“అల్పజీవి”తో నేను
ఇప్పుడే రావి శాస్త్రి రాసిన ఈ నవల చదవటం అయ్యింది. ఇప్పుడే అంటే ఓ రెండు గంటలవుతోంది. “హమ్మయ్య.. అయ్యిపోయింది” అన్న రిలఫ్ ఉందెక్కడో! మధ్యలోనే ఆపేస్తానేమో అనుకున్నాను చాలా సార్లు. కానీ మొత్తానికి పూర్తి చేసేశాను. రావిశాస్త్రి గురించి చాలా విని ఉన్నాను. ఎలా అయినా ఆయన రచనలు చదివితీరాలన్నంత విన్నాను. అందుకే అల్పజీవి చేతికందగానే ఇక ఆగేది లేదనుకుంటూ చదవటం మొదలెట్టాను. చదువుతున్నప్పుడు “ఆహా” అనుకున్న సందర్భాలూ లేవు. సుమారు 200 పేజీలున్న ఈ నవల చదవడానికి నేననుకున్నదాని కన్నా చాలా తక్కువ సమయం పట్టింది.
కథా-కమామిషు: మొదట్లో చెప్పినట్టు, ఈ పుస్తకం మధ్యలో ఆపేస్తానేమో అనుకోడానికి కారణం, ఇది ఒక “అల్పజీవి” అయిన “సుబ్బయ్య” కథ. బొత్తిగా ధైర్యం లేని మనిషి. ఏది ఎప్పుడు ఎలా చేసినా అది పిరికి చర్యలానే అనిపిస్తుంది. రోజూ అరుగు మీద కూర్చుని బానే పరికిస్తాడు చుట్టూ ఉన్న మనుషులని, దారెమ్మెట పోయే వాళ్ళని. తన భార్యని ఎవడో వచ్చి పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో చెప్తూ ఉంటే కోపానికి బదులు హాశ్చర్యపోయే అల్పజీవి. భార్యతో మాట్లాడాలన్నా పిరికితనం. చుట్టూ ఉన్న మనుషుల్లో ఏదో ఒక్క గొప్పతనం ఆపాదించేసి తనని తాను “అల్పుడి”గా భావించేసుకుంటాడు. అతగాడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసకున్నాయి, అతని పిరికితనం అతణ్ణి ఎందాకా నష్టపెట్టింది, అతను దాన్నుండి బయటపడ్డాడా? లేక ఇంకా కూరకుపోయాడా? ఇన్ని ఘటనలు అతనిలో అంతర్మధానానికి పురికొల్పాయా అన్నది ఈ నవల చదవి తెలుసుకోవాల్సిందే.
కథనం- నవీనం: ఈ పుస్తకాన్ని తెరచి- చదివి -ఆలోచించి కాసేపు- ఇప్పుడిది రాస్తున్నానంటే అది కేవలం ఈ నవలలో కథనం వల్ల. కొన్ని సినిమాల్లో ఒక పాత్ర తెర మీదకి రాగానే, ఫ్రీజ్ చేసి ఆ పాత్ర బాక్‍గ్రౌండ్‍ని వాయిస్ ఓవర్ ద్వారా తెలుపుతారే..అలా ఉంటుంది ఈ రచనలో ప్రతీ పాత్ర పరిచయం. కథ చెప్తూ చెప్తూ ఒక పాత్ర ప్రస్తావన వస్తుంది. ప్రస్తావన రాగానే ఆ పాత్ర పూర్వాపరాలు మన ముందు నిలుస్తాయి. ఆ పాత్ర ఒక్క రూపురేఖలూ, స్వభావాలు, ఆచారావ్యవహారాలు, గతాలు పూర్తవ్వగానే అంతకు ముందు ఏ సీనులో కథ ఆగిందో మళ్ళీ అక్కడే మొదలవుతుంది. ఇక చాలా నవల్లో సహజంగా కనిపించే పేరాలకు పేరాలు రాస్తూ సీన్ని వివరించడం కానీ, ఎడతెరగని డైలాగులు ఈ నవలలో చాలా అరుదు. ఇందులో ప్రతీ లైన్లో ఒకే ఒక్క లైన్ లో ఉంటుంది. అప్పుడే పాత్ర స్వగతంలో మాట్లాడుకుంటూటుంది. తర్వాతి లైన్లోనే నరేటర్ ఆ పాత్ర ఏం చేస్తుందీ చెప్తుంటాడు. కానీ ఎప్పుడూ మనమేం తికమకపడం, పఠనాప్రవాహం ఆటంకం లేకుండా పోతూనే ఉంటుంది. దాదాపుగా పుస్తకంలో ఒక్కో లైనులో ఒక్కో వాక్యమే ఉంటుంది.
భయం-భయం నిత్య బతుకు భయం: ఈ పుస్తకం నాతో పాటు చాన్నాళ్ళ పాటు ఉండిపోతుంది అన్న నమ్మకాన్ని కలిగించింది “ఆఖర్నో మాట” అంటూ రావి శాస్త్రి గారు ఉటకించిన ఈ కోట్: “Courage is reckoned the greatest of all virtues; because, unless a man has that virtue, he has no security for preserving any other.” ఇది శామ్యూల్ జాన్సన్ అన్నారట. ఈ పుస్తకంలో అల్పజీవి అయిన సుబ్బయ్యకు కూడా కాస్తంత ఆత్మచింతన కలుగుతుంది చివర్లో. ఖచ్చితంగా ఇక పై ధైర్యంగా ఉంటాడా అంటే ఏం చెప్పలేం కానీ, అసలు ఆలోచనైతే ప్రారంభం అవుతుంది.
తెలుగు సాహిత్యంలో విరివిగా వినిపించే పేరు రావిశాస్త్రి రాసిన ఈ “అల్పజీవి”. ఈ పుస్తకంపై “ఈ మాట”లో వ్యాసం ఇక్కడ.
మాలతి గారి రీడింగ్ లిస్టు | పుస్తకం
[…] 2. రాచకొండ విశ్వనాథశాస్త్రి – ఆరు సారా కథలు, ఆరు సారో కథలు, అల్పజీవి. […]
పుస్తకం » Blog Archive » నూరేళ్ళ తెలుగు నవల
[…] చదువు (కొడవటిగంటి కుటుంబరావు); అల్పజీవి (రాచకొండ విశ్వనాధశాస్త్రి); […]
పుస్తకం » Blog Archive » నిరుడు చదివిన పుస్తకాలు
[…] పై పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ. […]
పుస్తకం » Blog Archive » గొల్లపూడి గారి రీడింగ్ లిస్టు
[…] మాలతి గారి వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు.) 6.అల్పజీవి – రాచకొండ విశ్వనాథశాస్త్రి […]
పుస్తకం » Blog Archive » తెలుగు సాహిత్యంలో మళ్ళీ మునకలేయాలనుకుంటున్నారా?
[…] అల్పజీవి – రావి శాస్త్రి – దీనిపై పుస్తకం.నెట్ లో ఒక వ్యాసం. […]
రవి
పరిచయం బావుంది. నా పుస్తకాల హిట్ లిస్ట్ లో ఓ పుస్తకం చేర్చారు.
Sowmya
@Bookhermes: That was a nice review.
నాకా సుబ్బయ్య అంటే పరమ అలర్జీ ఉండేది… దేనికీ చేతగాని మనిషి అసలు పెళ్ళెందుకు చేస్కోవాలి అని. నిజజీవితంలో ఇలాంటి బాపతు మనుషులు కనబడేకొద్దీ నాకు మనిషి జీవితంలోని నిస్సహాయత అర్థమైంది.