పాఠకలోకం – వంగపల్లి విశ్వనాథం
[ఈ వ్యాసం భారత స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణగా యువభారతి వారు వేసిన – ‘మహతి ‘ అన్న సమీక్షా వ్యాస సంకలనం నుండి స్వీకరించబడినది. ఈ వ్యాసం ప్రస్తుత కాలానికీ వర్తిస్తుందన్న అభిప్రాయంతో, దీనికి ఇదివరలో మాకు తెలిసి ఆన్లైన్ వర్షన్ లేదు కనుక ఇక్కడ దీనిని మళ్ళీ ప్రచురిస్తున్నామే తప్ప, వేరే ఉద్దేశ్యాలు లేవని గమనించగలరు. ఈ వ్యాసం కాపీరైట్ల గురించి ‘మహతి ‘ సంకలనం లో ఏమీ రాయలేదు. కానీ, ఎవరికన్నా సమస్యలుంటే మమ్మల్ని సంప్రదించిన పక్షం లో ఈ వ్యాసం తొలగించగలము. వ్యాసం యూనీకోడీకరించినందుకు వేణూ శ్రీకాంత్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. – పుస్తకం.నెట్]
ఈ ఇరవై అయిదేళ్ళలో అక్షరాస్యులూ పెరిగారు, నిరక్షరాస్యులూ పెరిగారు, అంటే తర్కానికి లొంగని వాదంలా అనిపించినా వాస్తవానికి అక్షరాలా నిజం. పాఠశాలలసంఖ్య పెరిగినా అంతకు మించినవేగంతో పెరుగుతున్న జనాభా పైన పేర్కొన్న వాస్తవస్థితికి భాష్యం చెబుతుంది. ఇది ప్రత్యేకమైన పెద్ద సమస్యగా భావించి ప్రక్కకు వదిలేసినా, విచారకమైన విషయము ఏమిటంటే అక్షరాస్యులైన వారిలో కూడా చాలామంది నిరక్షరాస్యులుగా మారిపోతున్నారు. అంటే చదువుకున్న కాస్తంతా ఉపయోగానికి రాకపోవటంవల్ల (ఆర్ధికస్తితే కారణం కావచ్చు) కాలక్రమేణా ఆ చదువును మరచిపోతున్నారు. మొహమాటానికి అక్షరాస్యులని అనవలసిన ఈ తరహాకు చెందిన వారిని వదిలి వేసినా ఆశ్చర్యపరిచే పరిణామం “విద్యావంతులైన ఎంతమంది పఠనాసక్తిని కలిగి ఉన్నారు ?” అనేది. విషయం తెలుసుకుందామన్న జిఙ్ఞాస లేకపోవటం కారణం కావచ్చు; లేక ఏ సినిమాలో, పేకాటో మరింత ఆనందాన్ని అందించేవనిపించటం కారణం కావచ్చు – విద్యావంతులలో చాలామంది పఠనాసక్తిని కోల్పోయినవారె కన్పడుతున్నారు. విద్యావంతులైన ఎందరి ఇళ్ళలో చెప్పుకోదగిన పది పుస్తకాలు కన్పడుతున్నాయి ? (పాఠ్యగ్రంథాలను మినహాయించి). ’అంటే కొని చదవడమే అవసరమా ? ఎలాగో అలా చదివితే చాలదా ?’ అన్న తర్కం వేరేచర్చకు దారితీస్తుంది. ప్రస్తుతానికి ఆవిషయాన్ని ప్రక్కకు పెడితే ముందుగా గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
అసలు ఎందుకు చదవాలి ? అభివృద్ధికి విద్య ప్రాతిపదిక అయితే విద్యకు ప్రాతిపదిక పుస్తకం. సేకరించుకున్న విఙ్ఞానాన్ని సంరక్షించుకుని తరతరాలకు అందించటానికి ఎంతో ఉపయోగపడుతాయి పుస్తకాలు. వైఙ్ఞానిక, సాంస్కృతిక, సాహిత్యరంగాలలో అభ్యుదయానికి పుస్తకపఠనం ఎంతో దోహదం చేస్తుంది. మస్తకాలకు బూజు పట్టకుండా మనదల్చిన జాతి పుస్తక పఠనాసక్తిని పెంపొందించటానికి శాయశక్తులా యత్నించాలి. పుస్తకం అక్షరాకృతి దాల్చిన ఆలోచనల సముదాయం.
అక్షరాస్యత పెరిగి, విద్యావ్యాప్తి విస్తృతంగా జరగడం అవసరం అనే విషయం స్పష్టమైన ఈ రోజులలో పుస్తకాలు, పత్రికలు, వాటి నిరంతర పఠనం బహుళార్ధసాధకాలుగా ఉపయోగపడుతాయి. వైఙ్ఞానికంగా ఇంత అభివృద్ధి చెందిన ఈకాలంలో పుస్తకాలు – పత్రికలు, రేడియో, సినిమా, టెలివిజన్ మొదలైనవాటితో పోటీపడగలుగుతాయా ? అనే ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పుకోవాలి. పోటీ ఎంత తీవ్రమైనదైనా – పుస్తకం తనస్థానాని తాను నిలుపుకోగలుగుతుందనే చెప్పాలి.
జనాభా దృష్ట్యా ఆలోచిస్తే మనం “పుస్తక క్షామం” అనుభవిస్తున్నామని చెప్పక తప్పదు. “వ్యక్తి శీలానికీ సాహిత్యాధ్యయనానికీ సంబంధం ఉంది” అంటారు గాంధీజీ. అంటే నైతికవిలువల అవగాహనకు, పరిరక్షణకు పుస్తకపఠనం అవసరం. పుస్తకపఠనం మనస్సుకు నవసత్వం చేకూరుస్తుంది, పుస్తకపఠనం అలవాటుగా లేని మనస్సుకు నీరసమే మిగులుతుంది.
పుస్తకం అనే భవనం – రచయిత, ప్రచురణకర్త, పాఠకుడు, విమర్శకుడు అనే నాలుగు గోడలపై నిలబడివుందని భావిస్తే – ఏ వర్గంవారైనా తమ ధర్మాన్ని సరిగా నిర్వర్తించకపోతే, ఆవైపు భవనం కూలిపోతుంది. మరింకేమి మిగులుతుంది ? అందరి సహకారంవల్ల, సదభిరుచులవల్ల కృషి కొనసాగుతే, ఆపుస్తకాలు సమాజకళ్యాణానికి తోడ్పడుతాయి. ఒక్కో పుస్తకం వల్ల ఏదో హఠాత్తుగా మార్పు వచ్చిపడుతుందని కాదు. అది మంచి పుస్తకమే ఐతే, ఎప్పటికైనా తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది.
ఎప్పుడైనా, మంచికన్నా చెడుబలం ఎక్కువ, వేగం ఎక్కువ, ఆకర్షణ ఎక్కువ. మంచిపుస్తకం ప్రభావం కనపడుతుందా ? అన్నది శంకించినా చెడ్డపుస్తకం ప్రభావం వెంటనే కనపడుతుందని నిస్సంకోచంగా నమ్మవచ్చు. మంచిపుస్తకం రావటానికి ఎవరు బాధ్యులో చెడ్డపుస్తకానికీ వాళ్ళే బాధ్యులు, బాధ్యత వారిదైనా, దానివల్ల బాధనుమాత్రము సమిష్టిగా భరించాల్సి వస్తుంది.
పాఠకులంటే ఎవరు ?
వయసులో, వృత్తిలో, ధ్యేయంలో, అభిరుచిలో భేదాలున్నా – అన్ని వర్గాలవారూ పాఠకులే. చదువుకునే పుస్తకాలు కావచ్చు, ఆధ్యాత్మికపరమైన గ్రంథాలు కావచ్చు, ఉబుసుపోక చదివే వార, మాసపత్రికలు కావచ్చు, లేదా సైద్ధాంతికమైన విషయాలను చర్చించే సాహిత్య ప్రత్రికలు కావచ్చు. అంటే – సాహిత్యప్రక్రియలతో నిమిత్తంలేక అచ్చయిన ప్రతిఅక్షరం పఠనీయమైతే చదవటానికి సంసిద్ధుడైన ప్రతివాడూ పాఠకుడౌతాడు.
పాఠకులు వివిధరకాలు. కొందర్ విద్యార్జనకోసం, కొందరు విఙ్ఞానాభివృద్ధికోసం, కొందరు చదవటంలోని ఆనందాన్ని పొందటంకోసం, కొందరు మరింకేమీ లేక కాగితాల్ని తిరుగవేస్తూ బొమ్మల్ని చూడటంకోసం. చాలామటుకు పాఠకుల అభిరుచులకు అనుగుణ్యంగానే పుస్తకాలు వ్రాయబడుతాయి కనుక పైన పేర్కొన్న వివిధవర్గాలు పుస్తకాలలో కూడా కనపడుతాయి.
ఈ పాతికేళ్ళలో పాఠకులు, వారి అభిరుచులు, పుస్తకాలు, వాటి ప్రచురణ, గ్రంథాలయాలు, వాటిబాధ్యత, ప్రభుత్వకర్తవ్యం మొదలైన విషయాలను గూర్చి ఆలోచించేముందు దిగువవిషయాలను పరిశీలించటము మంచిది.
ఈ మధ్య వాణిజ్య ప్రకటనలసంఘమువారి ఆధ్వర్యాన జరిగిన ఒక సర్వేలో వెల్లడియైన విషయాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. మనదేశంలో విద్యావంతులసంఖ్య 11.27 కోట్లుకాగా అందులో వార్తాపత్రికల, ఇతరపత్రికల పాఠకులసంఖ్య 4.3 కోట్లు మాత్రమే ! అంటే చదువుకున్నవారిలో సైతం ఒక మూడవ వంతు మంది మాత్రమే చదవటం అలవాటుగా కలిగి ఉన్నారన్నమాట.
మరొక్క విషయం. మన దేశంలో అమ్ముడైన ప్రతి పత్రికలో ఒక కాపీకి 9.1 పాఠకులున్నారు. అంటే ఇక్కడ ’అరువు పాఠకు’లెక్కువన్నమాట. ఇతరదేశాలలోకంటె కొనకుండా పత్రికలు చదివే జనాభా మనదేశంలో ఎక్కువగా ఉన్నట్లుకూడా తేలుతున్నది. అంటే చదివే ఆసక్తి ఉన్నా కొనగలిగే శక్తిలేకపోవటం కారణంగా పేర్కొని మనం మనని సముదాయించుకున్నా పైన చెప్పిన విషయం – అంటే కేవలం మూడవ వంతు మంది విద్యావంతులకు మాత్రమే పఠనాసక్తి ఉన్నదనే విషయం_సంజాయిషీ చెప్పుకోలేని విషయం అవుతుంది.
విద్యావంతుల సంఖ్య అసలే తక్కువ. ఆ కొద్దిమంది విద్యావంతుల లోనూ విధ్యాభ్యాసం తరువాతకూడా పుస్తకపఠనాసక్తిని కలిగిఉండేవారి సంఖ్య మరింత తక్కువ. పఠనాసక్తి ఉన్నవారిలోకూడా అర్ధికశక్తిలేని కొందరు కారణాన స్వయంగా కొని చదివేవారు మరీ మరీ తక్కువమంది. పోనీ కొందామని ఆసక్తిగా అనుకొన్నా ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా వాస్తవంగా కొని చదివేవారి సంఖ్య ఇంకా తక్కువ. అంటే ’పంచపాండవులు మంచంకోళ్ళలా ముగ్గురేకదా’ అన్నట్లు పుస్తకాలను కొని చదివే పాఠకులు అత్యల్పమని చెప్పవచ్చు. కొనేవాళ్ళు లేరని అచ్చువేయటం తగ్గించటం, అచ్చవుతున్న పుస్తకాలు తక్కువ అయినవని కొనిచదివేవారి సంఖ్య మరింతతగ్గటం ఒకవిషవలయంగా ఏర్పడి భావదారిద్ర్యానికి దోహదం చేస్తుంది. అచ్చవుతున్న పుస్తకాల సంఖ్య పెరుగుతున్నమాట వాస్తవమే అయినా జనాభా పెరుగుదలదృష్ట్యా విద్యావంతుల సంఖ్య పెరుగుదలదృష్ట్యా ఆసంఖ్య గణనీయంగా లేదన్న వాదనలోని వాస్తవాన్ని అర్ధంచేసుకోవాలి. సంఖ్యాబాహుళ్యం సంగతి అటుంచినా, గుణాత్మకంగా యోచించినా, రావలసినన్ని మంచిపుస్తకాలు రావటంలేదు. ’మంచి పుస్తకాలంటే ఏమిటీ ?’ అనే ప్రశ్నకు సమాధానమ్ చెప్పుకునేముందు సామాజిక, నైతిక విలువల పరిరక్షణలో ఇటురచయితలకూ, ప్రచురణకర్తలకూ, అటు ప్రభుత్వానికీ, సమాజానికీ బాధ్యత ఉందన్న విషయం విస్మరించరాదు.
చౌకధరలలో చౌకబారు శృంగారం అందుబాటులో ఉన్నంతవరకు పరిపక్వస్థితి చేరని మానసిక పరిణామావస్థలో ఉన్న వ్యక్తులపై దాని పరిణామాలు ప్రమాదకరమైనవిగా ఉంటాయి. శృంగారం కూడదనికాదు, కానీ ఎలాంటి శృంగారం ? ఎప్పుడు ? ఏ సమయంలో ? ఎలా ? ఏ మోతాదులో అందించబడాలి ? అన్న విషయాలు ముఖ్యం.
పదేళ్ళక్రిందటి పత్రికలు తిరుగవేస్తే మచ్చుకయినా కనుపించని వింత ధోరణులు, ఈనాడు విరివిగా అమ్ముడుపోయి ఇంట్లో ఆబాలగోపాలం చదివే పత్రికలలో విరివిగా కనిపించుతున్నాయి. ఫార్ములా సినిమాలవలె నవలలో విధిగా ఒక Rape Scene, రెండు అక్రమ సంబంధాల కేసులు, సెక్సు స్వాతంత్ర్యాన్నీ, విశృంఖలత్వాన్నీ సమర్ధిస్తూ రెచ్చగొట్టే ఉపన్యాస ధోరణులూ, కథ అవసరాలకు మించిన మోతాదులో కనపడుతాయి. ఇది నిజంగా విచారించదగ్గ పరిణామమే. ప్రభుత్వమూ, చట్టాలూ, అన్నీ చూస్తూ ఊరుకుంటున్నందుకు విచారించటం మినహా చెయగిలిగిందేమిటో ఆలోచించాలి.
మరి మంచి పుస్తకాలంటే ఏమిటి ?
కేవలం ఆనందపరచటమే పరమావధిగా కాక, ఆలోచన రేకెత్తించగలదిగా, పాఠకుడిని కార్యోన్ముఖుడిగా, సదాశయచిత్తుడిగా, ఉదాత్తుడిగా చేయ గలిగినదై ఉండాలి. నిజమే మరి ! ’అన్ని పుస్తకాలు Serious Reading కే అయితే ఉబుసుపోకకుకూడా పుస్తకాలుండవద్దా !’ అన్న వాదన గమనించ వలసి ఉంటుంది.
పుస్తక పఠనం మనిషి ఆలోచనలకొక ఉదాత్తత కల్పించి, స్వార్థపరత్వాన్నీ, సంకుచిత దృష్టినీ అణగద్రొక్కడంలో తోడ్పడటమే కాక విశ్వమానవ సౌభ్రాతృత్వానికి అవసరమైన మానసికస్థితిని కలిగించటంలో తోడ్పడుతుంది. జడత్వం వదలి జగదారాధ్యమయ్యే చైతన్యం పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. అంటే నవసమాజ నిర్మాణం కోసం నేడు జరుగబోతున్న ప్రయత్నానికి పుస్తకాలూ, పాఠకులూ ప్రముఖపాత్ర నిర్వహించవలసి ఉన్నది.
ప్రచురణకర్తల బాధ్యత :
కేవలం వ్యాపారదృష్టితో కాక, సమాజపరమైన బాధ్యత నిర్వహిస్తున్న దృష్టితో, సామాజిక స్పృహతో వ్యాపారాన్ని నిర్వహించాలి. పుస్తకాలను మంచి పుస్తకాలను, అందంగా, ఆకర్షణీయంగా అచ్చువేస్తూ, వాటిధరలను వీలున్నంత తక్కువగా ఉండేలా నిర్ణయించాలి. బూజుపట్టిన పాతపద్దతులను విడనాడి ఆధునికమైన అమ్మకపు విధానాలను అవలంబించి పుస్తకాల అమ్మకాలను, పాఠకులను ప్రోత్సహించేందుకు పూనుకోవాలి. Book Club లూ, ’ఇంటింటా స్వంత గ్రంథాలయం’ ప్రణాలికలూ, పుస్తకాలను గురించి తెలిపే పుస్తకాలూ, వివరణాత్మక Catalogue లూ మొదలైన కార్యక్రమాలు చేపట్టడమే కాక, అడపా దడపా ప్రదర్శనలు ఏర్పాటుచేసి, రచయితలు, విమర్శకులు పాఠకులు, తాము కలిసి కూర్చుని కష్టసుఖాలను చర్చించుకుని ప్రగతిమార్గాన పయనించేందుకు సిద్ధపడాలి. ఇలాంటి చైతన్యం దేశంలో ఇప్పుడే కొద్ది కొద్దిగా అగుపిస్తున్నదని మన రాష్ట్రంలో ఇంకా స్వల్పంగా పొడచూపుతున్నట్లు భావించాలి.
గ్రంథాలయాల బాధ్యత :
కొని చదివే పాఠకులు తెలుగువారిలో తక్కువకావటంవల్ల అసలు చదవటంలో ఆసక్తిగల మరికొద్దిమంది స్నేహితులవద్దనుండి అరువు తెచ్చుకొని గానీ, లేక గ్రంథాలయాలకు వెళ్ళిగాని చదువుకుంటారని భావించాలి.
గ్రంథాలయాల సంఖ్య ఇంకా ఎంతో పెరగాలి. “కేవలం పుస్తకాలను ఒకచోట పోగేసి ఒక బోర్డు తగిలించితే చాలు” అనుకుని తృప్తిపడటంకన్న పాఠకుడికవసరమైన సమాచారాన్ని అందివ్వటంలోనూ, అతడికి పఠన సౌకర్యాలు కల్పించటంలోనూ మరింత జాగ్రత్త వహించటం గ్రంథాలయాధికారులకు అవసరం.
కనీసం ప్రభుత్వధనంతో నడిచే గ్రంథాలయాల కనుబంధంగానైనా Reader’s Club లు ఏర్పాటుచేయటము, అడపాదడపా రచయితలతో ఇష్టాగోష్టులను ఏర్పాటుచేయటము మొదలైనవి నిర్వహిస్తే ఆ గ్రంథాలయాలు నిర్జీవపుస్తకాల సమాధులవలెగాక చైతన్యపూరితమైన విఙ్ఞాన కేంద్రాలుగా, విశ్వ కళాపరిషత్తులుగా, రూపొందించబడటానికి అవకాశం ఉంది. అందుకే ఒక కవి “గ్రంథాలయం ఒక మౌనవిద్యాలయం” అన్నాడు.
సంచారగ్రంథాలయాలు నిర్వహించటం, ఉపన్యాసాలూ, సమావేశాలూ ఏర్పరచటం, పుస్తకచర్చ కార్యక్రమాలు నిర్వహించటం, వీలున్నన్ని ఎక్కువ పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉండేలా ప్రయత్నించటం, పుస్తకాలూ పత్రికలలోని వివిధవిషయాల వివరణాత్మక సూచికలు తయారుచేయటము, అక్షరాస్యతావ్యాప్తికి తోడ్పడటము, మొదలైన వివిధ, విభిన్నసృజనాత్మక కార్యక్రమాలద్వారా పాఠకుడిలో పఠనాసక్తిని పెంపొందించి సమాజ కళ్యాణానికి దోహదపడేందుకు గ్రంథాలయాలు పూనుకోవాలి.
ప్రభుత్వం బాధ్యత :
ప్రత్యక్షంగా అనిపించదూ కనిపించదూకాని పరోక్షంగా ప్రభుత్వంబాధ్యత ఎంతైనా ఉంది. ఎక్కువకాగితాన్ని ఉత్పత్తి చెయ్యటం, కాగితంధరలను అదుపులో పెట్టడం, ముద్రణా సౌకర్యాలను ఉత్పత్తిచేయించటం, పైన పేర్కొన్న గ్రంథాలయాలకు సంబందించిన విషయాలలో ఇతోధికంగా తోడ్పడటం, పుస్తకాలపై తపాలాఖర్చులలో ప్రత్యేకరాయితీలు చూపించటం (ముఖ్యంగా రిజిష్ట్రేషన్ ఖర్చుల్ని నామమాత్రంగా ఉండేట్టు తగ్గించటం), రచయితల సంఘాలను, ముఖ్యంగా ఆ సంఘాల తరఫున ప్రచురణలను ప్రోత్సహించటంలాంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. పుస్తకాలకూ, పాఠకులకూ మధ్య ప్రస్తుతం ఉన్న అగడ్తలను, అగాధాలను భర్తీ చేయటానికి ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర వహించవలసి ఉన్నది. అంతేకాదు, శవసాహిత్యం విచ్చలవిడిగా అమ్ముడు పోకుండా ఉండేందుకై అవసరమైన కట్టుబాట్లను ఏర్పరచటంలో కూడా ప్రముఖ పాత్ర వహించవలసి ఉంది. అంటే ఉద్దేశించిన నవసమాజస్థాపనకు అవసరమయిన వాతావరణం సృష్టించటంతో పుస్తక ప్రచురణలను ప్రోత్సహించటం, పఠనాసక్తిని కల్పించటంలాంటివి ప్రముఖమైన విషయాలుగా పరిగణించి ప్రభుత్వవర్గాలవారు అందుకు పూనుకోవాలి.
పుస్తకవిక్రేతలబాధ్యత :
ఎందుకోగాని పుస్తకాల విక్రయశాలలు నిర్వహింపబడే తీరుతెన్నులు చూస్తే పాఠకులకు వెగటు కలిగిస్తాయో లేదో చెప్పలేము కానీ, ఆకట్టుకునేట్టు ఆకర్షించుకునేట్టు నిర్వహింపబడటం లేదని నిస్సందేహముగా చెప్పవచ్చు. పుస్తకాలు అమ్మేవాళ్ళలో చాలామందికి వాళ్ళ దుకాణంలో వున్న పుస్తకాలలోని విషయాలు తెలిసివుండదు. మరింకేదైనా వ్యాపారంలోనైతే వస్తువు అమ్మేవాడికి తాను అమ్ముతున్న వస్తువుగురించి పూర్తివివరాలు తెలిసివుంటాయి. విక్రేతలు పుస్తకాలగురించి తెలిసి వుండటమేకాక, పుస్తకాలను అమర్చే పద్దతులలో కొత్త ఆకర్షణలు, లేని పుస్తకాలను తెప్పించి పెట్టడంలో ఆసక్తి చూపటం మొదలైన పద్ధతులను అవలంబించడం సమాజాభివృద్ధికి ఎంతైనా అవసరం.
రచయితలు, విమర్శకుల బాధ్యతలు :
రచనను కేవలం ఆనందానికనిగాని, లేక వ్యాపారంగా గాని భావించే వ్యక్తులకు బాధ్యతలంటూ ఉండవు, వారికి ధనం, కాదంటే కీర్తి కావాలి. అంటే ఆకోవకి చెందిన వారిని సాదారకంవారిగా పరిగణించాలి. దేశ శ్రేయస్సును ధ్యేయంగా కలిగిన మేధావివర్గరచయితలుగా వీరిని గుర్తించలేము. రచనల్లోనేకాక, వాటిపై వచ్చే విమర్శలలోనూ నిజాయితీ లోపిస్తుంది. కొన్ని సామాన్యవిలువలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనపడదు.
“ఫలానారకం రచనలను సంపాదకులు అచ్చువేస్తున్నారు కనుక మేము అటువంటి రచనలే చేస్తున్నాం” అని రచయితలు చెబుతున్నారు. ’పాఠకులు ఫలానారకం రచనలనే బాగా ఆదరిస్తున్నారు. కనుక మేము అటువంటి వాటినే ప్రచురిస్తున్నాము. పాఠకుల కోసమేకదా పత్రికలు’ అని సంపాదకులు అంటున్నారు. ’పత్రికలు అటువంటి సాహిత్యాన్నే అందిస్తున్నాయి. కనుక వాటినే చదువుతున్నాము. కాలక్షేపానికి ఏదోఒకటి చదవాలి కదా!’ అని పాఠకులు అంటున్నారు.”
“మన పాఠకులలో అధిక సంఖ్యాకులు మానసికంగా పరిణతి చెందని వారు. అంటే _ కొద్దిపాటి చదువుగల స్త్రీలు, విధ్యార్థులు, ఎక్కువగా పత్రికా సాహిత్యాన్ని పోషిస్తున్నారు. రచయితలు ఎక్కువగా వారి కోసమే రాస్తున్నారు. అయితే ఆ వ్రాయడంలో పాఠకుల అభిరుచిని, సంస్కారాన్ని పెంపొందింపచేసే ఉద్దేశ్యం మాత్రం కనిపించడంలేదు. అధిక సంఖ్యాక పాఠకవర్గంవారి మానసిక బలహీనతలను రెచ్చగొట్టే ప్రయత్నమే రచనల్లో కనిపిస్తున్నది. ప్రస్తుత సామాజిక వ్యవస్థలో స్త్రీలు పడుతున్న బాధలు, దారిద్ర్యసమస్య, పిల్లలపెళ్ళిళ్ళ సమస్య, యువతరం వారి ప్రేమ సమస్యలు, త్యాగాల్, ఇటువంటివి ఈ వర్గంపాఠకులని ఎక్కువగా ఆకర్షిస్తాయి. అందుచేత రచయితలు అటువంటిసమస్యలను గోరంతవాటిని కొండంతగా చిత్రించి రచనల నిండా కుండపోతగా కన్నీళ్ళు కురిపించి, పాఠకులను వశం చేసుకుంటున్నారు. సాధారణపాఠకులు తమ ఊహకందని కలలకు దోహదం చేసే రచనలనే అభిమానిస్తారు. వారికి రచనలలో వాస్తవికత అక్కరలేదు. భావవ్యక్తీకరణ అక్కరలేదు.”
“రచయిత – సంపాదకుడు – పాఠకుడు – ఇది విషచక్రం. ఈ చక్రాన్ని భేదించ వలసిన వాడు విమర్శకుడు. చెత్తరచనలను తెగడడం ఎంత అవసరమో, మంచి రచనలను పొగడడం కూడా అంత అవసరం. మంచి రచనలు ఎప్పుడూ అరుదుగా ఉంటాయి. అరుదైనవాటికి ప్రచారం అవసరం”. “ఏది కృత్రిమమో, ఏది వాస్తవమో విశ్లేషించి చెబుతూ, సాథారణ పాఠకుల్లో అభిరుచిని పెంచవలసిన వాడు విమర్శకుడు. పాఠకుల మానసిక వికాసానికి దోహదం చేయవలసినవాడు విమర్శకుడు. వ్యక్తిగత దురభిమానాలకు లోనుకాకుండా గొప్పరచనలకు ప్రచారం ఇవ్వడం, వాటిని పాఠకుల దృష్టికి తీసుకురావడం అవసరం.”
“మంచి విమర్శకులున్ననాడు, మంచిపాఠకులు ఉంటారు. మంచి రచయితలూ ఉంటారు. ఏభాషలోనైనా సాహిత్యాన్ని సన్మార్గంలో పెట్టవలసినదీ పెట్టగలిగినదీ సద్విమర్శయే !”
పాఠకుల బాధ్యత :
ఎందుకు చదవాలో స్పష్టంగా తెలుసుకున్న పాఠకులు తమ హక్కుల రక్షణకై జాగరూకతతో ప్రవర్తిల్లగలుగుతారు. పాఠకులు కేవలం ఉబుసుపోకకు కాక మంచి గ్రహించే ధ్యేయంతో చదవడం, చదివిన దానిపై ఆలోచన కొనసాగించటం, నలుగురితోనూ తన అభిప్రాయాలను చర్చించి, తెలుసుకోవడం లాంటివి జరుపడం ఎంతైనా అవసరం. అవసరమైతే _ పాఠకుల సంఘాలు ఏర్పడటం మంచి పరిణామం క్రిందే జమకట్టవచ్చు. పుస్తకాలను, కొని చదవటం మంచి అలవాటే అని భావించాలి. ఇంట్లో చెప్పుకోదగ్గ మంచి పుస్తకాలు కనీసం పదైనా ఉండేలా జాగ్రత్తపడాలి.
ఒక సమగ్రమైన పథకాన్ని రూపొందించి, నియమితకాలంలో నిర్ధుష్టమైన లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో కృషిచేయటం అవసరం. మంచి పుస్తకాలు ఎక్కువ సంఖ్యలో అచ్చవటమూ, చౌకధరలకు అందించవడడం, ఎంతో అవసరం. సామాజిక పరిస్థితుల దృష్ట్యా అవసరాలదృష్ట్యా, పాఠకుడ్ పుస్తకం దగ్గరికి రానప్పుడు పుస్తకం పాఠకుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి. దీనికై ఉన్న మార్గాలను వివరించటానికి విషయవిస్తరణ అడ్డువస్తున్నది.
*****************
మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు
సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు
–ఇరివెంటి కృష్ణమూర్తి.
ranjani
@Vangapally Viswanadham: ఈ బ్లాగు పాఠకలోకం తరఫున విశ్వనాథం గారికి ధన్యవాదములు 😀
Vangapally Viswanadham
Thanks Dear Friends. First, to my good friend Acharya Phaneendra, who was instrumental in bringing to the notice of the concerned about my phone number; and more importantly, to the concerned who took pains to contact me. I am grateful to both of them.
It was around 38 years ago, that essay was written. Many issues identified then, are still valid and relavent even now.
I just wanted to use this opportunity, I hope I am not misusing this privelege, to bring it to the notice of all the interested that they can visit: http://www.archive.org and search for Prof. V. Viswanadham, to freely listen to around 400 my lectures, [many in Telugu, and some in English], on various topics relating to Personality Development, Life Skills, Soft Skills, etc. Also, they can freely view about 200 of my power point presentations, by visiting http://www.slideshare.net/viswanadham, and also http://www.scribd.com – please search for viswam.vangapally4581. You are most welcome to give your valuable feedback directly to me: viswam.vangapally@gmail.com
Thanks again to all of you.
With best wishes and regards.
Viswam
పుస్తకం.నెట్
Wow! Thanks a ton! We’ll try to contact him.
Dr. Acharya Phaneendra
Prof.Vangapalli Viswanaadham’s Contact No. is 040-27223383.
Inform him about this post. He will be very happy to see this.