పుస్తకం
All about booksపుస్తకభాష

May 23, 2012

ఆర్థర్ హెయిలీ – In High Places

More articles by »
Written by: Jampala Chowdary
Tags: ,
In High Places 2

నేను మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో కొంతమంది ఆంగ్ల రచయితల నవలలంటే మాకందరికీ మోజుగా ఉండేది. ఆర్థర్ హెయిలీ (Arthur Hailey), ఇర్వింగ్ వాలెస్ (Irving Wallace), హెరాల్డ్ రాబిన్స్ (Harold Robbins), జేమ్స్ హాడ్లీ ఛేజ్ (James Hadley Chase), యాలిస్టైర్ మెక్లీన్ (Alistair MacLean) ల పుస్తకాలకు మా తరంలో మంచి గిరాకీ ఉండేది. ఎర్ల్ స్టాన్లీ గార్డ్‌నర్ (Earl Stanley Gardner – పెర్రీ మేసన్), అగాథా క్రిస్టీ (Agatha Christie – హెర్క్యూల్ పారో), ఇయాన్ ఫ్లెమింగ్ (Ian Fleming – జేమ్స్ బాండ్) రచనలు అప్పటికే పాతబడ్డాయి. ఫ్రెడరిక్ ఫోర్సిత్ (Frederick Forsyth), కెన్ ఫోలెట్ (Ken Follett) అప్పుడే ప్రచారంలోకి వస్తున్నారు. గుంటూరు అరండల్‌పేట మూడో లైన్లో కుమార్ బుక్‌స్టాల్ అని సెకండ్‌హేండ్ పుస్తకాలు అద్దెకు ఇచ్చే కొట్టు ఉండేది (ఆ తర్వాత ఆ షాపు మెడికల్, ప్రొఫెషనల్ పుస్తకాల షాపుగా రూపాంతరం చెందింది). రోజుకు ఐదు పైసలు, వారానికి పావలా అనుకుంటా అద్దె ఉండేది. అన్ని రకాల ఇంగ్లీషు పుస్తకాలూ దొరికేవి. నాలాంటి పుస్తకాల పురుగులకి అక్కడ ఖాతాలు ఉండేవి.

అప్పట్లో కాలేజీలో మెడికల్ విద్యార్థులందరూ దాదాపుగా చదివే పుస్తకాలు కొన్ని ఉండేవి: ఏ.జే క్రానిన్ (A.J.Cronin) The Citadel (విజాయానంద్ తేరే మేరే సప్నే చిత్రానికి మూలం), రిచర్డ్ గార్డన్ (Richard Gordon) Doctor in the House సిరీస్, ఆర్థర్ హెయిలీ The Final Diagnosis. మొదటి రెండూ అప్పటికే పాతబడిన బ్రిటిష్ నవలలు. ఫైనల్ డయాగ్నొసిస్ నవల మాత్రం అమెరికాలో అధునాతన హాస్పిటల్ నేపథ్యంలో చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. ఒక హాస్పిటల్లో పేథాలజీ డిపార్టుమెంట్లో జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ నడుస్తుంది. 1959లో వ్రాసిన ఆ నవలలో చర్చించిన కొన్ని ముఖ్యమైన లేబరేటరీ టెస్టులు 1979లో నేను హౌస్‌సర్జెన్సీ చేసేటప్పటికికూడా మన రాష్ట్రంలో అందుబాటులో లేవు. రచయిత ఆర్థర్ హెయిలీకి వృత్తిరీత్యా వైద్యంతో ఏ సంబంధమూ లేకపోయినా, అతను సాధికారంగా వివారణాత్మకంగా వైద్యశాస్త్రపు కొత్త విషయాలు కొన్ని చెప్పిన తీరు మాకు అబ్బురంగా ఉండేది.

అలా ఒక ప్రత్యేక వృత్తి ప్రపంచపు లోతుపాతుల్ని సామాన్య పాఠకులకు ఉత్కంఠ కలిగించే విధంగా పరిచయం చేయటం ఆర్థర్ హెయిలీ ట్రేడ్ మార్కు. ఆతని మొదట నవల ఫ్లైట్ ఇంటూ డేంజర్ (రన్‌వే జీరో ఎయిట్ అని ఇంకో పేరు కూడా ఉంది ఈ పుస్తకానికి). విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లూ ఒకేసారి ఫుడ్‌పాయిజనింగ్‌తో అస్వస్థులైతే ఆ విమానాని కేమవుతుంది అన్న ప్లాట్‌తో రాసిన నవల ముందు టీవీ సీరీయల్‌గా పేరు తెచ్చుకొని – చివరికి Airplane అనే వెక్కిరింత చిత్రంగా రూపాంతరం చెందింది. నేను మొదట చదివిన అతని పుస్తకం హోటల్ (పుస్తకం అట్ట మీద Author of the Best Selling Novel, The Airport అని ఉండేది. అలాగే ఎయిర్ పోర్ట్ పుస్తకం పైన Author of the Best Selling Novel, The Hotel అని ఉండేది; హాస్యంగా ఉండేది వాటిని చూసినప్పుడు). లూజియానా రాష్ట్రంలో ఒక హోటల్లో జరిగే కథ. ఆ నవల చదవటం పూర్తయ్యేసరికి ఆ రోజుల్లో హోటల్ పరిశ్రమ గురించిన అనేక ముఖ్య, అముఖ్య విషయాలు పాఠకుడికి పరిచయమౌతాయి. నవల కూడా చాలా పట్టుగా చదివిస్తుంది (కళ్ల పరీక్ష కోసం వేసిన అట్రొపైన్ చుక్కలవల్ల కళ్ళు బూదరగా కనిపిస్తున్నా, ఆపకుండా చదివాను నేను ఆ పుస్తకాన్ని). అలాగే ఎయిర్‌పోర్ట్ నవల (బోలెడు ఎయిర్‌ప్లేన్ డిజాస్టర్ సినిమాలకు ఈ నవలే మూలం). ఒక రంగాన్ని ఎన్నుకొని, ఒక సంవత్సరంపాటు ఆ రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ తర్వాత ఆ నేపధ్యంలో ఒక థ్రిల్లర్ కథను తయారు చేసుకొని ఇంకో సంవత్సరం శ్రమించి ఒక నవల రాసేవాడు హెయిలీ. వీల్స్ (కార్ల పరిశ్రమ), మనీ ఛేంజర్స్ (బాంకింగ్), ఓవర్లోడ్ (ఎలక్ట్రిసిటీ), స్ట్రాంగ్ మెడిసిన్ (మందులు), ఈవెనింగ్ న్యూస్ (టెలివిజన్)- ఇలా ఒక్కొక్కటీ ఒక్కొక్క రంగాన్ని కూలంకషంగా పరిచయం చేస్తాయి.

ఈ నవలలతో పోల్చుకొంటే కొద్దిగా విలక్షణమైన నవల In High Places. ఈ పుస్తకం 1960లో, అంటే హోటల్ కంటే ముందు, వ్రాసింది. ఈ పుస్తకం నేపథ్యం – కెనడా దేశపు రాజకీయాలు, అప్పుడు అమెరికా రష్యాల మధ్య జరుగుతున్న ప్రఛ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్). ఒక చలికాలం, క్రిస్ట్‌మస్‌కు రెండు రోజులముందు కెనడాలో ఒకదాని కొకటి సంబంధం లేదు అనిపించే సంఘటనలతో ఈ నవల ప్రారంభ మౌతుంది. రష్యా త్వరలో తమపై అణు మిస్సైల్స్‌తో దాడి జరుపుతుందని అమెరికా కెనడా దేశాల నేతలు బలంగా నమ్ముతారు. ఆ దాడి జరిగిన తర్వాత తమ రెండు దేశాల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే ఈ రెండు దేశాలు తాత్కాలికంగా ఐక్యమవటం తప్పనిసరి అని అమెరికా అధ్యక్షుడు టైలర్, కెనడా ప్రధాని జేమ్స్ హౌడెన్ అభిప్రాయపడతారు.

జేమ్స్ హౌడెన్ దూరదృష్టి, అవగాహన, ఆలోచన ఉన్న నాయకుడు. కెనడా దేశమంటే ప్రేమ; దాని భవిష్యత్తును భద్రపరచాలన్న ఆరాటం ఉంది. అమెరికాతో తన దేశాన్ని కలిపే ఐక్యతా ఒప్పందం తన దేశభద్రతకు అవసరం అని అతని నమ్మకం. ఐతే అలాంటి ఒప్పందం చేసుకుంటే, కెనడా స్వతంత్ర ప్రతిపత్తి, అస్తిత్వం మాయమైపోతాయని చాలామందికి ఆ ప్రతిపాదన విన్న వెంటనే కలిగే శంక, భయం. ఈ ఒప్పందం జరగాలంటే, అతను ముందు తన పార్టీలోనూ, కేబినెట్‌లోనూ ఉన్న సహచరులను సమాధానపరచి వారి సమ్మతి సంపాదించాలి. అమెరికా అధ్యక్షునితో సంప్రదించినప్పుడు కెనడా స్వతంత్ర ప్రతిపత్తి, కెనడా ప్రయోజనాలూ సంరక్షించబడేట్టు షరతులను ఒప్పించుకోవాలి.

అదే సమయంలో కెనడా పశ్చిమతీరం వాంకూవర్‌లో అప్పుడే తీరంలో లంగరు వేసిన ఒక ఓడలో దొంగచాటుగా చేరిన ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. హెన్రి డువల్ అనే ఈ అనాధ కుర్రవాడు ఇథియోపియా, సొమాలియా దేశాల్లో పెరిగాడు. పాస్‌పోర్టువంటి గుర్తింపు పత్రాలేమీ లేవు. రెండేళ్ళ క్రితం దొంగచాటుగా ఆ ఓడ ఎక్కాడు. అప్పటినుంచీ ఆ ఓడ ఏ రేవులో ఆగినా అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతనికి ప్రవేశాన్ని నిషేధిస్తునారు. ఇక్కడా అలాగే జరిగింది. ఎలాగో ఈ విషయం తెలిసిన ఒక వాంకూవర్‌ పత్రిక విలేఖరి తన దినపత్రిక మొదటిపేజీలో కరుణాత్మకమైన కథనాన్ని ప్రచురిస్తాడు. దానికి దేశమంతా విపరీతమైన స్పందన లభిస్తుంది. ఎలాగైనా ఈ కుర్రవాడికి కెనడియన్ వీసా ఇవ్వాలని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతుంటారు.

ఐతే, ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి హెన్రీ వారెండర్ ఒక తిక్క మనిషి. కెనడా ఇమ్మిగ్రేషన్ విధానానికి స్పష్టత లేదని, దాన్ని సమూలంగా మార్చాలనే అతని విశ్వాసాన్ని సమర్థించేవాళ్ళు లేరు. అందుకని ప్రస్తుతం ఉన్న చట్టాన్ని – ప్రజల ఆవేశ ఉద్వేగాలతో సంబంధం లేకుండా, స్ట్రిక్ట్‌గా అమలుపరచాలని అతని ఆదేశం. ఆ శాఖ అధికారులు అతని ఆదేశాలను అమలుపరచే తీరు తన ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెస్తున్నా వారెండర్‌ని ప్రధానమంత్రి రాజీనామా చేయమని అడగడం గానీ, బర్తరఫ్ చేయడం గానీ చేయలేడు. కొన్నేళ్ళక్రితం తాను ప్రధాని కావటంకోసం వారెండర్‌తో చేసుకున్న రహస్య ఒప్పందం బయటకు వస్తే తన పరువు, పదవి పోతాయని అతని భయం. అందుచేత ఇష్టం లేకపోయినా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ విధానాలను, నిర్ణయాలను ప్రధాని సమర్ధిస్తూనే ఉంటాడు. ఐనా అమెరికాతో ఐక్యతా ఒడంబడిక వంటి ముఖ్యవిషయంపై ధ్యానం పెట్టిన ప్రధానికి డువల్ వీసా సమస్య పట్టించుకోవలసినంత ముఖ్య విషయంగా అనిపించదు.

ప్రధాన మంత్రిని, ప్రభుత్వపక్షాన్నీ ఇరుకున పెట్టాలనుకున్న ప్రతిపక్ష నాయకులు హెన్రి డువల్ ఇమ్మిగ్రేషన్ సమస్యను పెద్దది చేసి తమకు అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. దాన్లో భాగంగా అలన్ మెయిట్లాండ్ అనే కుర్ర లాయర్‌కు ఈ కేసు అప్పచెబుతారు. ఆదర్శాలే ముఖ్యం అని భావించే మెయిట్లాండ్, డువల్ కి వీసా సంపాదించటం కోసం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నాల వల్ల ఈ సమస్యకు దేశమంతటా ప్రచారం పెరుగుతుంది. ప్రధాని, ప్రభుత్వపక్షాల వీసా విధానాలపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అత్యంత సమర్థతతో అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపి కెనడాకు అనుకూలమైన షరతులను (ఉదాహరణకు అలాస్కాను కెనడాలో కలిపేయటానికి అమెరికా ఒప్పుకొంటుంది) గెలచుకొన్న ప్రధానికి, ఈ ఊరూపేరూ లేని కుర్రవాడి ఇమ్మిగ్రేషన్ వ్యవహారం తలనొప్పిగా తయారవుతుంది. ఒకదానితో ఒకటిగా ముడిపడుతున్న ఈ సమస్యలు తిరిగే మలుపులు, వాటి పరిష్కారం ఈ నవల వృత్తాంతం.

ఈ ముఖ్యపాత్రలకు తోడు చాలా ఉపపాత్రలు. ప్రధానమంత్రి భార్య మార్గరెట్, అతని ఒకప్పటి ప్రియురాలు – ఇప్పటి సెక్రెటరీ మిల్లీ ఫ్రీడ్‌మన్, పార్టీ అధ్యక్షుడు బ్రయాన్ రిచర్డ్సన్, ఇమిగ్రేషన్ అధికారి ఎడ్గర్ క్రేమర్, కేబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్ష నాయకులు, ఇమిగ్రేషన్ అధికారులు అమెరికా అధ్యక్షుడు, అతని ఆంతరంగిక సలహాదారులు, ఎడిటర్లూ, జడ్జీలు, ఇలా చాలా పాత్రలు; ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక నేపధ్యం. కెనడా రాజ్యాంగ విధానం, ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంటు, ఇమ్మిగ్రేషన్ చట్టం, దినపత్రిక కార్యాలయాలు, న్యాయాలయాలు పనిచేసే తీరు, అమెరికా కెనడా సంబంధాలు, రష్యాతో అణుయుద్ధ భయం, కెనడా ప్రజల మనోభావాలు, చాలా విపులంగా కథలో భాగంగానే చర్చిస్తాడు రచయిత.

ఈ నవల చదువుతున్నప్పుడే నాకు మొదటిసారి హెబియస్ కార్పస్, ఆర్డర్ నిసి, రిట్ ఆఫ్ మాండమస్ వంటి న్యాయశాస్త్ర విషయాలు, ప్రోస్టేట్ సమస్య వంటి వైద్య విషయాలు తెలిశాయి. కెనడా రాజ్యాంగ వ్యవస్థ గురించి కొంత తెలిసింది. ఇట్లా చాలా విజ్ఙానంతో పాటు, ఈ పుస్తకం మంచి వినోదాన్ని కూడా ఇచ్చింది. నవల ప్రారంభంనుంచీ చివరివరకూ చాలా ఉత్కంఠతో సాగుతుంది. చిన్నా పెద్దా పాత్రలన్నిటినీ రచయిత శ్రద్ధతో నిర్మించి, ఆ పాత్రల స్వభావాలనీ, మానసిక ప్రవృత్తులనీ, చర్యలనూ విపులంగా వర్ణిస్తాడు. ముప్పేటలుగా సాగుతున్న కథని అవసరమైన చోట్ల ముళ్ళు వేస్తూ నేర్పుగా మలుపులు తిప్పుతాడు.

పుస్తకంలో ముఖ్య పాత్ర ప్రధాని జిం హౌడెన్‌దే. కెనడా దేశమంటే ప్రేమ. దేశభవిష్యత్తు పట్లే అతని దృష్టి; ఈ క్లిష్ట పర్తిస్థితిలో దేశానికి అవసరమైన నాయకత్వం అందించగలిగింది తానొక్కడేనని అతని నమ్మకం. ఆ నాయకత్వం నిలబెట్టుకోవటానికి అవసరమైన రాజకీయాలు నడపడానికి అతను వెనుకాడడు. అనాథగా పెరిగి స్వయంకృషితో ఈ స్థితికి వచ్చిన క్రమంలో అతను చాలా వదలుకొన్నాడు. ఐతే, ఈ పదవికోసం తన ప్రధాన ప్రత్యర్థి హెన్రీ వారెండర్ (ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి)తో ఒక అవినీతి పూర్వకమైన ఒప్పందం చేసుకొన్నాడు. దానికి ఉన్న ఒక సాక్ష్యం ఇప్పుడు అతని రాజకీయజీవితాన్ని అంతం చేసే ప్రమాదం ఉంది. ఇమ్మిగ్రేషన్ లాయర్ మెయిట్లాండ్ వృత్తినిబద్ధతకూ, నిజాయితీకీ కూడా ఒక విషమ పరీక్ష ఎదురవుతుంది. జాలి, దయ వంటి ఉద్వేగాలను పక్కనపెట్టి, చట్టాన్ని, చట్టం నియమాల్ని చిత్తశుద్ధితో నిర్మొహమోటంగా, నిష్కర్షగా, తుచ తప్పకుండా, పాటించే ఇమ్మిగ్రేషన్ అధికారి క్రేమర్ దృష్టిలో చట్టానికేగాని ప్రజాభిప్రాయానికి విలువ లేదు.

క్రేమర్ నిజాయితీకి ప్రభుత్వం, మెయిట్లాండ్ ఆదర్శాలకి సమాజం, హేడెన్ నాయకత్వానికి వోటర్లు ఎలాంటి ఫలితాలు ఇస్తారు? పైస్థాయిలో రాజకీయ నాయకులు ఎటువంటి ఒత్తిళ్ళ మధ్య తమ నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది? అప్రధానంగా కనిపించే కొన్ని విషయాలు యాదృచ్ఛికంగానే ప్రపంచ చరిత్రను ఎలా మార్చగలవు వంటి విషయాల గురించి తీవ్రంగా ఆలోచింపచేస్తుంది ఈ పుస్తకం.

ఆరోజుల్లో రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థలు, వ్యవహారాలు నేపధ్యంగా నన్ను ఆకట్టుకున్న మూడు నవలలలో ఇది ఒకటి (Allen Drury వ్రాసిన Advice and Consent, Irving Wallace వ్రాసిన The Man మిగతావి. నిజానికి The Man ఫోకస్ వేరు). దేశ స్థాయి రాజకీయాలలోనూ, చట్ట సభల్లోనూ ఉండే సంక్లిష్టతనూ, ఉత్కృష్ట ఆశయాలకూ, వివిధ మానసిక ప్రవృత్తులకూ, పరిస్తితులకూ మధ్య జరిగే సంఘర్షణలను విపులంగానూ, వాస్తవికంగానూ, ఉత్కంఠభరంగానూ చిత్రించిన పుస్తకాలు ఇవి. ఒక దశలో నామీద చాలా ప్రభావం చూపిన పుస్తకాలు; Politics is, and should be, a noble profession అన్న అభిప్రాయాన్ని బలోపేతం చేసిన పుస్తకాలు.

ఆ నవలలు చదువుతున్నప్పుడు, మనకు తెలుగులో (ఆ మాటకొస్తే మనదేశంలో) ఇటువంటి పుస్తకాలు ఉంటే మన వ్యవస్థ గురించి మన కందరకూ బాగా అర్థం అవుతుందిగా అనిపించేది. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ మనకు ఇటువంటి పుస్తకాలు చెప్పుకోదగ్గవి ఏవీ లేవు (పాలగుమ్మి పద్మరాజు రామరాజ్యానికి రహదారి, మహీధర రామ్మోహనరావు పుస్తకాలు స్వాతంత్ర్యోద్యమం గురించి కొంతవరకూ ఈ ధోరణిలో ఉంటాయి. వాటిలోనూ, ఇంత విపులత్వం తక్కువ).

ఈ మధ్య మావూరి లైబ్రరీలో ఈ పుస్తకం హఠాత్తుగా మళ్ళీ కనిపించింది. ఆర్థర్ హెయిలీ పుస్తకాలు చాలావరకూ ఇంట్లో ఉన్నా ఈ పుస్తకం నా దగ్గరలేదు. దాదాపు 38 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ నవలను ఈవారం చదివాను. కథ తెలిసినా, ఇప్పుడూ నవల బాగానే చదివించింది. అప్పుడు తలకెక్కని, పూర్తిగా అర్థం కాని కొన్ని విషయాలు ఈసారి అర్థం అవటంతో ఈ పుస్తకాన్ని ఇప్పుడూ బాగానే ఆనందించగలిగాను.

ఇంగ్లీషులో పాపులర్ ఫిక్షన్ చదివే సరదా ఉంటే ఆర్థర్ హెయిలీ పుస్తకాలు హాయిగా చదువుకోవచ్చు. హెయిలీ తర్వాత ఆ మూసలో పుస్తకాలు చాలామంది వ్రాస్తూండటం, ఈ పుస్తకాలలో వర్ణించిన పరిస్థితులు పాతబడడం వల్ల ఈతరం పాఠకులకు ఎంత నచ్చుతాయో నేను చెప్పలేను కానీ, ఒక తరం ఇంగ్లీషు పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్న నవలలు ఇవి. 1980లలో యండమూరి, మల్లాదిలు వ్రాసిన థ్రిల్లర్ నవలలు ఈ పుస్తకాల ఒరవడిలోవే.

ఆర్ఠర్ హెయిలీ పుస్తకాలతోపాటు నన్ను ఆకర్షించిన ఇంకో పుస్తకం, అతని భార్య Sheila Hailey ఆర్ఠర్ తో తన జీవితం గురించి వ్రాసిన I Married a Best-Seller అనే పుస్తకం. నిర్మొహమోటంగా వ్రాసిన పుస్తకం. సరదాగా చధివించింది. నేను చదివి 33 ఏళ్ళు దాటింది గానీ, ఈ పుస్తకమూ చదవమనే చెపుతాను.

***

In High Places
Arthur Hailey
1960
Dell Paperback
360 pages
ఫ్లిప్కార్ట్ కొనుగోలు లంకె ఇక్కడ.About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
cheekatirojulu

రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్ (ఈ వ్యాసం మొదట పాలపిట్ట జనవరి 17 సంచికలో వచ్చింది. పుస్తకం.నెట...
by అతిథి
1

 
 
IMG_20170131_173605936

కథా కబుర్లూ కాలక్షేపమూ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************* పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప...
by అతిథి
0

 
 
viswanatha-aprabha

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
5

 

 
homodeus

నరదేవుడి కథ

ఇజ్రాయెల్ కు చెందిన చరిత్రకారుడు యువల్ నోవా హరారీ వ్రాసిన Sapiens, Homo Deus అన్న రెండు పుస్తకా...
by nagamurali
6

 
 
HHawk

H is for Hawk – Helen Macdonald

వ్యాసకర్త: Nagini Kandala ********************** మనిషికి నవ్వు ఎంత సహజమో ఏడుపూ అంతే సహజం,కానీ ఈ బాధ,కన్నీరు ల...
by అతిథి
0

 
 
beyondcoffee

“బియాండ్ కాఫీ” – ఖదీర్‌బాబు

వ్యాసకర్త: మానస చామర్తి ************** మంచి కథ అంటే, మనని తనలో కలుపుకునేది. రచయిత సృష్టించిన లో...
by అతిథి
1