India After Gandhi – Ramachandra Guha

అరుణ్ శౌరీ చెప్పిన కథ విన్నాక, భారతీయ చరిత్రకారులు రాసిన చరిత్ర పుస్తకాలు చదవాలంటే భయం పట్టుకుంది, వాళ్ళు ఏం వక్రీకరిస్తారో..నేనేం తప్పుగా అర్థం చేసుకుంటానో అని. ఆయనకీ ఒక కథ ఉన్నది – ఆయన చెప్పినవి విని భయము వలదు – అనవచ్చు మీరు…కానీ, నా భయాలు నావి.

అయితే, హిందూలో కొన్ని సంవత్సరాలు వచ్చిన రామచంద్ర గుహ కాలమ్స్, అతని ’స్టేట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ కాస్త చదివాక, అతనిపై ఉన్న సదభిప్రాయం వల్ల అతను రాసిన చరిత్ర ’ఇండియా ఆఫ్టర్ గాంధీ’ చదివేందుకు పూనుకున్నాను. ఇది స్వతంత్ర భారతి సంపూర్ణ చరిత్ర అని చెప్పలేము కానీ, 1947 మొదలుకుని తొంభైల తొలిదినాల దాకా జరిగిన భారత చరిత్రపై ఒక అవగాహన కలిగేందుకు ఉపయోగపడుతుంది. పూర్తిగా తెలియని విషయాలంటూ ఇందులో పెద్దగా లేవు కానీ – తెలిసిన విషయాల గురించే, ఒక చరిత్రకారుడి దృష్టి ద్వారా సారాంశంలాగా చెబుతారు. పేరుకి తొమ్మిదొందల పేజీలుండి, చూడ్డానికి వెయ్యిపైగా ఉన్నట్లు కనిపించి భయపెట్టినా కూడా, రచనా శైలి సరళంగా ఉన్నందువల్ల పెద్ద ఇబ్బందులేవీ కలుగలేదు.

పుస్తకాన్ని ప్రధానంగా ఐదు భాగాలుగా విభజించారు. ఒక్కో భాగాన్నీ తీసుకుని పరిచయం చేస్తాను.

ముందు మాట :అన్ నేచురల్ నేషన్’ అన్న పేరు పెట్టారు దీనికి. దాన్ని బట్టి వ్యాస విషయం అర్థమయ్యే ఉంటుంది కదా! అదే విషయంతో మొదలుపెట్టి – ఎందుకు భారతదేశం ఇలా ఉంది? ఇలాగే ఎందుకు ఉంది? ఇన్ని సమస్యలొచ్చినా ఎందుకు కూలిపోలేదు? – ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నంలో మూలాలకి వెళ్ళి విశ్లేషించడమే ఈ పుస్తకం లక్ష్యమని చెబుతారు రామచంద్ర గుహ.

మొదటి భాగం: పికింగ్ అప్ ది పీసెస్ (Picking up the pieces)
ఈ భాగంలో ప్రధానంగా – స్వతంత్ర భారతి తొలినాళ్ళ నాటి పరిస్థితులు, అప్పుడు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల గురించి తెలియజేస్తారు. స్వాతంత్య సాధన, ఆపై దేశ విభజన – పరిస్థితులు, ప్రభావాలు; పటేల్-వీపీమీనన్ ల నేతృత్వంలో సాగిన చిన్నా-పెద్దా రాజ్యాలను భారతదేశంలో విలీనం చేసే ప్రయత్నం, ప్రతిఘటించిన హైదరాబాద్ వంటి రాజ్యాలను స్వాధీనపరుచుకోవడం; కాశ్మీర్ సమస్య-మూలాలు, వాదాలు; కాందిశీకుల సమస్య – వివిధ రాష్ట్రాలపై దాని ప్రభావం; భారతదేశం – అంటే ఏమిటి? అన్న ప్రశ్నపై అప్పట్లో ప్రబలిన భిన్నాభిప్రాయాలు : వీటన్నింటి గురించీ కొంత వివరంగా చర్చించారు. ముందే చెప్పినట్లు, అన్ని విషయాల గురించీ ప్రాథమిక అవగాహన కలిగిస్తూ, ఎక్కడా బోరు కొట్టించకుండా, ఏకబిగిన చదివేంత ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యే రీతిలో రాసారు.

రెండో భాగం: నెహ్రూస్ ఇండియా (Nehru’s India)
ఈ భాగంలో ప్రధానంగా నెహ్రూ పాలనలో భారతదేశపు పనితీరును గురించి తెలియజేస్తారు. మన తొలి ఎన్నికల గురించీ, విదేశీ వ్యవహారాలలోనూ, ప్రపంచంలో ఉనికిని చాటుకునే ప్రయత్నంలోనూ, ఆర్థిక,రాజకీయ,సాంఘిక రంగాల్లో కొత్త దేశం ఎదుర్కొన్న సవాళ్ళనూ, సపోర్ట్ చేసినవాళ్ళనీ, సతాయించిన వాళ్ళనీ, పాలక పక్షం వైఖరినీ, పారిశ్రామికీకరణ వైపు దృష్టి సాధించడాన్నీ, పంచవర్ష ప్రణాలికలనూ, భాషాధార రాష్ట్రాల ఏర్పాటు వెనుక కథలనూ, హిందూ లా చట్టాల సవరణా, కశ్మీర్ వివాదం ప్రోగ్రెస్, వివిధ ప్రాంతాల్లో ట్రైబల్ గుంపులు తమ హక్కులకోసం సాగించిన పోరాటాలు – ఇలా చరిత్రలో ప్రాముఖ్యం ఉన్న ఏ చిన్న విషయాన్నీ వదలకుండా చర్చించారు. స్వీయ విశ్లేషణను వీలైనంత తగ్గించి, యధాతథంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు – అది ఈశైలికి బాగా అమరింది.

మూడో భాగం: షేకింగ్ ది సెంటర్ (Shaking the center)
ఈ భాగంలో ప్రధానంగా – ప్రభుత్వం ఎదుర్కున్న సమస్యలు, ప్రభుత్వం సమర్థతని పరీక్షించిన సందర్భాల గురించి చర్చ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చర్చించిన విషయాలు – దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి ఎదురైన ఎదురు దెబ్బలు, చైనా తో సంబంధాలు, ఆపై యుద్ధం, వీటి తర్వాత నెహ్రూ మరణం – లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం – కొన్నాళ్ళ శాంతి; ఆపై, మైనారిటీ హక్కులూ-సమస్యలూ; తొలినాటి ఇందిర ప్రభుత్వం – ఇవీ.

నాలుగో భాగం: ది రైజ్ ఆఫ్ పాపులిజం (The rise of populism)
ఈ భాగంలో ఎక్కువగా ఇందిర రాజ్యం గురించి, ఆ కాలంలో దేశంలో జరిగిన మార్పుల గురించి విపులంగా చర్చిస్తారు. బంగ్లా యుద్ధం – జరిగిన పరిస్థితులు, పరిణామాలు, దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రబలిన ఉద్యమాలు (ఉదా: పంజాబ్) -వాటిపై ప్రభుత్వ స్పందన, కాంగ్రెసేతర పార్టీల కథ, ఎమర్జెన్సీ, తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం, పంజాబ్లో ప్రభుత్వ చరిత్ర – ఆపై ఇందిర మరణం, రాజీవ్ గాంధీ ప్రధాని కావడం తో ఈ భాగం ముగుస్తుంది.

ఐదో భాగం: హిస్టరీ ఆఫ్ ఈవెంట్స్ (History of events)
తొంభైలలోకి అడుగుపెట్టాక – గుహ ఈపుస్తకంలో ’చరిత్రకారుడి’ పని ఆపి, ’historically informed journalist‘ పని మొదలుపెడతారు. ‘Rights’,’Riots’,’Rulers’,’Riches’ – అన్న నాలుగు ఛాప్టర్లలో – గత ఇరవై ఏళ్ళలో భారతదేశం ఎలా మారిందో, ఏ విషయాల్లో ఎదిగిందో, ఏ విషయాల్లో ప్రమాణాలు తగ్గాయో, జరిగిన గొడవలు, ప్రభుత్వాల పనితీర్లు – ఇలా అన్ని కోణాల నుండీ విశ్లేషిస్తారు. చివరగా: ’A people’s entertainment’ అన్న వ్యాసంలో – సినిమాలూ, రేడియో, క్రీడలు, టీవీ, నాటకరంగం – ఇలా ప్రజల రిక్రియేషన్ కార్యకలాపాల గురించి చర్చిస్తారు. అంతసేపూ సీరియస్ స్టఫ్ అయ్యాక, ఈ అధ్యాయం తో ముగించడం బాగుంది.

ఎక్కడికక్కడ ఎంత మంది – ’ఇక ఇండియన్ డెమొక్రసీ పనైపోయింది’ అని జోస్యం చెప్పారో – చదువుతూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది. అన్ని జరిగినా కూడా, మన దేశం సైన్యం చేతుల్లోకి పోవడమో, సివిల్ వార్ జరిగి అల్లకల్లోలం జరగడమో – ఏమీ లేకుండా, ప్రశాంతంగా కాకున్నా -గతుకుల రోడ్డుపై అన్నా – స్వతంత్ర భారతి అలాగే గతితప్పక ప్రయాణం చేయడం – నేను చాలా సహజమైన విషయంగా తీసుకున్నాను ఇన్నాళ్ళూ. ఈ పుస్తకం చదువుతూ – అక్కడక్కడా ప్రపంచంలోని వివిధ వ్యక్తులు చెప్పిన జోస్యాలూ – ఇదే సమయంలో ఇతర ఆసియా దేశాల్లో ఉన్న సమస్యలూ – ఇవన్నీ ఒక కాంటెక్స్ట్ లో చదువుతూ ఉంటే -’వై ఇండియా సర్వైవ్స్’ అన్న ప్రశ్న కలిగింది.

దాని గురించే ఆలోచించుకుంటూన్నప్పుడే చివర్లో : why india survives అని గుహా రాసిన ఎపిలాగ్ చదివాను. ఈ పుస్తకం మొత్తంమీదా ఖచ్చితంగా చదవాల్సిన భాగం ఇది. మొత్తం పుస్తకానికీ మంచి ముగింపు.

రామచంద్ర గుహ గారి శైలి – బాగా చదివించేలా ఉంటుంది. దానితో పాటు, ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. అకడమిక్ చరిత్ర పుస్తకంలా – భయపెట్టే నంబర్లతో, తిథి వార నక్షత్రాల జాబితాలతో నిండి ఉండదు. వివిధ అంశాల గురించి వివరిస్తూ, అవసరం ఉన్న చోట్ల భిన్న కోణాలను తెలియజేస్తూ, ఏదన్నా సంఘటన జరిగాక వచ్చిన వివిధ స్పందనలు తెలియజేస్తూ – ఇలా ఆసక్తికరమైన వ్యాసాలు చదువుతున్న అనుభూతినిస్తుంది. అయితే, ఇందాకే అన్నట్లు -చరిత్ర తెలుసుకునేందుకే తప్ప చరిత్ర ’అధ్యయనం’ చేసేందుకు ఈ పుస్తకం అంత ఉపయోగపడకపోవచ్చేమో అనిపిస్తోంది.

ఇక, ఇది ఒకసారి చదివేసి, వదిలేసే రకం పుస్తకం కాదు అనుకుంటున్నాను. కొని – పెట్టుకుని, అప్పుడప్పుడూ మళ్ళీ రీవిసిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అని అంచనా వేస్తున్నాను 🙂

నామటుకు నాకైతే – కొన్ని విషయాల గురించి కొంచెం అవగాహన పెరిగితే, కొందరి గురించి అపోహలు తొలగాయి. 🙂 చరిత్ర పుస్తకాలంటే నాకెప్పుడూ భయమే – బయాస్ ఎక్కువ ఉంటుందని ఉన్న అనుమానం కొద్దీ. అయితే, ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ భావన కలగలేదు. ఆ పరంగా ఇది ’extremist ideologies’ తో లేదని ఖచ్చితంగా చెప్పగలను. నిష్పక్షపాతంగానే రాసారు అని నా అభిప్రాయం.

వెల కొంచెం ఎక్కువే. చరిత్రలో మునిగితేలే వారికి లైట్ రీడింగ్ కి పనికొస్తుందేమో కానీ, మామూలుగా కుతూహలం ఉన్నా, చరిత్ర ఎక్కువగా అధ్యయనం చేయని, చేయలేని వారికి తప్పక చదవవలసిన పుస్తకం!

పుస్తకం వివరాలు:
India after Gandhi – The history of the world’s largest democracy
Ramachandra Guha
~900 Pages
First Print: 2007 (MacMillan)
వెల: ఆరొందలు, ఐదొందలు, తొమ్మిదొందలు, పదిహేనొందలు – ఇలా ఒక్కో సైట్లో ఒక్కో వెల.
ఇండియా ప్లాజా లంకె ఇక్కడ.

You Might Also Like

7 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] Erich Von Daniken : ఆర్కియాలజీ పరిశోధనల గురించి India after Gandhi – Ramachandra Guha : స్వతంత్ర భారతి చరిత్ర States of […]

  2. పుస్తకం » Blog Archive » పుస్తకంతో ఒక సంవత్సరం

    […] ఇంత తొందరగా కలిసి ఉండేవాణ్ణి కాదు. India After Gandhi తెప్పించుకొని ఉండేవాణ్ణి కాదు. […]

  3. పుస్తకం » Blog Archive » పుస్తక ముఖ పరిచయాల కథ

    […] కలిగింది. రామచంద్ర గుహ – ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ‘ లా, హిస్టరీ ఫర్ డమ్మీస్ అన్నట్లు, […]

  4. పుస్తకం » Blog Archive » కవితాభూషణం-రెండో భాగం

    […] గుర్తించడం ఒక సరదా ( ఇటీవల చదివిన ఇండియా ఆఫ్టర్ గాంధి అన్న పెద్ద పుస్తకంలో కేవలం రెండు […]

  5. krishnareddy

    I liked the way you reviewed the book, based on you review I interested to read to know history on india to fill gaps that I might have about indian history.
    Thank You

  6. HalleY

    “చివర్లో : why india survives అని గుహా రాసిన ఎపిలాగ్ చదివాను. ఈ పుస్తకం మొత్తంమీదా ఖచ్చితంగా చదవాల్సిన భాగం ఇది”

    I Agree 🙂

  7. మాలతి

    **ఏదన్నా సంఘటన జరిగాక వచ్చిన వివిధ స్పందనలు తెలియజేస్తూ – ఇలా ** మంచి పాయింటు. అంచేతే చరిత్ర అధ్యయనం చెయ్యడానికి పనికిరాదని కూడా నీభావం అనుకుంటా. మంచి విశ్లేషణ.

Leave a Reply