Leave me alone, I’m reading – Maureen Corrigan

కొత్తగా పెట్టిన పుస్తకాల కొట్టు “అసలే మాత్రం ఉందో.. చూద్దాం” అన్నట్టు గిరగిర తిరగేసి ఏదో అసంతృప్తితో బయటకెళ్ళబోతూంటే కనిపించిన పుస్తకం ” Leave me alone, I’m reading.”  ఆ పేరే catchy గా ఉందనుకుంటే టాగ్ లైన్ “Finding and Losing Myself in Books” చూడగానే పుస్తకం తీసుకుని గబాగబా అనువైన చోట కూర్చుని పుస్తకం చదవటం మొదలెట్టాను.

టైటిల్, టాగ్ లైన్ దాదాపు పుస్తకంలో ఏ విషయం ఉన్నదో స్పష్టంగా తెలిపేశాయి. ఇక ఎలా చెప్పారో అన్నదే చూడాల్సింది. పుస్తకాలు చదవటంలో ఒక్కోరిది ఒక్కో అనుభవం. ఒకే పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లు ఒక్కో అనుభవం. అవి అక్షరీకరించాలంటేనే ఒక తపస్సులాంటిదేదో చేసినంత పని. ఇక అలాంటిది బాల్యం నుండి మధ్య వయస్సు వరకూ పుస్తకాలతో అనుభవాలన్నీ ఒక memoir గా పెట్టటం అంటే సామాన్య విషయం కాదు. ఆసక్తి హెచ్చుతున్న కొద్దీ పుస్తకంలో పేజీలు తిరగేస్తున్నాను.

“మనుషులంటే నాకు ద్వేషంగానీ విసుగు గానీ లేవు. అయినా కొన్ని సందర్భాల్లో పుస్తకాల్లో “Leave me alone” అంటూ మునిగిపోవటమే నాకు ఇష్టం.” అంటూ తన పరిచయాన్ని మొదలెట్టిన రచయిత్రి, ఒక యూనివర్శిటిలో ఇంగ్లీషు సంబంధిత ప్రొఫెసర్‍గా పుస్తకాలతో వృత్తిరిత్యా ముడిపడినా, అంతకు మించి తన ప్రవృత్తి రిత్యా బాల్యం నుండీ పుస్తకాల్లో మునకలేస్తుండడం ఈవిడకి లభించిన అరుదైన అవకాశం. పత్రికలకు పుస్తక సమీక్షలు పంపే ఈవిడ నాన్న కూడా పుస్తక పురుగు. కుటుంబంలో అత్యధికులు పుస్తకపురుగులైనప్పుడు, మిగితా వారు ( ఈవిడ విషయంలో అమ్మ) ఎలాంటి ఒంటిరితనం అనుభవిస్తారో తెలియజెప్పింది.

పుస్తకాలు అద్దెకు తీసుకుంటున్నా, లైబ్రరీలకెళ్ళి చదువుకుంటున్నా కొన్న పుస్తకాలు ఇంటిలో ప్రతీ అరలోనూ, ప్రతీ చోట ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. అన్ని పుస్తకాలను సర్దుకోవాలన్నా, ఇళ్ళు మారేటప్పుడు వీటిని జాగ్రత్తగా తరలించడం.. బహుశా పుస్తకాల మీదున్న ప్రేమ పెట్టే పరీక్షలనుకుంటాను. తన చిన్నతనంలో నుండీ తనపై ప్రభావం చూపిన పుస్తకాలు, ముఖ్యంగా “ఫిక్షనల్ కారెక్టర్లు” అన్నీ సోదాహరణంగా వివరించడానికి ప్రయత్నించారు. కానీ వాటిలో చాలా వరకూ నేను చదవలేదు కాబట్టి, నాకు అంతగా తలకెక్కని విభాగం అది. కాకపోతే ఫిక్షనల్ రచనలో రచయిత మనముందు ఆవిష్కరించే ఊహాలోకాన్ని చదువుతూ అందులో హాయిగా విహరించే అనుభూతిని రచయిత్రి చెప్పిన తీరు నా మనస్సుకు చాలా దగ్గరగా ఉందనిపించింది.

జీవితంలో అత్యధిక భాగం పుస్తకాలతో, అనేకమన్ని సార్లు passion and intensity తో, కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో గడిపిన ఒక పుస్తకప్రియురాలి మనోభావాలు ఈ పుస్తకం. పుస్తకపఠనానికి కావాల్సిన అన్నీ లక్షణాలు, ముఖ్యంగా ఏకాంతంలో మరో లోకంలో మనల్ని మనం మర్చిపోయి, అక్షరాల మాటున దాగున్న గారడీ చుట్టూ తిరుగుతూ మరో అద్భుత ప్రపంచాన్ని ఆనందించే వారికీ ఈ పుస్తకం ఒక మంచి అనుభూతిని మిగిలుస్తుంది. ఇద్దరూ పుస్తకపురుగులు కలిస్తే పుట్టుకొచ్చే పుస్తకాల ముచ్చట్లు ఇందులో కనిపిస్తాయి. అంతకన్నా ప్రతీ పదంలో రచయిత్రి పుస్తక పఠనాభిలాష సుస్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది.

బుక్ స్టోర్ నుండి బయటపడాలన్న హడావిడిలో ఈ పుస్తకాన్ని కొనటం కుదరలేదు. కానీ పదిరోజులవుతున్నా ఆ పుస్తకపు జ్ఞాపకాలు మాత్రం నన్ను వదిలిపెట్టటం లేదు. 200 పేజీలు మించని ఈ రచనని ఐదొందల రూపాయలు పెట్టి కొనాలా అంటే నేనేం చెప్పలేను కానీ పుస్తకం పొరపాటునైనా సరే, తెరిస్తే మాత్రం చదువుతూనే ఉంటారు.

Book Details:

Title: Leave me alone, I’m reading: Finding and Losing Myself in Books

Author: Maureen Corrigan

Publishers: Vintage Publications

Cost: Rs 530 /-

Excerpt of the book here.

You Might Also Like

One Comment

  1. kvrn

    nijamae. pustakapriyulaku manchi pustakamae. kaani dhara yekkuvagaanae vundi.

Leave a Reply