రచయిత్రి వారణాసి నాగలక్ష్మి

వ్యాసం రాసిపంపినవారు: సి.బి.రావు
శ్రీకాకుళంలో  కధానిలయం  స్థాపకులు కాళీపట్నం రామారావు గారు మెచ్చిన శ్రీమతి  వారణాసి నాగలక్ష్మి  ప్రఖ్యాత   కధా రచయిత్రి. వీరి కధలకు పలు పత్రికల పోటీలలో బహుమతులు లభించాయి. వీరి కధా సంపుటి ఆలంబన 2005 లో వెలువడింది. ఆలంబన పై సమీక్షకై  ఇక్కడ చూడవచ్చు. అచ్చు పత్రికలే కాకుండా అంతర్జాల పత్రికలైన కౌముది,సుజన రంజని, భూమిక వగైరా పత్రికలలో కూడా నాగలక్ష్మి కధలు ప్రచురించబడ్డాయి. కధలే కాకుండా నాగలక్ష్మి గేయ రచయిత్రి, చిత్రకారిణి కూడా. ఇవి మాత్రమే కాకుండా నాగలక్ష్మి ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. హోమియోపతి డాక్టరు సునీత తో జరిపిన భేటీ ఇక్కడ. వీరి గేయాలు “వాన చినుకులు” గా  2003 లో ఒక కవితా సంపుటంగా వెలువడ్డాయి. నాగలక్ష్మి  తన పుస్తకాలకు తనే ముఖ చిత్రం, లోపలి బొమ్మల  చిత్రణ చేస్తారు. ‘ కాన్సర్ ఆన్  కాన్వాస్ ‘ అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీలలో వీరి చిత్రం ‘ బ్లూస్  & బ్లూంస్ ‘ చిత్రం ఎన్నిక కాబడి, రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, లండన్  లో ప్రదర్శించబడింది. నాకు వీరి పరిచయమిటీవలే యాదృచ్ఛికంగా రచయిత్రి చంద్రలత  ‘ వచ్చేదారెటు ‘ పుస్తకావిష్కరణ సమయంలో జరిగింది.  కాని అంతక్రితమే వారి కధల పరిచయం కొత్తపాళి వారి  బ్లాగులో, కౌముది వగైరా పత్రికలలో కలగటం తో, నా బ్లాగు దీప్తిధార లో  వారి  కధలను కొన్ని పాఠకులకు పరిచయం చేసి ఉండటంతో,  ఆమె చిరపరచితురాలిగా  కనిపించారు. మానవాళికి చెరుపుచేసే  బిటి వంకాయలపై నాగలక్ష్మి ఎక్కుపెట్టిన అస్త్రం,ఆంధ్రభూమి స్వర్ణోత్సవ కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన కథ  “ఇది కలకాదు” ను కూడా దీప్తిధారలో పరిచయం చేశాను.

పుస్తకాలెందుకు చదవాలి? కధలెలా వుండాలి? అనే  విషయాలపై  నాగలక్ష్మి అభిప్రాయాలు  ఆసక్తికరం గా వుంటాయి. “విస్తృతంగా చదివిన వ్యక్తి దృక్పధం విశాలమవుతుంది. ఎదైనా సమస్య  ఎదురైనప్పుడు ఆ వ్యక్తి  ప్రతిస్పందనలో పరిణతి కనిపిస్తుంది. ‘ పుస్తకాలు మనుషులను మార్చేస్తాయా ఏమిటి? ‘ అని చప్పరించే వాళ్లు కాదనలేని సత్యం ఇది. మంచి సాహిత్యం చక్కని పెంపకం లాంటిది.అది వ్యక్తి సవ్యమైన ఎదుగుదలకు, చక్కని వ్యక్తిత్వం  సంతరించుకోవటానికి  దోహదం చేస్తుంది.కధలు సందేశాత్మకంగా ఉంటే మంచిదే.సందేశం లేకపోయినా, సామాజికబాధ్యతను విస్మరించేలా వుంటే మాత్రం అవి ఎంత వాస్తవికంగా వున్నా  మంచి కధలు కాలేవని నా అభిప్రాయం.పిల్ల తిమ్మెర పూలమీంచి వీస్తే సుగంధం, మురికి కాలవ మీంచి వీస్తే, దుర్గంధం వ్యాపిస్తుంది.  ఆ వీచే గాలిలాగే,రచయిత యదార్ధ సంఘటనలకి కధారూపం ఇచ్చి, చేతులు దులుపుకుంటే సరికాదనుకుంటాను”

ఇటీవలనే నాగలక్ష్మి గారింట  జరిగిన భేటిలో నాగలక్ష్మి  కౌముది 2007 ఉగాది కథల పోటీలో, ప్రథమ బహుమతి పొందిన కథ   అమృతాన్ని సాధించు గురించి మాట్లాడుతూ కొన్నిసార్లు  ఎంతో విధేయతతో వ్రాసిన కధలు కూడా వివాదంలో పడతాయన్నారు. ఈ కధను భవదీయుడు పరిచయం చేస్తూ దీప్తిధారలో రాసిన కొన్ని మాటలు  ఇక్కడ ఇస్తున్నా. “సంసారంలో పనులన్నీ ఇద్దరూ సమానంగా చెయ్యలేరు. కానీ, దుఖం, సుఖం సమానంగా పంచుకోగలరు, చెరిసగం అనే భావం వుంటే . “సంసారం, సంసారం ! ప్రేమ సుధాపూరం,నవజీవన సారం, సంసారం! ”. ఎంత ప్రేమ వివాహమైనా, భార్యా భర్తల మధ్య ఆ పొరపచ్చాలు,కన్నీటి పొరలు, అవగాహనా రాహిత్య నీహరికలూ సహజమే సంసార సాగరంలో. ఆ సముద్రాన్ని మధించి,అపోహల విషాన్ని త్యజించి, అమృతాన్ని వెలికి తియ్యాలి. అప్పుడు, ఇల్లే, కాదా స్వర్గసీమ?”
ఈ కధలో నాయకుడు అవినాశ్ నిమ్నజాతికి చెందిన శస్త్రవైద్యుడు. నాయిక నీరద అగ్రవర్ణానికి చెందిన స్త్రీల వైద్యురాలు.  బాల్యం నుంచి అతను పడ్డ  కష్టాలకు  కారణమైన అగ్రవర్ణాల ప్రతినిధిగా భార్యను చూస్తూ తన ఆక్రోశాన్ని ఆమెపై  ప్రదర్శిస్తాడు. ఈ కధలో మరో రెండు ఉపకధలున్నై. నాయిక  సహవైద్యురాలు  జాహ్నవి పనిమనిషి కూతురు జయప్రద కధ. ఆమె తల్లి జయప్రదగురించి చెప్తూ ” ఆ సచ్చినోడు, దాని పెనిమిటి వట్టి ముదనష్టపోడమ్మా.తాగుడికి పైసలిమ్మని తంతడు. తాగొచ్చి దొర మీది కోపం దాని మీద చూపిస్తడు.” మరో కధ నాయిక ఆప్తమిత్రురాలు సునందది. నాయిక సునంద ఇంటికెల్లినప్పుడు సునంద ఇంట్లోని పనిపిల్ల చుక్కమ్మ టీ కప్ అందిస్తుండగా తీ తొణికి వేడి టీ కొంత నీరద చెయ్యి పై, కొంత ఆమె లేత రంగు క్రేప్ చీర పై పడితే నీరద బాత్రూంకి వెళ్లి చీర సుభ్రం చేసుకుని వచ్చేసరికి చుక్కమ్మ చెక్కిళ్లపై చారలు నీరదను ఎంతో మనో వ్యధకు గురిచేస్తాయి. చుక్కమ్మ తప్పేమి లేదని మిత్రురాలు సునందతో చెప్తుంది. సునంద బదులిస్తూ ” నీరూ, ఏ విధంగా నైనా  డబ్బువిషయంలో గాని, అధికారంలో గాని బలవంతుడు బలహీనుడి మీద పెత్తనం చెయ్యటం  ఎప్పటినుంచో వుంది.” అంటుంది. అణచివేయబడ్డవర్గానికి చెందిన నాయకుడు తాగి నాయికను అవస్థలు పెట్టడానికి, అతను తాగుబోతు కావటానికి  కారణం నిమ్నజాతి కులంలో తను పెరిగిన వాతావరణమే అంటూ వ్రాసి రచయిత్రి నిమ్న జాతివారిని కించపరిచిందని ఒక విమర్శకుడు అభిప్రాయబడ్డాడు. ఈ కధ పై పెక్కు వాదోపవాదాలు జరిగాయి. రచ్చబండలో జరిగిన ఆ చర్చలు ఇక్కడ చూడవచ్చు. ఇతర రచయితలు రచయిత్రిని సమర్ధిస్తూ పెక్కు ఉత్తరాలు వ్రాశారు.  ఇక్కడ మనము గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే అవినాష్ -ప్రేమికుడుగా, భర్తగా చెందిన రూపాంతరం. అతడు నాయికను ప్రేమిస్తూనే, అగ్రకులపు ప్రతినిధిగా ఆమెను వ్యతిరేకించటం. భర్త అహం ఇంకో కోణం. మరో విషయం స్త్రీల అణచివేత.   తాగటానికి అవినాష్ కులానికి సంబంధం లేదు. తాగటం, భార్యను వేధించటం, కులానికతీతంగా ఆని వర్ణాలలోను ఉన్న అవ్యవస్థే.   స్త్రీల హక్కుల కోసం పోరాడుతూనే, ఇంట్లో పని పిల్లలను  వేదనకు గురిచేయటం కొందరు స్త్రీలు చేస్తున్నది, మనలో కొందరు గమనించే వుంటారు.  ఇక్కడ జరుగుతున్నది ఒక బలమైన వర్గం, బలహీనమైనవర్గాన్ని  వేదనకు గురిచేయటం తప్ప ఏ కులాన్ని తక్కువ చేయటం కాదు.

కధల గురించిన గంభీర చర్చ ముగుస్తుండగా ఒక హరివిల్లు మా ముందుకు వచ్చి ఒక వర్షిణిలా కూర్చుంది. ఆమె నాగలక్ష్మి గారమ్మయి వర్షిణి. గతంలో పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలలో పాల్గొని  పలు బహుమతులు గెల్చుకుంది.  మా అభ్యర్ధన పై   రామాచారి గారు స్వర పరచిన మలయ మారుతం పాట శ్రావ్యంగా వినిపించింది. ఆ కాసేపు నీలి మబ్బుపై తేలియాడి, గుంపు తుమ్మెదల సరాగాలు వింటూ, ఏటి ఒడ్డున, పూల పరిమళాన్ని ఆస్వాదించాము. ఈ పాట వ్రాసినది మాతో మాట్లాడుతున్న నాగలక్ష్మి గారే. ఇది వాన చినుకులు అనే లలిత గీత మాలిక లో ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని 2003 లో తొలిగా ప్రచురించారు.

ప|| మలయమారుతం మెల్లిగా వీచింది
పూల పరిమళం మోసుకుని తెచ్చింది
నీలి మబ్బు పై, వాన చుక్కపై,
ఏటినీటిపై పాట పాడింది

చ|| వర్షకాలపు నింగి వాన చల్లింది
వాగువంకా నిండి నీరు తుళ్లింది
కొండ కొనల్లోన నిండుసొగసును  చూసి
నింగి మెరిసింది! నేల మురసింది

చ|| ఏటి ఒడ్డున చెట్టు వాన  స్నానాలాడి
నీటి అద్దాన తన మేను కాంచింది
గుంపు తుమ్మెద లేమొ  సుమ సరాగాలాడ
సరాగాల రాగాల కచేరి సాగింది

చ|| పైరు చేసిందిగా నాట్యం
పిట్ట చెప్పిందిలే భాష్యం
మనసు పాడిందీ గీతం
మౌనగీతం ….. మౌనగీతం

పాటతో వీనుల విందయ్యాక, నాగలక్ష్మి తాము వేసిన చిత్రాలు చూపించారు.  ఈ వ్యాసం లో మీరు చూస్తున్న చిత్రాలు అన్నీ నాగలక్ష్మి చిత్రించినవే.

వాన చినుకులు (లలిత గీత మాలిక)                                 ఆలంబన
పేపర్ బాక్: డెమి  పేజీలు: 99                             పేపర్ బాక్: డెమి  పేజీలు: 204
ప్రధమ ముద్రణ: 2003                                           ప్రధమ ముద్రణ: 2005
ధర రూ.75/-                                                         ధర రూ.100/-

ప్రతులకై:
Varanasi Publications,
303, Edaikode Towers,
Srinagar Colony,
Hyderabad -500 073

Photos & Text: cbrao

You Might Also Like

5 Comments

  1. dr.a.raja prasanna kumar.

    poorwa janma sukrutame pustaka rachana

  2. perugu

    ఒక రచయిత్రిని ,ఒక కవయిత్రిని,ఒక చిత్రకారిన్ని,
    చక్కగా పరిచయం చేసారు రావు గారు..
    నాగలక్ష్మి గార్కి అభినందనలు.

  3. D.R.RAVINDRAKUMAR

    NAMASTE TO NAGALAKSHMI GARU,
    ONE HAS TO FEEL THE ‘IDEA’–‘DIFFERENT MENTALITIES OF DIFFERENT PEOPLE’–‘CHANGING OUR PRECONCEIVED IDES’– ‘PLEASANTNESS OF RELATIONS’ —‘DUTY OF OUR CONSCOIUSNESSS’– IN ALL STORIES OF YOU.

    ‘THE FEELINGS OF FRUSTATED LIVES’.
    YOUR DEPICTION IS GOOD . HOPE WE WILL BE RECEIVING MORE ARTICLES.
    WITH BEST WISHES TO NAGALAKSHMI GARU AND HER SUPPORTING HUSBAND.
    D.R.RAVINDRAKUMAR
    HINDUPUR

  4. Dr Chilukuri Harihar

    శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారిని పరిచయం చేసి వారి విశిష్టతను మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు.
    అయితే, “అమృతాన్ని సాధించు” అనే కథలోని మతఛాందస వివాదం గురించి వ్రాయడం అనవసరమనిపిస్తోంది.

  5. కొత్తపాళీ

    బొమ్మలు చాలా బావున్నై. ఇదే చూడ్డం. అందించినందుకు నెనర్లు రావుగారూ

Leave a Reply