తెలంగీ పత్తా – కథా పరిచయం

రాసి పంపిన వారు: వి.ఎస్.ఆర్.నండూరి

telangiనేను ఈ మధ్య గ్రంధాలయంలో కథావేదిక ౨౦౦౫ కథల సంకలనం (జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు వారి ప్రచురణ). చదివాను. అందులో అఫ్సర్ వ్రాసిన “తెలంగీ పత్తా” కథ నన్ను ఆకట్టుకుంది. మిగిలిన ౧౭ కథలూ కూడా బాగున్నాయి. ఈ వ్యాసం ద్వారా “తెలంగీపత్తా” కథను తమ వెబ్ సైటు పాఠకులకు పరిచయం చేద్దామనుకుంటున్నాను.

కథా పరిచయం:
కథకుడు తెలంగాణాలోని ఓ మాదిరి పట్టణంలో దుకాణంలో సహాయకుడిగా పనిచేసుకొనే ముస్లిం యువకుడు. అతనికి ముస్లిం భాష, సంస్కృతి సంప్రదాయాలపై ఏవగింపు లేకపోయినా, ప్రత్యేకమైన ప్రేమ కూడా లేదు. తాను ముస్లింను కనుక ముస్లిమేతరులనుంచి, తెలుగు మాత్రమే మాట్లాడేవారి నుంచి ప్రత్యేక అస్తిత్వం కలిగి ఉండాలని అతను కోరుకోడు. కానీ అతని, భార్య, బంధువులూ అతని చుట్టూ ఉన్నమస్లిం సమాజం అలా కోరుకుంటూ ఉంటారు. వారంతా తన ప్రత్యేకతను మర్చిపోయి తెలుగుమాట్లాడేవారితో కలసిపోయిన కథకుడిని “తెలంగీపత్తా” అని వెక్కిరిస్తూ ఉంటారు. అయినా కథకుడు వాటిని లెక్క చేయడు. మతపరమైన అభిమానాలు ఆర్థిక దోపిడీలకు అడ్డురావని అతని అనుభవం. ముస్లింలకు ప్రత్యేక కాలనీగా ఉన్న ఖిల్లాలో కాక మామూలు కాలనీలో నివాసముంటాడు. తన కుమారులను కూడా మామూలు వాతావరణంలో పెంచుతూంటాడు. ఇదీ నేపథ్యం.

ఇంతలో బాబరీ మసీదు విధ్వంసం జరుగుతుంది. పసివాడైన కథకుని కుమారునికీ, తోటి ముస్లిమేతర స్నేహితులకీ కారణాలపై అవగాహనలేకుండానే అంతరం పెరుగుతుంది. ఇది మన ఊరు కాదు. మనం మన ఊరికి వెళ్ళిపోదాం అని కలవరిస్తూంటాడు. ఇదే అదనుగా తీసుకొని అతని భార్య ఖిల్లాలోకి నివాసం మార్చాలని ప్రయత్నిస్తుంది. ఎందుకు అనవసరంగా అనుమానాలు అంతరాలు పెరుగుతున్నాయో, ముస్లింగా తనకు భారత సమాజంలో ప్రత్యేక అస్తిత్వం అవసరమో కాదో అర్థంకాక కథకుడు బాధపడుతూండగా కథ ముగుస్తుంది.

తెలంగీ పత్తా.. అన్నీ ప్రశ్నలే, జవాబులిచ్చేదెవరు?

సాధారణపాఠకుడికి తెలియని కొత్తప్రపంచాన్ని(ఆలోచనా ప్రపంచాన్ని) తెలంగీపత్తా పరిచయం చేస్తుంది. సమాజంలో ప్రతి అల్పసంఖ్యాక వర్గానికీ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలన్న తపన ఉండటం, దానికోసం వాళ్లు ప్రయత్నించడం సహజం. ప్రస్తుతం విదేశాంధ్రులు చేస్తున్న పని అదే కదా. కానీ వీరికీ, అధిక సంఖ్యాకులకూ ఉన్న మానసిక అంతరాలు శృతి మించకుండా అస్థిత్వ రక్షణాలోచనలు వెర్రితలలు వేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, దాన్ని నడిపే నాయకులది. ఒకరిపై మరొకరికి మానసికంగా నమ్మకం కలిగించి వారిలోని అభద్రతను పారద్రోలడం చాలా కష్టమైన విషయం. దాన్ని పదవీకాపాడుకొనే ప్రయత్నాలతోనే పొద్దుపుచ్చే నాయకులు చెయ్యలేరు. ఇక అల్పసంఖ్యాక వర్గ నాయకులకి వీరిని మానసికంగా అధికసంఖ్యాకులలో కలసిపోయేలా చూడాలనే ఆలోచనే పాపంలా కనిపిస్తుంది. స్వయంగా ఆపాదించుకున్న అంటరానితనాన్ని కొనసాగించడంలోనే వీరి నాయకత్వాలు నిలుస్తాయి. ఇది కేవలం ముస్లింలకు సంబంధించిన సమస్య కాదు. దళితులు, ప్రవాసులు, అన్ని చోట్లా అంతర్జాతీయంగా ఈ మనస్తత్వం కనబడుతుంది. గత అర్థ శతాబ్దిలో అన్ని వర్గాల మధ్యా ఈ అభద్రత తీవ్రంగా పెరుగుతోంది.

మనమంతా, మానవులంతా ప్రాథమికంగా ఒకటే. ఆర్థికావసరాల్లో నిజంగా ఆదుకొనేందుకు ప్రయత్నించేవాడే స్నేహితుడు. అలా ఆదుకోవడానికి ఆ వ్యక్తిలో అలాంటి బుద్ధి ఉండాలి. ఫలానా కారణం మనం వాళ్లతో కలవకూడదు. వేరు అని చెప్పే నాయకులలో అత్యల్పశాతం తమ అనుచరులను ఆర్థిక అవసరాల్లో బేషరతుగా ఆదుకొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ కఠోర వాస్తవాలను అర్థం చేసుకొనేంత పరిణితి, విద్య సగటు అల్పసంఖ్యాకులలో ముఖ్యంగా ముస్లింలలో, దళితులలో లోపించింది. దురదృష్టవశాత్తు రాజకీయ కారణాలు, పొరుగు దేశాల జోక్యం ముస్లిం సమాజంలో అభద్రతను పెంచి పోషిస్తున్నాయి. మసీదు సంఘటన, పేలుళ్ళకు కారణమా? పేలుళ్ళు, మసీదు సంఘటనకు కారణమా అనేది అనవసరమైన చర్చ. మొత్తం మీద అంతరాలు పూడ్చలేనంతగా పెరుగుతున్నాయనేది చేదు నిజం. విద్యాస్థాయి, ఆర్థిక భద్రత ఎక్కువగా ఉన్న ప్రవాసులలో వర్గచైతన్యం కొంత నియంత్రణలో ఉండటం గమనించవచ్చు.

ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని, చీకటిని, రాబోతున్న ప్రమాదాన్ని పాఠకుల ముందుంచడంలో అఫ్సర్ అద్భుతంగా సఫలీకృతులయ్యారు. కానీ సామాన్యులు భయంకరమైన వాస్తవాలు ఎదురైనప్పుడు అంతకన్నా భయంకరంగా ప్రతిస్పందిస్తారు. అఫ్సర్ వ్రాసిన కథను చర్చకు పెడితే రెండు వర్గాలు ఒకరినొకరు కనీసం ఏడాదిపాటు విమర్శించుకొనేందుకు సరిపడా మేత అందులో ఉంది. అయితే కథానాయకుడు చేతకానివాడులా, పరిస్థితుల ముందు దిక్కుతోచనివాడులా నిలబడటం నాకు నచ్చలేదు. అతనున్న ఆర్థిక పరిస్థితులలో ఆలా చేయడం కష్టమని రచయిత అలా వదిలేసారేమో? కనీసం ఊహల్లో అయినా లేకపోతే మా అబ్బాయిని బాగా చదివిస్తాను. ఈ అనవసర భయాలు సోకని ప్రపంచానికి నీదే ఊరు అని అదగని చోటుకు పంపుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నట్లు చూపితే బాగుండేదేమో? శిల్ప పరంగా కథకు వంక పెట్టాల్సింది ఏమీ లేదు. ఉద్దేశ్యంలోనే( ముగింపుని పాఠకుడికి వదిలెయ్యడం) కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఇలాంటి అయోమయపరిస్థితులలో (ఇదేమీ కథానాయకుడి వ్యక్తిగత సమస్య కాదు) రచయిత సూచనప్రాయంగా అయినా సమస్యకు పరిష్కారం సూచిస్తే బాగుంటుందని నా విశ్వాసం.

You Might Also Like

7 Comments

  1. పుస్తకం » Blog Archive » ఊరిచివర – కవిత్వదేహం

    […] పై సి.బి.రావు గారి పరిచయ వ్యాసం ‘తెలంగీపత్తా’ కథపై వి.ఎస్.ఆర్.నండూ… ‘యానాం వేమన ఏమనే కవితపై బొల్లోజు […]

  2. Srinivas Vuruputuri

    “గెట్ పబ్లిష్డ్” అనే పేరుతో ఖదీర్‌బాబు గారు ఈ మధ్యే ఓ కథ రాసారు (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ). నవంబర్ 26 సంఘటన నేపథ్యంలో రాసిన కథ! ఓ పేద ముస్లిం డ్రైవరూ, మసీదు దగ్గర చెప్పుల్ని కాపలా కాసే తన భార్యా, మసీదు పక్కన నమాజీల దగ్గర డబ్బులు యాచించే వాళ్ళ అబ్బాయీ… భయం పడగ నీడన బిక్కుబిక్కుమని బతికే సామాన్యుడి వ్యధ. “నూరు మంది దోషులు తప్పించుకున్నా ఫరవా లేదు. ఒక్క నిర్దోషి క్షేమంగా ఉండటమే ముఖ్యం” అని ఆరాట పడతారు రచయిత, పక్కన్నే బుక్ ఉండి ఉంటే ఇంకాస్త బాగా రాసేందుకు ప్రయత్నించేవాడినేమో… చదివి చూడండనే సిఫారసుతో ముగిస్తాను.

  3. కెక్యూబ్ వర్మ

    స్వదేశంలో కాందిశీకులంటే యిలాంటివారేనేమోకదా? ఒక మంచి కథను పరిచయం, విశ్లేషణ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అణచివేయబడుతున్న వర్గాల మానసిక క్షోభ ఈ కథలో కంటే కూడా ఎక్కువగానే వుంటుంది. పాకిస్తాన్-ఇండియా క్రికెట్ మాచ్ జరుగుతుంటే అవతలి వాడి చేతిలో ఒక చెత్త షాట్ కి సచినో etc. ఎవడైనా అవుట్ అయితే అంతా ముస్లిం కుఱాడిని ఎలా చూస్తారో చాలా మంది మితృలు చెప్పారు. ప్రతి చోటా అనుమానం దెయ్యంలా వెంటాడే వారి మనస్తత్వం అభధ్రతా భావంతో నిండి వుంటుంది. యిది అక్షర సత్యం. ముగింపు తాను చెప్తే అది కూడా విమర్శకు దారితీసి వుండేదేమోనన్న భావంతో మనకే వదిలేసి వుంటారు అఫ్సర్. ఈ విషయం ఆయన క్లారిపై చేయగలరేమో చూడాలి. మంచికథా పరిచయాన్ని యిచ్చిన పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలు.

  4. కొత్తపాళీ

    మంచి కథని చాలా చక్కగా పరిచయం చేశారు. మీ విశ్లేషణాంశాలు కూడా సముచితంగా ఉన్నాయి. కాలంతో పాటూ, సమాజంతోపాటూ సృజనాత్మక సాహిత్య స్వరూపం అది పోషించే పాత్ర కూడా మారుతూ వస్తున్నాయి. పరిష్కారాల్ని సూచించడం కన్నా ఉన్న పరిస్థితుల్ని సరి కొత్తకోణాల్లో పాఠకులకి చూపించి వారి ఆలోచననని ప్రేరేపించడమే ఈ నాటి కథానిక ముఖ్య లక్షణమని నా ఉద్దేశం. చదివాక పాఠకులు ఎవరి నిర్ధారణ వారు చేసుకోవలసిందే. మీరుదహరించిన ఈ కథ ఆ పనిని సమర్ధవంతంగా నెరవేరుస్తున్నది.

  5. జానీ

    చాల థాంక్స్ . మంచి కథను పరిచయం చేశారు. రాంబాబు గారి అబిప్ర్రాయంతో నేను ఏకిభవిస్తున్నాను. కథనాయకుడి హీరోయిజం సినిమాలకు, కథల వరకే పరిమితం, నిజ జీవితం చాల భయకరంగా ఉంటుంది అటువంటి క్లిష్ట పరిస్తితులో. బాబ్రి విద్వంసం రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి, స్వంత దేశంలో, స్వంత ఊరిలో అభద్రత భావంలో జీవించడం కన్నా ఘోరమైనది ఇంకేది లేదేమో… బహుశ … అఫ్సర్ … అందుకే అలా ముగించి ఉంటారు.

  6. panthangi rambabu

    Hello sir Nanduri gaaru,

    Namasthe.

    I am Rambabu.
    THELANGEE PATHAA katha ithivrutham mee parichaya vyasam dvaaraa thelusukunnanu. chakkani kathanu parichayam chesinanduku dhanyavaadaalu.
    Ayithe.. mugimpu gurinchi mee abhiprayam tho nenu vibhedisthunnanu. Ee kathalo mugimpu ‘open ended’gaa undi. Mainaritee abhadrathaa bhaayanni
    jayinchi, loukika bhavana tho jeevisthunna okaanoka muslim kutumbam.. mathavaadula vidvamsakaara charya phalithamgaa dikku thoochani maha sandigdham lo chikku kunna drysyaanni Afsar chithreekarincharu. Nijamgaa bathuku lo leeni pariskaaram, kathalo mathram yenduku undaali? yelaa untundi? ani nenu prasnisthunnanu.
    Mundu goyyi venuka nuyyi annattunna sthithini alaage open ended gaa ivvadamlo.. Kondari duscharyala valla samaajamlo samarasyam mantagalisi pothunna dusthithini rachayitha samarthamgaa yethi chupithe chaaladaa?
    rachana nikkachigaa parishkaaaram chupalsindenani nenu bhavinchadam ledu.

    Panthangi Rambabu

  7. GURRAM SEETARAMULU

    నండూరి గార్కి దన్య వాదాలు… మీద మీ విశ్లేషణ చాలా బాగుంది..
    సమకాలీన విషయాలని వ్యాఖ్యానించడం లో ఒక అఫ్సర్ దశాబ్దం ముందు ఉన్నాడు ఆ విషయం గ్రహించడానికి..నేటి విమర్శకులు…ఇంకా ఆలోచించాలి … రాసిన కథ స్థానికత చాలా లోతైన తాత్వికత ఉంది..
    కాకుండా ఇస్లాం వాద ముస్లిం వాద చర్చ సమయంలో.. ఆయన మౌనం మనం గమనించవచ్చు …అది అతని పరిణితి..ని సూచిస్తుంది..
    కథకుడిని “తెలంగీపత్తా” అనడం కేవలం పాత్రనే కాదు.. నిజజీవితంలో కూడా ఆ విషాదం చాలామంది లో చూడవచ్చు.. మంచి విశ్లేషణ చేసిన ..మిమ్మలను అభినందిస్తూ ….

Leave a Reply