గుండ్లకమ్మ తీరాన… నడుస్తున్న చరిత్ర
గుండ్లకమ్మ తీరాన ఉన్న కొలచనకోట అనే గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా, అప్పుడు గుంటూరు) నా చిన్నతనం కొంత గడచింది. నేను బడికి వెళ్ళటం ఆ ఊరులోనే మొదలుబెట్టాను. కొద్దిగా పెద్దవాణ్ణైన తరువాత ఒక వేసవికాలం తిరిగి ఆ ఊరు వెళ్ళినప్పుడు స్నేహితులు రోజూ గుండ్లకమ్మకు (గుళ్ళకమ్మ, ఏరు అనేవారని గుర్తు) తీసుకు వెళ్ళి ఈత నేర్పించబోవడం, అక్కడ చెలమల్లో నీళ్ళు తోడుకొని ఇళ్ళకు తీసుకువెళ్ళటం నాకు ఇంకా గుర్తుంది. గుండ్లకమ్మ పేరు విన్నప్పుడల్లా, ఆ జ్ఙాపకాలు నన్ను పలుకరిస్తాయి.
దయానంద్ కథలు చదువుతున్నప్పుడు కూడా నాకు ఆ మట్టివాసన గుర్తుకు వస్తుంది. చిన్ననాట నేను తిరిగిన ఇళ్ళూ, కొట్టాలూ, బేరన్లూ, పుగాకు వాసనా, రంగాగారి ఫొటోలూ, పైరుపనుల హడావిడీ, పొలాల్లోనూ ఇళ్ళల్లోనూ కష్టపడి పనిచేసే రైతుకుటుంబాలూ జ్ఞప్తికి వస్తాయి. ఆ కథల్లో మనుషుల తీరూ, వారి కట్టూ బొట్టూ మాటా యాసా అన్నీ పరిచయమున్నట్టే కనపడతాయి. అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో రైతుకుటుంబంలో పుట్టి పెరిగిన కాట్రగడ్డ దయానంద్, పోస్టల్ డిపార్టుమెంటులో తన ఉద్యోగరీత్యా కూడా ప్రకాశం జిల్లా పల్లెటూళ్ళు, పట్టణాలలో మనుషుల జీవితాల్ని చాలా దగ్గరగా పరిశీలించినవాడు. తన కథల్లో పాత్రలు, వాళ్ళుండే చోట్లు, వారు చేసే పనులూ దయానండ్‌కు బాగా పరిచయం. అందుకే దయానంద్ కథల వాతావరణంలో కృతకత ఉండదు.
గత మూడు దశాబ్దాలలో ఆ ప్రాంతాల్లో వచ్చిన పరిణామాలను దగ్గరగా చూసిన ప్రత్యక్ష సాక్షి దయానంద్. ఆ నేపథ్యంలో జీవితాలూ, మానవసంబంధాలూ ఎలా మారుతున్నాయో తెలిసి చలించిన వాడు. ఒకప్పుడు స్వతంత్రంగా, ధైర్యంగా జీవించిన చిన్న రైతుల జీవితాలు అస్తవ్యస్తం కావడం, పెద్దవాళ్ళ వ్యాపారాలకోసం చిన్నవారు భూములు అమ్మేసుకోవలసి రావడం ఆయన దగ్గరగా చూశాడు. భూమితో రైతుకి ఉన్న సంబంధం రైతుబిడ్డలకు లేకపోవడం ఆయన గమనించాడు. భూమి అంటే అభిమానంతో, ఎలాగైనా దాన్ని నిల్పుకొంటే భవిష్యత్తు తమదే అన్న నమ్మకం ఉన్న ఒకతరం మనుషులకూ, భూమి ఉత్పత్తిసాధనం కాదు ఒక వ్యాపారపు సరకు అనుకొనే ఇంకోతరానికి జరుగుతున్న ఘర్షణ ఆయనకు బాగా పరిచయమే. ఈ పరిణామాలన్నిటి వెనుక ఉన్న దెబ్బతిన్న మనుషులూ వారి మనసులూ ఆయనకి బాగా అవగతమే. ఈ నడుస్తున్న చరిత్రలో వివిధఘట్టాలను గ్రంథస్తం చేస్తున్న చరిత్రకారుడు దయానంద్.
పాతికేళ్ళుగా తెలుగులో మంచికథలు రాస్తున్నవారిలో ఎన్నదగిన కొద్దిమందిలో ఒకడు కాట్రగడ్డ దయానంద్. ఆయన కథలు ఆయనకి మల్లేనే స్వచ్ఛంగా ఉంటాయి. ఆర్తిగా ఆత్మీయుల కబుర్లూ, మంచీ చెడ్డా చెప్పినట్లుంటాయి. ఆ కథల్లో మనుషులు రక్తమాంసాలతో జవసత్వాలతో నిజం మనుషుల్లా ఉంటారు. సగటు మనుషుల బంధాలు, బాంధవ్యాలూ, బాధ్యతలూ కలిగి ఉంటారు. వాళ్ళు అంతంతమాత్రంగా నిరాశకు లొంగేవాళ్ళు కాదు. బతుకు లడాయిలో ఢక్కామొక్కీలు తిన్నవాళ్ళు. తుపానుల ముందు తలవంచి వంగవలసి వచ్చినా, పరిస్థితుల కొరడాదెబ్బలకి నడుం విరిగినా, తిరిగి నిటారుగా నిలబడి భవిష్యత్తుపై ఆశతో, ఆత్మవిశ్వాసంతో తలెత్తి ముందుకు సాగేవాళ్ళు. బతకటంలో విశ్వాసం ఉన్నవాళ్ళు. నేలతిమ్మిరి (భూకంపం)కి జడిసేవాళ్ళు కాదు.
ఈ సంపుటంలో మొత్తం 14 కథలున్నాయి: ముసురు, బతుకుదారి, నీడ, మేఘమాల – వాయువీణ, అలజడి, పెద్దపండుగ, రెండు జ్ఙాపకాలు, కట్టుగొయ్య, అతడు-ఆమె-ఒక స్వప్నలోకం, ఆకురాలు కాలంలోకి…, నేలతిమ్మిరి, చదువు, గుండ్లకమ్మ తీరాన, మనిషీ-మట్టీ. ఈ కథలన్నీ 1999-2010ల మధ్య వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. కొన్ని కథలు వార్షిక కథాసంకలనాల్లో ప్రచురింపబడ్డాయి.
దయానంద్ ప్రచురించిన మొదటి కథల సంపుటి పండుటాకు (1999) లో లాగానే ఈ కథల్లోనూ గుర్తు పెట్టుకునే సంఘటనలూ, పాత్రలూ ఉన్నాయి. దయానంద్ కథలు సాధారణంగా సూటిగా, సాంప్రదాయిక కథన పద్ధతిలో ఉంటాయి. మానసిక సామాజిక విశ్లేషణలకన్నా జరిగిన కథ చెప్పటమే ముఖ్యం. కథలో రచయిత చొరబడటం అరుదు. ఈ సంపుటిలో కొన్ని కథలు అన్యాపదేశంగానూ, ప్రతీకాత్మకంగానూ ఉండటం విశేషం. దయానంద్ కథలు సరళంగా ఉంటాయి; సంఘర్షణ ఉన్నా, చాలా కథల్లో సంక్లిష్టత తక్కువ. ఐనా, కథల్లో సంఘటనలూ, పాత్రలూ మనసుమీద బలంగా ముద్ర వేయటం వల్ల ఈ కథలు తేలిపోక చాలా కాలం గుర్తుంటాయి.
అచ్చుతప్పులు లేకుండా, ఈ పుస్తకాన్ని శ్రద్ధగా ముద్రించారు. ముఖపత్రంపై వేసిన ఏలే లక్ష్మణ్ చిత్రం ముద్రణలో తేలిపోయింది. పచ్చిగా ఉండే లక్ష్మణ్ రంగులకు వార్నిష్ పూసినట్లనిపించింది. ఈ మధ్య ముఖపత్రం పేలవంగా అనిపించిన కొద్ది పుస్తకాలలో ఇది ఒకటి.
(Disclosure: ఈ పుస్తకం ముందుపేజీల్లో రచయిత ఆప్యాయంగా గుర్తు చేసుకున్నవాళ్ళలో నేనూ, అరుణా ఉన్నాము; క్రితంసారి ఇండియా వచ్చినప్పుడు మేము దయానంద్‌గారి కుటుంబం ఆతిథ్యాన్నీ ఆత్మీయతనూ పంచుకున్నాము).
—
గుండ్లకమ్మ తీరాన – కాట్రగడ్డ దయానంద్ కథలు
(Gundlakamma Teeraana – Katragadda Dayanand Kathalu)
నవంబరు, 2010
చినుకు ప్రచురణలు
దత్తాస్ నయా బజార్
యువరాజ్ థియేటర్ ఎదురుగా
గాంధీనగర్, విజయవాడ 520 003
నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి వగైరా షాపుల్లో దొరుకుతుంది
155 పేజీలు; 80 రూ.
***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************
Leave a Reply