పా.ప. కథలు

వ్వాసం రాసిపంపినవారు: స్వాతి కుమారి
మరి కవులూ,రచయితలందరూ శ్రీశ్రీ, రావి శాస్త్రి, కొకు, కారా.. ఇలా కురచ పేర్లతో చలామణి అయిపోతుంటే అనవసరం గా కష్టపడి పోవడమెందుకని పాలగుమ్మి పద్మరాజు గారి పేరు ని అలా కత్తిరించేశానన్నమాట. ఐనా మీరు ఊహించే ఉంటారు లేదా నేను వికటించి ఉంటాను. అసలు విషయమేంటంటే పోయినేడాది పుస్తకాల సంత లో కొని చదవటం మాత్రం బాగా ఆలస్యం చేసిన పుస్తకం పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి సంపుటం” ఇది.

“ఉద్వేగాలంటే నాకు అసహ్యం” అంటూ బాధ ని వెళ్ళగక్కటానికి ఏడ్చి సంఘం లో తేలిక గా కనపడటమా లేక మన్సులోనే అణచుకుని కుమిలిపోవటామా అనే రాపిడి కనిపిస్తుంది ’ఉద్వేగాలు’ కథలో. పగలంతా ఒంటరిగా ఉండే ఇల్లాలు తనకెవరైనా ఫోన్ చేస్తే బావుండు అనే కోరిక ని బయటికి మాత్రం విసుగులా ప్రదర్శిస్తూ తానాశించే స్వేచ్ఛ ని అదిమిపెట్టి సమాజం లో మర్యాద నిలబెట్టుకునే అతి సహజైన పాత్ర ని చదవచ్చు ’టెలిఫోన్’ లో. సంఘం లో దిగువ తరగతి మనుషుల జీవన విధానం, మనస్తత్వ చిత్రణ, నిర్భీతి తో కూడిన ప్రవర్తన పాత్ర ల రోజువారీ భాష, యాస, మాండలీకాల్లో నడిపించిన ’పడవ ప్రయాణం’ తదితర కథలు ఒక రకమైతే పై తరగతి లో జీవిస్తూ మెటిరీయలిస్ట్ లుగా కనిపించే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్లకూ, భావోద్వేగాలకు లోనవటాన్ని అతి సహజం గా చూపించిన ’చిట్టి తల్లి’ వంటి కథలు మరొక తరహా. ఇలా ప్రతి కథా చెప్పడం మొదలెడితే ఇదొక కేటలాగ్ అయిపోతుంది. పుస్తకం చివర్లో విదేశీ కథలకు రచయిత చేసిన తెలుగు అనువాదాలు కొసమెరుపు.

ఒకదానికొకటి భిన్నమైన కథాంశాలు, ప్రతి కథలోనూ తనను తానే అధిగమించే శైలీ ప్రధాన ఆకర్షణలైతే కావచ్చు కానీ చదువరి మనసులోనూ, జీవతం లోనూ ప్రతి దశ లోను ఎదురయ్యే సంఘటనలూ, సంఘర్షణా వాటి వెనక అంతర్లీనమైన ఆర్ద్రత, బయటి వారికి కనపడని గుండె తడి అన్నిటినీ దాపరికం లేకుండా అక్షారాలుగా మంత్రించిన ప్రతిభ అబ్బురపరుస్తుంది. ఈయన ’గాలివాన’ కథకు అంతర్జాతీయ స్థాయి లో బహుమతి వచ్చింది తెలుసా అన్నారెవరో. అది కూడా తెలియకుండా, అసలిన్నాళ్ళూ ఈ రచయిత గురించే తెలియకుండా ఉన్న నా అజ్ఞానానికి కించిత్తు బాధ కలిగినా దానికేమాత్రమూ తీసిపోని మిగతా కథల్లో దీనికే బహుమతి రావటం కేవలం యాదృచ్ఛికం కాబోలు అని సరిపెట్టుకున్నా.

ఇదంతా మొదటి సంపుటం గురించే. తీరా ఇది చదివిన తర్వాత ఈయన మిగతా వ్యాసాలు, నవల్లు, కవితలూ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి కలగక మానదు. మరందుకే వేట మొదలెట్టాను పాలగుమ్మి రచనా సర్వస్వం కోసం. అసలు కథంటే ఎలా ఉండాలి; మంచి కథకుండాల్సిన లక్షణాలేమిటీ అని తెగ వాదించుకుని హైరానా పడుతున్న సగటు సాహిత్యాభిలాషులు, ఒక సమస్య మీదో, ఒక అభిప్రాయం మీదో ఉపన్యాసమో, వ్యాసమో రాసి దాన్నే కథ అనుకొండి పొండి అనేసే ఈ కాలపు వార పత్రికల కథకులు తప్పనిసరిగా చదివి తీరాల్సిన పుస్తకం.

You Might Also Like

7 Comments

  1. dvrao

    పద్మరాజు, ముళ్ళపూడి సినీ పూతన మింగేసిన రచయిత లు అన్పిస్తుంది, ఎందుకంటే వాళ్ళు సినిమాలకి వెళ్ళాక పెన్ను మూసేశారు.

  2. చౌదరి జంపాల

    పాలగుమ్మి పద్మరాజుగారిని పాప అని పాపరాజు అని వ్యవహరించడం ఒకప్పుడు వాడుకలో ఉన్న విషయమే.

  3. పుస్తకం » Blog Archive » రామరాజ్యానికి రహదారి : స్వాతంత్ర్య సంగ్రామంలో సజీవపాత్రల జీవన పథం

    […] లో వచ్చిన స్వాతికుమారి గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు. (No Ratings Yet)  Loading […]

  4. కొత్తపాళీ

    “మానవత్వం పతాక స్థాయిలో ఆవిష్కరించబడిన కథలాయనవి.”
    అసలు కీలకాన్ని బాగా పట్టుకున్నారు విజయకుమార్ గారు.
    ఈ సంపుటిలో ఉన్న కథలన్నీ గొప్పకథలు కాకపోవచ్చు కానీ, ప్రతీ కథలోనూ ఏదో ఒక గొప్పతనం కనిపిస్తూ వచ్చింది నాకు. ఒక్కోసారి ఆ గొప్పతనం వస్తువులోనో కథనంలోనో శైలిలోనో స్పష్టంగా కనిపిస్తే, చాలా సార్లు ఇదమిత్థం అని తెలియని అస్పష్టంగా, కథ చదవడం అయిపోయాకకూడా మనసుని పట్టి విడువని ఒక వింత భావనలాగా తోస్తుంది.

  5. వింజమూరి విజయకుమార్

    కథకు అసలు ప్రామాణీకత ఏమిటనే ప్రశ్నకు పద్మరాజుగారి కథలు ఉదాహరణ. మానవత్వం పతాక స్థాయిలో ఆవిష్కరించబడిన కథలాయనవి. అందుకే ‘గాలివాన’ కథ అంతర్ఝాతీయ బహుమతి నందుకుంది. ఆ పైన సినిమా ఫీల్డు ఆయనని వదిలి పెట్టలేదు. సినిమాలలో కూడా ఆయన రాసిన కథలు చిరస్మరణీయీలంటారు. అప్పట్లో కొన్ని సినిమాల పేర్లు, సమీక్షలు చదివాను. కానీ ఏదైమైనా తెలుగువారు గర్వించదగ్గ రచయితను మరోసారి మీరూ పరిచయం చేసారు. కృతజ్ఞతలు.

  6. శ్రీ కృష్ణ తిలక్ శాస్త్రి!! « కల్హార

    […] అని వాగ్దానమిచ్చి బయటపడ్డాను. ఇప్పుడిలా మీ మీద […]

  7. వెంకటరమణ

    క్లుప్తంగా చక్కగా వ్రాశారు.
    ఆయనవి పడవ ప్రయాణం, గాలివాన కధలు మాత్రమే కధల సంకలనంలో చదివా. ఈ రెండు కధలు కలచివేశాయి. మగవాడు, స్త్రీని ఎంతగా హింసించినా అతనితోపాటే ఉంటూ తనకు తాను ఎలా సర్ది చెప్పుకుంటుందో చాలా బాగా వ్రాశారు ‘పడవ ప్రయాణం’ లో.
    // పై తరగతి లో జీవిస్తూ మెటిరీయలిస్ట్ లుగా కనిపించే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్లకూ, భావోద్వేగాలకు లోనవటాన్ని

    ఈ వ్యాఖ్య ‘గాలివాన’ కధకు కూడా బాగా సరిపోతుందనిపిస్తుంది.

Leave a Reply