2009 – పుస్తకాలు, నా సోది!

ఇద్దరు ఆంగ్లేయులు కలుసుకుంటే, మొదట వాతావరణం గురించి మాట్లాడుకుంటారట. అలాగే జపాను వాళ్ళు మాట్లాడుకుంటే ఆరోగ్యం గురించని, ఫ్రెంచ్ వాళ్ళయితే మరోటని ఇలా ఏవేవో ఉన్నాయి. నిరుడు కొంతమంది జాల మిత్రులని కలిసినప్పుడు పుస్తకాల గురించి మాట్లాడుకోవడం ఓ అనుభూతి. సాధారణంగా ఇద్దరు జాలమిత్రులు కలిస్తే, అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి మాట్లాడుకునే కోకాకోలా లాంటి థ్రిల్ నుంచీ, పుస్తకాల గురించి చర్చ అనబడే లేత కొబ్బరి నీళ్ళ మనఃతృప్తి వరకూ మనం (నేనూ, నా జాల మిత్రులూనూ) ఎదగడం సంతోషంగా అనిపించింది. ఇందుకు పుస్తకం.నెట్ కూడా కొన్ని సమిధలు ఆహుతిచ్చిందనడంలో సందేహం లేదు.

కొన్ని నెలల క్రితం పూర్ణిమ గారు ఓ చాట్ లో “ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నారని” అడిగారు. అప్పుడు పక్క తిరిగి చూసుకుంటే, అమృతం కురిసిన రాత్రి, చలం మ్యూజింగ్స్, ఓ రవీంద్రనాథ్ ఠాగూరు, కృష్ణమూర్తి నోట్ బుక్, సమగ్రాంధ్రసాహిత్యమ్ 2, అడుగున సత్యజిత్ రే దెయ్యాల కథలూ, తిలక్ కథలూ ఇలా ఉన్నాయి. అప్పుడు ఓ అనుమానం వచ్చింది. నేను పుస్తకాలు చదువుతున్నానా? లేక ఓ చిన్నపిల్లవాడు ఎక్కడ అయిపోతుందో అన్న సందిగ్ధతతో ఐస్ క్రీమును కొంచెం కొంచెం ఎలా ఆస్వాదిస్తాడో అలా ఒక్కో పుస్తకాన్నీ పట్టుకుని ఆస్వాదిస్తున్నానా? అని. పుస్తకాలలో కొన్ని ఉత్కంఠగా చివరివరకూ చదివించేవి కొన్నయితే, చదివిన ప్రతిసారి కొత్త అనుభూతినిచ్చేవి మరికొన్ని. (ఈ వర్గీకరణ అంత కరెక్ట్ కాదు. అలానే ఈ వర్గీకరణకు చెందక, మధ్యస్థంగా ఉన్న పుస్తకాలు కూడా ఉండవచ్చు) ఈ రెండవ తరహా పుస్తకాలలోనే “సరుకు” ఉంటుందని నాకో చెడ్డ అభిప్రాయం ఉండేది. పూర్ణిమ అందుకు విభేదించినట్లు గుర్తు. ఉత్కంఠగా చివరి వరకూ చదివించే పుస్తకాలు కూడా ఆలోచింపజేసే తరహాలో ఉండవచ్చుననీ, ఆ తర్వాత అప్పుడప్పుడూ గుర్తుకు రావచ్చనీ,చెప్పుకొచ్చారామె.

ఆలోచిస్తే, ఆమె చెప్పింది సబబేననిపించింది. 2009 లో నాకదో రియలైజేషను (జ్ఞానద్వారాలు తెరిచేసుకోవడమన్నమాట). దానికి ప్రేరేపించిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి.

ఇంతకూ 2009 లో నేను చదివిన పుస్తకాల కథాకమామీషు ఇదీ.

షాడో పుస్తకాలు: మధుబాబు రాసిన నవలలు, 2008లో అనుకుంటాను మళ్ళీ పునర్ముద్రించారు. దాదాపు ముప్ఫై, నలభై దాకా ఉంటాయి. అవన్నీ ప్రయాణాల్లో చదువుకోవడమే. ఏ చీకూ చింతా లేదూ, వాదనల్లేవు, సిద్ధాంతాల్లేవు, పైగా ఉన్న తలనెప్పులన్నీ మటుమాయం. ఝండూ బామ్ కు మంచి ప్రత్యామ్నాయం ఇవి. కాలక్షేపం బఠానీలు! ఇంటర్లోనో, డిగ్రీలోనో ఇవి చదువుతూ పెరిగిన వాళ్ళకు వీటి విలువ తెలుసుంటుంది.

యండమూరి ప్రార్థన, దుప్పట్లో మిన్నాగు వగైరా: ఇవి ఇప్పుడు కాస్త బోరే కానీ, యండమూరి గురించి తెలియని వాళ్ళు ఇవి చదవడంలో తప్పులేదు.

బొమ్మరిల్లు పొట్టినవలలు: ఇవి నాకు కొన్ని దొరికాయి. వీటిలో కొన్ని చదివాను. ఎప్పుడు మొదలెట్టామో తెలియకుండా చదవడం అయిపోతుంది. అలానే పాత చందమామలూనూ.ఇక్కడ మరో విషయం. పాత చందమామలు వీజీచెయిర్ లో కాళ్ళు బారజాపుకుని, మధ్యమధ్యలో పుస్తకం తాలూకు సువాసనను ఆఘ్రాణిస్తూ చదవడంలో ఉన్న తుత్తి, అంకోపరి (ల్యాప్ టాప్)లో చదవడం లో రాదుగాక రాదు.(నా దగ్గర పాత చందమామలున్నాయి కొన్ని. అదీ నా బడాయి లెండి)

ఇక కథా సాహిత్యం: తిలక్ కథలు, శ్రీపాద వారివి కొన్నీ, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి మిట్టూరోడి కథలు వగైరా.నామిని వారి సినబ్బ కథలు మాత్రం నిజంగా బాల్యంలో దాచుకుని దాచుకుని తినే కమ్మరకట్ట లాంటిదే.సందేహమే లేదసలు. ఈ పుస్తకాలు తెలీకుండా ఇన్నేళ్ళెలా గడిపానో ఏమో. కొత్తపాళీ అనే ఆయన పుణ్యాన శ్రీపాద మార్గదర్శి పుస్తకం తెచ్చుకోగలిగాను.

ఏటి ఒడ్డున అన్న కవితల సంకలనం అనుకోకుండా ఆ పుస్తకం రచయిత ద్వారానే లభించింది, చాలా ఆశ్చర్యకరంగా. ఇదొక మరపురాని జ్ఞాపకం! ఈ పుస్తకం తరుచూ దాచి చదువుకునే జాబితాల్లో చేరింది. ఓ వేసవి సాయంకాలాన ఏటిఒడ్డుకు ఏటి గలగల వినాలనుంటే ఈ పుస్తకం చదవచ్చు, కాదు కాదు, ఆస్వాదించవచ్చు.

ఆంగ్ల పుస్తకాలు చదవటం ఇబ్బంది అయినప్పటికీ, కాస్త కష్టపడి గొప్ప పుస్తకం ఒకటి చదివాను, పోయినేడాది. చదివిన దానికి తగ్గ ప్రతిఫలమూ దక్కింది. అద్భుతమైన పుస్తకం అది. విల్ డ్యూరాంట్ రాసిన A Case for India అన్నది. అదే ఊపులో మరో పుస్తకం “The Men who killed Gandhi” అన్నది తెచ్చుకున్నా (తస్కరించా) ఒకరి దగ్గర. ఇది మాత్రం అటకెక్కే పరిస్థితి కనబడుతూంది! ఇంకా అప్పుడెప్పుడో ఫ్రెడరిక్ నీత్సేదస్ స్పేక్ జరతూస్త్ర అనీ, ఓడ్ హవుసు పుస్తకాలు, మధ్యదాకా చదివి వదిలేసినవీ ఉన్నాయి. వాటిని తవ్వకాలు జరిపి వెలికితీయాలి. ఎప్పుడు వీలుపడుతుందో ఏమో?

మన భాగ్యనగరంలో ఆనందబుద్ధ విహార ట్రస్ట్ అని ఒక సంస్థ ఉన్నది. వారి పుస్తకాలు మూడు ఉన్నవి, “ధమ్మపదం కథలు, జాతకమాల, లోక క్షేమ గాథలు” అన్న పేర్లతో. అద్భుతమైన పుస్తకాలివి. బుద్ధ బోధనూ, బుద్ధుడి నాస్తిక వాదం (?) వివరాలనూ, హిందూ మతంపై కొన్ని అపోహలనూ ఈ పుస్తకాలు చక్కగా వివరిస్తాయి.ఇందులో ఒక పుస్తకం డిజిటల్ లైబ్రరీ లో ఉన్నది. అలానే బౌద్ధధర్మం మీద సాధ్యమైనంత స్వతసిద్ధంగా (ఒరిజినల్) ఉన్న పుస్తకాలు ఇవి. అలా కాకపోయినా, కథలపరంగా ఈ పుస్తకాల సాహిత్యవిలువ తీసివేయదగ్గది కాదు.

ఇవి కాక, నోరి నరసింహ శాస్త్రి గారి చారిత్రక నవలలు ఓ మూడు, ఆర్య చాణక్య నేను చదివిన మరి కొన్ని.

చదవాలనుకుని చదవలేక వదిలేసినవి చెంగిఝ్ ఖాన్, చిలకమర్తి వారి జీవిత చరిత్ర, సాక్షి వ్యాసాలు, రఘువంశ కావ్యమూ వగైరా.

మొన్న మా ఊళ్ళో ఉన్నపళంగా రోడ్డుపక్కన, వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్ వారి పాతకాలం పుస్తకాలు కొన్ని అగుపడ్డాయి. అందులో పరవస్తు చిన్నయసూరి గారి నీతిచంద్రిక, ఓ పాత అమరకోశమూ, మరో రెండు పుస్తకాలు తీసుకున్నాను. (పుస్తకాలు చదవడం కోసం కన్నా, ఆ సువాసన కోసం) ఇంకొన్ని పుస్తకాలను మరుసటి రోజుకోసం ఆట్టే పెట్టేసి వస్తే, ఆ తరువాత రోజవి అక్కడ మాయమయాయి. ఆ పోయిన వాటిలో ఆంధ్రమహాభాగవతమూ (తెలుగు వచనం), పాండురంగ మహత్మ్యమూ, శంకర విజయం అనే కావ్యమూ ఇవన్నీ ఉన్నయ్. చాలా బాధేసింది.

అన్నిటికన్నా ఎక్కువగా 2009 లో నన్ను వెంటాడిన పుస్తకం – మృచ్ఛకటికం అన్న సంస్కృతనాటకం (సటీక, తాత్పర్య సహితం – బేతవోలు రామబ్రహ్మం). ఈ వ్యాసం రాస్తున్నప్పుడూ ఆ పుస్తకం మనసులో మెదులుతూనే ఉంది. ఈ యేడాదీ, సంస్కృత కథా, రూపక సాహిత్యాలు తప్పక చదవాలి. (ముందుగా సంపాదించాలి!)

పోయినేడాది, కొన్న పుస్తకాలకన్నా చదివిన పుస్తకాలు తక్కువ. ఈ యేడాది అది వ్యతిరేకం చేయాలని ఆశ. అలానే “పుస్తకం” లో అందరూ, కాఫ్కా, చేగువేరా, చేతన్ భగత్ ఇలాంటి వారి గురించీ, మంచి మంచి ఆంగ్ల పుస్తకాల గురించీ చెబుతూంటే, నా చాదస్తం రాస్తున్నందుకు సిగ్గుగా ఉంది.అలాంటి పుస్తకాల మీద పరిచయం పెంచుకోవాలనే ఆశా ఉంది!

You Might Also Like

9 Comments

  1. రవి

    పూర్ణిమ గారు: ఇందాకే విశాలాంధ్రకెళ్ళి వస్తున్నాను, నేనూనూ. చాణక్యనీతి పుస్తకమే నేనన్నదీనూ. ఈ మధ్య తిరిగి ముద్రించినట్టున్నారు.(ఇందాక వ్యాఖ్య వెనక్కి తీసుకుంటున్నాను)

    శంకర విజయం అన్న పుస్తకం కూడా కొత్తగా విశాలాంధ్రలో ఉంది. ఇది శంకరాచార్యుల వారి జీవితచరిత్రలా కనబడుతూంది.

  2. Purnima

    @రవి: >> చాణక్య నీతి (శ్రీపాద వారిది. ఈ పుస్తకం ఇప్పుడు దొరకదు)

    శ్రీపాద వారి చాణక్య నీతి (సూక్తులు?) అనేదో ఒక పాకెట్ బుక్ విశాలాంధ్రలో కనిపించింది. కొత్త ముద్రణ. మీరంటున్న పుస్తకం ఎన్ని పేజీలు? ఏముంటుంది?

  3. నరసింహారావు మల్లిన

    ప్రస్తుతం నేను తెప్పించుకొని చదువటం ప్రారంభించిన పుస్తకాల వివరాలు.

    అమరకోశము జయలక్ష్మీ పబ్లికేషన్సు 906 పేజీలు

    మందరం – అంటే శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము – గ్రంథకర్త కీ.శే. శ్రీ వావిలికొలను సుబ్బారావు ( వాసుదాసు ) గారు. రచనాకాలం 1900 – 1908 మధ్యకాలంలో.
    వీరు వ్రాసిన మందరం పుస్తకాల వివరాలను ఈ క్రింద పొందుపరుస్తున్నాను. చదవాలనుకొనిన వారు వాటిని తెప్పించుకోవచ్చు.

    కాండ వివరము పేజీలు వెల
    బాల కాండము ౯౯౧(992) రు.250
    అయోధ్యా కాండము-1 ౬౪౦(640) రు.225
    అయోధ్యా కాండము-2 ౬౩౬(636) రు.225
    అరణ్య కాండము ౭౦౨(702) రు.225
    కిష్కింధ కాండము —- ——
    సుందర కాండము ౬౭౦(670) రు.250
    యుద్ధ కాండము – 1 ౬౨౪(624) రు.225
    యుద్ధ కాండము – 2 ౬౬౪(664) రు.225
    ఉత్తర కాండము ౫౮౪(584) రు.225

    పై మందరం భాగాలలో వాల్మీకి రామాయణం లోని సుమారు 24000 శ్లోకాలను అన్నే పద్యాలలో నిర్వచనంగా వ్రాసారు శ్రీ వాసుదాసుగారు.
    టీకా తాత్పర్యాలతో పాటుగా అనేకమైన ఛందోవిశేషాలనూ ఇతర విషయాలను గుఱించి కూడా వ్రాయటం జరిగింది. శ్రీమద్రామయణాన్ని పూర్తిగా చదివి ఆనందించాలనుకొనేవారికి పై పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం కిష్కింధా కాండ ప్రింటింగ్ లో ఉన్నదట. ఓ రెండు నెలల్లో దొరుకుతుందట. అందుచేతనే ఆ కాండ వివరాలు వ్రాయలేదు.
    ప్రాప్తి స్థానం :
    శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజము,
    అంగలకుదురు, వయా తెనాలి
    ఆంధ్ర ప్రదేశ్
    Ph. 9390097195

    మందరం పుస్తకాలలోని రామాయణాంతర్గత సొగసులను గురించి ఛందో విశేషాలగురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది బ్లాగును దర్శించగలరు.
    http://jwalasmusings.blogspot.com

  4. రవి

    స్నేహ గారు, అవునండి అనంతపురం లోనే. మహాభారతం వచనం దాదాపు 7,8 బౌండు పుస్తకాలు కూడా అక్కడే చూశాను. అన్నీ ఏకమొత్తంగా కొనేసి ఉంటే సరిపోయి ఉండేది. ఇప్పుడు ఏవీ లేవక్కడ. అయినా ఆశ చావక, ప్రేతాత్మ లాగా అక్కడే తిరుగుతున్నాను. ఈ రోజూ ఓ సారి చూసొచ్చాను. ఏవీ లేవక్కడ.

    సౌమ్య గారు, ఆ పాతపుస్తకాలు – నీతిచంద్రిక, అమరకోశం, సంస్కృత రామాయణం అరణ్య, కిష్కింధ కాండలు (ఇవి నాకోసం కాదు, మరొకరి కోసం), గాయత్రి తత్వ విచారం, చాణక్య నీతి (శ్రీపాద వారిది. ఈ పుస్తకం ఇప్పుడు దొరకదు). వీటి గురించి ఏం వ్రాయమంటారు? 🙂

    సుజాత గారు: శంకర విజయం అన్న సంస్కృతగ్రంథం నేనూ అక్కడే మొదటిసారి చూశాను. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర, బుక్క రాయల వార్ల గురువులు మాధవ విద్యారణ్యులు (శృంగేరీ శారదా పీఠాధిపతి) వ్రాసిన గ్రంథమట. నాకూ ఆ పుస్తకం గురించి ఒక్క ముక్కా తెలియదు.

    పూర్ణిమ గారు: తెలుగు సాహిత్యం మీద మంచి అభినివేశం ఉన్న పండితులు జాలంలో ఉన్నారు. అయినా అంతమాటనేశారేంటండి?

  5. Purnima

    @సుజాత: >> 80ల్లో పుట్టి మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలతోనే చదువు మొదలెట్టిన ఈ తరం యువతరానికి ఆంగ్ల పుస్తకాలతోనే సాహిత్య పరిచయం మొదలవుతుంది. అందువల్ల వాళ్ళు పాపం ఫౌంటెన్ హెడ్ తోనే మొదలెడతారు మరి! ఏం చేస్తాం?

    బోలెడు చెయ్యగలరు. తెలుగు సాహిత్యంలో కమ్మదనాన్ని పరిచయం చేస్తే కాదనేవాళ్ళుంటారా? పిట్జాలు తింటున్నాం కదా అని గుంటూరు ఇడ్లీ కాదంటామా, మీరు వడ్డించాలే కానీ? 🙂

    “పుస్తకం.నెట్” మొదలెట్టడంలో ముఖ్యోద్దేశ్యం ఇదే.. మనకి తెల్సినంతలో (తెల్సింది చాలా తక్కువనిపించినా)పుస్తకాల గురించి విషయాలు, విశేషాలు పంచుకోవడం. ఈ నెల ఫోకస్‍కి ఈ అంశం ఎన్నుకోడానిక్కూడా అదే కారణం.. ఏడాది కాలంలో చదివిన అన్ని పుస్తకాల గురించి రాయలేకపోయినా, పేర్లు ప్రస్తావించినా కొద్దిలో కొద్ది మేలే కదా అని!

  6. Purnima

    >> కాఫ్కా, చేగువేరా, చేతన్ భగత్ ఇలాంటి వారి గురించీ, మంచి మంచి ఆంగ్ల పుస్తకాల గురించీ చెబుతూంటే, నా చాదస్తం రాస్తున్నందుకు సిగ్గుగా ఉంది.

    మీరు మీరీనూ! ఆళ్ళ గురించి గూగులమ్మని అడిగాలే గానీ, బోలెడంత ఇన్ఫో ఇస్తుంది. అదే కొన్ని తెలుగు పుస్తకాల గురించి గూగులమ్మని అడిగితే మీ వంకే చూపిస్తోంది! 🙂 అందుకని మీరు ఇలానే అరుదైన తెలుగు సాహిత్యాన్ని మాకు పరిచయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇహ, మీరు ఆంగ్ల సాహిత్యం చదవాలనుకుంటే మేం ఉడతా సాయం (ఏదైనా ఉంటే) చేయడానికి సంసిద్ధం! 🙂

  7. సుజాత

    మొత్తానికి షాడోని షాడో లా బాగానే అనుసరిస్తున్నారన్నమాట.:-) ఈ మధ్య నేను కూడా విజయవాడ బస్టాండ్ లో షాడో పుస్తకాలు మరి కొన్ని కొన్నా ఎప్పుడన్నా సరదాగా చదవొచ్చని.

    ఇంగ్లీష్ పుస్తకాల గురించి!

    మాతృభాష తెలుగై, కనీసం పదో క్లాసు వరకు తెలుగు మీడియం లో చదివిన వారికి(నాలాగా)తెలుగు పుస్తకాలంటేనే ప్రాణం లేచొస్తుంది. 80ల్లో పుట్టి మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలతోనే చదువు మొదలెట్టిన ఈ తరం యువతరానికి ఆంగ్ల పుస్తకాలతోనే సాహిత్య పరిచయం మొదలవుతుంది. అందువల్ల వాళ్ళు పాపం ఫౌంటెన్ హెడ్ తోనే మొదలెడతారు మరి! ఏం చేస్తాం?

    నా మటుకు నాకు తెలుగు పుస్తకాలంటే ఇష్టం! కానీ ఆంగ్ల సాహిత్యంలో కూడా చదవాల్సిన పుస్తకాలు చాలా వున్నాయని గ్రహించి ఆలస్యమైనా పర్లేదని ఆరేడేళ్ల క్రితం నుంచి అడపా దడపా ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.ఫౌంటెన్ హెడ్ కూడా చదివేశాను.:-)

    ఎవరు చదివిన పుస్తకాల గురించి వారు పంచుకోడానికే కదా పుస్తకం వేదిక! అయినా మీరు ఆంగ్ల పుస్తకాలు చదవరంటే నేను నమ్మను.

    ఈ టపాలో మీరు ప్రస్తావించిన కొన్ని పుస్తకాలు అసలున్నాయని కూడా నాకు తెలీదు.ఉదాహరణకు శంకర విజయం!

    హంపీ నుంచి హరప్పా దాకా..గురించి మీరు రాస్తే చదవాలని ఉంది.

  8. సౌమ్య

    మీకు కనబడ్డ పాతపుస్తకాల గురించి, వావిళ్ళ వారి గురించి – త్వరలో రాస్తారు కదూ పుస్తకం లో?? 🙂

  9. స్నేహ

    రవి గారు,

    మీరు చెప్పింది అనంతపురంలో రోడ్డు పక్కన పాత పుస్తకాలు అమ్మే వాళ్ళ గురించేనా. అయితే అమరకోశం మీరు తీసుకున్నరా. నేను చూసినపుడు అక్కడ వున్నది. తరువాత తీసుకుందామని వదిలేసాను. నేను ఆంధ్రమహా భాగవతం తీసుకున్నాను. నేను కొన్నపుడు కూడా పాండురంగ మహత్యం చూసాను.

Leave a Reply