందుకని..

“Lolita, Lolita, Lolita, Lolita, Lolita, Lolita, Lolita, Lolita, Lolita. Repeat till the page is full, printer.”

——————————————————————————————
Buy from flipkart for Rs. 153/-

You Might Also Like

Leave a Reply