ఎవరైనా చూశారా?

రాసిన వారు: గీతాచార్య
************
రాత్రి ఏడున్నర కాంగానే, బుద్ధిగా అన్నం తినేసి, నాన్న పెద్ద మంచమెక్కి అమ్మ వచ్చి చెప్పే కథల కోసం ఎదురుజూస్తూ (అద్దీ అసలు సంగతి! బుద్ధిగా అన్నం తినేది అమ్మ చెప్పే కథల కోసం :D) ఉంటే ఆ కథల్లో వచ్చే కాకమ్మా, పిచ్చికమ్మలను ఎవరైనా చూశారా?

కర్రలిల్లు కట్టుకున్న కాకమ్మ, పుల్లలిల్లు కట్టుకున్న పిచ్చికమ్మకు ఇల్లు పడిపోయినప్పుడు ఆశ్రయమివ్వదు. అప్పుడు దేవుడిని ప్రార్థించిన పిచ్చికమ్మకు చక్కని ఇల్లు ఇస్తాడు దేవుడు. కొన్నాళ్ళకు కాకమ్మ ఇల్లు పడిపోతే పిచ్చికమ్మ ఆశ్రయమిచ్చి ఆదరిస్తుంది. ఎంత మంచి కథ? అమ్మ చెప్పింది కనుకనే కదా… ఆ కాకమ్మలూ, పిచ్చికమ్మలూ ఏరి? అసలు పిచ్చికమ్మలను చూసెన్నాళ్ళైందో! బుజ్జి ముక్కూ, చిట్టి కళ్ళలోంచీ అమాయకపు చూపులూ అవీనూ.

ఎప్పుడూ కాకమ్మకేనా తిట్లూ శాపనార్థాలూ, అని స్కూలు యానివర్సరీలో (అప్పుడు నేను యూకేజీ) కాకమ్మ బదులు పిచ్చికమ్మనూ, పిచ్చికమ్మ బదులు కాకమ్మనూ పెట్టేసి ప్రైజు కొట్టేశాను. మనోడిలో క్రియేటివిటీ ఎక్కువని ప్రైజిచ్చేటప్పుడు చెప్పారు. అప్పటికామాట నాకు తెలీదు. ఉన్నదాన్ని తిరగేస్తే అదే క్రియేటివిటీ అనుకున్నా. హిహిహి. ఎందుకలా మార్చావంటే… మంచీ చెడూ రెంటిలోనూ ఉంటాయనే జీవిత సత్యం చెప్పా 😀 అందుకిచ్చారేమో ఆ ప్రైజు. మళ్ళా ఆరోజులనెవరైనా చూశారా?

ఎవరైనా చూశారా? ఎంత కష్టం వచ్చినా వెరవక తన లక్ష్యమైన నిప్పుతిని జ్వాలలను త్రాగే గుర్రాన్ని సాధించే రైతు కొడుకు ఇవాన్నీ, ముసలి తనంలో ఇంట్లోంచీ యజమాని గెంటేసినా నక్క చెల్లిని మనువాడి, దాన్ని తోడేలూ, పెద్ద పులీ, ఎలుగు బంటి బారి నుంచీ కాపాడుకునే అమర ప్రేమికుడు శ్రీమాన్ మార్జాలం గారినీ, తన స్లెజ్ ని విరగ్గొట్టినందుకు తోడేలు అన్నని మాడు పగులగొట్టి మరీ పగ సాధించిన నక్క చెల్లినీ, చేపా, కొంగా, రొయ్యల అన్యూజువల్ స్నేహాన్నీ, మహాకాళం బారి నుంచీ రాకుమారిని కాపాడే చర్మకారుడు కిరీల్ నీ, ఓహ్ అనగానే పరిగెత్తుకొచ్చి అమాయకపు రైతు కొడుకుని తన దగ్గర పెట్టుకుని, మోసం చెయ్యబోయిన పొడుగ్గడ్డం ముసలాడు ఓహ్ నీ, ఎన్నో కష్టాలు పడి మహిమ ఉన్న గుడ్డుని సాధించి, అందుకు ప్రతిగా తన కొడుకుని కోల్పోయే పేద వేటగాణ్ణీ, ఆ కొడుకుని రక్షించి, తల్లిదండృలకప్పగించి, పెళ్ళాడే అందమైన పాము పిల్లనీ…, ఆ ఉక్రేనియన్ జానపద గాధల్నీ..!

రాజుగారికి లేక లేక పుట్టిన కొడుకు (పుట్టింది రాణిగారికేలెండీ ;-)) కోరిన కోరిక నిప్పు తిని జ్వాలలు త్రాగే గుర్రం. దానికోసం ఓ పెద్ద చాటింపూ,యాజ్యూజువల్గా ఎవరూ దాన్ని సాధించ లేరు. అప్పుడు రంగంలోకి దిగుతాడు మన రైతు కొడుకు ఇవాన్!!! టట్టడాయ్… అప్పటిదాకా అచ్చు మన తెలుగు సినిమా హీరోల్లాగా ఫ్రెండ్సుతో ఆడుకుంటూ, జులాయిగా తిరుగుతూ, ఏపనీ చేతగాకుండా ఉన్న మన ఇవాన్ ఒక్కసారిగా జూలు విదిల్చి రంగంలోకి దిగుతాడు. ముందమ్మా నాన్నలు నమ్మకపోయినా తన శక్తి సామర్థ్యాలను చూపించి, వారినొప్పించి, రాజుగారికి చెప్పి ఒక గొప్పదైన గుర్రాన్నీ, తనకు తగ్గ గదనీ తీసుకుని బయలుదేరుతాడు ఇవాన్. అతనితో పాటూ ఇద్దరు ఉన్నత వంశజుల్ని కూడా పంపుతాడు రాజు. వాటే షేమ్! యంగు బ్యూటిఫుల్లు విడోని ఇంట్లో ఉంచుకుంటమంత షేమ్! మన హీరో ఇవాన్ని జనం నమ్మరా? నిమ్న కులస్తులైతే అంతే నాయనా అని నాన్న కథ నాకు మొదట చదివి వినిపించినప్పుడు అన్నమాటలు ఇప్పటికీ నిజమే కదా అనిపిస్తుంది. ఏఁ వర్కింక్లాసు సిటిజన్లలో మాత్రం వీరులుండరా?

దారిలో ఎవరైతే గదనెక్కువ దూరం విసురుతారో వారే నాయకుడని పందెంగట్టి, వాళ్ళను లొంగదీసుకుంటాడు ఇవాన్. కొంత దూరం పోయాక నిప్పు తిని జ్వాలలు త్రాగే గుర్రం మీదో మహాకాళం. దాని మీద అలవోగ్గా గెలుస్తాడు మన హీరో. దాని అన్నా, దాని అన్నా, వచ్చిమన ఇవాన్ తో ఫైటింగు. ఆ ఫైటింగుకెళ్ళే ముందు ఇవాన్ తన అనుచరులకు తన గ్లోవులనిచ్చి వాటిని గది గోడకు తగిలించ మంటాడు. వాటిలోంచీ చెమట కారితే అది త్రాగి మజా చేసుకోమనీ, లేక రక్తం కారితే తనకు యుద్ధంలో సాయం రావాల్సి వస్తుందనీ చెప్పే మాటలు మాకో ట్రెండ్ సెట్టర్.

మూడు మహాకాళాలూ అయ్యాక వాటి తండ్రి చక్రవర్తి హిరోద్ వచ్చి ఇవాన్ని బంధించి తీసుకెళతాడు. ఆపోరాటంలో బాగా గాయ పడుతాడు ఇవాన్. ఐనా చక్రవర్తి హిరోద్ కోటలో ఉన్న అందగత్తె సాయంతో అక్కడ గెల్చి, తన లక్ష్యమైన నిప్పు తిని జ్వాలలు త్రేగే గుర్రాన్ని సాధించి, తన ప్రేయసితో మళ్ళా రాజ్యం చేరుకుంటాడు. ఆ అందగత్తెని కూడా తన వశం చేయమన్న రాకుమారుణ్ణీ, రాజునీ జస్టలా తన గదని గాల్లో ఊపటం ద్వారా భయపెటి ఆ గుర్రంతో సహా అందాల భరిణెను తీసుకెళ్ళపోతాడు. నిజమైన హీరోయిక్కారక్టర్. మన ఫ్రెండు ఇవాన్ని నేను చూసి చాలా రోజులైంది. మీరెవరైనా చూశారా? చూస్తే నాక్కొంచం చెప్పరూ? ఒక్కసారి మాట్లాడాలి.

భుజ బలమే కాదు, బుద్ధి బలమున్నా ఈవిల్నంతం (ఆ ఈవిలే. చెడు కాదు) చెయ్యొచ్చని చెప్పే ఇవానింకొకడు. అచ్చం మన బాపతే. వీడు మహాకాళాన్ని మట్టు పెట్టిన ఇవాన్ లో కనిపించాడు. జున్ను ముక్కకి తడి గుడ్డ చుట్టి, దాన్ని రాయిలా భ్రమింప చేసి బుర్ర తక్కువ మహా కాళం ముందు రాయిని పిండి నీళ్ళు తెస్తానంటాడు. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించి గ్రామస్తులను కాపాడి తన దారిన చక్కా పోతాడు.

ఈ ఉక్రేయినోళ్ళందరూ తమ్ముళ్ళ పక్షమే. అన్నలెప్పుడు విలన్లే. రాజుగారి ఆగ్రహం నుంచీ తండ్రిని కాపాడుకున్న తెలివైన కూతురు కథలోనూ, దయ్యాల ద్వారా తన జీవితం బాగు చేసుకునే తమ్ముడి కథలోనూ, అన్నకొండలే విలన్లు.

అమాయకపు చక్రవర్తి అయిన సింహపు కథ చిత్రాతి చిత్రం. మన ఎలక్షన్లలోని రిగ్గింగులన్నీ కనిపిస్తాయి.

ఆరేళ్ళ వయసున్నప్పుడు నాన్న ఇంకో నేస్తుని పరిచయం చేశాడు. పేరు తెలుసా? సెర్యోష. పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు ని అంటూ నా చిన్న ప్రపంచంలోకి వాళ్ళ పాష అత్తయ్య, మారుటి తండ్రి కొరెస్తొల్యెవ్, హాస్పిటల్లో కొనితెచ్చుకున్న చిట్టి చెల్లాయి (సరిగ్గా గుర్తు లేదు. తమ్ముడైనా కావచ్చు), తన నేస్తులు, నాకు వాస్య బాగా గుర్తు, తో సహా వచ్చేశాడు. తనకి అమ్మంటే ఎంత ప్రేమో మరి.

ఇంకొన్నాళ్ళలో క్రొత్త నాన్న వచ్చి, తనకు కావాల్సినవన్నీ ఇస్తాడనీ, తనకు పెద్ద అండగా ఉంటానీ, నమ్మిన చిన్ని సెర్యోషకి ఆ వచ్చిన కొత్త నాన్న ద్మీత్రీ కొర్నేయెవిచ్ ఉరఫ్ కొరెస్తోల్యేవ్ నిజమైన హీరోలానే అనిపిస్తాడు. నాకు సెర్యోషతో పాటే వళ్ళ నాన్న కూడా బాగ నచ్చాడు. అనారోగ్యం పాలైనప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుని, సెర్యోషకు బహి:ప్రామైన కొరెస్తొల్యేవ్ ని మర్చిపోవటం కష్టం. కళ్ళ ముందే కదలాడుతుంటాడు. పిల్లలకు నాన్నంటే ఎలా ఉండాలో భలేగా చూపిస్తాడు. మరి ఈ నాన్నని ఎవరైనా చూశారా?
(వెరా పనోవా రాసిన పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లాడు (రష్యన్ నుండి చేసిన ఆంగ్లానువాదాల పేర్లు: Seryozha/Time Walked/A Summer to Remember))

Because Achilles died,
Because Hercules’ arrows finished their task,
Because there is no Ajax,
And because I wanna go home,
To see my only son Telemachus,
And my beloved wife Penelope,
However farce it may be,
The Trojan horse is the
Only way Athene,
Bless me, this fellow,
Though the people call me cunning,

-అంటూ ట్రాజన్ హార్స్ ని నిర్మింపజేసి, ట్రాయ్ ని ఆకిలీజ్ మరణానంతరం జయింపజేసిన యూలిసీజ్ నాకు survival instincts గురించిన పాఠం చెప్పాడు ఆరో క్లాసులో. ఆడిస్సీలో ఎన్ని కష్టాలెదురైనా వెరవకుండా లక్ష్యాన్ని చేరాలని చెప్పాడు. నా కష్ట కాలాల్లో అండగా నిలిచాడు. మరి నా యూలిసీజ్ ని ఎవరైనా చూశారా? (Trojan war, High school non-detailed book) చందమామ భువన సుందరిలోని రూపధరుడిని?.

కావాలంటే రండి. యూలిసీజ్ కథని నేను చెపుతాను, నా మిగిలిన నేస్తుల్ని నాతో వెదుకుదురు.

You Might Also Like

7 Comments

  1. G

    Aravind Joshua,

    Actually i am not a man for nostalgia. Not that I have bad memories of childhood, but I always enjoy the ‘present’ 🙂 So, no need to go for flashbacks to have some lighter moments;-) But there are slight exceptions. One of them Seryozha. One of most beautiful literary characters I have read, and the portrayal of Seryozha made a lasting impression on a 6 year old child (It was when my father read, and explained this story), which (co)incidentally is the age of the protagonist. That is how a 6 year old lives his life.

    I have lost my copy though in some unfortunate situations. I too always search for those ‘Rushy’an books whenever I go Vishaalandhra. Thanks a lot for giving that link, with a beautiful review of the book 🙂

  2. శ్రీనివాస చామర్తి

    ఆ కథలు నేను చదవలేదు. మీ జ్ఞాపకాలు చదివాక అన్నీ చదివినట్టే వున్నాయ్!

  3. Aravind Joshua

    సెర్యోష ని గుర్తు చేసారు. ఆ పుస్తకం చదివినప్పటి నుండి నా ప్రాణ స్నేహితుడైపోయాడు. నా బాల్యమంతా రష్యన్ కథలతోనే ముడిపడిపోయింది. ఇప్పటకీ విశాలాంధ్ర వెళ్ళిన ప్రతీసారీ ఆ పుస్తకాలకోసం వెదకకుండా ఉండలేను, అవి ఇక రావట్లేదని తెలిసీ

  4. Dhanaraj Manmadha

    One should not write like this. You use only an academic style of writing or imitate some popular style 😀

    The Ulysses poem is well captured. But I enjoyed this one

  5. Jagadeesh Reddy

    అబ్బా… ఒక్క సారిగా మళ్ళా చిన్న పిల్లలమయిపోయి ఆ రష్యన్ కధల్లోకి వెళ్ళిపోయాము. నేను ఎప్పటికయినా మళ్ళా ఆ పుస్తకాలు రీప్రింట్ చేస్తాను. అదే క్వాలిటితో… కాపీ రైట్ ఎవరిదగ్గర వుంటుందొ? విశాలాంద్ర వాళ్ళని అడగాలి….?

Leave a Reply