ఊరిచివర – కవిత్వదేహం

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
*************************
అఫ్సర్ కవిత్వాన్ని ఒక అంచనా వేసి ఏడెనిమిదేళ్ళవుతుంది. ఒక కవి జీవితంలో దాదాపు ఒక దశాబ్ద కాలం తక్కువేమీ కాదు. “తరువులతిరసఫలభారలగుచు” తరహాలో అనుభవభారంతో కవి వంగాలి.జూలు విదిలించుకొనే ఊహలను కట్టడి చేసుకొని ,అర్థవంతమైన భాషలో కుదురుగా కవిత్వం చెప్పగలగాలి.అంతేగాని, నానాటికి తీసికట్టు నాగంభొట్లుగా తయారు కారాదు.

ఇందులో నలభై ఎనిమిది కవితలున్నాయి.గురితప్పిన బాణాల్లా ,ఎప్పుడోగాని ఏ ఒక్కటీ గుండెను తాకదు. కవికి ఎందులోనూ తాదాత్మ్యం లేదు. భాష పట్ల మెలకువ సున్న.కవితా ప్రక్రియ పట్ల చూపవలసిన కనీస మర్యాద హుళక్కి. పద్యాన్ని ఎక్కడ ఆపాలో తెలియదు.కవిమిత్రులు రాసిన ఆప్తవాక్యాలతో మరింత కంగాళీగా తయారైంది వ్యవహారం.పుస్తకాన్ని మూసి పెట్టి పాఠకుడు పారిపోయేది ఊరి చివరకే. అది ఎట్లన్నన్…

మొదలునుండి చివరి దాకా ఏ కవితను తిరగేసినా కనిపించే పదాలు రెండు : దేహం,నెత్తురు వాటి పర్యాయపదాలు (శరీరం,వొళ్ళు;రక్తం).ఇంకా ముందుకు పోతే శవం/మరణం/తెగి(పడటం).ఇంతేనా ఈ కవి పద సంపద (diction) అనిపించక మానదు.దేహం,నెత్తురు లేని కవితలు గాలించి పట్టుకోవడం అంత తేలిక గాదు.
అలా వెతగ్గా ,ఫర్వాలేదు అనిపించే ఒక కవిత : కొయ్యకన్ను.ఈ కవితకు మరో ప్రత్యేకత వుంది.కేవలం ఒక్క పుటకే పరిమితం.తనదైనటువంటి అనుభవాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది.తతిమ్మా కవితల్లాగే ఇందులోనూ బొత్తిగా లయ లేదు.అంగ్లంలో tone-deaf అంటూ వుంటారు ,ఇలా రాసే కవులను.

కొయ్యకన్ను

అతన్ని రోడ్డు దాటిస్తున్న
ఆ కర్ర చప్పుడు
నా వెనుక నీడలాగా.

తెరచుకునే వున్న అతని చూపు కింద
ప్రపంచం వొక శూన్యపు గులకరాయి.
గిరగిరా తిరుగుతూనే వుంటుంది.
అనేకార్థాల
అనేక వర్ణాల చక్రంలాగా.

అతని కళ్ళ కింద పొందిగ్గా
వొదిగి కూర్చున్న వాటి అర్థాల కోసం
వెతుక్కుంటూ వుంటాను

అసలు అర్థం ఏమిటా అని
అదే పనిగా శోధిస్తూ వుంటాను.
ఈ లోపు అతను రోడ్డు దాటి వెళ్ళిపోయాడు.

నేను
రోడ్డు మధ్యలో
చిక్కుబడిపోయాను.
కొయ్యబారిన కన్నుతో.

ఇది కవి మానసికావస్థను సూచిస్తుంది. కొయ్యకన్ను వల్ల అఫ్సర్ కవిత్వానికి ఎంతో నష్టం జరిగిపోయింది.దేహాన్ని దాటి చూడలేకపోవడం అందులో మొదటిది.
(Take me home,country roads అన్న కవితలో మాత్రం ” అన్నీ విడిచి వచ్చిన వివస్త్ర ఆత్మ ” అంటున్నాడు-దేహం కాదు- అంటే ఇంకా ఎక్కడో కొసప్రాణం ఉంది కవిలో.)

శ్రీ శ్రీ మానవుణ్ణి శరీరపరీవృతుడా అని సంబోధిస్తాడు ఒక కవితలో. అది శ్రీ.శ్రీ తాత్విక ధోరణిలో భాగం ,శరీరాన్ని మించిన అస్తిత్వాన్ని కవి ఊహించగలుగుతున్నాడు అని రా.రా గొప్పవ్యాసం రాసి ఉన్నాడు.

రెండవది మరీ ముఖ్యమైనది కవికి తనదైనటువంటి దృష్టి నశించింది. తాత్వికధోరణి తలెత్తడమే లేదు.నెత్తుటిదేహంలో కవి బందీ ఐనాడు. కాబట్టి,వచన చెరసాలలో నిలువునా మగ్గిపోతున్నాయి అతని కవితలు. బొత్తిగా లయలేని కవిత్వం;అంతేగాక తాత్వికతలో భాగమైన ముగింపు శిల్పం లేదు. అభిప్రాయాలు, దీర్ఘవచనాలు, నిర్వచనాలు కలగాపులగంగా కనిపిస్తున్నాయి.

చివరికి

ఎవరొస్తారో ఈ ఊరి చివరకి
ఆకాశం కూడా వేలు విడిచిన
దిక్కులేని దేహం కొసకి
మాటలన్నీ రాలిపోయి
మోడై నిలిచిన చెట్టుకొసకి

ఎవరొస్తారో ఈ వూరి చివరికి?
వొళ్ళంతా పిడచకట్టి
పగిలిపోయిన చెరువు వొడ్డుకి
వొక్క దేహమే వెయ్యిముక్కలయిన
శకలాల ఎముకల కలలతోపుకి
ఎవ్వరొస్తారో ఈ ఊరిచివరకి?

ఈ సంకలనంలో ఒక్క పుటలో ఒదిగిన కవితల్లో ఇది ఒకటి. మొదటి సగంలోనే ‘దేహం’ ప్రత్యక్షమైనా పెద్ద ఇబ్బంది లేదు. రెండవసగంలో అంతలోనే వొళ్ళంతా అంటూ మరో సారి తెలుగు దేహాన్ని ప్రవేశపెడతాడు.సరే పోనీలే ,అని వదిలేసినా మళ్ళీ వెంటనే ‘ఒక్క దేహమే వేయిముక్కలయిన ‘ అనగానే ఈ కవికి దేహం ఒక
obsession అనిపించక మానదు. ఆపై, ‘ శకలాల ఎముకల కలల తోపుకి ‘ అంటూ abstraction ,అయోమయాన్ని హెచ్చవేసే సరికి ఊరిచివరికి ఎవరూ రారనే చెప్పక తప్పదు.

మరొక చోట ‘ నా మాట / దేహం విడిచిన వస్త్రం’ అంటాడు ,కవికీ పాఠకునికి అదే ఇనుపతెరలా మారిందన్న తాత్వికస్పృహ కలగాలంటే ,కవి మాటల్లోనే –

“..వెళ్ళిపోవాల్సిందే ఎక్కడికైనా,ఎటైనా
ఎడారి దేహంలోకి రాకుండా
దేహం
ఇసక దిబ్బ కాకుండా ..”

లేదా హఫీజ్ మాటల్లో —

” ఇదిగో ఇది కవిత్వ స్నాన సమయం
ఈ నీళ్ళల్లో నిండా మునిగి
దేహాత్మల్ని కడుక్కోండిక .”

( ఊరి చివర, అఫ్సర్ కవితా సంకలనం )

అఫ్సర్ గారి రచనల గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు:
‘ఊరిచివర’ పుస్తకానికి ఎన్.వేణుగోపాల్ గారి ముందుమాట
‘ఊరి చివర’ పై సి.బి.రావు గారి పరిచయ వ్యాసం
‘తెలంగీపత్తా’ కథపై వి.ఎస్.ఆర్.నండూరి వ్యాసం
‘యానాం వేమన ఏమనే కవితపై బొల్లోజు బాబా గారి వ్యాసం

జాలంలో ఇతర లంకెలు:
పొద్దులో అఫ్సర్ గారి నాలుగు భాగాల ఇంటర్వ్యూ మొదటి భాగం ఇక్కడ.
అఫ్సర్ గారి రచనలు కొన్ని ఈమాటలో ఇక్కడ చదవొచ్చు.
ఊరిచివర – సంకలనం పై ఈమాటలో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు.
ఊరిచివర -పై వచ్చిన వివిధ సమీక్షలను అఫ్సర్ గారి ఆన్లైన్ నివాసం లో ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

  1. పుస్తకం.నెట్

    అందరికీ నమస్కారం. ఈ వ్యాసం కింద వస్తున్న వ్యాఖ్యలూ, జరుగుతున్న చర్చలు అసలు విషయం వదిలేసి, వ్యక్తిగత విమర్శలతోనూ, దూషణలతోనూ నిండిపోతున్నాయి కనుక, ఈ వ్యాసానికి వ్యాఖ్యల్ని మూసివేస్తున్నాము.
    -అడ్మిన్

  2. bollojubaba

    నేను అఫ్సర్ గారి అభిమానిని కాను మొర్రో అని డిక్లరేషన్ ఇచ్చి ఈ వాఖ్య మొదలెట్టక్కరలేదనుకుంటాను.

    కవినో కవిత్వాన్నో చట్రాలలో బిగించి చూడటం అనవసరమేమో
    కవిత్వం జీవితపు భిన్న పార్శ్వాలను, దానిలోని బహుళ వైవిద్యాలను ప్రతిబింబించటం సాహిత్యానికి మంచిదే కదా.
    ఊరిచివర సంకలనం నాకు పఠనానందాన్ని కలిగించింది. అందరికీ అలానే జరిగుంటుందని నేను అనుకోను.

    అదే విధంగా ఆ పుస్తకం చదివిన కొందరికి నచ్చనంత మాత్రానా అందరికీ అలానే జరిగే ఉంటుందని భావించటం ఎంతవరకూ సమంజసం. ఇది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న

    నాకైతే ఈ పుస్తకంలో బహుముఖాలతో జీవితం దర్శనమిచ్చింది. ఇదే పుస్తకాన్ని చదివిన నా కొంతమంది మిత్రులను విచారించగా, ఇక్కడ కొంతమంది వెలిబుచ్చినంత వ్యతిరేకతనేమీ వెలిబుచ్చలేదు.

    ఇక భూషణ్ గారి గురించి
    ఓ పెద్ద మాస్టారు తన వద్దకు సందేహనివృత్తి కోసం వచ్చిన కుర్రాడితో “ఒరే య్ అబ్బాయ్ నువ్వు పలానా పదానికి అర్థం ఏమిటని నన్ను అడగకూడదురా అది నాస్థాయి కాదు, మాస్టారు మాస్టారూ పలానా పదానికి అర్థం ఇదని చెప్పేసాను దాన్ని అందరూ తప్పు అంటున్నారు ఇప్పుడు నేను ఎలా సమర్థించుకోవాలో చెప్పండి సారూ- అని అడగాలిరా – అదీ నా స్థాయి” అన్నాడట

    అలాగ భూషణ్ గారు పై పుస్తకాన్ని సమర్థిస్తూ కూడా రాయగల పండితులు. ఆయనకు చెప్పగలిగేదేముంటుంది?

    కానీ ఈ వ్యాసం మొత్తం మీద కొన్ని వాక్యాల వద్ద నా కళ్ళు పదేపదే నిలిచిపోయాయి, చూపులు చాలాసేపు ముందుకూ వెనుకకు తారాడాయి. అవి ఇవి

    ” కవిని, కవిత్వాన్ని శాసించాలనుకోవడం మీ హ్రస్వదృష్టిని సూచిస్తుంది. ముందు మీ చూపులను, హృదయాన్ని విశాలం చేసి నిసర్గ సౌందర్యాన్ని ఆస్వాదించ ప్రయత్నించండి. ”

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  3. Srinivas Nagulapalli

    “ఊరిచివర పుస్తకాన్ని కనీసం ఒకసారైనా తిరగేయకుండా అభిప్రాయాల్లో ఒకటీ రెండు లైన్లు కోట్ చేస్తూ రచ్చ చేసే ఇంటర్నెట్ సిద్దాంతులు దీనికి మాత్రం సమాధానమివ్వకండి. ప్లీజ్”

    అభిప్రాయాలు రాయడానికి పుస్తకం తిరిగేయనవసరం అన్ని వేళలా అవసరం కాదు. ఇంటర్నెట్ సిద్దాంతుల అవసరం ఎప్పుడూ లేదు. సొంత పేరైనా చెప్పుకోక అభిప్రాయాలు రాయడం, కేలరీలు చూడకుండా ఆహారాన్ని తినడం, పార్టీల మేనిఫెస్టోలు చదవకుండా వోట్లేయడం, అంతెందుకు రామాయణభారతాలు అర్థం చేసుకోకపోయినా ప్రతివిమర్శలు చేయడం, సొంత పైత్యాలతో వ్యాఖ్యలు, విమర్శలు, నవలలు గట్రా రాస్తే- తప్పు కానిది, సొంత అభిప్రాయాలు రాయడానికి పుస్తకం తిరిగేయకుండా రాస్తున్నారు అని గింజుకోవడం ఎందుకు?! ఎటొచ్చీ పుస్తకంలోనివి పంచుకుంటూనేవున్నారు కదా, బాగానే, తెగిడే వారు, పొగిడే వారు. ఇంకేం, నచ్చితే కొంటారు, నచ్చకపోతే కొనరు. ఇదీ ఒక అభిప్రాయమే! “బుడుగోయ్’ మళ్ళీ రాయొచ్చు. ప్లీజ్.
    ——
    విధేయుడు
    _శ్రీనివాస్

  4. budugoy

    ఎవరినైనా తెలుగులో కవిత్వమెలా ఉందని కాజువల్‌గా అడిగామనుకోండి. “అబ్బే ఎక్కడండీ, వాదాలు రొష్టుతో నిండుతున్నాయి పత్రికలు. మంచి కవితలు రాసేవారేరీ” అని పెదవి విరిచేవారే. ఉదాహరణకి : ఇక్కడ వ్యక్తమైన అభిప్రాయాల్లో వాక్యం : “మనసు పెట్టి వ్రాసే కవులు లేని కాలంలో కండగల వాక్యం ఒక్కటి దొరికినా చాలునన్నది నావంటి చాతక పాఠకుల కోరిక. ”
    మీకిష్టమైన కవులెవరని అడగండి. శ్రీ శ్రీ, తిలక్, ఇస్మాయిల్, అజంతా, బైరాగి ఇలా ఎప్పుడో రాసిన కవులపేర్లు చెబుతారు. ఇలా వాదానికి దిగితే తప్ప ఆ లిస్టులో సమకాలీనులుండరు. అదే ఏదైనా ఒక కవి పుస్తకాన్నిచ్చి సమీక్ష చేయమనండి ఏవో రేండు మంచి కవితలు ఉదహరించి భేష్ భేష్ అనే మొహమాటపు సమీక్షలే ఎక్కువ. ఉదాహరణలకోసం ఎక్కడో వెతకఖ్ఖర్లేదు పుస్తకం, ఈమాట, పొద్దులో కవిత్వ సమీక్షలు తిరగేస్తే సరి.
    మంచి కవిత్వ పుస్తకమంటే ఏమిటి? బోలెడన్ని అకవితల మధ్య నాలుగైదు మంచి కవితలుంటే చాలా? పాఠకులు వెతుక్కొని ““యదృచ్ఛా లాభ సంతృప్తం”” అనుకోవడమేనా? మరి అలాంటి కవిత్వాన్ని విమర్శకులేమనాలి?

    అఫ్సర్ గారు ఈమాటలో ప్రచురించిన కొన్ని కవితలు నచ్చీ, ఊరిచివర పుస్తకానికి నెట్లో వచ్చిన సమీక్షలు చూసి ఉత్సాహంగ కొన్నవాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఎవరేమైనా అనుకోండి నాకైతే నాలుగైదు కవితలు మినహా ఈ పుస్తకం నచ్చలేదు. ఊరికే నా డబ్బులు దండగయ్యాయనుకున్నానంతే. కేసీ.ఆర్ ఎవర్నో ఏమో అన్నాడని ఒక కవితా? ఇంకా తెలంగాణ మీద ఒక దీర్ఘకవితో/కథో/కావ్యమో ఉంది దాంట్లో. ఎవరైనా ఈ వీరాభిమానులు అది ఎందుకు మంచి కవితో? నాలుగో సంకలనం వేస్తున్న కవి స్థాయికి ఏ రీతిలో సరితూగిందో విశ్లేషిస్తే సంతోషించే వాళ్ళలో నేను మొదటివాణ్ణవుతాను. నా ఉద్దేశ్యంలో ఆ కవిత బదులు కే.సీ.ఆర్ కు సమాధానంగా ఒక వ్యాసం రాస్తే బోలెడంత మంది చదువుకునే యోగ్యంగా ఉండేది కవి బాధేంటో అర్థమయ్యేది.
    ఈ పుస్తకంలో నాకు నచ్చని మరో విషయం. ఇంజ్యూర్‌డ్ బాట్స్‌మన్ తో హెల్ప్ రన్నర్ ని పంపించినట్టు కవిత చివర్లో ఫుట్నోట్స్ ఇవ్వడం. ఇది సో అండ్ సో కవిత. ఇది దీనివల్ల రాసుకున్న కవిత..ఇది దాని తర్వాత రాసుకున్న కవిత అంటూ…
    (ఊరిచివర పుస్తకాన్ని కనీసం ఒకసారైనా తిరగేయకుండా అభిప్రాయాల్లో ఒకటీ రెండు లైన్లు కోట్ చేస్తూ రచ్చ చేసే ఇంటర్నెట్ సిద్దాంతులు దీనికి మాత్రం సమాధానమివ్వకండి. ప్లీజ్.)

  5. Srinivas Nagulapalli

    “అక్కడ కూడ పేరడీలు ప్రముఖ పాటలకే కానీ చెత్త పాటలకు కాదు, పేరడీలు కట్టించే గుణం ఒక రకంగా కవిత్వానిదే, మీరేమంటారు నాగుల పల్లి గారు?”

    గరికపాటి గారు, మీ సహృదయతకు కృతజ్ఞతలు. కాని ఎవరికి కావాలండి నే నేమంటానో! ఊరికే అనడం కాదు, నిజంగా నిజాయితీగా అంటున్నదే. ఇతరుల అభిప్రాయాలకన్నా స్పష్టంగా వినిపించేది, బాగా అలరించేది సొంతడబ్బానేమో అని చెడ్డ అనుమానం. వెలుగుకన్నా వేడే ఎక్కువ మిగిల్చే రాతలు- ఎవరివైనా ఏవైనా ఎక్కడైనా- అవి పాటలో పేరడీలో కవితలో విమర్శలో, మీ ఇష్టమొచ్చిన ప్రక్రియ పేరు ఇక్కడ పెట్టుకోండి- అవి పూర్తిగా చదివో, అసలే చదవకనో- వెలుగుకన్నా వేడి ఎక్కువ అయితే మాడిన వాసన, సూచన, మసి, బూడిదే మిగిలుతాయేమో అనిపిస్తుంది. ఇంకేం రాయొద్దు దీని గురించి అనుకుంటే మళ్ళీ రాయించారు, అనుకోకుండా.
    —–
    విధేయుడు
    _శ్రీనివాస్

  6. గరికపాటి పవన్ కుమార్

    “ఇలా రాసినందుకు నేనేదో అఫ్సర్ గారి అభిమానిని అనుకోకండి. అతని “ఊరిచివర” నేను చదవలేదు. మీరు ఉటంకించిన కొయ్యకన్ను కవిత మాత్రం అద్భుతంగా ఉంది(అందులో మీక్కావల్సిన లయ లేకపోయినా).”

    భేష్ , చర్చలో పాల్గొనడానికి , సమీక్షను విమర్శించడానికి ,కనీసార్హత పుస్తకాన్ని చదివి ఉండటం. పుస్తకం చదవని వారికి విమర్శలోని లోటు పాట్లు ఎలా తెలుస్తాయో నా ఊహకందని విషయం. దీన్ని బట్టి చూస్తే, భూషణ్ గారన్నట్లు, అఫ్సర్ పట్ల వీరిలో నాకు గుడ్డి అభిమానమే కనిపిస్తుంది కానీ మరొహటి కాదు.ఆ గుడ్డి అభిమానమే వీరిచే పేరడీలు రాయిస్తొందా? గారడీలు చేయిస్తోందా, సరె ఇది మానసిక శాస్త్రవేత్తలకు వదిలేసినా, సాధారణంగా ఇటు వంటి అభిమాన ప్రదర్శన నవతరంగం లాంటి సినిమా పత్రికల్లో చూడ వచ్చు. అక్కడ కూడ పేరడీలు ప్రముఖ పాటలకే కానీ చెత్త పాటలకు కాదు, పేరడీలు కట్టించే గుణం ఒక రకంగా కవిత్వానిదే, మీరేమంటారు నాగుల పల్లి గారు? “తెలుగు వీర లేవరా” కి కూడా దారుణమైన పేరడీ ఉంది కదా…

    ““ఎప్పుడోగాని ఏ ఒక్కటీ గుండెల్ని తాకదు” – అలా గుండెల్ని తాకిన వాటిని కూడా ఉదహరించాల్సింది. మీ గుండెల్ని తాకే ఆ మృదువైన పదచిత్రాలేమిటో మాక్కూడా కాస్త తెలిసేది. మీ వ్యాసానికి కాస్త ప్రామాణికత వచ్చుండేది.”

    మీ అభిప్రాయం లో valid point ఉంది. కానీ , మీరు ఊరి చివర చదివి దాని మీద వచ్చిన విమర్శను ఒకటికి రెండు సార్లు పరిశీలించిన మీద మీ అభిప్రాయం రాసి వుంటే మీ రాతలకు ప్రామాణికత వచ్చి ఉండేది. పేరడీలు ,గారడీలుచూసిన మాబోటివారెవరైనా మీరెంచుకున్న దారి డొంక దారే అనాల్సుంటుంది. మీరు ఊరి చివర చదవనేలేదాయే, ఎంతసేపూ ఈవ్యాసానికి, ఊరి చివరి సంబంధం లేని భూషణ్ విమర్శ పుస్తకమూ, కవితలపైన చర్చ గా మారుస్తున్నారు? సత్తా ఉంటే మీరూ భూషణ్ కవిత్వం మీద గాని, “నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు” మీద కానీ సహేతుక విమర్శ పుస్తకం లోనే చేయవచ్చు..

    గరికపాటి పవన్ కుమార్

  7. ari sitaramayya

    అఫ్సర్ గారూ, భూషణ్ గారూ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు.
    ఇద్దరూ మంచి మనుషులు.
    సాహిత్య ప్రియులు అని చెప్పనవసరం లేదు.
    భూషణ్ గారి అభిప్రాయం ఆయన రాశారు.
    అది నచ్చకొపోతే ఎందుకు నచ్చలేదో రాయాలి గాని విమర్శకుడు “అగ్రహారాలు దాటి వాటిని చూడలేని స్థితిలో వున్నా” డు అనీ, “చంక పరిమళాలనే ఆస్వాదిస్తూ గడిపే” స్తున్నాడనీ, కారణం “వారసత్వపు అభిజాత్యపు లక్షణమే” అనీ, ఇలా రాయటం అసభ్యంగా ఉంది.
    ఇలాంటి రాతలను ప్రచురించటం వల్ల పుస్తకం.నెట్ వారి మీద నాకున్న గౌరవం చాలా తగ్గిందని చెప్పటానికి విచారిస్తున్నాను. ఒకవైపు ఇటువంటి వ్యఖ్యానాలను ప్రచురిస్తూ, “దయచేసి, వ్యాఖ్యల్లో సంయమనం పాటిస్తూ, వ్యక్తిగత విమర్శలు చేయకుండా, వ్యాసానికి సంబంధించిన వ్యాఖ్యలు చేయగలరు” అని రాయటం హాస్యాస్పదం.

    విమర్శను సహృదయంతో స్వీకరించే అలవాటు వస్తే తప్ప తెలుగు సాహిత్యం బాగుపడదు.

  8. Srinivas Nagulapalli

    “సంపాదకులుగా మీ బాధ్యత అప్రస్తుత ప్రసంగాలను అరికట్టడం, చర్చను పక్క దారి పట్టకుండా చేయడం.”

    అన్నది చదివితే ఎందుకో “సమీక్షలో” ఇదే అప్రస్తుతంగా అనిపిస్తుంది.

    “సత్తా ఉంటే నేను చేసిన వాదానికి ప్రతి వాదం చేయగలగాలి.”

    సత్తా ఉంటే వాదం మోదంగా ప్రమోదంగా, కాదు, ఆమోదంగా మారుతుందేమో, మారకపోయినా ప్రతివాదం ఉండదేమో అనిపిస్తుంది.
    =============
    విధేయుడు
    _శ్రీనివాస్

  9. Chandra

    “ఎప్పుడోగాని ఏ ఒక్కటీ గుండెల్ని తాకదు” – అలా గుండెల్ని తాకిన వాటిని కూడా ఉదహరించాల్సింది. మీ గుండెల్ని తాకే ఆ మృదువైన పదచిత్రాలేమిటో మాక్కూడా కాస్త తెలిసేది. మీ వ్యాసానికి కాస్త ప్రామాణికత వచ్చుండేది.

    “దేహం అని రాస్తే వచనం, ఆత్మ అని రాస్తే కవిత్వం” ఈ సరికొత్త సిద్ధాంతాన్ని మరికొంత విపులీకరిస్తే వినాలనుంది. ఇప్పుడు అఫ్సర్ గారి పుస్తకంలో “దేహం” అనే పదాన్ని “ఆత్మ” అనే పదంతో రీప్లేస్ చేస్తే మీరు చెప్పిన వచనమంతా కవిత్వమైపోతుందా?

    “దశాబ్ద కాలంలో అఫ్సర్ కవిత్వంలో గుణాత్మక మైన మార్పు కనిపించక పోవడంతో నేను ఆరేడు నెలల క్రిందట రాసిన విపుల విమర్శలో కేవలం మొదటి పుట ఈ సమీక్ష. మొత్తం విమర్శను వీలు వెంబడి ప్రకటిస్తాను.”

    గుణాత్మకమైన మార్పు కనిపించలేదని చెప్పేస్తే సరిపోతుందా? అసలు ఆ గుణాత్మకమైన మార్పు కనిపించలేదని మీరెలా నిర్ణయిస్తున్నారో కూడా చెపాలి కదా. అయినా వ్యాసాన్ని కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లా సీరియల్ గా ప్రచురించడమెందుకు సార్? గుణాత్మకమైన మార్పు కనిపించకపోతే మొదటి పుటని మాత్రం ప్రకటించడమెందుకు? కనిపించలేదని మిగతా పుటల్ని దాచడమెందుకు?

    ఇక మీ కవితలోకి వద్దాం.. ( ఇది అప్రస్తుతం కాదనే అనుకుంటున్నాను)

    నదీ తీరాన
    మృదువైన చేతులతో
    ఇసుకగూళ్లు కడుతూ

    సుదూరపు కొండల నడుమ
    కుంకుతున్న సూర్యుడు

    సూర్యుడు ఇసుక గూళ్ళు కట్టడం ఎప్పటినుండీ మొదలెట్టాడండీ?

    నాకోసం నా ప్రియురాలు
    ఎదురు చూస్తుంది

    మీకోసం మీ ప్రియురాలు కాకపోతే ఇంకెవరి ప్రియురాలో ఎందుకు ఎదురు చూస్తుంది సార్? అక్కడ “నా” అనవసరం కదూ.

    “పెరటి మొక్కలకి నీళ్ళు పొయ్యడం, మృదువైన చేతులతో ఇసకగూళ్ళు కట్టడం” ఇలా సాగిన మీ కవితలో మాత్రం దేహానికి అతీతంగా ఏముంది? దేహానికి అతీతంగా లేదు కాబట్టి మీ కవితకూడా అకవితేనా? లేక మీ కవితలో దాగిన మర్మాన్ని పాఠకులు కొయ్యకన్ను కారణంగా చూడలేకపోతున్నారా? మీరు చెప్పిన ప్రమాణాల ప్రకారం మీ కవిత్వాన్ని తూచడం తప్పు కాదే! మీరే మీ ప్రమాణాలకి తగ్గట్టు కవిత్వం రాయకుండా ఇంకెవరినుంచో దాన్ని ఆశించడం హాస్యాస్పదంగా లేదూ? ఇలా విమర్శించుకుంటూ పోతే ఏ కవితనైనా/కవినైనా విమర్శించెయ్యొచ్చు.

    చెప్పొచ్చేదేమిటంటే విమర్శ అనే గొప్ప బాధ్యతను అర్జెంటుగా తలకెత్తేసుకోగానే సరిపోదు. అవేశాల మీద అదుపుకోల్పోకుండా, రాగద్వేషాలకి అతీతంగా దాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. మీ పై వ్యాసంలో అది లోపించదని స్పష్టంగా తెలుస్తోంది. మీకు నచ్చని వాటిని కవితలే కాదు పొమ్మనడం, కేవలం మీకు నచ్చిన పదం వాడినందుకు ఇంకా ఎక్కడో కొసప్రాణం ఉంది కవిలో అనడం, కవిగా మీ స్థాయిని ప్రశ్నించిన వారిని అఫ్సర్ గారికి దురభిమానులుగా ముద్ర వెయ్యడం మీ సభ్యతని బాగానే సూచిస్తోంది.

    ఇలా రాసినందుకు నేనేదో అఫ్సర్ గారి అభిమానిని అనుకోకండి. అతని “ఊరిచివర” నేను చదవలేదు. మీరు ఉటంకించిన కొయ్యకన్ను కవిత మాత్రం అద్భుతంగా ఉంది(అందులో మీక్కావల్సిన లయ లేకపోయినా).

  10. Venkata Ramana

    1. (విమర్శకు గురయిన కవి గారి అభిమానుల(?) ఆగడాలకు అంతు లేకుండా ఉంది. ఈమాటలో జయప్రభ శబ్ద కవిత్వం మీద చేసిన విమర్శకు ప్రతిగా సదరు కవయిత్రి అభిమానులు ఆమె కవిత్వాన్ని విమర్శించడానికి కవిగా నీ స్థాయి ఎంత ?? తరహాలో దాడికి దిగారు, ఇప్పుడు ఈ చర్చలో నా కవిత్వ ప్రస్తావన ,ఆ పై పేరడీలు రాసిన వారిలాగానే. ఇది చర్చను పక్క దారి పట్టించడం తప్ప మరొకటి కాదు.)

    చర్చను పక్కదారి పట్టించటం ఏముంది. మీరు వ్రాసిన నేటికాలం కవిత్వం తీరుతెన్నులు పుస్తకంలో కవిత్వం ఎలా ఉండాలని చెప్పారో, ఆ కొలబద్ద ప్రకారం మీరు వ్రాసిన పై కవిత మాత్రం ఉందా అని ప్రశ్నిస్తే ఈ ఊకదంపుడు ఉపన్యాసాలేమిటి? ఇకపైగా, ఇది ఎదురు దాడా? అ ఆ లు నేర్చుకున్న పాపడు, తననో బడిపంతులుగా భావించుకొని బత్తెం దరువులు వేస్తున్నట్లుంది మీ వ్యాసం.

    2. (సత్తా ఉంటే నేను చేసిన వాదానికి ప్రతి వాదం చేయగలగాలి. కవిగా నా స్థాయి నేను చేసే విమర్శను ప్రభావితం చేయరాదు. విమర్శకుడు కవి కానవసరం లేదు. కథలు రాయనవసరం లేదు.)

    విమర్శకుడు కవి కానవసరం లేదు. కథలు రాయనవసరం లేదు. అన్నారు. అంటే, మీరు స్వతహాగా విమర్శకులు కాబట్టి, మీరు కవిత్వం పేరుతోనో, కథ పేరుతోనో ఏమి పేనినా దాని గురించి చర్చించ కూడదా?

    ఆ మాటకొస్తే, మీ పై కవితలో వచనం తప్ప, కవిత్వం ఎక్కడైనా ఉందా? ముదురు నీలపు ఆకాశంలోను, వెదురుపొదల గలగలలోను, కదిలే లాంతరు నీడలలోనూ ఏమాత్రమైన కొత్తదనం కనిపిస్తున్నదా?

    మీ కవితను విమర్శిస్తున్నది, మీరు అఫ్సర్ గారిని విమర్సించారనో, ఆయనకు నేనో అభిమానిని అనో కాదు. కవిత్వం ఎలా ఉండాలో కొత్త కవులకు సూచనలు చేసే మీరే ఇలాంటి చెత్త కవితలు వ్రాయటం ఒక ఎత్తైతే, ఆ చేత్తోనే మరొకరు వ్రాసిన దానిని ఎద్దేవా చేయటం మరో ఎత్తు. ఇకా ఒకరి సత్తాల గురించి భేషజాలెందుకులేండి.

    నమస్తే.

  11. రఘోత్తమరావు కడప

    @తమ్మినేని యదుకుల భూషణ్:

    భూషణ్ గారూ!

    క్లుప్తము, సారభూతమూ ఐన మీ సమాధానాన్ని చదివాను. మరికొన్ని సందేహాలను ప్రోది చేసుకున్నాను.

    “దాహామణగిన వెనుక తత్వ మెరిగెదనన్న
    దాహమేలణగును, తా తత్వమేమెరుగు?
    దేహంబుగల అన్ని దినములకు, పదార్థ
    మోహమేలణగు, తా ముదమేల గలుగు!” (అన్నమయ్య)

    “బయలు ఆలయదొళగో – ఆలయవు బయలొళగో (బయలు ఆలయమందో – ఆలయము బయలందో)
    బయలు ఆలయగళు నయనదొళగో? (బయలు, ఆలయాలు నయనమందో)
    నయన బుద్ధియదొళగో – బుద్ధి నయనద ఒళగో (నయనం బుద్ధిలోనో – బుద్ధి నయనమందో)
    నయన బుద్ధిగళెరడు నిన్నొళగో కృష్ణా!” (నయన, బుద్ధులు రెండు నీలోనో కృష్ణా)
    (కనకదాసు – కన్నడ కీర్తన)

    అస్తి, నాస్తి వివాదాన్ని విడిచి చూస్తే పై రెండూ గొప్ప కవిత్వాలు. ఐదువందల ఏళ్ళ తర్వాత కూడా పాఠకుల్ని తమ భావ గాఢతతో విస్మితుల్ని చేస్తాయి.

    తత్వం, కవిత్వం రెండూ “నిర్మలం నయనద్వయం” అన్నట్టుగా ఉంటాయన్నది నా అభిప్రాయం. (ఇక్కడ తత్వమంటే వేదాంతమే!). కానీ మీరు చెబుతున్న ఆధునిక కవిత్వంలో ఉండాల్సిన తత్వాన్ని ఇంకాస్త తెలుసుకోవాలని ఉంది.

    వేదాంతబాహిరమైన బోధనల్ని మెట్టవేదాంతమనాలి. శరీర నశ్వరత్మం, ఆత్మ శాశ్వతత్వం గురించి ఏ ప్రక్రియలో వ్యక్తం చేసినా అది వేదాంతసమ్మతమైన తత్వమే! కాకపోతే నవీనత లేదని తిరస్కరించవచ్చు.

    ప్రాచీనమో, అర్వాచీనామో, మరింకేదో ఐనా తాను వ్రాయదలచుకున్న వస్తువు/విషయం పై “నవనవోన్మేషణ”తో కవి చేసే సృష్టి కవిత్వం. కాలానుగుణంగా భాష, ప్రతీకలు, వ్యక్తీకరణలు మారిపోతుంటాయి. కానీ ఏకాలానికైనా అన్వయించకోదగ్గదే కవిత్వం.

    “ఎవరొస్తారో ఈ ఊరి చివరకి
    ఆకాశం కూడా వేలు విడిచిన
    దిక్కులేని దేహం కొసకి
    మాటలన్నీ రాలిపోయి
    మోడై నిలిచిన చెట్టుకొసకి”

    అన్న అఫ్సర్ గారి మాటల్లో నాకు మెట్టవేదాంతం కనబడలేదు.

  12. తమ్మినేని యదుకుల భూషణ్.

    @పుస్తకం.నెట్:
    ఈ సందర్భంలో సంపాదకులకు ఒక సూచన చేయ దలచుకొన్నాను.
    చర్చను పక్క దారి పట్టించే రాతలను ప్రచురించి మరింత ‘ చెత్త పోయడానికి ‘
    ఆస్కారం కల్పించ వద్దు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఒక
    మంచి సంప్రదాయంగా రూపొందుతుంది. మనం విభేదించే తీరు మన సభ్యతను
    తెలుపుతుంది.
    విమర్శకు గురయిన కవి గారి అభిమానుల(?) ఆగడాలకు అంతు లేకుండా ఉంది. ఈమాటలో జయప్రభ శబ్ద కవిత్వం మీద చేసిన విమర్శకు ప్రతిగా సదరు కవయిత్రి అభిమానులు ఆమె కవిత్వాన్ని విమర్శించడానికి కవిగా నీ స్థాయి ఎంత ?? తరహాలో దాడికి దిగారు, ఇప్పుడు ఈ చర్చలో నా కవిత్వ ప్రస్తావన ,ఆ పై పేరడీలు రాసిన వారిలాగానే. ఇది చర్చను పక్క దారి పట్టించడం తప్ప మరొకటి కాదు.సత్తా ఉంటే నేను చేసిన వాదానికి ప్రతి వాదం చేయగలగాలి. కవిగా నా స్థాయి నేను చేసే విమర్శను ప్రభావితం చేయరాదు. విమర్శకుడు కవి కానవసరం లేదు. కథలు రాయనవసరం లేదు.

    ఈ సందర్భంగా అర్జెంటీనా కవి Borges గురించి తెలుసుకోవడం మనకు లాభిస్తుంది. Borges కవి, కథకుడు వెరసి గొప్ప సమీక్షకుడు ; ఆయన కాఫ్కా రచనలను కొట్టి పారేస్తాడు. అలాగే టాగోర్ కవిత్వంలో రూప పరమైన ఇబ్బందులను ఏకరువు పెడతాడు. కాఫ్కా అభిమానులు కాఫ్కానే విమర్శిస్తున్నావు , రచయితగా నీ స్థాయి ఎంత ?? టాగోర్ అభిమానులు రవీంద్రుడు విశ్వకవి , ఆయన కవితా రూపంలో తప్పులెన్నుతావా ?? అని ప్రశ్నించరు.కారణం , Borges చేస్తున్న సమీక్షకు అతను ఏ పాటి కవి / రచయిత అన్నది అప్రస్తుతం అన్న విషయం సభ్యత గల వారికి తెలుసు. దాన్ని మాటి మాటికి ప్రస్తావించే అప్రస్తుత ప్రసంగులు అవధానంలోలా కాస్త వినోదం పంచగలరు.
    సంపాదకులుగా మీ బాధ్యత అప్రస్తుత ప్రసంగాలను అరికట్టడం, చర్చను పక్క దారి పట్టకుండా చేయడం .

  13. satya

    రాయి కేవలం ముడి సరుకు శిల్పానికి చేయడానికి…
    కాని కేవలం రాయి చూపించి శిల్పం అనలేం…

    భావాలు కేవలం ముడి సరుకు కవిత్వాలు రాయడానికి…
    కాని కేవలం భావాలు రాసి కవిత్వం అనలేం…

    కవిత్వానికి ఆయుష్షునివ్వడానికి (చాలా కాలం గుర్తుండడానికి)
    కవిత్వాన్ని ధారంణ చేయడానికి (కఠస్థం చేయడానికి) ,
    పాటకట్టడానికి,
    శిల్పం( structure) తప్పని సరి..(వస్తువేదైనా సరే!)

    ఒకప్పుడు శ్రీ శ్రీ గారు కూడా కందం రాసినవారే, కానీ
    సిధ్ధాంతాలని పామరులకందిచడానికి కాబోలు భావకవిత్వాన్ని ఎంచుకున్నారు..
    కాని ఆ పదజాలాన్ని వీడలేక పొయారు(క్లిష్టమైన పదాల ప్రయోగం)…
    అది ఆయన సంస్కార బలం( / బలహీనత)…

    ఇప్పుడున్న బ్లాగుల్లో సగానికి పైగా
    ఇలాగే, కేవలం భావాలు రాసి కవిత్వంగా పబ్లిష్ చేసుకుంటున్నారు….

    చివరగా : afsar గారిది పరిణితినొందిన భావుకత!
    -సత్య.

  14. తమ్మినేని యదుకుల భూషణ్

    @రఘోత్తమరావు కడప:

    “ఓ కథ కవితగా మన్నన పొందినపుడు, దేహస్థమైన కవిత ఎందుకు కవిత కాలేదు? దేహమంటే ఎముకలు, నెత్తురేనని చెప్పాడం తాత్వికత కాదా?”
    కాదు. అది మెట్ట వేదాంతానికి దగ్గర. దేహమనగా తొమ్మిది రంధ్రాల తోలు తిత్తి. ఈ తరహా రచనలు
    చాలా కాలం నుండి ఉన్నాయి. చదువు రాని వారు కూడా వాటిని పాడుకోవడం కద్దు. వాటికి మన వారు పెట్టిన పేరు తత్వాలు . బ్రహ్మం గారు ఆయన శిష్యులు రాసిన తత్వాలు మనకు తెలుసు .కన్యాశుల్కం లో రామప్పంతులు ‘ యేవిటీ అప శగునం పాటా ‘ అని విసుక్కొంటాడు ..తర్వాత అది ఇలా సాగుతుంది.
    “కర్రలే చుట్టాలు , కట్టెలే బంధువులు
    కన్నతల్లెవరే చిలుకా ??”

    చిన్న నాడు నేను విన్న ఒక తత్వం.

    ‘గాలి పోతే కట్టే ఒరుగు
    కంప దాకే తొండ పరుగు
    ఎల్ల పాటులు భంగ పాటుకే
    అన్ని దారులు వల్ల కాడికే’ :

    ఇవి పాడుకోవడానికి ఉద్దేశించినవి . వీటిలో భాష పట్ల వివేచన జాస్తి. అయోమయం నాస్తి. పురందర దాసు కృతులు నేను విన్నాను. మీరు ఉటంకించిన వాటిలో రెండవది ఈ ‘తత్వ ‘ సంప్రదాయానికి చెందినదే.
    ఆధునిక కవిత్వంలో తత్వ మన్న పదం ఈ అర్థంలో మనం వాడటం లేదు. కాబట్టి , అఫ్సర్ కవిత్వాన్ని ఈ గాట కట్టి వేయలేము. అఫ్సర్ అయినా మరెవరయినా తత్వాలు రాసుకుంటే నాకు అభ్యంతరం
    లేదు . కారణం , ఆ ప్రక్రియ వేరు. బొల్లోజు బాబా కవిత విషయంలో నేను చెప్పినది ఇదే , ‘narrative poem ‘ అది అనగా కథన కవిత. దాన్ని విమర్శించ వస్తే , ఆ విషయాన్ని గుర్తించి విమర్శించాలి.
    వ్యాధి నిదానం చేసే వైద్యుడు నాడీ లక్షణాలను బట్టి ముందు వ్యాధి నిర్ధారణ చేయాలి . ఆ తర్వాత
    మొదలవుతుంది చికిత్స. విమర్శకుడు ప్రక్రియను గుర్తించడంలో తబ్బిబ్బు కారాదు. నేటికాలపు
    కవులు రాస్తున్న ఆధునిక కవిత్వాలు , వీధి చివర పాడుకునే తత్వాలు ఒకటి కావు. ప్రక్రియలు వేరు కావున, వాటి వాటి విమర్శలు వేరు. ఈ విషయం మీద ఈ ఎరుక చాలు.

  15. పుస్తకం.నెట్

    అందరికీ ఒక విన్నపము:
    దయచేసి, వ్యాఖ్యల్లో సంయమనం పాటిస్తూ, వ్యక్తిగత విమర్శలు చేయకుండా, వ్యాసానికి సంబంధించిన వ్యాఖ్యలు చేయగలరు.

  16. రఘోత్తమరావు కడప

    అఫ్సర్ గారి ఊరి చివర కవిత్వ సంకలనాన్ని నేను చదవలేదు. కానీ కొన్ని వ్యాసాల్ని చదివాను. ఇప్పుడు భూషణ్ గారి విమర్శను చదివాను.

    నా వరకు – కవిత్వాన్ని ఎలా చదవాలన్న చిక్కుముడికి, ఎలా వ్రాయాలన్న మరో చిక్కుముడి పడుతోంది. ఐతే ఇవన్నీ మేధోపరమైన ప్రకంపనలేనని అనిపిస్తుంది.

    అఫ్సర్ కవిత్వంలో తాత్వికత లేమి గురించి సోదాహరణంగా వివరించారు భూషణ్ గారు. చదవడానికి బావుంది.

    కవిత్వం అన్నది ఒకే పదమని దానికి ముందు వెనక తగిలించే కొమ్ములు,తోకలు మన బులపాటాలని నేను తెలుసుకున్నది. బొల్లోజు బాబాగారు కొన్ని నెలల క్రితం ముసలిదంపతుల గురించి ఓ కవిత వ్రాసారు. దానికి వ్యాఖ్యానిస్తూ భూషణ్ గారు దాన్నొక కథనాత్మక కవిత అన్నారు.

    ఓ కథ కవితగా మన్నన పొందినపుడు, దేహస్థమైన కవిత ఎందుకు కవిత కాలేదు? దేహమంటే ఎముకలు, నెత్తురేనని చెప్పాడం తాత్వికత కాదా?

    “భ్రాంతి యెంబ హెబ్బులిగె సిగలు బేడ” (భ్రాంతి అనే పెద్దపులికి చిక్కకు) అని నర్మగర్భంగా చెప్పిన పురందరదాసు “మలమూత్రగళిరువు కీవు క్రిమిగళు, బరియ తొగల మెచ్చి కెడబేడిరో” (మలమూత్రాలు, చీము, క్రిములతో నిండిన ఉత్తి చర్మాన్ని నమ్మి చెడకండి) అని వాచ్యంగా కూడ చెప్పారు.

    నావరకూ ఈ రెండూ తాత్వికత నిండిన కవిత్వాలే. మొదటిది బుద్ధివంతులైన సూక్ష్మగ్రాహులకు చెబితే, రెండోది సాధారణ లౌకికులకు చెప్పింది.

    అఫ్సర్ ఐనా మరొకరైనా కవిత్వం వ్రాస్తే ఖచ్చితంగా ఓ జనసమూహానికో, భావసారూప్య బంధువులకో ఉద్దేశించబడివుంటుంది. వయ్యక్తిక వేదనల్ని, సామాజిక విషయాల్నీ ఒకే వేదిక మీద చేర్చడానికి ప్రయత్నించడమే “ఊరి చివర”లోని లోపం కావొచ్చు. బహుశ ఇక్కడ పాఠకులు కవిని మీరి పరిణితిని చూపాల్సిన అవసరం ఉంది. కానీ ఛందస్సులో లేని కవిత్వాన్ని, శుద్ఢ వచనాన్ని విడదీయగల “లయ” లేకఫోవడమన్నది ఖచ్చితమైన లోపమే.

    మనసు పెట్టి వ్రాసే కవులు లేని కాలంలో కండగల వాక్యం ఒక్కటి దొరికినా చాలునన్నది నావంటి చాతక పాఠకుల కోరిక. “యదృచ్ఛా లాభ సంతృప్తం”

    నమస్సులతో…

  17. తమ్మినేని యదుకుల భూషణ్

    @వడ్రంగిపిట్ట:
    “కాదేదీ కవిత్వానికి అనర్హం అని మహాకవి చెప్పి 70 ఏళ్ళు కావస్తుంది”
    సదరు మహాకవే ‘ఔనౌను శిల్పమనర్ఘం’ అని చెప్పినట్టు గుర్తు.

    ” దేహం, నెత్తురు, ఎముకల గూళ్ళు మిగిలింది ఊరిచివరనే. మీరెలాగు అగ్రహారాలు దాటి వాటిని చూడలేని స్థితిలో వున్నారు కాబట్టే వాటినిక్కడ కవి ఆవిష్కరించాల్సి వచ్చింది.”

    ఆ ఆవిష్కారం కవిత్వం కాలేదు అని చెప్పడమే నా విమర్శ ఉద్దేశం.

    “ఊరి చివరవైపు మీ అడుగులు వేసే ధైర్యం లేదు అన్నది మరో మారు స్పష్టమైపోయింది. నెత్తురింకిపోయిన పదబంధాలే మీకు కవిత్వ పాదాలుగా కనిపిస్తున్నాయింకా.”
    మొదటి వాక్యం అన్వయం కుదిరినట్టు లేదు. అర్థమైనంత మేర మీ పరిశీలనకు చాలా సంతోషం!

    “అవి దాటి రాలేని మీరు ఆ కొంగు చాటునే వుండి ఆ చంక పరిమళాలనే ఆస్వాదిస్తూ గడిపేయండి.”
    ఊరిచివర ‘ఆ కొంగు’ ఎక్కడ నుండి పట్టు కొచ్చారు మహాశయా ?? మీ స్వంత ఇష్టాలు ఇతరులకు ఆపాదించడం భావ్యమా ??

    ” విమర్శించేందుకు ఏమీ దొరక్క జంధ్యపు పోగుల వడుకులోంచి వీటిని బయటకు లాగి గోకడానికి అతి ప్రయాస పడినందుకు కృతజ్నతలు.”

    మీరు ఉటంకించిన మహాకవి భూతాన్ని, యజ్ఞోపవీతాన్నిఅని చెప్పు కొన్నాడు, కాబట్టి , దాన్ని అంత తేలికగా తీసి వేస్తే ఆబోరు దక్కదు. గిరీశం శలవిచ్చినట్టు :
    ” ఇన్నాళ్ళకి జంఝమ్పోస వినియోగంలోకి వచ్చింది. థియాసోఫిస్టుసు చెప్పినట్లు ఓల్డు కస్టమ్సు అన్నిటికీ యేదో ఒహ ప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు యార్పరచారు.ఆత్మానుభావం అయితే గాని తత్వం బోధ పడదు ” .
    ” కవిని, కవిత్వాన్ని శాసించాలనుకోవడం మీ హ్రస్వదృష్టిని సూచిస్తుంది. ముందు మీ చూపులను, హృదయాన్ని విశాలం చేసి నిసర్గ సౌందర్యాన్ని ఆస్వాదించ ప్రయత్నించండి. ”
    మరి విమర్శకుణ్ణి శాసించాలనుకోవడం ఏ దృష్టిని సూచిస్తుందో ?? ఊరి చివర నిసర్గ సౌందర్యం ఉన్నా అది అఫ్సర్ ‘ఊరి చివర’లో వ్యక్తం కాలేదని నా నిష్కర్ష.

    ఆ మాటకే వస్తే గుర్రం జాషువా స్మశాన వాటి పద్యాలు ఈనాటికి ఎందుకు ఆంధ్రులు తలచుకొంటారు.? కారణం, వాటిలో భావమూ ఉంది. దానికి తగిన భాషా ఉంది.ఆ రెండూ లేనప్పుడు హృదయం ఎంత విశాలం చేసుకొన్నా , చూపులు ఆకాశాన్ని తాకినా పాఠకులకు ఒరిగేదేమీ లేదు, తల పట్టుకు పోవడం తప్ప.నేటికాలపుకవులు, వారి (దుర్) అభిమానులతో ఇదే చిక్కు.వేపకాయంత విమర్శను తట్టుకోలేరు. వీరందరూ ఆశించేది కేవలం ప్రశంసలే. విమర్శ అన్న బాధ్యతను తలకెత్తుకొన్నాక పేరులేని పిరికి పిట్టల కూతలకు బెదిరి పోతామా ??విమర్శకునికి లేని ఉద్దేశాలు అంట గట్టడం, కులం /వర్గం /మతం /ప్రాంతం పేరుతో దూషించడం .. ఏ వెలుగులకీ ప్రస్థానం ??
    మనలో నిజాయితీ ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన ప్రశ్న.స్వస్తి.

  18. gajula

    eyes can’t see what mind donot know-mitrulu bhooshan gaari vishleshana alaa vundhi.ayinaa afsargaari kavitvaanni chadivi vishleshana raasi -mee vishleshanatho aayana kavitvaniki vanne thecchinanduku kruthagnathalatho ,vadrangipitta abhipraayamtho ekeebhavistoo….

  19. Chandra

    ఇదిగో వెంకట రమణ గారు,

    భూషణ్ గారి కవిత్వంలో కవిత్వం పాలెంత పెరుగెంత అని ఆడుగుతారా? తప్పు సార్. శ్రీశ్రీ మహాప్రస్థానం తర్వాత భూషణ్ గారి ప్రియురాలి కవితే! తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పగల ఈ కవితని వివరించమని సవరించమనీ అడగడం మీకు తగదు. ఈ కవిత నాకెంత నచ్చిందో చెప్పడానికి మాటల్లేవు. కింది రాత తప్ప!

    నాకోసం నా పని మనిషి

    అంట గిన్నెలను బర బరా తోముతూ
    విదిలిస్తూ మెతుకులను
    చదునెక్కే చపటాలో

    నా కోసం నా పనిమనిషి
    దిక్కులు చూస్తుంది

    నుదురు మీద చెమటలు
    కుదురు లేని చూపులు
    యెదలో సినిమా తారలు

    నా కోసం నా పనిమనిషి
    దిక్కులు చూస్తుంది

    కొళాయి గట్టున
    మసిబారిన చేతులతో
    కసిగా బట్టలు బాదుతూ

    ఇరుకిరుకు బండల నడుమ
    జంకుతున్న వాయువు

    నా కోసం నా పనిమనిషి
    దిక్కులు చూస్తుంది

  20. Venkata Ramana

    భూషణ్ గారండి

    ఈ క్రింది మీ కవితలో కవిత్వం పాలెంతో మీ నేటికాలపు కవిత్వం తీరుతెన్నుల బెంచ్ మార్క్ ప్రకారం వివరిస్తే ధన్యులమౌతాము. బహుశా ఊరి చివరలో ఎందుకు కవిత్వం లేదో కూడా మాకు అప్పుడు విశదమౌతుంది.

    __________

    నాకోసం నా ప్రియురాలు

    పెరటిమొక్కలకు నీళ్ళు పోస్తూ
    అదిలిస్తూ కాకులను
    పదునెక్కే ఎండలో

    నాకోసం నా ప్రియురాలు
    ఎదురు చూస్తుంది

    ముదురునీలపు ఆకాశం
    వెదురు పొదల గలగల
    కదిలే లాంతరు నీడలు

    నాకోసం నా ప్రియురాలు
    ఎదురు చూస్తుంది

    నదీ తీరాన
    మృదువైన చేతులతో
    ఇసుకగూళ్లు కడుతూ

    సుదూరపు కొండల నడుమ
    కుంకుతున్న సూర్యుడు

    నాకోసం నా ప్రియురాలు
    ఎదురు చూస్తుంది

  21. వడ్రంగిపిట్ట

    కుల ప్రస్తావనా, అసభ్య పదజాలం ఉన్నందువల్ల ఒకట్రెండు వ్యాఖ్యలు అంగీకరించలేదు. ఆ సందర్భంలోనే గతంలో ఇ వ్యాఖ్యని ప్రచురించారన్న వ్యాఖ్య వచ్చింది. ఈ వ్యాఖ్య పొరబాటున ప్రచురించడం జరిగింది. ఎవరో వచ్చి చెప్పేదాకా ఈ వ్యాఖ్య ప్రచురించిన విషయం గమనించలేదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాఖ్యను తొలగిస్తున్నాము. ఇది నా వ్యక్తిగత తప్పిదం కనుక, నేనే సమాధానం ఇస్తున్నాను.
    -సౌమ్య. పుస్తకం.నెట్ అడ్మిన్

  22. తమ్మినేని యదుకుల భూషణ్

    @paatakuDu:
    మొదలునుండి చివరి దాకా ఏ కవితను తిరగేసినా కనిపించే పదాలు రెండు : దేహం,నెత్తురు వాటి పర్యాయపదాలు (శరీరం,వొళ్ళు;రక్తం).ఇంకా ముందుకు పోతే శవం/మరణం/తెగి(పడటం)

    పాఠకుడు అందించిన కవిత , ఈ సంకలనంలోని కవితలతో పోలిస్తే ఎంతో మెరుగైనా , ఇది కూడా నా విశ్లేషణని దాటక పోవడం తమాషా అనిపించింది. దేని గురించి రాసినా కవి శరీరాన్నే అంటి పెట్టుకుని ఉండటం గమినించ దగ్గ విశేషం. ఈ కవితలోనూ , నాలుగవ పంక్తిలో ‘వొళ్ళు’ , ఏడవ లైనులో ‘శరీరం’,
    క్రింది నుండి మూడవ లైనులో ‘పై వొంటిని’ కనిపించడం యాదృచ్చికం కాదు.సంతోషించ దగ్గ విషయం
    ఒక్కడుగు ముందుకు వేసి స్మశానాలను , శవాలను ప్రవేశ పెట్టక పోవడం.
    కవిత్వం predictable గా ఉండి, statistical analysis కి లొంగి పోవడం ఒక రకమైన భావ దారిద్ర్యాన్ని , అనుభవ రాహిత్యాన్ని సూచిస్తుంది.

    ఎనిమిదేళ్ళ క్రిందట నేను చేసిన ఆసక్తి గల పాఠకులకోసం ఇస్తున్నాను. తెలుగులో కవిత్వం దినపత్రికల్లో ప్రచురించడం మొదలైనాక వార్తలకు , కవిత్వానికి మధ్య విభజన చెరిగి ఒక రకమైన వార్తా కవిత్వం మొదలైంది. కవి అనుభవాలకు ప్రత్యామ్నాయంగా వార్తా విశేషాలు చోటు చేసుకొనడంతో కవి జర్నలిస్టు వేషం వేసుకొని పాఠకులను హింసించడం మొదలైంది.

    పై లింకులో నేను విశ్లేషించిన ఇద్దరు కవులు పూర్వాశ్రమంలో వార్తా రంగానికి చెందిన వారు కావడం
    గమనార్హం. అది గమనించే , వారి పుస్తకాలను ఒకే సమీక్షలో ఒదిగించాను.
    కవిత్వమంటే బహు క్లుప్తమని, సంక్షిప్తమని గ్రహించి ఆచరించటం తక్షణావసరం. అలాగే ఆవేశాల మీద అదుపు, మాటల్లో పొదుపు కావాలి. ఎవరి అనుభవాల్ని వారు వ్యక్తం చేస్తేనే అందులో నిజాయితీ వుంటుంది; అదే కవిత్వమౌతుంది. మన చుట్టూ ఉన్న జీవితాన్ని నిండుగా అనుభవించి, చెప్పడానికి నిజంగా ఏమైనా మిగిలుంటే, అప్పుడు వ్రాయాలి కవిత్వం.అంతేగాని కవిత్వం వార్తాకథనం కాదు.

    కవి, జర్నలిస్టు పగటి వేషాన్ని తుడిచేసుకొని కేవలం కవి శబ్ద వాచ్యుడిగా నిలబడటానికి ఎంతో ధైర్యం కావాలి. అది మన వర్తమాన తెలుగు సాహిత్యంలో చాలా మంది కవులకు లేదని వారి కవిత్వాలను చూస్తే అర్థమవుతుంది. సద్దాం హుస్సేన్ మొదలుకొని సందులో గొడవ దాకా సకల వార్తలు మనకు కవితా వస్తువులే. మనం అక్షేపిస్తే , ఉద్యమ స్వరాలను అవమానిస్తున్నారు, జీవితం రాజకీయాతీతం కాదు అన్న మేక పోతు గాంభీర్యం; చాలా హాస్యాస్పదంగా తయారైంది సాహిత్య వాతావరణం.

    నాకు అర్థం కాని ప్రశ్న ఈ గొడవలన్నీ కవిత్వంలోకే దిగబడాలా ?? వచనము (వ్యాసం) గొడ్డు
    పోయిందా ?? అంటే అవుననే సమాధానం. ధర్మారావుగారు సెలవి చ్చినట్టు ‘వచనం రాకే వచన కవిత్వం ‘.

    దశాబ్ద కాలంలో అఫ్సర్ కవిత్వంలో గుణాత్మక మైన మార్పు కనిపించక పోవడంతో నేను ఆరేడు నెలల క్రిందట రాసిన విపుల విమర్శలో కేవలం మొదటి పుట ఈ సమీక్ష. మొత్తం విమర్శను వీలు వెంబడి ప్రకటిస్తాను.

  23. paatakuDu

    imkaa Sareeeramoo, dEhaaloo, vaLLoo vadili peTTa lEdee kavi:

    bhoooshaN gaari kOsam.

    http://afsartelugu.blogspot.com/2010/12/blog-post_27.html

  24. sriram

    Please watch
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.