అహం భో అభివాదయే
ఒకానొక కాలపరిధిలో సమాజపు తీరుతెన్ను, ప్రజల ఆలోచనా విధానం, సామాజిక, సాంస్కృతిక విశేషాలు, వేళ్ళూనుకున్న విలువలు, వీటి గురించి తెలుసుకోవాలంటే, అప్పటి సమాజానికి చెందిన ప్రముఖ వ్యక్తులను, వారి జీవన విధానాన్ని గురించి తెలుసుకోవటం ఓ చక్కటి పద్ధతి. ఈ ఒరవడిలో రచనలు సాగించిన రచయిత, భాషాసేవకుడు తిరుమల రామచంద్ర గారు.
తిరుమల రామచంద్ర గారు ఉద్యోగ రీత్యా, విలేఖరిగా, పత్రికా రచయితగా ఉన్నప్పుడు, సామాన్యుల నుంచి, అసామాన్యుల వరకు ఆయన కలుసుకున్న వివిధ వ్యక్తుల గురించి, వారిలో ఆయన చూసిన ఏదో ఒక మంచిని, మరేదో ఒక మించును ఉటంకిస్తూ ౩ పుస్తకాలుగా వెలువరించారు. వాటిలో ఒకటి “మరపురాని మనీషులు” కాగా, రెండవది తెలుగు వెలుగులు, మూడవది అహం భో అభివాదయే.
ఎవరైనా పెద్దలను కలుసుకున్నప్పుడు, ఓ వటువు (బ్రహ్మచారి) తన ప్రవర (గోత్రనామాదులు) చెప్పుకుని, అభివాదం చేయడం ఒక ఆచారం, సంప్రదాయమూనూ. అలా అనేకమంది ప్రముఖులకు “అహం భో అభివాదయే” అంటూ ప్రణామాలర్పిస్తున్నారు రామచంద్ర గారు.
ఈ పుస్తకంలో ఉన్న వివిధ వర్గాల మహానుభావులను చూద్దాం.
సాహిత్యం – విశ్వనాథ వారు, యుగకవి పుట్టపర్తి నారాయణాచార్యులవారు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, ప్రాచ్య కవితా కోకిల సరోజినీదేవి,వేలూరి శివరామశాస్త్రి గారు, పింగళి లక్ష్మీకాంతం గారు, రాయప్రోలు వారు, బైరాగి …….
పత్రికా సంపాదకులు : పప్పూరు రామాచార్యులు, సురవరం వారు, అడవి బాపిరాజు గారు…
రాజకీయ నాయకులు : డాక్టర్ పట్టాభి, లాల్ బహుదూర్ శాస్త్రి, జవహర్, గాంధి, అణ్ణా, కామరాజ్ నాడార్, బూర్గుల వారు ….
సంగీత విద్వాంసులు : ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి, నాదస్వర సుధాలహరి దాలిపర్తి పిచ్చిహరి, ఉస్తాద్ బడే గులాం అలీఖాన్, షేక్ చినమౌలాలి
ఇంకా వాలంటీనా తెరిష్కోవా, మొక్కపాటి వారు,డాక్టర్ చంద్రశేఖర్, బళ్ళారి రాఘవ ఇంకా అనేకమంది…
ఇంతమంది విభిన్న రంగాల వారిని, వారి వారి రంగాలలో వారి ప్రతిభాపాటవాలను, వైయక్తికంగా, ఆసక్తి కరంగా పరిచయం చేస్తారు తిరుమల రామచంద్ర గారు.
స్థాలీపులీకంగా ఓ రెండు మూడు సందర్భాలు పుస్తకంలోనివి.
నిజమైన కవి బైరాగి – ఈ వ్యాసంలో కవిని పరిచయం చేస్తూ,
“వీరులు నీలకంఠులు మృత్యుంజయులు
వేదనల విషం తాగి జనతకు, మహితకు,
సమతామృతం పంచుతారు
మృత్యువు వారికి చేస్తుంది జోహారు
వగపు వలదు
ప్రతిచెర ఒక తిరుపతిగా
ప్రతిశిల ఒక తిరుమలగా
పూజించే రోజులు ముందున్నాయి!”
అని ఘంటాపథంగా ఘోషించాడు ఆలూరి బైరాగి, అత్యయిక పరిస్థితి రోజుల్లో నిర్భయంగా, మందవేసే మనః ప్రవృత్తి, ఇచ్చకాలాడే పిచ్చిచేష్ట, పదవులకోసం ప్రాకులాడే పైరవీ కంచుకాగడా వేసి వెదికినా కానరాని కవితామూర్తి ఆలూరి బైరాగి…..ఆయన “నూతిలో గొంతుకలు” కవిత జున్నుగట్టిన కావ్యం.
అడవి బాపిరాజు నవలల గురించి చెబుతూ –
“బాపిరాజు గారి నవలలోని నాయకుడు మొదలు తక్కిన పాత్రలంతా ఆయన పరిసరాలలోని పరిచితులైన జీవులే. నారాయణరావు ముష్టి లక్ష్మీనారాయణ అనే కాంగ్రెస్ యోధుడు.ఆయన నవలలలో హిమబిందు తర్వాత గొప్పది తూఫాను. దాని నాయకుడు ఆయన గురువైన ప్రమోద్కుమార్ చటర్జీ. తూఫానులో నా దేశ యాత్రానుభవాలను బాపిరాజు గారు వాడుకున్నారు…”
అరుదయిన వ్యక్తుల పరిచయాలను మరింత అందంగా పరిచయం చేసిన ఈ పుస్తకం ఇప్పుడు దొరకడం అరుదయ్యింది.
Aham Bho Abhivaadaye (Tirumala Ramachandra)
ప్రాకృత అకాడెమీ వారి ప్రచురణ. విశాలాంధ్రలో ఒకప్పుడు విరివిగా దొరికేది. అప్పట్లో వెల ౫౦/-. ఇప్పుడు ముద్రణ నిలిపివేసినట్టు కనబడుతుంది.
పుస్తకం » Blog Archive » తిరుమల రామచంద్రగారి “హంపీ నుంచి హరప్పా దాకా”
[…] ఉత్సాహంగా పాల్గొంటున్న రోజులు. “అహంభో అభివాదయే“, “మరపురాని మనీషి” (ఇది పుస్తక […]
Sowmya
పుస్తకం పేరే నాకు ఆ పుస్తకం ఏమిటో చూడాలి అన్న కుతూహలం కలిగించింది 🙂 పుస్తకాలను చదివించేలా రూపొందించడంలో పేరు పాత్ర కూడా సుమారుగా ఉందేమో మరి 😉 పరిచయం బాగుంది. ఇలాగే మీరు మరిన్ని తిరుమల రామచంద్ర గారి రచనలని పరిచయం చేయగలరు.