రామరాజ్యానికి రహదారి : స్వాతంత్ర్య సంగ్రామంలో సజీవపాత్రల జీవన పథం

గత శతాబ్దపు ఉత్తరార్థంలో తెలుగులో బాగా పేరున్న రచయితల్లో శ్రీ పాలగుమ్మి పద్మరాజు (1915-1983) ఒకరు. చిత్రంగా ఆయన కీర్తి కథారచయితగా, గట్టిగా మాట్లాడితే గాలివాన, పడవ ప్రయాణం కథల రచయితగా, మాత్రమే పరిమితమయ్యింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారి అంతర్జాతీయ కథలపోటీలో ద్వితీయ బహుమతి పొంది తెలుగు వాడి బావుటా అంతర్జాతీయంగా ఎగరవేశాడని ఆయన ప్రసక్తి వచ్చినప్పుడల్లా చెప్పుకోవటం ఆనవాయితీ. ఐతే, మిగతా సాహిత్యప్రక్రియల్లో ఆయన ప్రతిభ గురించి అంతగా వినిపించదు. నిజానికి పద్మరాజుగారు చిన్నవయసులోనే పెద్దవారి మెప్పు పొందిన కవి. చాగంటి కామేశ్వరరావు అనే మిత్రునితో కలసి జంటగా రాజేశ్వర కవులు అనే పేరుతో కవిత్వం చెప్పారు. ఆ తర్వాత కెమిస్ట్రీలో ఎం.ఎస్సీ పట్టా తీసుకొన్నారు. నెమ్మదిగా మద్రాసు చేరారు. కథలూ, నవలలూ, నాటకాలూ రాశారు. సినిమారంగంలో జ్ఞాతంగానూ, అజ్ఞాతంగానూ చాలా కాలం పనిచేశారు.

నాకు పద్మరాజుగారితో మొదటి పరిచయం ఆయన కథలతో కాదు. బతికిన కాలేజీ అన్న నవల ద్వారా. నేను ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో అని గుర్తు. ఆంధ్రప్రదేశ్ అనే ప్రభుత్వ పత్రికలో సీరియల్‌గా వస్తుండేది. నవలపేరు దగ్గరనుంచీ అంతా చాలా గమ్మత్తుగా ఉండేది. నాయకుడిపేరు మిస్టర్ చింతా; ఉపనాయకుడి పేరు పట్టు; ఇట్లా ఉంటుంది వరస. తర్వాత చాలా కాలానికి తెలిసింది ఇది వోడ్‌హౌస్ పంథాలో వ్రాసిన పుస్తకం అని. పీయూసీ చదువుకునే రోజుల్లో రెండవ అశోకుడి మూణ్ణాళ్ళ పాలన చదవటం బాగా గుర్తుంది. రామరాజ్యానికి రహదారి ఈ రెండు పుస్తకాల మధ్య ప్రచురితమయ్యింది. ఎమెస్కో పాకెట్ బుక్స్ వారు ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా 1966, 1967లలో ప్రచురించారని ఈ సంపుటంలో ఉంది. ఎందుకోగాని ఈ పుస్తకం లీలామాత్రంగానే గుర్తుంది. ఈసారి చదివినప్పుడు పద్మరాజుగారి రచనల్లో ఉత్కృష్టమైనవాటిలో ఇదొకటి అని అనిపించింది.

స్వాతంత్ర్య సమరం నేపథ్యంగా తెలుగులో రావలసినన్ని రచనలు రాలేదని నా అభిప్రాయం. కొల్లాయి గట్టితేనేమి, అతడు-ఆమె వంటి కొన్ని నవలలు మాత్రమే మనకు ఉన్నాయి. వేయిపడగలు, నారాయణరావు వంటి నవలల్లో స్వాతంత్ర్యపోరాటం అప్రాధాన్యమైన పక్క విషయం. ఈ పుస్తకాలలో చాలావరకూ స్వాతంత్ర్యపోరాటంలో ఉన్న వ్యక్తులు ఆదర్శమూర్తులు, మాలిన్యాలేమీ లేనివాళ్ళు. కుటుంబరావుగారి చదువులో మాత్రం కొంత లౌకిక వాసన కనిపిస్తుంది.

రామరాజ్యానికి రహదారి స్వాతంత్ర్యపోరాటం ముఖ్యనేపథ్యంగా, అందులో పూర్తిగా మునిగిపోయిన కొంతమంది వ్యక్తుల, కుటుంబాల కథ. ఆ మనుషుల అంతరంగాలను, రాగద్వేషాలనూ దగ్గరగా పరిశీలించిన పుస్తకం. మనస్తత్వ చిత్రీకరణకు పేరుపొందిన పద్మరాజుగారి ముద్ర ఈ నవలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నవల మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం గోపాలం చెప్పిన కథ; అతడి వదిన లక్ష్మి చెప్పిన కథ రెండవ భాగం; అతని కొడుకు రంగడి (రంగారావు) కథ మూడో భాగం.

1930 జనవరి 26. గాంధీజీ పిలుపునందుకొని దేశమంతటా కాంగ్రెస్ కార్యకర్తలందరూ స్వతంత్ర భారత పతాకాన్ని ఎగరవేసి పూర్ణ స్వరాజ్యమే ధ్యేయమని దీక్ష పుచ్చుకొంటున్నరోజు. ఆ ఉదయం పొగమంచులో, ఈదరగాలి మధ్య, రామరాజ్యాన్ని ఊహించుకొంటూ, పశ్చిమగోదావరిజిల్లా భీమవరం ప్రాంతంలో ఒక పల్లెటూరిలో ఆరు వందలమంది కార్యకర్తలు కూడగా, చింతచెట్టుపైన పదేళ్ళ రంగడు జండా ఎగురవేయటంతో ఈ కథ ప్రారంభమౌతుంది. రంగడి తండ్రి గోపాలం ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల్లో ఒకడు. డిగ్రీ మధ్యలో మానేసి పూర్తిగా ఉద్యమంలో తిరుగుతున్నాడు. పెద్దాయన పంతులుగారు వారికి నాయకుడు. అతనికి తోడు సుబ్బన్నశాస్త్రి, శర్మ, రామ్మూర్తిరాజు, సాయిబు శాస్త్రుల్లు, మాలదాసు, సుబ్బరాజు, కమ్యూనిస్టు నరసయ్య వగైరా. ఇంకో సన్నిహితుడు డాకూ అని అందరూ పిలుచుకొనే రామశాస్త్రులు; ఆయుర్వేదమూ, అల్లోపతీ కలగలిపి ప్రాక్టీసు చేస్తుంటాడు; లౌక్యుడు. కానీ వీరందరి బాగోగులు చూసుకొంటూ ఉంటాడు.

భార్య సీత, కొడుకు రంగడు గోపాలం కుటుంబం. అవటానికి అరవై ఎకరాలకి యజమానే అయినా, ఉద్యమంలో తిరుగుతూ స్వంత సంగతులు పట్టించుకోడు గోపాలం. పాడుపడుతున్న ఇంటిని బాగుచేయించాలన్న శ్రద్ధ లేదు. “దేశాన్ని బాగుచేస్తే ఇల్లు అదే బాగుపడుతుంది. అసలు స్వతంత్ర భారతదేశంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు ఎందుకుంటాయి?”,  అని అతని ఆలోచనలు. వర్తమానంకన్నా భవిష్యత్తువైపే అతని చూపు. అప్పులు పెరుగుతున్నాయి. పన్నులు కట్టడానికి నిరాకరించడంతో పొలాలు వేలం వేయిస్తానంటున్నాడు కరణం. ఐనా గోపాలానికి ఈ విషయాలు పట్టించుకోబుద్ధి కాదు.

గోపాలం మామగారు డాక్టర్ సాంబశివుడు ఏలూరులో గొప్పపేరున్న డాక్టరు, కాంగ్రెస్ నాయకుడు. ఆయన పెద్ద కూతురు లక్ష్మికూడా ఉద్యమంలో చురుకుగా పనిచేస్తుంది. ఆమె భర్త సూరి ఆమె చుట్టూనే తిరుగుతూ సాయం చేస్తుంటాడు. గోపాలం తండ్రికి, మామగారికి ముఖ్యస్నేహితుడు లాయరు నాయుడు గారు, జస్టిస్‌పార్టీ మనిషి. అయినా తన స్నేహానికి ఈ పార్టీలని అడ్డం రానివ్వడు. గోపాలానికి డబ్బు అవసరమైనప్పుడు ఇల్లు హామీగా ఆయన దగ్గర అప్పులు తీసుకొని గడిపేస్తున్నాడు.

ఉప్పు సత్యాగ్రహం మొదలయ్యింది. గోపాలం సహచరులందరూ వివిధ ఉద్యమాల్లో దెబ్బలు తిన్నారు. చాలామంది అరెస్టు అయ్యారు. డాక్టర్ సాంబశివుడు గారు వేలూరు జైలుకు వెళ్ళారు; అక్కడ ఆయన ఆరోగ్యం దెబ్బతింది. గోపాలం జైల్లో ఖైదీల తిండి బాగుండటం లేదని నిరాహార వ్రతం చేశాడు. కొంతకాలం తర్వాత అందరూ విడుదలయ్యారు. గోపాలం హరిజన సంఘం కార్యదర్శిగా పని చేయసాగాడు. బాపూజీ హరిజనోద్యమంలో భాగంగా గోదావరిజిల్లాలలో పర్యటించారు. 1935 సంస్కరణల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నికలు జరిపి ప్రజా ప్రతినిధులకు పరిమితమైన అధికారాలనివ్వటానికి సిద్ధమయ్యింది. ఆ ఎన్నికల్లో పాల్గోవాలా వద్దా అని తర్జనభర్జనలు పడ్డాక లక్నో కాంగ్రెస్ కార్యవర్గసమావేశంలో ఎన్నికలలో పాల్గొనాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ తరపున గోపాలం ఎన్నికలలో నిలబడ్డాడు. పోటీగా నాయుడుగారి కుమారుడు గోపీనాయుడు. ఇతను ఇంగ్లాండులో బారెట్లా చదివి లారా అనే తెల్ల అమ్మాయిని పెళ్ళిచేసుకొన్నాడు. డబ్బులిచ్చి వోట్లు కొనడానికి ప్రయత్నించాడు. డాకూ చాణక్యం  ఆ ప్రయత్నాలని భంగపరిచింది. గోపాలం పెద్ద మెజారిటీతో గెలిచాడు. మద్రాసులో కాపురం పెట్టాడు. ఓడిపోయిన గోపీ దావా వేసి గోపాలం ఎన్నిక రద్దు చేయించాడు. ఈలోపల గోపాలం ఆస్తి మొత్తం గుల్ల ఐపోయింది. మద్రాసులో తన వదిన లక్ష్మి నడుపుతున్న హిందీ పాఠశాలలో ఉండిపోయాడు.

లక్ష్మికి సూరితో పెళ్ళయినా వారిద్దరిమధ్య దాంపత్యసుఖం లేదు. అది వారిద్దరి జీవితాలని అస్తవ్యస్తం చేసింది. కొన్నాళ్ళకు సూరి ఇంకో పెళ్ళి చేసుకొని వేరే వెళ్ళిపోయాడు. లక్ష్మీ గోపాలాల మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. దూరంగా స్వంత ఊళ్ళో ఉంటున్న సీత చనిపోయింది. ఆత్మహత్యేమో అని అనుమానం.

మద్రాసులో కాలేజీలో చదవడానికి వచ్చిన రంగడు స్వతంత్రంగా ఉండటానికి, తండ్రి మాటలను లెక్కచేయకుండా ఉండడానికి అలవాటు పడిపోయాడు. కొన్ని విషయాలలో లారా అతనికి గురువు అయ్యింది. మంచి ఫుట్‌బాల్ ఆటగాడు. తన చుట్టూతా ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే రంగడికి చదువు మీద శ్రద్ధ పోయింది. తల్లి చనిపోయాక గమ్యమంటూ లేని గమనం మొదలు బెట్టాడు.

దాదాపు పద్నాలుగేళ్ళ చరిత్రను ఈ నవల చిత్రీకరిస్తుంది. అనేకమైన పాత్రల వ్యక్తిగత విషయాలు, స్వాతంత్ర్య సమరం, ఆంధ్ర రాష్ట్రోద్యమం పడుగూపేకల్లా ఈ నవలలో ఇమిడిపోతాయి. ముఖ్యపాత్రలందరికీ స్వాతంత్ర్యంకోసం ఏమైనా చేయాలన్న తపన ఉంటుంది. స్వంత విషయాలకన్నా దేశమంటేనే పట్టింపు. ఆరోగ్యం బాగాలేని డాక్టర్ సాంబశివుడు ఎవరు చెప్పినా వినకుండా లక్నో కాంగ్రెస్ సమావేశానికి ప్రయాణం కడతాడు ముఖ్యమైన తీర్మానాలు చర్చకు వస్తున్నాయని. పొలం వేలం తాలూకు కోర్టువాయిదా ఉన్నా, ఆస్థికన్నా దేశభవిష్యత్తు ముఖ్యమని లక్నో వెళ్ళిపోయాడు గోపాలం. స్వంత వర్తమానం, భవిష్యత్తు పట్టకుండా దేశం భవిష్యత్తుపైనే వాళ్ళ దృష్టి. చదువులూ, ఆస్తులూ, ఉద్యోగాలూ, ప్రాక్టీసులూ, కుటుంబం బాగోగులూ వీళ్ళకి పట్టవు. వీరెవరికీ కులాల పట్టింపులు లేవు. వీరందరిదీ ఒక కలగలుపు కాంగ్రెస్ కులం. తమకోసం వీళ్ళంతా ఇట్లా జీవితాల్ని పాడు చేసుకొంటున్నారని ప్రజలకు వీరిపైన గౌరవం, మమకారం. గాంధీగారన్నా, వారి ఉద్యమాలన్నా, వారి ఆదేశాలన్నా వీళ్ళందరికీ విపరీతమైన గౌరవం. ఉప్పు వండి అమ్ముతున్నందుకు పోలీసులు తనని లాఠీలతో కొడుతుంటే, మహాబలాఢ్యుడు సుబ్బరాజు పళ్ళు బిగించి, గుప్పెళ్ళు మూసి, ’గాంధీగారు అహింస అన్నారంటగానీ, మీ అందర్నీ శీపురుపుల్లల్లాగా ఇరిశేసుందునురా’ అంటాడు.

కానీ అందరిదీ ఒకటే పద్ధతి కాదు. ఈ లాఠీ ఛార్జీలు, ఈ గోల, ఈ కష్టాలు ఎందుకని, డాకూ, తన మేనల్లుడి వరుస పోలీసు ఇనస్పెక్టరు ఇంటికి వెళ్ళి, అతని చేతనే ఒక కుంపటీ, కుండా, ఉప్పు నీళ్ళూ తెప్పించి ఇంటిముందు ఉప్పు వండి అరెస్టు చేయించుకొంటాడు. గోపాలం ఉన్న జైలుకే వెళతాడు. సర్కిల్ ఇనస్పెక్టరు సుబ్బారావు లాఠీఛార్జీలు తెగ చేసేసి డీఎస్పీ ఐపోతాడు. తాసీల్దారు నరసయ్య లొంగుబాటు పత్రాలు కలెక్ట్ చేసి డిప్యూటీ కలెక్టరు అవుతాడు.

స్వాతంత్ర్యం వీరందరి ధ్యేయమే ఐనా, కాలం గడుస్తున్నకొద్దీ వీరి ఆదర్శాలలోనూ, ఉద్దేశాలలోనూ విభేదాలు కనిపిస్తుంటాయి. మాలదాసు కొడుకు అంబేద్కర్ అనుయాయి అయ్యాడు. డాకూ హిందూ మహాసభ పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. జిన్నాని ఒకప్పుడు తిట్టిన సాయిబు శాస్త్రులు ఇప్పుడు జిన్నా విషయాలు మాట్లాడుతున్నాడు. కొందరు కాంగ్రెస్ ఎన్నికలలో నిలబడి ప్రభుత్వం నడపాలంటున్నారు. కొందరు అది తప్పు అంటున్నారు. ఇంగ్లండు జర్మనీల మధ్య యుద్ధంలో ఇంగ్లాండు గెలవాలని కొందరూ, కాదు జర్మనీ గెలవాలని మరికొందరూ వాదిస్తున్నారు. నరసయ్య రష్యాలో వచ్చినట్లు సామ్యవాద ప్రభుత్వం వస్తే కాని అది స్వాతంత్ర్యం కాదంటున్నాడు. ఇన్ని విరుద్ధభావాలు ఉన్న వ్యక్తులందరూ కలసి పోరాటం సాగిస్తున్నారు.

స్వాతంత్ర్య పోరాటాన్ని సహజంగా చిత్రీకరించటం ఒక ఎత్తైతే, పాత్రల అంతరంగాల్లోని వైరుధ్యాలని, వారి ప్రవర్తనలని పద్మరాజుగారు చిత్రీకరించిన తీరు మరో ఎత్తు. ఈ నవల నాకు బాగా నచ్చటానికి, గొప్పగా అనిపించటానికి కారణం ఈ పాత్రల చిత్రీకరణే. ఈ పాత్రలు సహజమైనవి. సజీవమై జవసత్వాలు, చీమూ నెత్తురూ ఉన్నవి. వీరి ప్రవర్తనలోనూ, ఆలోచనలలోనూ రకరకాల పొరలు, వైరుధ్యాలు, సంఘర్షణలు.

కథానాయకుడు గోపాలం స్వతంత్రం కోసం, ఆ తర్వాత వచ్చే రామరాజ్యం కోసం ఎప్పుడూ కలలు కంటూంటాడు. తనూ, తన తోటి కాంగ్రెస్‌వాదులందరూ మిగతా అందరిలా కాకుండా ఆదర్శంగా బతకాలని అతని అభిప్రాయం. అతని కాళ్ళు నేలమీద ఉండవనీ, అతను గాల్లో నడుస్తూ ఉంటాడని పక్కవాళ్ళందరూ వివిధ సందర్భాల్లో అనుకొంటూ ఉంటారు. స్వంత విషయాలను అశ్రద్ధ చేస్తుంటాడు. అలా అశ్రద్ధ చేయడం తప్పని అతనికి తెలుసు. అది అతన్ని గుచ్చుకొంటూ ఉంటుంది. కాని ఆ విషయం వేరే ఎవరైనా జ్ఞాపకం చేస్తే అతను సహించలేడు. కోపం వస్తుంది. మరింత బిగుసుకుపోతాడు. భార్యబిడ్డలంటే చాలా ప్రేమ; కానీ, అది చూపించటం రాదు. కీర్తిమీద పెద్ద కండూతి లేదు. అప్పుడప్పుడూ తప్పులు చేస్తుంటాడు. ఆ సమయాల్లో అతను తనని క్షమించుకోనూ లేడు. ఆ తప్పుల్ని అతను విస్మరించలేడు. ఆత్మవిమర్శతో వ్యధ పొందుతుంటాడు. ఒకోసారి అనవసరంగా వేరేవారిపై ఆ కోపం చూపిస్తుంటాడు. ఒకరోజు కొడుక్కు కాలేజీ విద్య అవసరం లేదని ఆవేశంగా వాదించిన అతను లక్ష్మికి చిలిపిగా, తిక్కగా కనిపిస్తాడు. ఆ సాయంత్రమే బహిరంగసభలో మద్రాసు ఆంధ్రరాష్ట్రంలో ఉండటమే న్యాయమని అద్భుతంగా ఉపన్యాసమిచ్చినప్పుడు మహావ్యక్తిగా కనిపిస్తాడు.

అతని వదిన లక్ష్మిది ఇంకో తీరు. కాంగ్రెస్ పోరాటానికే తన జీవితాన్ని అంకితం చేసింది. ప్రభుత్వపు అణచివేతను ఎదుర్కొని ధైర్యంగా తన పాఠశాలను నిర్వహిస్తుంటుంది, కానీ తమందరి పోరాటాలు తన స్వంత సమస్యలని వదిలేసి పారిపోవటానికేమోనన్న ప్రశ్న ఆమెకు ఉంది. భర్త సూరి అంటే అనురాగం; అతను పడుతున్న వ్యథను చూడలేని బాధ; కానీ అతనితో దైహిక సౌఖ్యం పట్ల అమితమైన అసహ్యం. ఈ వైరుధ్యాల వల్ల శారీరక మానసిక ఇబ్బందులు.

గోపీనాయుడు లాంటి విలువలు లేని మనుషులతోపాటు, అతని భార్య లారా, అతని తండ్రి నాయుడుగారు, డాక్టర్ సాంబశివుడు, శర్మ వంటి హుందా, నిండుతనం ఉన్న ఉదాత్తమైన మనుషులు మనకి ఈ నవలలో కనిపిస్తారు. నవల మధ్యలో ప్రవేశించిన లారా నెమ్మదిగా ముఖ్యపాత్ర అవుతుంది. ఆమెలోని న్యాయబద్ధత, ఉదారవాదం, గుండె నిబ్బరం ఆమెపై గౌరవాన్ని కలుగజేస్తాయి.

పల్లెటూరి జీవితాలగురించి రాసినంత సాధికారతతో నగరాల్లో ఎగువతరగతి జీవితం గురించి కూడా రాయగల కొద్దిమంది తెలుగు రచయితల్లో పద్మరాజుగారు ఒకరు. ఆ నైపుణ్యం ఈ నవలలో కూడా కనిపిస్తుంది. 1930లలో గోదావరి జిల్లాలలో, మద్రాసులో ఉన్న ఉద్యమ పరిస్థితుల్ని మనం కూడా అనుభవించేట్లుగా చేయటంలో పద్మరాజుగారు సఫలీకృతులయ్యారు. పుస్తకం మూసేశాక ఈ పాత్రల గురించీ, ఆ రోజుల గురించీ ఆలోచింపచేశారు. ఈ నవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకొంది. అది తగిన గుర్తింపే.

ఎమెస్కో పాకెట్‌బుక్స్ పుస్తకాలకి ఉపశీర్షికలుండేవి. ఈ పుస్తకం రెండు సంపుటాలకి ఉన్న శీర్షికలు: బానిసత్వంలోంచి ప్రజారాజ్యానికి…; ఐతిహాసిక బృహన్నవల.

ఈ సంపుటంలో ఇంకో రెండు నవలలు కూడా ఉన్నాయి: రెండవ అశోకుడి మూణ్ణాళ్ళ పాలన, నల్ల రేగడి. ఇవి కూడా ముందు ఎమెస్కో పాకెట్‌బుక్స్ గానే వచ్చాయి. నల్లరేగడి సినిమాగా కూడా వచ్చింది; విజయవంతం కాలేదు. రెండవ అశోకుడి మూణ్ణాళ్ళ పాలన మొదటిసారి చదివినప్పుడు నాకు చాలా నచ్చింది. వీలువెంట ఆ పుస్తకాన్ని కూడా పరిచయం చేయాలని ఉంది.

ఈ పుస్తకాల్ని విశాలాంధ్రవారు ప్రచురించిన తీరు నాకు నచ్చలేదు. మూడు నవలలు కలిపి ప్రచురించేసి అమ్మేసుకొంటే తమ పని ఐపోయిందనుకొంటున్నారేమో అనిపించింది ఈ సంపుటం చూస్తే. పద్మరాజు గారి రచనలన్నీ సమగ్రంగా సేకరించి వేస్తున్నారు కదా, రచయిత గురించి నాలుగు ముక్కలు ఎవరితోనన్నా రాయించి వెనుక అట్ట మీదో, లేకపోతే లోపల ఒక పేజీలోనో వేయించడం ఎంత కష్టం? ఎంత ఖర్చు? ఈ నవలల చరిత్ర గురించి ఒకటి రెండు మాటలు చెప్తే ఎంత బాగుంటుంది? ఈ పుస్తకానికి అకాడమీ బహుమతి వచ్చిన విషయం కూడా ఎక్కడా కనిపించదు. అచ్చు తప్పులు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫుల్‌స్టాపులూ, కామాలూ అక్కడక్కడా స్థానాలు తప్పడంతో వాక్యాల అన్వయం తప్పి, పెడర్థాలు వచ్చాయి.

ఐనప్పటికీ, ఈ పుస్తకం సాహిత్యప్రియులు కొనతగ్గదే, మళ్ళీ మళ్ళీ చదివి (ఇంకో మంచి ఎడిషన్ వచ్చేదాకా) దాచుకోతగ్గదే.

పాలగుమ్మి పద్మరాజు రచనలు – 2 – నవలలు

మే 2010

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విజ్ఞాన భవన్, 4-1-435, బ్యాంక్ స్ట్రీట్
హైదరాబాద్ – 01

392 పేజీలు; 180 రూ.

**************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకంలో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

**************

పద్మరాజు గారి కథలపై గతంలో పుస్తకం.నెట్ లో వచ్చిన స్వాతికుమారి గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

2 Comments

  1. ఆర్థర్ హెయిలీ – In High Places | పుస్తకం

    […] ఏవీ లేవు (పాలగుమ్మి పద్మరాజు రామరాజ్యానికి రహదారి, మహీధర రామ్మోహనరావు పుస్తకాలు […]

  2. Brahmanandam Gorti

    బావుంది మీ పరిచయం. తెలుగునాట రావాల్సినంత గుర్తిపురాని రచయితల్లో పద్మరాజుగారొకరు. దాసరి నారాయణ రావుకి ఈయన భూత రచయితగా మారినప్పటినుండీ ఈయన ప్రాభవం తగ్గింది. సినిమాకి సంబంధించిన ప్రతీ అడ్డమైన ప్రక్రియ క్రిందా తెరపై దాసరి పేరు కనిపిస్తే చాలు వేంటనే పద్మరాజు గారే మెదిలేవారు. మనసు చంపుకొని గతిలేక అమ్ముడుపోయినందుకు ఈయన్నీ, సిగ్గూ శరమూ వదిలేసిన ఆ దర్శకరత్నాన్నీ తెగ తిట్టుకునేవాణ్ణి.

    ముళ్ళపూడి వారి భాషలో చెప్పాలంటే తెలుగునాట రచయితలెప్పుడూ ఆరోగ్యవంతులే. వారికెప్పుడూ డబ్బుచేయదు. వారి రక్తం ఎప్పుడూ డోనరు గ్రూపే!

    అందుకే “రచయితా – O – రచయితా!” అని నిట్టూర్చాల్సి వస్తుంది.

    -బ్రహ్మానందం

Leave a Reply