రచయితా – శిల్పము (పుస్తక పరిచయం)
రాసినవారు: శ్రీనిక
ఆంగ్ల మూలం : ఇల్యా ఎహ్రెన్ బర్గ్ (1891-1967)
తెలుగుసేత: తుమ్మల వెంకటరామయ్య
————————————————————————————————————————-
ఇల్యా ఎహ్రెన్ బర్గ్ అప్పటి సోవియట్ యూనియన్ సాహితీ రంగంలోనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రచయిత. రెండో ప్రపంచ యుధ్ధకాలంలో యుధ్ధరంగం నుండి కలాన్ని శత్రుగళాల్ని ఛేదించే పదునైన ఆయుధంగా ఉపయోగించాడు. భారతీయ అభ్యుదయ రచయితలకి ఈయన కొత్త కాదు. సతీసమేతంగా భారతదేశాన్ని సందర్శించి ఆనాటి అభ్యుదయ రచయితలని కలుసుకున్నాడు.
————————————————————————————————————————
పుస్తకం లో ఆనాటి సోవియట్ రష్యా సామోజిక పరిస్థితులను చర్చించినప్పటికీ ప్రస్తావించిన సాహితీ విలువలను, ప్రయోజనాలను నేటికీ అన్వయించుకోవల్సిన పరిస్థితి ఉంది.
“లెనిన్ గ్రాడ్ యువ ఇంజనీరు ఒకరు ఇటీవలనే నాకొక ఉత్తరంలో ఇలా రాసారు.’ మన జీవితం కన్నా మన కల్పనా సాహిత్యం ఎందుకింత బలహీనంగా, నిస్సారంగా ఉంది? అన్న ప్రశ్న ఈ రచనకి ప్రేరణ.
మన సమాజం మన కళ్ళ ముందే నిర్మించబడుతుంది. సత్వరం పరిష్కరించవలసిన సమస్యలపై రాసిన నవలలు ఇంకా పాతవికాకుండా సజీవంగానే వున్నాయి. సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం మనజాలదు అంటాడు రచయిత. కళలు వికసించి, విజయోపేతమయిన సామరస్యం ఏర్పడి అద్భుత రచనలు అనేకంగా వెలువడిన
కాలం ప్రతి సమాజానికి ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది.
పాఠకుడు సాయంత్రం కిటికీ తెరగుడ్డలాగి ఓ పుస్తకాన్ని తెరచి చదవడం ప్రారంభించాడనుకోండి. ఆ గ్రంధంలోని పాత్రలు అదే పట్టణమ్లో, అదే వీధిలో ఉన్నప్పటికీ, పాఠకుని గమ్యస్థానం ఏమిటి?
ఈ పుస్తకం లో కనిపెట్టగలనని అతడు ఆశించే దేమిటి?
—- అంటూ రచయిత బాధ్యతను చెప్తాడు రచయిత.
తనతోటి పౌరులకన్నా, సమకాలికులకన్నా రచయిత బాగా తెలుసుకోవలసిన రంగం ఇంకొకటి ఉంది. అది మానవుని అంతరంగిక ప్రపంచం. ఒక పాత్ర ఆకారాన్ని, దాని పరిసరాలని వర్ణించాలంటే, దాని ఇల్లు గాని అది పనిచేసే ప్రదేశం గాని తెలుసుకోవాలి. విషయ సేకరణ జరగాలి…నిత్య అధ్యయనశీలిగా ఉండాలి. పరిచయ పాత్రలలో రచయిత అపరిచిత భూమిని సేద్యం చేయగలగాలి.
పాత్ర పాఠకుని పొరుగువాడేకావచ్చు. అతని ఆలోచనలని, దుఖాల్నీ, పనినీ, ప్రేమని, తప్పుల్నీ రచయిత చూపగల్గితే పాఠకుడా పుస్తకాన్ని ముగించగానే, తానెంతో తెలుసుకొగలిగానని అనుకుంటాడు. రచనలు ఈ దిశగా సాగాలి…అంటాడు ఎహ్రిన్ బర్గ్.
విమర్శకులు ఎలా ఉండాలి ?
ఒకానొక రచయిత యొక్క విజయాన్నో, విఫలతనో విశదీకరించే పనికి పూనుకునే విమర్శకులు, కళాత్మక రచన (గ్రంధం) ఎలా పుట్టిందో దానికి సంబంధించిన సమస్యలపైన ఏమైనా కొంత వివరణ చేస్తారా? లేదు. కొంతమంది విమర్శకులకు రెండే రెండు పుస్తకాలుంటాయి. బహుమతి పొందిన నవలలు, పూర్తిగా నాశనం చేయదగిన నవలలు. మొదటిరకం పుస్తకాలను సమీక్షించేటపుడు స్కూలు విద్యార్ధిలాగా ఆ పుస్తకాల్లోని విషయాన్ని వర్ణించుతారు. తమ స్వతంత్రతను నిలబెట్టుకోవడానికి ఏదో ఫలానిది లోపించిందని నిందిస్తూ ముగిస్తారు.
రెండో రకం పుస్తకాలను సమీక్షించేటపుడు విమర్శకులు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర వహిస్తారు. ఒక నవలను స్తుతించేటపుడు, లేక పూర్తిగా ఖండించేటపుడు, ఆ రచయిత రాసిన ఇతర పుస్తకాలకూ, ఈ నవలకూ సంబధాలను చూడాలి. రచయిత విజయానికి, వైఫల్యానినికి కారణాలను విశదీకరించాలి. అంటూ విమర్శకుల వైఖరి ఎలా ఉండాలో చెపుతాడు రచయిత.
బాగా రాయడం ఎలా అని ప్రశ్నించినపుడు లియో టాల్ స్టాయ్ చాలా విలువైన సలహాలు రెండిచ్చాడు.
1. నీకు అభిరుచి కల్గించని వాటిని గురించి రాయబోకు.
2. పుస్తకం రాయాలని నీకు ఉద్దేశ్యం ఉండి, నీవు తప్పని సరిగా రాసితీరాలి అన్న భావం నీలో కలగక పోతే, అసలు రాయడమే మానివేయి.
ఇదే భావాన్ని బర్గ్ మరోలా: యాంత్రికంగా ఘటనలను నమోదుచేసే యంత్రం కాదు రచయిత..అంటాడు.
రచనలో కౌశల్యం మాత్రమేకాదు, నవలను పాఠకులు ఆసక్తితో చదివేట్టు దాని సంవిధానం(ప్లాట్) ఉండాలి.
రచయిత శిల్పాన్ని గురించి చెప్పేటపుడు తరచుగా గతకాలపు రచయితలను పేర్కొంటాడు.
వారినుండి మనం నేర్చుకోవలసింది ఏమిటి? దీనికి సమాధానం సహజంగా సంపన్నత, అమలినభాష, వాక్య నిర్మాణం, సాహిత్య విధానాలు. మరొకరి నుండి నేర్చుకోవడమంటే..వారిని అనుసరించడం కాదు.
సమాజమ్లో రచయిత పాత్ర ఏమిటి? అతని విధి ఏమిటి?
ప్రజలకు అతడు ఎలా సేవచేయాలి?
పాఠకుడు రచయితనుండి ఏమి ఆశిస్తాడు?
సాహిత్యం సమాజాన్ని జ్ఞానవంతంగా చేస్తుందా?
ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం ఈ పుస్తకం.
అడుగడుగునా అనేక నవలల లోని సన్నివేశాలను ఉటంకిస్తూ రచయితకొక దిశని సూచిస్తాడు.
ఔత్సాహిక రచయితలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
ప్రధమ ముద్రణ : 1955
చతుర్ధ ముద్రణ : 2009
నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా ఈ రచనకోసం పాఠకులు పదే పదే ఉత్తరాలు రాస్తున్నారంటే
దీని విలువ వేరే చెప్పనక్కర్లేదు…..ప్రకాశకులు.
ప్రతులకు:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
విజ్ఞాన్ భవన్, 4-1-435
బ్యాంక్ స్ట్రీట్ , హైదరబాదు-500 001.
వెల: 25 రూపాయలు..
హెచ్చార్కె
నిజంగా చాల మంచి పుస్తకం. కనీసం ముప్పయ్యేళ్లయ్యుంటుంది మొదట తెలుగు అనువాదం, తనివి తీరక ఇంగ్లిష్ పుస్తకం సంపాదించి చదివి. పుస్తకం నాకు చెప్పిన పాయింట్లు కనీసం రెండు నా మనస్సులో ఇప్పటికీ తిరుగుతుంటాయి. ఒకటి… ఏ విధంగానూ నీ అనుభవంలో లేని దాన్ని సృజనాత్మక రచనలో ‘వర్ణించాల’ని చూడకు అని బర్గ్ రచయితలకు ఇచ్చిన సలహా. నీకు ఎప్పుడూ తలనొప్పి రాకపోయ వుంటే… తలనొప్పి వస్తే ఎలా వుంటుందో చెప్పడానికి ప్రయత్నించకు అని ఉదాహరణగా చెప్పారాయన. అలాగే, రచనలో ఉండాల్సిన టెండెన్సీ’ గురించి ఇచ్చిన ఉదాహరణ. ఏనుగు బొమ్మలో దాని అన్ని అవయవాలు సరైన ప్రపోర్షన్ లో వున్నాయా లేదా అని చూసుకుంటే అది కళ కాదు. ఆ ఏనుగు తొండం పైకెత్తి, ముందు కాలు ఒకటి పైకెత్తినట్టు (శిల్పి) చూపిస్తే అది ఏదో పనికి ఉద్యమించిన ఫీలింగ్ కలుగుతుంది చూపరికి. రచనలో కూడా అంతే అంటారు ఎరెన్ బర్గ్. ఇలాంటి “చిట్కాలు” చాల ఉన్నై ఆ పుస్తకంలో. ఒక మాట మాత్రం చెప్పగలను, ఇంగ్లీష్ పుస్తకం చదివించినంతగా, ఆలోచింపజేసినంతగా తెలుగు అనువాదం చదివించలేదని, ఆలోచింపజేయలేదని బాగా జ్ఙాపకం.
కొత్తపాళీ
మంచి మాటలు, ఎదిగి వస్తున్న రచయితలే కాదు చెయ్యి తిరిగిన రచయితలూ మననంచేసుకోవల్సిన మాటలు
బొల్లోజు బాబా
fine.
hope i can get this book and read
Independent
Wow.. My heartfelt thanks to Pustakam.net admin staff. You guys are doing such a commendable job that I sometimes find books that I never came across before, and it’s occuring more often of late.