నా జీవిత చరిత్ర – విన్నకోట వెంకటేశ్వరరావు
నాలుగు నెలల క్రిందట పుస్తకం.నెట్‌లో విన్నకోట వెంకటేశ్వరరావుగారు సంకలించిన తెనుఁగు తోట పుస్తకాన్ని పరిచయం చేస్తూ, “ఈ పుస్తకంలో వెంకటేశ్వరరావుగారి గురించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి… స్మృతిచిహ్నంగా ప్రచురించిన పుస్తకం కాబట్టి ఆయన జీవన విశేషాలు ఇంకొన్ని ఇచ్చి ఉంటే బాగుండేది.” అని అన్నాను. అప్పుడు నాకు తెలియని విషయమేమిటంటే వెంకటేశ్వరరావుగారి కుటుంబ సభ్యులు ఆయన శతజయంతి సంవత్సర స్మృతిచిహ్నాలుగా తెనుఁగు తోటతో పాటు, ఆయన జీవిత చరిత్రను కూడా పుస్తకంగా ప్రచురించారని. ఆయన కుమారుడు, ప్రముఖ కవి, మిత్రుడు విన్నకోట రవిశంకర్ ఆ పుస్తకాన్ని ఇప్పుడు అందించారు.
1911 ఫిబ్రవరిలో పుట్టిన వెంకటేశ్వరరావుగారికి డైరీ రాయటం అలవాటుండేదట. కుటుంబసభ్యుల కోరిక మేరకు ఆయన రిటైరయిన తరువాత, జీవిత చరమాంకంలో, ఈ జీవిత చరిత్రను రాయటం మొదలుబెట్టారు. 1986లో మొదలుబెట్టిన ఈ ఆత్మకథని పూర్తి చేయకుండానే ఆయన 1990 జనవరిలో మరణించారు.
వెంకటేశ్వరరావుగారు కృష్ణా జిల్లా చంద్రాల గ్రామంలో జన్మించారు. పూర్వీకులు విన్నకోట వారు దేశపాండేలు; చాలా ఆస్థి ఉండేది. తాతగారి హయాములో చుట్టాలు వస్తే నేతితో గారెలు వండించి నేతిలో ముంచి తినిపించేవారట. తండ్రిగారి హయాం వచ్చే సరికి ఆస్తులు హరించుకుపోయాయి. తండ్రిగారు కూడా వెంకటేశ్వరరావు గారి చిన్నతనంలోనే (ఆయన 13వ యేట) చనిపోయారు. వారి పెద్దన్నయ్యా, వదినా, ఆయన్నీ, మిగతా సహోదరుల్నీ స్వంత పిల్లల్లా పెంచారు. పెద్దన్నయ్య చంద్రాల గ్రామ కరణంగా పని చేసేవారు. అప్పుడు ఆయన జీతం నెలకి 7 రూపాయలట. ఆ తర్వాత వెంకటేశ్వరరావుగారి చిన్నన్నయ్య కూడా కరణంగానే పనిచేశారు. వారి తల్లిగారు చిన్న వయస్సులో కష్టాలు పడ్డా పెద్దయ్యాక, కొడుకుల్ని చూసుకొని, ’ఆస్తి లేకపోవడం వల్ల కొడుకులంతా ప్రయోజకులయ్యా’రని సంతోషించేదట.
వెంకటేశ్వరరావుగారి స్కూలు చదువు ముందు అంగలూరు (కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, గోపీచంద్‌ల గ్రామం) లో, తర్వాత గుడివాడలో జరిగింది. ఆయన పుస్తకాలు బాగా చదువుతుండే వారు. అంగలూరు గ్రామం ప్రభావం వల్ల గాంధేయవాదానికి ఆకర్షితులయ్యారు. గాంధీ గారి యంగ్ ఇండియాకు చందాకట్టి తెప్పించుకుని చదివే వారట. 1928 మార్చ్‌లో ఎస్సెస్సెల్సీ (స్కూల్ ఫైనల్ – 11వ తరగతి) మంచిమార్కులతో పాస్ అయ్యారు. డబ్బులు లేక కాలేజీ చదువుకు వెళ్ళకుండా ఉంటే, మార్కులు చూసి మెచ్చుకున్న బంధువు ఒకరు ఆయన్ని బలవంతంగా కాలేజీలో చేర్చి మొదటి టరం ఫీజు కట్టారు. తర్వాత స్కాలర్‌షిప్స్‌తోనూ ఇతరుల సహాయంతోనూ బి.ఏ. పూర్తి చేశారు.
1936లో ముందు టెంపరరీగానూ, తర్వాత పర్మనెంటుగానూ గుడివాడ తాసీల్దారు ఆఫీసులో గుమస్తా ఉద్యోగం దొరికింది. పెద్దలు కుదిర్చిన సంబంధం, శ్యామలగార్ని చూడకుండానే, పెళ్ళి చేసుకొన్నారు. సిన్సియర్‌గానూ, నిజాయితీగానూ పని చేయటంతో పై అధికారుల ఆదరాభిమానాలు పొంది ఉద్యోగంలో పదోన్నతి పొందుతూ చాలాకాలం కృష్ణా జిల్లాలో పని చేశారు. 1962లో తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో RDO (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ – డిప్యూటీ కలెక్టర్) గా ప్రమోషన్ వచ్చింది. 1966లో గవర్నమెంటు ఉద్యోగ విరమణ చేసి, పిఠాపురం చక్కెర మిల్లులో అసిస్టెంట్ మేనేజర్‌గా, మేనేజర్‌గా ఒక దశాబ్దం పని చేసి విశ్రాంత జీవనం మొదలుపెట్టారు. ఆయన సతీమణి మరణించిన నాలుగేళ్ళకు ఆయన కూడా మరణించారు.
వెంకటేశ్వరరావుగారికి ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆయన సర్వీసులో చాలా నిజాయితీగా పని చేశారు. ఉద్యోగరీత్యా ఎక్కడికన్నా వెళితే అక్కడ ఎవరి ఇంట్లోనూ భోజనం కూడా చేయగూడదన్న నియమం ఆయనది. ఉద్యోగ ధర్మంలో ఎవరి ఒత్తిడికీ లొంగేవారు కారు. ఎవరో ప్రేమగా ఒక బుట్ట మామిడి పళ్ళు పంపిస్తే ఆ బుట్టని సైకిల్‌కు కట్టుకొని వెళ్ళి తిరిగి ఇచ్చి వచ్చిన నిబద్ధత. గాంధేయ వాదిగా బతికారు. కార్యదక్షుడైన అధికారిగా పేరు, గౌరవం పొందారు. అంతకాలం పెద్ద పదవుల్లో పని చేసినా, స్వంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఆయనకి తీరనిదే అయ్యింది.
వెంకటేశ్వరరావుగారు పేరు పొందిన రచయిత, కళాకారుడూ కాదు; స్వాతంత్ర్య యోధుడూ, రాజకీయ నాయకుడూ కాదు. ఉద్యమాలు నడపలేదు. జైలుకు వెళ్ళలేదు. ప్రభుత్వ అధికారిగా ఆయన ఒక జాతి చరిత్రనో, ఒక ప్రాంత చరిత్రనో మార్చే గొప్ప నిర్ణయాలేమీ తీసుకొన్నట్లుగా చెప్పలేదు. పరిశ్రమలూ, పాఠశాలలూ స్థాపించలేదు. మరి, తన ఉద్యోగ ధర్మం, కుటుంబధర్మాలు నిర్వహించటంలోనే నిమగ్నమైన ఆయన జీవిత కథలో ఏముంటుంది?
ఆయన చనిపోయిన వార్త తెలిసి ఎప్పుడో 24 ఏళ్ళ క్రితం ఆయన పనిచేసిన చోటునుంచి మనుషులు పనికట్టుకుని వచ్చి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారట. ”ఎనిమిదిమంది పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలని పట్టుదలగా ఆ పని సాధించారు. అదే వారు మాకు ఇచ్చిన ఆస్తి. వారి నుంచి ఈ ఆస్తిని పొంది మేం అందరం ఎంతో సుఖంగానూ ఆనందంగానూ ఉన్నాం” అని ఈ పుస్తకానికి ముగింపుగా వారి పిల్లలు అన్నారు. జీవితానికి ఆ సాఫల్యం చాలదా?
ఈ పుస్తకం చిన్నది. పూర్తిగా వ్యక్తిగతమైంది. కుటుంబ విషయాలు, స్నేహితుల కబుర్లు, ఉద్యోగ విషయాలే పుస్తకం నిండా ఉన్నాయి. నాటకీయత తక్కువ, చుట్టూ ఉన్న సమాజం గురించి పనికట్టుకొని ఎక్కడా చెప్పలేదు. ఐనా ఇది ఒక నిజమైన మనిషి కథ; ఒక నిజమైన జీవితం కథ. కల్పనలేని సంఘటనల సమాహారం. అదే ఈ పుస్తకం బలం.
తెనుఁగు తోట చదివిన తర్వాత ఈ పుస్తకం చదవటంతో, నేను ఈ పుస్తకంలో ఆ కాలపు సాహిత్యం, సాహితీకారుల ముచ్చట్లు ఉంటాయనుకొని ఆశించాను. ఆ విషయాల మీద ఈ పుస్తకంలో ఆయన అసలు దృష్టి పెట్టలేదు. కాలేజీ రోజుల్లో సారస్వత సంఘం నిర్వహించామని ప్రస్తావించటమే కాని వివరాలలోకి వెళ్ళలేదు. పుస్తకం పూర్తిగా రాయకుండానే ఆయన మరణించటం కారణమేమో మరి.
నా జీవిత చరిత్ర
(కొన్ని జ్ఙాపకాలూ- అనుభవాలూ)
విన్నకోట వెంకటేశ్వరరావు
2010
శ్రీ విన్నకోట వెంకటేశ్వరరావు అండ్ శ్రీమతి విన్నకోట శ్యామల ఛారిటబుల్ ట్రస్ట్
హైదరాబాద్
98 పేజీలు
Not For Sale; If interested, contact vrkaundinya@yahoo.com
***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************
Jampala Chowdary
@రవిశంకర్: వెంకటేశ్వరరావుగారి జీవిత కథ చదువుతున్నప్పుడే యాదృచ్ఛికంగా ఇన్నయ్యగారు తెనిగించిన ఫ్రికెన్‌బర్గ్ గుంటూరు జిల్లా చరిత్ర చదువుతూ ఉన్నాను. 19వశతాబ్దపు పూర్వార్థంనుండి వెంకటేశ్వరరావుగారి ఉద్యోగవిరమణ వరకూ జిల్లా/తాలూకాల నిర్వహణావిధానంలో వచ్చిన మార్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. బ్రిటిష్ పరిపాలననుండి స్వతంత్ర భారతపు తొలిదినాలలో పాలనానిర్వహణ శాఖలో మధ్యతరగతి ఉద్యోగిగా వెంకటేశ్వరరావుగారి అనుభవాలకు ప్రాధాన్యత ఉంది.
chavakiran
http://kinige.com/kbook.php?id=156 This book is now available on Kinige.
రవిశంకర్
ఈ పుస్తకాన్ని పరిచయం చేసినందుకు జంపాల చౌదరిగారికి ధన్యవాదాలు. పుస్తకం ముందుమాటలో పేర్కొన్నట్టుగా దీనిని ప్రచురించటంలో మా ముఖ్యోద్దేశం రెవెన్యూ శాఖలోగాని మరే ఇతర ప్రభుత్వశాఖలోగాని పనిచేసేవారికి ఇటువంటి
చరిత్రలో ఆసక్తిఉంటే ఆనాటి పరిస్థితులను ప్రతిబింబించేదిగా వారికి ఉపయోగపడుతుందని. పుస్తకం ప్రచురించాక చదివిన కొంతమంది స్పందననుబట్టి మా ఉద్దేశం సరైనదే అనిపించింది. ఉదాహరణకు,ప్రభుత్వోధ్యోగంలో ఉన్న
ప్రముఖ కవి/రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు ఈ పుస్తకం తనకు చాలా నచ్చిందని చెప్పాడు. కలెక్టర్లవంటి ఉన్నత హోదాలో పనిచేసినవారు రాసిన పుస్తకాలున్నాయిగాని (Steel Frame and I by Chettur వంటివి) క్రిందిస్థాయి అధికారులు తమ అనుభవాలను రికార్డు చేసిన సందర్భాలు తక్కువని, ఆరకంగా దీనికి కొంత విలువ
ఉంటుందని అతని అభిప్రాయం. నాన్నగారు మొదట బ్రిటిషువారి దగ్గర, తరువాత మనవారిదగ్గర పనిచెయ్యటం పనిచెయ్యటంవల్ల ఆ అనుభవ విస్తృతి ఇందులో తెలుస్తుంది ఆంతేకాకుండా, అవినీతి సర్వ సాధారణమైపోయిన ప్రస్తుత కాలంలో నిజాయితీకి కట్టుబడిన ఒక వ్యక్తి కధ ఇప్పటి తరానికి ఆసక్తి కలిగించవచ్చుననే ఆశ కూడా ఉంది.
మరొక విషయం – గాంధీగారి వల్ల ప్రభావితులైన యువకులలో కొంతమంది, వివిధ కారణాలవల్ల స్వాతంత్రోద్యమంలో నేరుగా దిగకపోయినా, వ్యక్తిగత జీవితంలో ఆయన చెప్పిన విలువలు పాటించి తద్వారా, స్వాతంత్ర్యం రాకముందు,
వచ్చిన తరువాత కూడా సమాజానికి ఉపయోగపడటానికి తమవంతు కృషి చేసారని దీనివల్ల మనకు తెలుస్తుంది. చౌదరిగారు చెప్పినట్టు – గొప్ప పనులు చెయ్యకపోయినా,ఇటువంటివారివల్ల ఎంతోకొంత మేలు చేకూరుతుంది. సమాజానికి వారి అవసరం కూడా ఉంది.నిజాయితీ, నిరాడంబరత, చేసే పనిపట్ల అంకితభావం, ఇతరులకు చెప్పే ధర్మాలు తాము ముందుగా ఆచరించటం వంటివి వారు పాటించిన విలువలు. వాటికి జీవితాంతం కట్టుబడి ఉన్నారు. నాన్నగారు ఉద్యోగంలో కర్తవ్యంగా బయట ప్రచారంచేసి, స్వయంగా తాను మాత్రం పాటించలేకపోయిన
సూత్రం ఒకే ఒకటి – కుటుంబనియంత్రణ.(అది పాటించి ఉంటే ఈ విషయాలు చెప్పటానికి నేనుండేవాడిని
కాదనుకోండి)
ఇక తెనుఁగు తోట విషయానికొస్తే, అది విద్యార్థిదశలో కవిత్వంపై అభిరుచివల్ల చేసిందేగాని, అప్పటి ప్రముఖ కవులలో ఎక్కువమందితో ఆయనకు ప్రత్యక్ష పరిచయం ఉండకపోవచ్చు. గురుజాడ రాఘవశర్మగారు వరుసకు సోదరుడు కావటం, పాటిబండ మాధవశర్మ, దివాకర్ల వేంకటావధాని వంటివారు కాలేజీలో సహాధ్యాయులు కావటం వంటివి కొన్ని మినహాయించి, ఎక్కువమంది సాహితీకారులతో పరిచయాలు లేకపోయినా, ఒక పాఠకునిగా తనకు నచ్చిన పద్యాలు సంకలనం చేసి ఉంటారు.