మనం “ఫేంటసీ” బస్సు మిస్సు ఐనట్టేనా?

రాసిన వారు: Halley

********************

మొన్నా మధ్యన ఆదివారం ఆంధ్రజ్యోతిలో అనుకుంటా, ..టి లో అత్తెసరుగాళ్ళుఅని “5 point someone” తెలుగు అనువాదం గురించి చదివాను. ముందు పేరు చూసి నవ్వుకున్నా, తర్వాత ఎందుకనో కోపం వచ్చింది! మళ్ళీ ఇంకొక అనువాదమా అన్న కోపం. కోపానికి ఒక కారణం లేకపోలేదు. నాకు ఎందుకనో చాలా కాలం నుంచీ ఆధునిక తెలుగు సాహిత్యం అంటే ఒక చిన్న చూపు. ఇది ఏదో అకారణంగా పెంచుకున్నది కాదు, గత 15 ఏళ్ళలో ఎన్నో మార్లు ఎన్నో బుక్ ఫెయిర్సు కానివ్వండి, బుక్ షాపులు కానివ్వండి, మంచి మోడరన్ డే తెలుగు పుస్తకాల కోసం ఎంతో వెతికాను. ఎపుడో కానీ కనపడవు. ఎక్కడ చూసినా ఇదిగో ఇలా సగానికి పైగా అనువాదాలే కనపడతాయి! అనువాదం అవసరమే కాదనను కాని పబ్లిష్ అయ్యే పుస్తకాలలో సగానికి సగం అవేకనిపిస్తాయి నాకు. ఎటు వెళ్లినా (మరి నాకు కళ్ళజోడు అవసరమో ఏమో ). ఇవీ కాదూ అంటే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు (ఇందులో కుడా సగం వేరే భాషల అనువదాలే). ఇవీ కాదూ అంటే ఆంగ్ల సైన్సు పుస్తకాల అనువాదాలు. ఇవన్నీ కాదు అంటే రా.వి.శాస్త్రి, విశ్వనాథవారు , శ్రీ శ్రీ అలా పాత కాలం వారి రచనలు .. లేదా 1980ల లో ఒక ఊపు ఊపిన యండమూరి , యద్దనపుడి ఇలాంటి వారి రచనలు (ఇప్పటికీ మాత్రం తెలుగు సాహిత్యం పుస్తకాల సేల్స్ ఉన్నాయి అంటే పుస్తకాల వల్లనే కాబోలు).


అపుడప్పుడు కొన్ని కొన్ని మంచి ఒరిజినల్ తెలుగు పుస్తకాలు వస్తాయి. కాదనను. ఐనప్పటికీ గత 20 ఏళ్ళలో (నేను పుట్టింది 1986 కాబట్టి నా ప్రామణికం 1990-2010) తెలుగు సాహితీ లోకాన్ని ఒక ఊపు ఊపి అటు పాత పాఠకులని అలరించి ఇటు వందల వేలకొద్దీ కొత్త పాఠకులని తెప్పించిన పుస్తకాలు యేవి అంటే ఏమో! .. అంటాను నేను. ఇక్కడ మార్పు అంటే ఎదో చిన్న స్థాయి మార్పును గురించి కాదు నేను చెపుతున్నది.. ఆంగ్లములో పరడిగ్మ్ షిఫ్ట్” (paradigm shift) అంటారు.. స్థాయి మార్పు. బహుశా అంతర్జాలంలో తెలుగు వెబ్ సైట్స్ వెల్లువ వలన మెల్లగా ఏదన్నా పెను మార్పు కలుగుతుందో ఎమో నాకు తెలియదు!


ఇది మరి అన్ని ప్రాంతీయ భాషలకి ఉన్న సమస్యో ఏమో నాకు తెలియదు. గడిచిన 20 ఏళ్ళలో ఆంగ్ల సాహితీ (ఫిక్షన్) ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పుస్తకాలలో కొన్నిటిని పరికించి చూస్తే అటువంటివి మన తెలుగులో ఎందుకురావా అని అనిపిస్తుంది [లంకె : ఇక్కడ ]. లిస్టులో పైన చెప్పిన కాలంలో ముఖ్యమైనవాటిని కొన్నిటిని పరికించి చూద్దాం. క్రిస్టొఫెర్ పౌలిని ఇన్హెరిటెన్స్ సిరీస్ ఎరగొన్ , ఎల్డెస్ట్ , బ్రిసిన్గర్ – 2002-2008 ” ,  “జె.కె.రౌలింగ్ హేరీపొట్టర్ సిరీస్ – 1997-2007″ , “ఫిలిప్ పుల్మేన్ హిస్ డార్క్ మెటిరియల్స్ సిరీస్ – 1995-2000 ” (గోల్డెన్ కంపాస్ సినిమాగా కూడా వచ్చింది) . మూడూ ఫేంటసీ నవలలు , ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కాపీలు అమ్ముడు పోయాయి.తర్వాత సినిమాలుగా విడుదల అయ్యి కోట్లు ఆర్జించాయి కూడానూ! .


వీరిలో ఇప్పుడు పౌలినీ వయసు అక్షరాలా 26 యేళ్ళు . ఇప్పటి దాకా ఇన్హెరిటెన్స్ సిరీస్ పుస్తకాలు అమ్ముడైంది రెండు కోట్ల కాపీలకి పై మాటే! కథ అంతా టినేజ్ పిల్లలు , డ్రాగన్స్ చుట్టూ తిరుగుతుంది. ఇక జె.కె.రౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందరో లక్షల మంది కొత్త పాఠకులని సాహితీ లోకానికి లాకొచ్చింది ఆవిడ. ఇప్పటి దాకా అమ్ముడుపోయిన కాపీలు నలభై కోట్లకు పై మాటే. కథ కుడా ఫేంటసీ కథే! నేను అన్ని పుస్తకాలు చదవలేదు లెండి. ఫిలిప్ పుల్ల్మన్ పుస్తకాలు విదేశాలలో చాలా బాగా అమ్ముడుపోయాయి అంటే ఒకటిన్నర కోట్ల కాపీలకు పై మాటే. వీటి గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. “గోల్డెన్ కంపాస్సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవటం ఒక కారణం ఏమో! నేను సిరీస్ పుస్తకాలు మూడూ చదివి ఉన్నాను. వంద చందమామ కథలకు పెట్టు సిరీస్! గత కొనేళ్ళలో ఆపకుండా మూడు పుస్తకాలు చదవటం నాకు గుర్తు లేదు.. “హిస్ డార్క్ మెటిరియల్స్ సిరీస్ తప్పితే !.


పుస్తకాలన్నీ 10-25 యేళ్ళ మధ్య వారి కోసమే. ఫ్యూచర్ సిటిజెన్స్ కోసమే! చిన్నప్పుడే పుస్తకాల విలువ తెల్సుకుంటే పాఠం జీవితాంతం గుర్తు ఉండి పొతుంది. మరి ఇరవై సంవత్సరాలలో తెలుగులో ఒక మోస్తరు ఫేంటసీ నవల అన్నా వచ్చిందా అంటే లేదు అనే చెప్పాలి! పుస్తకాల పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా ప్రపంచ బాలలంతా ఫేంటసీ ప్రపంచంలో ఓలలాడుతూ ఉంటే, ఎందుకనో మరి ఒక్క తెలుగు రచయిత/త్రి కూడా రకం నవలలు రాయాలని సంకల్పించలేదు! ఏదో అవతార్లాంటి సినిమా మనం తీయలేము అనండి .. ఒప్పుకుంటా .. అన్ని కోట్లు పెట్టి సినిమా తీసే స్థోమత మన దేశంలో ఇంకా యే ప్రొడ్యుసరుకీ లేదనే అనుకుంటున్నా మరి! (మధు కోడా ప్రొడక్షన్స్ వస్తే మరి చెప్పలేం అనుకోండి!) కానీ పుస్తకాలు రాయటానికి కోట్లు అక్కర్లేదు కదా. అది ఎందుకనో తెలియదు ఒక చట్రం గీసుకొని అందులో నుంచి బయటకు రావటానికి జంకుతారేమో మన రచయితలు అని ఒక ఫీలింగు నాకు. కానీ నాకు తెలిసి నేనే ఒక పది వేరు వేరు చోట్ల వేరు వేరు వ్యక్తులనుంచీ ఇది విని ఉన్నాను .. ” హర్రీ పోట్ట్రర్లో ఏముందని .. మన పంచతంత్ర కథలకంటేనా ఇవి ! ” … “ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి సినిమాలు మన విఠ్ఠలాచార్య ఎపుడో తీసారు కదా !”. ఇలా ఉంటాయి మనవాళ్ళ రియాక్షన్లు . బహుశా ఇలాంటి ఆలోచనల వల్లనేనేమో మన దగ్గర సాహితీ విప్లవాలు కలగలేదు గత 20 యేళ్ళలో! కోట్లలో అమ్మకాలు ఎలాగూ మన దగ్గర ఉండలేవు. ఏదో రోజు రోజుకీ తెలుగు సాహిత్యానికి దూరం అవుతున్న ఒక జెనరేషన్ని తిరిగి తెలుగు పుస్తకాలలో పడేయటానికి కొన్నిమంచి పుస్తకాలు వస్తే బాగుండు .. అందుకు ఫేంటసీని మించిన “genre” లేదు అని నా అభిప్రాయం.


కొసమెరుపు: చేతన్ భగత్ కూడా తన పుస్తకాలతో ఎందరినో తిరిగి పుస్తకపఠనం వైపునకు లాకొచ్చాడు. కనీసం అలాంటి కమర్షియల్ పుస్తక రచయితలు కూడా కరువయిపోయారు మనకి. చేతన్ భగత్ ఎదో బాపు, విశ్వనాథ్ లాంటి వాడు అని నేను అనట్లేదు కాని ఒక బి.గోపాల్, కే.రాఘవేంద్రరావులలాగా ఎదో కనీసం కలెక్షన్లన్నా సాధిస్తాడు.. పుస్తకాలని జనసంద్రంలోకి తీసుకొనివెళ్తాడు. అలాంటి వారు కూడా కరువయ్యారు మనకి ఎందుకనో మరి. అత్తెసరుగాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబోలు!

మనవి : ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పాను . షారుక్ ఖాన్ ని శివ సైనికులు నువ్వు ఇండియనువా, పాకిస్తానీవా అని బెదిరించినట్టు మీరంతా నన్ను నువ్వు తెలుగువాడివా .. తెల్లదొరవా అని బెదిరించరనే ఆశిస్తున్నాను! (నేను కొంచెం తెలుపే కానీ దొరను కాదులెండి ! ) .

http://en.wikipedia.org/wiki/Christopher_Paolini

You Might Also Like

38 Comments

  1. అబ్రకదబ్ర

    మీ ప్రశ్నకి నిష్ఠూరమైన సమాధానం: కాల్పనిక సాహిత్యం మనకెందుకు రాదంటే, కల్పనా శక్తి కలిగిన రచయిత/త్రులు మనకి లోపించటం వల్ల. Straight and simple 🙂 జీవితానుభవాల్లోంచి మాత్రమే కథలల్లగలిగే వాళ్లకి ఫ్యాంటసీలు రాయటం ఎలా వల్లనౌతుంది?

    ఒక్క ఫ్యాంటసీలేంటి. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, డిటెక్టివ్, అధివాస్తవికత, సైన్స్-ఫిక్షన్ …. ఈ విభాగాల్లో ఈ మధ్యొచ్చిన తెలుగు కథలెన్ని?

  2. సౌమ్య

    స్వంత ప్రచురణ వంటి విషయాలు అటు పెడితే, నిన్న క్రిస్టఫర్ పాలినీ ఫాంటసీ ట్రైలజీ – ‘Inheritance’ సిరీస్ లో రెండో పుస్తకం చదువుతూ అనిపించింది ఇదీ – తెలుగు సంగతి ఒక నిముషం పక్కన పెడితే, పోనీ, ఆంగ్లం లో అన్నా రాసేందుకు ప్రయత్నించలేరా?

    తెలుగు లో రాసేంత తెలుగు రాదు – అనుకుంటే, ఏదో ఒక భాషలో మన భావాలు మనం వ్యక్తీకరించుకోగలిగితే చాలు, అనుకుంటే – వచ్చిన అనుమానం ఇది. మార్కెట్ వాల్యూ – కనీసం ఆంగ్ల నవలల కైతే ఆ సమస్య ఉండదేమో అనుకుంటున్నా. ఏమంటారు?

Leave a Reply