అజో-విభొ-కందాళం ఫౌండేషన్ (AVKF) వారితో…
తెలుగు పుస్తకాల కొనుగోలుకి ఆన్లైన్లో ప్రస్తుతం ఉన్న ఉత్తమమైన సోర్సు – ఏవీకేఎఫ్ అనబడు అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ వారి సైటు. అలాగే, ఆన్లైన్ పుస్తకాల షాపుగానే కాక; ఏటేటా సాహితీ సేవ చేసిన ప్రముఖులకి అందజేస్తున్న పురస్కారాల ద్వారా, నిర్వహించే సభల ద్వారా, అప్పుడప్పుడూ వేసే పుస్తకాల ద్వారా – తెలుగు సంస్కృతికి ఏవీకేఎఫ్ వారు ఎన్నో చేస్తున్నారు. అలాంటి వారి గురించి పుస్తకం.నెట్ లో పరిచయం చేసే అవకాశం దొరకడం కూడా ఒక అదృష్టమేనని నాకనిపిస్తుంది. అనుకోకుండా, సి.సుబ్బారావు గారి పుస్తకావిష్కరణకి వెళ్ళాము నేనూ, పూర్ణిమా. అక్కడ ఒక పెద్దాయన్ని పరిచయం చేస్తూ – డా.వైదేహి శశిధర్ గారు “ఏవీకేఎఫ్ అని ఉంది కదా, దాని స్థాపకులు, సత్య అప్పాజోస్యుల గారు” అనడంతో ఒక్కసారిగా – ఆశ్చర్యం. అప్పటికి చాలాసార్లుగా వీళ్ళని గురించి పుస్తకం.నెట్ లో పరిచయం చేయాలి అని మేమిద్దరం అనుకుంటూ వచ్చాము. అనుకోకుండా, ఇవాళ్టికి అవకాశం దొరకడంతో – నేను తెగించేసి, పేరు చెప్పుకున్నాక – ’మీకు ఇదివరలో పుస్తకాల గురించి మెయిల్ చేశాను…’ అనగానే – ’అవును, గుర్తుంది, అని…ఇప్పుడు మాట్లాడుకుందాం.. అంటూ మాతో పాటు కూర్చున్నారు. ఆమాటల్లోనే ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. మా ప్రశ్నలకి, సత్య గారి జవాబులు, నా మాటల్లో 🙂
ఏవీకేఎఫ్ కథా కమామిషూ…
’ప్రతిభా పాండిత్యాల్లో మేరు శిఖరాల వంటి మేధావులను సత్కరించడం
మన రంగస్థల కళలనూ, కళాకారులనూ ప్రోత్సహించడం, గౌరవించడం
పదికాలాల పాటు పదిలపరుచుకోవలసిన సాహిత్యాన్ని ప్రచురించడం -రచయితలకు చేయూత నందించడం’
-మా లక్ష్యం ఇది సుమా! అని సైటులోనే చెప్పారు.
సత్య గారి మాటల్లో:
ఏవీకే ఫౌండేషన్ అంటే – అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్. 1993లో ప్రారంభమైంది. మొదట నేను స్థాపించాక, తరువాత వి.భొ వారు, కొన్నాళ్ళకి కందాళం వారు – కలిసారు. తెలుగు సాహిత్యానికి మా వంతు సేవ చేయడం ఈసైటు లక్ష్యం. ’ప్రతిభా మూర్తి పురస్కారం’, ’విశిష్ట సాహితీ పురస్కారం’, ’సేవామూర్తి రంగస్థల సాధన పురస్కారం’ – అన్న మూడు అవార్డులు ఎంపిక చేసిన వ్యక్తులకి ఇవ్వడంతో పాటు సాహితీసదస్సులు, కథానాటికల పోటీలు, పుస్తకావిష్కరణలు – వీటితో కూడిన నాలుగురోజుల సాహితీ ఉత్సవాన్ని ఒక్కోఏడు ఆంధ్రప్రదేశ్ లోని ఒక్కో జిల్లాలో నిర్వహిస్తాము. వచ్చే సంవత్సరం ఏ జిల్లాలో నిర్వహించాలీ? అన్నది ఈ సంవత్సరంలోనే నిర్ణయిస్తాం అన్నమాట. ఇది ఏటా జనవరి నెల తొలి గురువారం మొదలై, శుక్ర శనాదివారాల వరకూ సాగుతుంది. సుమారు పద్దెనిమిదేళ్ళుగా ఈ యజ్ఞం కొనసాగుతూనే ఉంది. “పురస్కార గ్రహీత వల్ల పురస్కారానికి గౌరవం వస్తుంది” – అని మా నమ్మకం.
మీ గురించి.
నేను వృత్తిరిత్యా అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్సు ప్రొఫెసర్ ను.
అసలు ఆన్లైన్ లో పుస్తకాల అమ్మకం అన్న ఆలోచన….
“నేను అమెరికా వెళ్ళిన తొలినాళ్ళలో, ఇండియా వచ్చినప్పుడు, సాహిత్యాభిమానం కొద్దీ ఎన్నో పుస్తకాలు కొని పట్టుకెళ్ళేవాడిని. ఒక్కోసారి అదనపు రుసుం చెల్లించి, పరిమితికి మించిన సంఖ్యలో డబ్బాలనిండా పుస్తకాలు పట్టుకెళ్ళిన సందర్భాలున్నవి. ఇలా చేస్తున్న సమయంలోనే, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారికి, అక్కడ తెలుగు పుస్తకాలు దొరక్క, కాలక్రమేణా తెలుగు పుస్తకాల వివరాలే తెలీకుండా పోయే అవకాశం లేకపోలేదు. అదిగో, అప్పుడే కలిగింది, ఆన్లైన్లో పుస్తక విక్రయం మొదలుపెట్టి, ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగువారికైనా, తెలుగు సాహిత్యం మంచి ధరలకే అందజేయాలి అన్న ఆలోచన.
ఆలోచన తరువాత ఆచరణ:
ఇదివరకే చెప్పినట్లు, ప్రవాసాంధ్రులకి తెలుగు పుస్తకాలను అందుబాటులో ఉంచడం మా లక్ష్యం. అలాగే, పుస్తకాలను ఇక్కడ దొరికే ధరకే అందించాలన్నది మా ఆలోచన. ఇప్పుడు చాలా పుస్తకాల్లో ధర – రూపాయల్లో ఒకటి, డాలర్లలో ఒకటి వేస్తున్నారు. మేము డాలర్ రేటుకి కాకుండా, రూపాయి రేటుకే అమ్ముతాము.
ఇక, సైటు నిర్మాణం విషయం: 2004 వేసవిలో మొత్తం కోడ్, సైట్ డెవెలప్మెంట్ పనిని నేనే చూసుకున్నాను.
ఈ ఇంటర్నెట్ యుగంలో మీ పుస్తకాల అమ్మకాలు ఎలా ఉన్నాయి?
ఇప్పుడు, అప్పుడు అని ఏమీ లేదు. పుస్తకాలని ఇష్టపడే వారు అన్ని వేళలా ఉంటారు. కొన్ని పుస్తకాలు ఇప్పుడు దొరకటం లేదు అని చాల మంది వాపోతూ ఉంటారు. తనకి ఏం కావాలో కాలం కచ్చితంగా ఎన్నుకోగలదు. కాలాన్ని ఎదుర్కొని నిలవగల రచనలు కొన్నే.. అవి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇంకా కొన్ని పుస్తకాలు దొరక్కపోవటానికి కారణం, కాపి రైట్ సమస్యలు. పునర్ముద్రించాలంటే కాపి రైట్లు ఉండాలి. అవి అన్ని వేళలా సాధ్యపడవు. అయినా, సాహిత్యాన్ని నిలబెత్తగాలిగేది ఒక జాతో, సమాజమో కాదు, వ్యక్తులు.
ఇతర భాషల్లో ఇటువంటి సైట్లు ఏవన్నా ఉన్నాయా?
ఇతర భాషల పుస్తకాలను ఆన్లైన్ లో కొనుగోలు చేసే అవకాశం ఉంది కానీ, ప్రత్యేకం ఏవీకేఎఫ్ వంటి సైట్లు లేవనుకుంటాను. కనీసం, ఉన్నట్లైతే నాకు తెలీదు.
సైటు యూనికోడులో లేకపోవడం –
అదే, పైన చెప్పినట్లు, అప్పట్లో నేను చేసేనాటికి నాకున్న పరిమితులవి. భవిష్యత్తులో సైటు మొత్తాన్నీ యూనీకోడ్ లోకి మార్చే ఆలోచన ఉంది.
హైదరాబాద్ లోని మీ ఆఫీసు గురించి…
ఇక్కడ ఆఫీసులో కొంత మంది స్టాఫ్ ఉన్నారు. అలాగే, సైట్ లో లభ్యమయ్యే పుస్తకాల గురించిన సారాంశం కనిపిస్తుంది కదా – అది మొదట మేమే రాసేవాళ్ళం. ఇప్పుడు అవి రాసేందుకు ఒక పూర్తిస్థాయి ఉద్యోగి కూడా ఉన్నారు.
పుస్తకాలను కొనుగోలు చేసేందుకు మీకు ఆఫ్లైన్ ఆఫీసు ఉందా?
లేదు.
మీరు షిప్పింగ్ భారతదేశంలో కూడా సులభంగా అయ్యేలా చూడవచ్చు కదా?
మేము మొదట ఇది మొదలుపెట్టేనాటికి పేపాల్ ఉండేది. అందులో ఇండియన్ రుపీస్ లేవు. త్వరలోనే రుపీ ప్రాసెసింగ్ గేట్వే కూడా ఎనేబుల్ చేసి, భారతీయ కరెన్సీలో కూడా కొనుగోళ్ళు చేయనివ్వాలన్న ఆలోచన ఉంది.
విజయవర్ధన్
>> త్వరలోనే రుపీ ప్రాసెసింగ్ గేట్వే కూడా ఎనేబుల్ చేసి, భారతీయ కరెన్సీలో కూడా కొనుగోళ్ళు చేయనివ్వాలన్న ఆలోచన ఉంది.
చాలా మంచి ఆలోచన. నాకు తెలిసి చాలా మంది ఎదురుచూస్తున్నారు దీని కోసం.
మెహెర్
interesting!
>>> భారతీయ కరెన్సీలో కొనుగోలుకు అనుమతి ఇవ్వడం
waiting for that.
Vaidehi Sasidhar
1998 లో మేము అమెరికా వచ్చిన కొత్తల్లో మొదటసారి ఒక సాహిత్యసదస్సులో అప్పాజోస్యుల వారిని కలిసాము. దాదాపు నెలరోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి వారింట్లో ఏర్పాటుచేసిన సద స్సుకు రమ్మని ఆహ్వానించటం నాకు ఇంకా గుర్తుంది.అప్పటినుండి వారింట్లో జరిగిన సదస్సులకు,నాటక ప్రదర్శనలకు,ఇండియా నుంచి వచ్చే ప్రముఖ రచయితలు,కళాకారుల తో భేటీ లకు ప్రతిసారీ మాకు ఆహ్వానం అందుతూనే ఉండేది.:-)
ఎవికేఎఫ్ బుక్ లింక్ వచ్చాక ఇండియాలో పుస్తకాలు కొనడం దాదాపు మానేశాననే చెప్పాలి.పుస్తకాలు ఆర్డర్ చేసిన పదిరోజులలోపు వచ్చేసేవి.నిజంగా ఏమాత్రం లాభాపేక్ష లేని సంస్థ. ఈ బుక్ లింక్ వెనక సత్యనారాయణ గారికి పుస్తకాలపై ఉన్న అమితమైన ప్రేమ, తెలుగు సాహిత్యం ప్రవాసాంధ్రులకు అందుబాటులోకి రావాలనే ఆశయం స్పష్టంగా కనబడుతూ వుంటుంది . అన్నిటి కంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం ‘ప్రతిభామూర్తి పురస్కారం ‘,” విశిష్ట సాహితీ పురస్కారం” “రంగస్థల సేవా మూర్తి పురస్కారం ” తెలుగునాట వివిధ రంగాలలోని కళాకారులకు అందజేసి కళను ,సాహిత్యాన్ని ప్రోత్సహించి,గౌరవించాలనే ఉన్నత ఆశయంతో ఎవికేఎఫ్ చేస్తున్న సేవ తప్పక చెప్పుకోవాలి. కళ పట్ల,సాహిత్యం పట్ల వారికున్న గౌరవం ,అభిమానం మాత్రమే కాదు, వాటిని పునరుద్ధరించాలనే వారి తపన ,దానిని ఓ యజ్ఞంలా నిర్వహించే స్పూర్తి ,కృషి ఎంతైనా గౌరవనీయాలు.
ఏవికేఎఫ్ గురించి సత్యనారాయణ గారితో చక్కటి ఇంటర్వ్యూ చేసిన సౌమ్య ,పూర్ణిమలకు అభినందనలు.
కొత్తపాళీ
Yes, their work is an inspiration to all.
మాలతి
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సంస్థని పుస్తకంలో పరిచయం చెయ్యడం. ఇంత నిస్వార్థంగా సాహిత్యసేవ చేసేవారు అరుదు. అప్పాజోస్యుల సత్యనారాయణగారికీ, పరిచయం చేసిన మీ ఇద్దరికీ అభినందనలు.
సౌమ్య
రావు గారికి: ఛాయాచిత్రాలు – ఉంటే ప్రచురించేవాళ్ళం 🙂 We did not do a conventional Interview sort of thing. We did not expect that we will meet Satyagaru over that place either.
cbrao
పరిచయం చెయ్యదగ్గ సంస్థ avkf.org వారి వెబ్సైట్ యునికోడ్ లో లేకపోవటం పెద్ద లోటు. వారికి కావలసిన సాంకేతిక సహాయం అందించటానికి etelugu.org సిద్ధంగా ఉంది. సమావేశ, సత్య అప్పాజోస్యుల గారి ఛాయాచిత్రాలు కూడా ప్రచురిస్తే మరింత బాగుండేది.
cbrao
Vice President, e-telugu.org