జీవిత వాస్తవాల శారద
రాసినవారు: ఎ. స్నేహాలత
ఎ. స్నేహలత అన్న కలం పేరుతో రాస్తున్న అన్నపూర్ణ విశాఖపట్నంలో పౌరహక్కుల సంఘంలో కార్యకర్త. న్యాయశాస్త్ర విద్యార్థి.
(ఈ వ్యాసం మొదట ’వీక్షణం’ పత్రిక జనవరి 2010 సంచికలో ప్రచురితమైంది. వ్యాసాన్ని పుస్తకం.నెట్ లో తిరిగి ప్రచురించడానికి అంగీకరించిన వీక్షణం సంపాదకులకి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
************************
ఇపుడిప్పుడే సాహిత్యాన్ని చదువుతున్న దాన్ని. నన్ను చదివించిన ప్రతి పుస్తకం నుండి సంతోషాన్నో, దుఃఖాన్నో అనుభవించాను. ఇంతకు ముందే ‘సాహిత్య బాటసారి శారద’ చదివాను. శారద బతుకు బాట నన్నెంతో కుదిపేసింది. కన్నీటి చుక్కనైపోయాను. గబగబా శారద రచనలు చదవడం మొదలుపెట్టాను. శారద జీవితం, రచనలు నాలో ఎంత చెక్కు చెదరని ముద్ర వేశాయో మొన్నటి నా తెనాలి ప్రయాణం వరకు గాని తెలియదు. తెనాలి స్టేషన్‌లో దిగిన నాకు చప్పున శారదే గుర్తొచ్చాడు. ఇది శారద ఊరు కదూ! అని నా మనసు, కళ్లు ఆ తెనాలిలో ప్రతి చోటా శారదని వెతికాయి. ఆ గాఢానుభూతే ఇది రాసేలా చేసింది.
శారదని చదివి ఏం తెలుసుకున్నానో తెలియదు. కానీ ఇన్నాళ్లు శారదని తెలుసుకోనందుకు, చూడనందుకు దుఃఖం కలిగింది. నిజంగా శారదని చూపించిన మిత్రులని మరువలేను.
శారద పరాయి రాష్ట్రం వాడనో, పరాయి భాష వాడనో ఒక క్షణం కూడా అనిపించనంతగా తెలుగును నేర్చుకున్నాడు. తెలుగును చదివాడు, తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని రచించాడు. శారద ఉన్న చోటు పట్లా, భాష పట్లా కనబరిచిన శ్రద్ధా, ఆసక్తి వెలకట్టలేనివి.
రాష్ట్రాలు దాటొచ్చినా కడుపు కాలక తప్పదనీ, ఆకలి కేకలూ తప్పవన్నాడు. ప్రేమ, హింస సున్నిత హాృదయాన్ని ఎంతగా కదిలిస్తాయో, కుదిపేస్తాయో అనుభవించాడు. ఇంతటి సంక్షోభకరమైన జీవితాలకి సమాజం నిర్ణయించిన నీతి, నియమం, మంచీ, చెడులూ కనీసమైన భద్రతని కలిగించలేవన్న నిజాన్ని నిర్భయంగానే చూపించాడు.
ప్రకృతిలో పుట్టి పెరిగిన మనిషి తోటి మనిషిని మనిషైనందుకే ప్రేమించిన కథనీ, కాలాన్నీ, స్థితినీ మార్చేసిన విలువలు ఎట్లా పుట్టుకొచ్చాయి. ఇలాంటి విలువలనే మోస్తున్న సమాజంలో తెలిసో, తెలియకో చేసే పొరపాట్లకు, తప్పులకు ఒక మనిషి పట్ల, మరో మనిషి చేసే నిర్ణయం ఎలా అంతులేని ఆవేదనని మిగిలిస్తుందో? మనిషినెట్లా అదృశ్యం చేస్తుందో శారద చిత్రించాడు. అంతేనా? బంధాలనీ, ఉద్వేగాలనీ ఎంతగా ఛిన్నాభిన్నం చేస్తాయో ఎవరికెవరం ఏమీ కాకుండా ఏమైపోతామో కళ్లకు కట్టాడు. అందుకే శారదవి ఒట్టిగా, కథలనీ, నవలలనీ అనలేం.
ఒక అసత్యానికి బలైపోయిన పార్వతి చావు ‘ఏది సత్యం’ అని ప్రశ్నిస్తే, బద్దలైపోయిన, బండబారిపోయిన బతుకులతో పద్మ, సరోజినీలు పెద్దల నిర్ణయాల్లోని ‘మంచీ చెడులని నిలదీశారు.
మరోపక్క వసంతం ఆకలి రగిలించిన ‘అపస్వరాన్ని’ వినిపించకుండానే తనువుని చాలిస్తోంది. ఇలా ప్రతీ నవలలోను శారద స్త్రీ జీవితాలన్నీ హృదయ విదారకంగా నిలిచాయి. కడుపు నింపని, స్వేచ్ఛనివ్వని నీతి, రీతి లోకంలో నడుస్తున్నంత కాలం శారద స్త్రీ పాత్రలన్నీ సజీవంగానే ఉంటాయి.
మనిషి లోపలి పొరల్లోని అసంతృప్తులో? అవహేళనలో? భయమో? భక్తో? ఆడంబరమో? అతిశయమో? నాదేననే భావమో? నాది కాదేమోననే అభద్రతో? ప్రతీది కావాలనే కాంక్షో? దక్కదేమోననే ఈర్ష్యో? మనిషినెంత అతలాకుతలం చేస్తాయో అద్దంలా చూపించాడు. ఈనాటి వ్యాపార సంస్కృతిలో పెరిగిపోయిన విధ్వంసానికి, శారద రచనలు మరింత అద్దం పడుతున్నాయి.
శారద రచనల్లోని ప్రతిపాత్ర అభద్రత, ఆకలీ నిండిన కళ్లలో, ప్రేమనీ, మోహాన్నీ, ఉత్సాహాన్నీ, ఉద్రేకాన్నీ మరచిపోయి నైరాశ్యంలో కొట్టుకుపోవడాన్ని చూస్తాం. ఆకలి, అవసరం మనిషిలోని సుగుణాలని, సున్నితత్వాన్ని చంపేయడాన్నీ చూస్తాం.
నటరాజన్‌గా హోటల్ చాకిరీలో మగ్గిపోయాడు. మజ్జిగమ్మాడు. బజ్జీలమ్మాడు. దారిద్య్రంలోనే బతుకీడ్చాడు. ఆకలితో, అనారోగ్యంతో కాలం వెంబడి పరిగెత్తాడు. వ్యసనాలొచ్చి చేరాయి. ఏ అవస్థలోనూ తన గమ్యాన్ని విడిచిపెట్టలేదు. సాహిత్య శ్రమలో మునిగితేలాడు. నటరాజన్‌గా కడుపేదరికంలో కొట్టుకుపోతూనే శారదగా సాహిత్య పూలు చల్లాడు. అవి యుగాలైనా వాడిపోని, చెదిరిపోని పూలు. ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇదిగో ఇలా మనల్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఆర్ధ్రంగా, ఆత్రంగా సమాజం వైపు చూస్తూనే ఉన్నాయి.
********************
శారద కథల సంకలనం – రక్తస్పర్శ పై పుస్తకం.నెట్ లో ఇదివరలో వచ్చిన సమీక్ష ఇక్కడ.
శారద గారి జీవితం, సాహిత్యం గురించి నిడదవోలు మాలతి గారు సమగ్రంగా రాసిన రెండు వ్యాసాలు – మొదటి భాగం, రెండో భాగం – కూడా చదవండి.
అలాగే, ‘సాహిత్య బాటసారి శారద’ పుస్తకం వివరాలు తెలిసిన వారు, ముఖచిత్రం పంచుకోగలిగిన వారూ- ఇక్కడ వ్యాఖ్య రాయండి, లేదా, editor@pustakam.net కు వేగు పంపండి.
ముఖచిత్రం, పుస్తకం వివరాలూ పంపినందుకు జంపాల చౌదరి గారికి ధన్యవాదాలు.
– పుస్తకం.నెట్
Potikuchi balasundaram
lalita gari sapndana akshra satyaalu
జంపాల చౌదరి
@చౌదరి జంపాల: మొదటి ముద్రణ: రాహుల్ సాహిత్య సదన్, గుడివాడ, 1985
జంపాల చౌదరి
@చౌదరి జంపాల: @చౌదరి జంపాల: సవరణ:
ఐదో లైన్లో భుజంగరావు, గమనాగమనం అని ఉండాలి.
లలిత
మాలతి గారి ద్వారా ముందు ఈయన రచన, తర్వాత ఈయన జీవితం పరిచయమయ్యాయి.
ఇప్పుడు ఈ వ్యాసం కదిలించింది.
ఆయన జీవితం ముగిసింది. రచనలు మిగిలాయి.
ఇవన్నీ ఇలా ఉండగా, ఈ వ్యాసంలో నా దృష్టి నిలిచినది ఈ మాటల మీద:
“ఇంతటి సంక్షోభకరమైన జీవితాలకి సమాజం నిర్ణయించిన నీతి, నియమం, మంచీ, చెడులూ కనీసమైన భద్రతని కలిగించలేవన్న నిజాన్ని నిర్భయంగానే చూపించాడు”
సమాజం నిర్ణయించే నీతీ, నియమం ఆశయం దేన్ని ఉద్దేశించి ఉండాలో ఈ మాటలు చెప్తున్నాయి.
కులం, మతం, ఆడా, మగా, ప్రాచ్యం, పాశ్చాత్యం, స్వేఛ్ఛా, కట్టుబాట్లూ, తప్పూ, ఒప్పూ, ఇలా రక రకాల గీతలు గీసి సమాజాన్ని మనం విశ్లేషించ పూనుకుంటాం. అది నిర్దేశించే నీతి నియమాల గురించి, ఆ నియమాలను మన దృష్టిలో ఉల్లంఘించే మనుషుల గురించీ , వాదులాడుకుంటాం.
పై మాటలు దేనిని ఉద్దేశించి మనం మన సమాజంలో, మన మనసుల్లో, విలువలని ఏర్పరుచుకోవాలో, కళ్ళు పొడిచి మరీ చూపిస్తున్నాయి.
చౌదరి జంపాల
ఈ 96 పేజీల పుస్తకంలో భుజంగరావుగారి రెండు ముందుమాటలు, శారద జీవిత చరిత్ర, మూడు కథలు, ఒక ఉత్తరం, కృష్ణాపత్రికలో శారద మృత్యువార్త, నార్ల చిరంజీవి, కె.వి.ఆర్ (రమణారెడ్డి)ల నివాళులు ఉన్నాయి. శారద జీవితంతో పాటు, ఆరోజుల తెనాలి, హోటల్‌వర్కర్ల జీవితాలు, దుర్భర దారిద్ర్యపు జీవనపోరాటం మధ్య సాహిత్యం పట్ల ఆరాటం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ పుస్తకంతో పాటే చదవాల్సిన మరో పుస్తకం భుజంగారావు గారి జీవితచరిత్ర – గమనగమనం (1999). భుజంగరావు, శారద, రావూరి భరద్వాజ ముగ్గురూ తెనాలి హోటళ్ళలో సర్వర్లు, సాహితీపిపాసులు, స్నేహితులు.
చౌదరి జంపాల
సాహిత్య బాటసారి శారద
రచన: ఆలూరి భుజంగరావు
రెండవ ముద్రణ: అక్టోబరు 1995
ప్రచురణ: చరిత ప్రచురణలు, 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్, 500 044
వెల: రూ.15.