శతపత్రము
సమీక్షకుడు – మద్దిపాటి కృష్ణారావు
[2006 సెప్టెంబర్ 24 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA) లో గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ మీద జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష]
**********************************************************************
శతపత్రము గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ. ఈ పుస్తకాన్ని చర్చించడానికి నిర్ణయించుకున్నప్పటికి, గడియారం రామకృష్ణశర్మ గారెవరో చర్చలో పాల్గొన్నవారెవరికీ తెలియదు. కానీ ఈ పుస్తకాన్ని చదవమని సూచించిన శ్రీ నవోదయ రామ్మోహనరావు గారికి కృతజ్ఞతలు చెప్పాలన్నది అందరి అభిప్రాయం.
1919 లో జన్మించిన శర్మ గారు, ఈ పుస్తకాన్ని కొందరి మిత్రుల, అభిమానుల ప్రోత్సాహంతో 1995 లో వ్రాయడానికి పూనుకున్నారు. కానీ పూర్తి చేసి ప్రచురించింది
2004 లో. అంటే పుస్తకం పూర్తయిన తరువాత రెండు సంవత్సరాలకే వారు దివంగతులవ్వడంతో, ఇది ఇంచుమించుగా వారి సంపూర్ణ జీవిత ఆత్మ చరిత్ర. శర్మ గారు పుట్టింది ప్రస్తుతపు అనంతపురం జిల్లా, కదిరి తాలూకా, బాబాసాహెబ్‌పల్లె అయినా వారి జీవితకాలంలో చాల వరకు మహబూబ్‌నగర్ జిల్లా, అలంపూరు లోనే గడిపారు. అయితే స్వభావసిద్ధంగా వ్యవహార్త కావడం వల్లనేమో, వీరు నివసించిన, తిరిగిన ప్రదేశాలు తలుచుకుంటేనే మనకు తల తిరుగుతుంది!
అప్పట్లో నిజాం పాలనలో ఉన్న అలంపూరులోని ఉర్దూ పాఠశాలలో ఆరవ తరగతి తప్పడమే తన విద్యార్హతగా చెప్పుకున్నారు శర్మ గారు. ఆ తరువాత వారి చదువు, జ్ఞాన సముపార్జన అంతా పాఠశాలల్లో కాక స్వయంకృషితోనే జరిగినట్టు తెలుస్తుంది. వేలూరి శివరామశాస్త్రి గారి దగ్గర గురుకుల పద్ధతిలో జరిగిన విద్యాభ్యాసం ఆయన్ను ఎంత ప్రభావితం చేసిందో, శర్మ గారు వారి గురువులను గురించి పుస్తకంలో పదే పదే ప్రస్థావించడంలోనే తెలుస్తుంది. కేవలం స్వయంకృషితో వివిధ భాషల్నీ, వాస్తు, శిల్పనిర్మాణ శాస్త్రాల్నీ, అభ్యసించి, ఎంతో తర్ఫీదు పొందిన శాస్త్రకారులకు దీటైన పరిశోధనలు చెయ్యగలగటంలోనే శర్మ గారి ప్రతిభ తెలుస్తుంది. వీరి పరిశోధనా కృషి ఒక ఎత్తైతే, రాజకీయ, సాంఘిక సేవ, కార్యాచరణ మరొక ఎత్తు. కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటం దగ్గర్నుంచి, నిజాం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలతో పాటు, అప్పట్లో తెలంగాణాలో అణచివేయబడుతున్న తెలుగు భాష అభివృద్ధికి కృషి చెయ్యటం, బాల్య, వితంతు వివాహాలవంటి సంఘ సంస్కరణోద్యమాల్లో పాల్గొనటం, ఆంధ్రసారస్వత పరిషత్తు నిర్వహణలో కీలక పాత్రవహించడం వంటి పనులన్నీ చెయ్యడం చూస్తే, ఈయనకు తినడానికైనా తీరికుండేదా అనిపించక తప్పదు. ఈ పుస్తకం చదువుతుంటే ³ఆయన చేయని, చెయ్యలేని పనేదైనా ఉంటుందా? అని ప్రశ్నించుకోకుండా ఉండలేం.
ఈ పుస్తకంలో శర్మ గారు తన ఆత్మకథను చెప్పడం ఒక ఎత్తైతే, అది చెప్పిన పద్ధతి మరొక ఎత్తు. ఉన్నది ఉన్నట్టుగా, నిర్మొహమాటంగా చెప్పటం, అదీ ఇంత పరిపూర్ణంగా చెప్పడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నది అందరి అభిప్రాయం. తనకు నచ్చని విషయాన్ని అవతలి వారు ఎంత వారైనా, చివరికి తానే ఐనా, నిర్మొహమాటంగా, నిష్కర్షగా చెప్పడంతో ఈ పుస్తకాన్ని చదవడం ఒక ఆహ్లాదమైన అనుభూతిగా మిగులుతుంది. స్వాతంత్ర్య పోరాటం, తెలంగాణా సాయుధ పోరాటం, విశాలాంధ్రోద్యమం మొదలైన ఉద్యమాలపై శర్మ గారి ప్రత్యక్షసాక్షి కథనం చరిత్రను మసిబూసి మారేడు కాయ చెయ్యకుండాను, అనవసరమైన ఉత్ప్రేక్షలు, అలంకారాలూ లేకుండానూ తెలియజేస్తుంది. చారిత్రక సత్యాల్ని ఇంత నిష్కర్షగా, నిష్పక్షపాతంగా, చక్కని భాషలో వ్రాసినవారు వేరే ఎవరైనా ఉన్నారో లేదో తెలియదుగాని, శర్మ గారు మాత్రం ఆ కోవకి తప్పక చెందుతారు.
ఎన్నో మత, సాంఘిక, సాంస్కృతిక విషయాలపై శర్మ గారి అభిప్రాయాలతో మనం ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు. కానీ ఆయన నిజాయితీని, నమ్మకాన్ని మనం శంకించలేం. కొన్ని సందర్భాల్లో ఆయన అభిప్రాయాల్లోనే పరస్పర వ్యతిరేకతను మనం చూడవచ్చు. ఉదాహరణకు, పుట్టుకతో కలిగే కుల నిర్ధారణను వ్యతిరేకిస్తూనే, కులతత్వాన్ని శ్లాఘించడం, వర్ణసంకరాన్ని తప్పుబట్టడం వంటి వైరుధ్యాలు పుస్తకంలో చాలా చోట్ల కనిపిస్తాయి. కొంతవరకు ఇది ఆయన వయసుతో మారిన అభిప్రాయాలు కావచ్చు. కానీ పరస్పర వైరుధ్యం మాత్రం ప్రస్ఫుటం. ఈ పుస్తకంలో ఉన్న పెద్ద లోపమెల్లా రచనా సంవిధానం. తన జీవితానుభవాల్లోంచి ఎన్నో విషయాలు చెప్పదల్చుకున్న శర్మ గారు ఒక ప్రణాళికను నిర్దేశించుకుని దాని ప్రకారం కథను నడిపిస్తే ఎంతో బాగుండేది, పుస్తకం మొదటి భాగం కాలానుక్రమంగా నడిచినా, చాలా చోట్ల ఎన్నెన్నో విషయాలను చిలవలు పలవలుగా చేర్చడం వల్ల నడక కుంటుబడి, పాఠకుల అసహనానికి దారి తీసే పరిస్థితి కలిగిస్తుంది. ఇది రెండవ భాగంలో మరీ వికృత రూపం దాలుస్తుంది – ముఖ్యంగా నా సాంసారిక జీవితము అన్న అధ్యాయంలో. తెలుగు పుస్తకాలకు సంపాదకత్వ లోపం కొత్త కాకపోయినా, సంపాదకత్వ బాధ్యత వహించిన అక్కిరాజు రమాపతిరావు గారు ముందుమాట వ్రాయడమే సంపాదకత్వం అని చేతులు దులుపుకున్నట్లుంది. తెలుగులో వచ్చిన అనేక మంచి పుస్తకాలకున్న సంపాదకత్వ లోపమే ఈ మంచి పుస్తకానికి కూడా ఉండటం విచారించదగ్గ విషయం. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకం.
**********************************************************************
ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.
vamsi
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు అభినందనలు
తాజా సమాచారం కోసం ప్రతీ రోజు చదవండి
http://www.apreporter.com
budugoy
నేనూ నవోదయ కొట్టులో కాస్త అనాసక్తంగానే కొని, చదివిన తర్వాత నెనరులు తెలుపుకున్న పుస్తకం. మంచి పరిచయం.
హెచ్చార్కె
ఔను, అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఎంత ప్రతికూల పరిస్థితుల్లోనైనా, ‘నిజ్జంగా జీవించాల’ని బలమైన కోరిక ఉంటే నిజ్జంగా జీవించ వచ్చునని ఆత్మవిశ్వాసం ఇచ్చే పుస్తకం. కర్నూలు వెళ్లినప్పుడల్లా, కనీసం ఒకసారైనా, ఇదిగో ఈ ఏటవతలనే ఆయన ఉండేవారు అని ప్రేమగా అలంపురం వైపు చూడాలనిపిస్తుంది. (తుంగభద్రా నదికి ఒక గట్టున అలంపురం, ఇంకో గట్టున కర్నూలు). ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు అభినందనలు.