నెమరేసే పుస్తకాలు

చదవడం – ఈ విషయంలో చిన్నతనంలో నాకో అలవాటు ఉండేది. అదేమంటే, మిరపకాయబజ్జీలు కొన్నా కూడా ఆ బజ్జీల పొట్లం తాలూకు పేపరులో ఏదో విషయం ఉందన్న కుతూహలం. ఆ కుతూహలంతో కనబడిన పుస్తకాన్నల్లా చదివేవాణ్ణి. భోంచేసేప్పుడు కూడా పుస్తకం కరదీపంలా చేతిలో ఉండాలి. లేపోతే ముద్ద దిగదు. అయితే కండిషనేమంటే చదివే కంటెంటు మొత్తం తెలుగులో ఉండితీరాలి.

ఆ అలవాటు నాకు ఉద్యోగంలో స్థిరపడిన రెండేళ్ళకు నన్ను వీడి వెళ్ళిపోయింది. కారణం – ఓషో. ఏ రోజున ఓషో తాలూకు మొదటి ప్రవచనం విన్నానో, ఆ రోజునుంచీ –

Eat philosophy
Sleep philosophy
Drink philosophy

చందాన తయారయ్యింది. ఫిలాసఫీ అంటే ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, తావో, జెన్ – ఇవే. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నా రూము నిండా వీళ్ళ పుస్తకాలు, కాసెట్లే.

బ్రహ్మచర్యం వీడి, పెళ్ళి కాగానే (దాదాపు అదే సమయంలోనే జాలంలో నా బ్లాగు ప్రస్థానమూ మొదలయ్యింది), ఫిలాసఫీతో బాటు ఇతరత్రా పుస్తకాల మీద ఆసక్తీ మెల్లగా నన్ను కమ్ముకోసాగింది.

ఇప్పుడు మా ఇంట పుస్తకాల అరలో – వెనుకవైపున JK పుస్తకాలు, ఒక పక్క తెలుగు పద్యసాహిత్యం, సంస్కృత పుస్తకాలు ముందువరుసలో (చెయ్యికి అందేట్టు..అర్థం కాకపోయినా), మిగిలిన తెలుగు పుస్తకాలు రెండో పక్క, ఒకపక్క చక్కగా పేర్చిన చందమామలు, బొమ్మరిల్లు పుస్తకాలు, ఇటువైపు మూలలో షాడో, మధుబాబు పుస్తకాలు.

పుస్తకాలలో ఒక్కపట్టున మొదట్నుంచి, చివరి వరకూ ఆసాంతం విడవకుండా చదివించేవి కొన్నయితే, అప్పుడప్పుడూ అలా, అలా చదువుకుంటూ నెమరేసుకుంటూ అలా…ఊహలలో తేలింపజేసే పుస్తకాలు కొన్ని. ఈ రెండవ కేటగిరీ పుస్తకాలలో కొన్ని..

1 Krishnamurthy’s Notebook, Krishnamurthy with himself
2 అమృతం కురిసిన రాత్రి
3 ఠాగూరు పుస్తకాలు (కథలు లేదా కవితలు, ముఖ్యంగా నెలవంక, స్ట్రే బర్డ్స్)
4 గీత (భగవద్గీత కాదు, అష్టావక్రగీత)
5 పాత చందమామలు (బౌండు చేసినవి. ఇవి కూడా మార్చి మార్చి చదవడం బావుంటుంది)

పై పుస్తకాలలో ఏవీ కూడా ఇంతవరకూ పూర్తీగా మొదటిపేజీనుంచి చివరి పేజీ వరకు చదవలేదు నేను.అయితే కొన్ని భాగాలు మాత్రం అనేక సార్లు చదివి ఉంటాను.

అవి కాక రెండవశ్రేణిలో కొన్ని పుస్తకాలు. ఇవీ మామూలుగా చదువుతూ ఉండవచ్చు. కొంచెం ఆసక్తి కావాలి. అయితే ఎల్లవేళలా కాదు.

1 అవధానం మీద ఓ పుస్తకం
2 సత్యజిత్ రే కథలు
3 బొమ్మరిల్లు పొట్టి నవలలు
4 సమగ్రాంధ్ర సాహిత్యం
5 షాడో – మధుబాబు నవలలు
6 శ్రీరమణ
కొండొకచో కథలూ…



ఈ మధ్య కాలంలో ఆమూలాగ్రంగా ఒక్కపట్టున చదివించిన పుస్తకం – నా అమెరికా అనుభవాలు – వేమూరి వెంకటేశ్వరరావు గారిది.

ఇదండీ పుస్తకాలకు సంబంధించి నా విపరీతమైన టేష్టు!

You Might Also Like

8 Comments

  1. చంద్ర మోహన్

    యాజ్ఞవల్క్యుడికి జనకునికి జరిగిన సంభాషణలగురించి చదివాను గానీ అష్టావక్రుని గీత గురించి ఎప్పుడూ వినలేదు. రాహుల్ సాంకృత్యాయన్ వ్రాసిన “భారతీయ దర్శనం” లో కూడా అష్టావక్రుని ప్రస్తావన కనిపించలేదు. నెట్లో వెదికితే ఇప్పుడే దొరికింది:
    http://www.messagefrommasters.com/Ebooks/Spiritual-Books/Ashtavakra-Gita.pdf

  2. రవి

    @చంద్రమోహన్ గారు: అష్టావక్ర గీత, సౌమ్య గారన్నట్టు జనకుడికి,అష్టావక్రునికి నడిచిన మధ్య నడిచిన చర్చ సారాంశం. ఉపనిషత్తుల సారం, మహావాక్యాలు, శంకరుని మాయావాదం, గౌతముని శూన్యవాదం, నాగార్జునుని క్షణికవాదం, మొదలుకుని జిడ్డు కృష్ణమూర్తి “Find out” అని ఘోషించే “mutation of brain cells” గురించీ, గుర్జీఫ్ చెప్పిన buffers గురించీ ఏకమొత్తంగా ఒకచోట కలిపిన సారం. ఇది భగవద్గీతకన్నా పురాతనమైనది.

    భారతీయ తత్వచింతన ఇష్టమైన వారికి ఇదొక కరదీపిక.

  3. సౌమ్య

    @Chandramohan: అష్టావక్ర గీత అష్టావక్రుడికి, జనకుడికి సంభాషణ అనుకుంటాను. ఎప్పుడో ఈ పుస్తకం చూశాను లెండి…అప్పుడు ఇంట్రో తెలుసుకున్న జ్ఞాపకం 🙂 తక్కిన వివరాలు రవి గారే చెప్పాలి మరి!

  4. చంద్ర మోహన్

    ‘అష్టావక్ర గీత’ … అదేం పుస్తకం?
    మధుబాబు నవలలు- షాడోవి మాత్రమేనా, జానపదాలు కూడానా?

    GK నుండి షాడో వరకు… మంచి వైవిధ్యం !

  5. రవి

    @సౌమ్య గారు: “ఆంధ్రము – అవధాన ప్రక్రియ” కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి గారి పుస్తకం. చాలా పుస్తకాలున్నవి అవధానం మీద. అందులో ఈ పుస్తకం కాస్త సమగ్రంగా ఉంది.

  6. సౌమ్య

    అవధానం మీద ఓ పుస్తకం – ఏం పుస్తకం? 🙂

  7. వడ్రంగిపిట్ట

    రవిగారు మీ పుస్తకపఠన ప్రియత్వం పట్ల ఆనందంగా వుంది. ఫిలాసఫీ అంటే అవే కాదు. కాస్తా సమాజాన్ని గురించి, వాటిని మార్చడానికి ప్రయత్నించే ఫిలాసఫీలు గురించి కూడా అధ్యయనం చేయగలరు.

  8. SRRao

    ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ…………

    – SRRao

    శిరాకదంబం

Leave a Reply