2009 లో నేను చదివిన పుస్తకాలు
నాకు చిన్నప్పటినుండి పుస్తకాల పిచ్చి ఎక్కువే. అందునా తెలుగు పుస్తకాలు. అమ్మకు కూడా చదివే ఆసక్తి ఉండడంతో ప్రతి వారపత్రిక, మాసపత్రిక కొనేది. నాకు అలా తెలుగు మీద, చదవడం మీద అభిమానం పెరిగింది. ఎలా అంటే ఎవరింటికి వెళ్లినా ముందు వాళ్లింట్లో పుస్తకాలు ఉన్నాయా చడవడానికి అని అడిగేదాన్ని. ఓ పుస్తకం ఇచ్చి ఓ మూల చోటు చూపిస్తే చాలు సెటిల్ ఐపోయేదాన్ని. కొద్ది కాలంగా చదవడం తగ్గింది కాని గత సంవత్సరం ఎమెస్కో లైబ్రరీ స్కీములో చేరడం వల్ల ప్రతినెల ఒకో పుస్తకం ఇంటిముంగిటికి వచ్చేస్తుంది. అలాగే ఈ బ్లాగుల పుణ్యమా అని ఎన్నో పుస్తకాల గురించి తెలుసుకోవడం జరిగింది. అందులో కొన్ని కొన్నాను కూడా. ఇంతకు ముందు ఎక్కువగా కుటుంబ ప్రధానమైనవి, సస్పెన్స్ నవళ్లు ఎక్కువగా చదివేదాన్ని. సాహిత్యం,పురాణాలు, పద్యాలు కూడ ఇష్టమే కాని ఏ పుస్తకాలు కొనాలో, చదవాలో చెప్పేవాళ్లు లేరుగా. గత సంవత్సరం మాత్రం విభిన్న అంశాలు గల పుస్తకాలు కొనడం, చదవడం జరిగింది. అవి కుటుంబ ప్రదాన కథలు, సస్పెన్స్, కామెడీ, వ్యక్తిత్వ వికాసం, సాహిత్యం, కథలు మొదలైనవి…. చదివిన పుస్తకాల గురించి కొన్ని వివరాలు .
మునెమ్మ…. డా.కేశవరెడ్డి గారి ఈ పుస్తకం మీద జరుగుతున్న దుమారం చూసి దాని సంగతేంటో చూడాల్సిందే అని అనుకుంటున్న సమయంలో అదే పుస్తకం నాకు బహుమతిగా వచ్చింది. చాలా కాలం తర్వాత నవల చదవడం వల్ల ప్రారంభంలో కాస్త మెల్లిగా చదివినా కథలో ఇన్వాల్వ్ అయ్యాక పుస్తకం పూర్తయ్యేవారకు వదలబుద్ధి కాలేదు.. ఇందులో నాయిక పాత్ర నాకు నచ్చింది. భర్త అనుమానంతో గొడ్డును బాధినట్టు బాదినా అతను చనిపోయాక దుఖంతో క్రుంగిపోదు. అత్తకు ధైర్యం చెప్పి ఒంటరిగా బొల్లిగిత్త సాయంతో ఒంటరిగా బయలుదేరి, తన భర్త చావుకు కారణాలు తెలుసుకుని ప్రతీకారం తీసుకుంటుంది. బ్రతుకు బండి నడపడానికి సమాయత్తమవుతుంది.
హాస్య కథలు… పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఈ పుస్తకంలో ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలెన్నో ఏర్చి కూర్చారు. ప్రతి కథలోనూ ఆనాటి కాలంలోని ప్రజల అనుబంధాలు, ఆత్మీయతలు, మర్యాదలు స్పష్టంగా గోచరిస్తాయి. అది చదువుతూ మన చిన్ననాటి రోజుల్లోకి వెళ్లి నాన్నమ్మ, అమ్మమ్మలను గుర్తు తెచ్చుకోవచ్చు.
సాకేత రామాయణం…. మానవజీవనము ఉన్నంత కాలం రామాయణముంటుంది. అంతే కాదు. ఎప్పటికి నిత్యనూతనంగా తోస్తుంది. అదే ఆ రామకథలోని మహత్తు, మాధుర్యం. ఈ మహనీయ కథామాధుర్యాన్ని సాకేత రామాయణం పేరుతో శ్రీ గజానన్ తామన్ గారు గేయరూపంలో అందించిన అద్భుత గేయకావ్యం. ఇందులో వివిధ రగడజాతికి చెందిన యాభై రెండు గేయాలు పొందుపరచబడ్డాయి. కథాసూత్రాన్ని పాత్రలే తమ మనోభావాల్ని గేయరూపంలో వ్యక్తం చేస్తాయి. అలా రామాయణాన్ని మరో రూపంలో ఆస్వాదించగలిగాను.
సిల్లీఫెలో…. మల్లిక్ రాసిన ఈ నవల నవ్వులు పూయిస్తుందంటే అతిశయోక్తి కాదు. అదేంటో గాని మల్లిక్ కి మాత్రమే అద్భుతమైన పేర్లు, పేరడీలు, వెక్కిరింతలు, భయంకరమైన తిట్లూ వస్తాయి. అవి చదువుతుంటేనే నవ్వు వచ్చేస్తుంది. ఒక ప్రేమజంట తమ బాస్ తో పడే కష్టాలు. తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లకు ఎలా చెప్పాలి అని వాళ్లిద్దరూ ముఖ్యంగా అబ్బాయి పడే తంటాలు, తదనంతరం జరిగే గంధరగోళం విచిత్రంగా, వినోదాత్మకంగా ఉంటాయి.
గడప …. హోతా పద్మినిదేవి గారు రాసిన ఈ నవలలో ధనవంతురాలైన అత్త బీద కుటుంభం నుండి వచ్చిన కొత్త కోడలిని తక్కువ చేసి మాట్లాడ్డం, ధనవంతురాలైన పెద్ద కోడలిని ఆమె పుట్టింటి వారిని పొగడ్డం చేస్తుంది… తామూ ఒకప్పుడు కోడళ్లమే అని మరచిన అత్తలు తమ కోడళ్లను ఆరళ్లు పెడుంటుంటారు. కాని ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో తగిలే ఎదురుదెబ్బలకు తమ తప్పు తెలుసుకుంటారు అని చెప్తుంది ఈ నవల..
తాడంకి – ది థర్డ్ … మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల కాస్త డిఫరెంటుగా ఉంటుంది. కోట్ల విలువైన ఆస్థిని వారసులకు ఎలా పంచాలి అనే చిన్న అంశంపై మొదలైన ఈ కథలో అన్నీ విచిత్రమైన పేర్లు ఉంటాయి. మనవలు కూడా ఉన్న వయసులొ ఒక పెద్దమనిషి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు . కాని అది పెటాకులై, పదిహేనేళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్యతో కలిసి సహజీవనం సాగిస్తాడు. ముసలితనాన కొడుకును కంటాడు. అర్ధం కాలేదు కదా. అదే మరి నవల ప్రత్యేకత.
బి.వి.పట్టాభిరాం …. ఎందుకో ఈ పుస్తకాలు చదవాలనిపించి తెప్పించుకున్నా. ఒకరు సాధించగా లేంది మీరెందుకు సాధించలేరు అనే టర్నింగ్ పాయింట్, ఆత్మవిశ్వాసం గురించి మరింతగా అవగతం చేసే సెల్ఫ్ కాంఫిడెన్స్ పుస్తకాలు. చదువుతుంటే నిజమే కదా ఈ విషయాలు మనం ఎందుకు ఆలోచించము అనిపించింది.
రంగుటద్దాల కిటికీ .. కొత్తపాళీగా మనకు తెలిసిన నారాయణస్వామిగారు రాసిన ఈ పుస్తకం కూడా నాకు నచ్చింది. విభిన్నమైన అంశాలపై రాసిన కథా సంకలనం ఇది. ఊరికే అలా చదివే పుస్తకం కాదు. కాస్త కుదురుగా కూర్చుని మనసు పెట్టి ఒక్కో కథ చదవాలి. ఇలా చిన్న కథలు చదవడం నాకు కొత్తైనా కూడా అందులోని కొన్ని కథలు మనసుకు తాకుతాయి. కొన్ని ఆలోచింపచేస్తాయి. అలాగే కొన్ని అర్ధం కాలేదు. (అది నా సమస్యేమో )
ఇల్లలుకగానే… పి. సత్యవతి గారు రాసిన ఈ పుస్తకం మాత్రం నాకు బాగా నచ్చింది. జీవితంలో నేర్చుకొవలసిన ఎన్నో విషయాలున్న ఈ పుస్తకం చదువుతుంటే నేనే ఆశ్చర్యపోయాను.. ఇదేంటి.. ఇవన్నీ నా మాటలే కదా. బ్లాగు టపాల్లో, కామెంట్లలో నేను చెప్పిన మాటలే రచయిత్రి చెప్పారు అని. అంటే నాలా ఆలోచించేవాళ్లు , నా మాటలు సరియైనవే అని ఒప్పుకునేవారు చాలా మంది ఉన్నారు అనుకున్నా. ఈ కథలు నన్ను ఆలోచింపచేసినంతగా ఇంతవరకు ఏ కథా , నవలా చెయలేదు అనుకుంటున్నాను. నన్ను నా గురించి మరింతగా ఆలోచింపచేసిన పుస్తకం ఇది.
మధుపం .. సంవత్సరాంతంలో చదివిన పుస్తకం ఇది. సాక్షి ఫండే ఎడిటర్ రాజిరెడ్డిగారు రాసిన ఈ పుస్తకం చదివితే ముందు కోపం వస్తుంది. తర్వాత జాగ్రత్తగా చదివితే రచయిత చెప్పాలనుకున్నది అర్ధమై నవ్వొస్తుంది. ఒక్కో కధలో అందమైన అల్లరి ఉంటుంది. పురుషుడు స్త్రీని ద్వేషిస్తాడు. అలాగని ఆమెని ప్రేమించకుండా ఉండలేడు. కోపం, తాపం, వాంచ, వాత్సల్యం, అక్కసు, అభిమానం .. ఇలా పురుషుడికి సంబంధించిన ఎన్నో ఎమోషన్స్ కు స్త్రీ కారణమవుతుంది. అని రచయిత చెప్పుకున్న మాట అక్షరాలా నిజం. నిజంగా ఇది ఒక మగవాడి ఫీలింగ్స్ ని వెలికి తీస్తుంది. చదివి తీరాల్సిందే. కల్పన అన్నట్టు అప్పడాలకర్రతో బాటు ఈ పుస్తకం కూడా ఆడవాళ్ల చేతిలో ఉండాల్సిందే. మగవాళ్ల సీక్రెట్లన్నీ చెప్పేసుకున్నారుగా మరి..
ఇవన్నీ చదివినవి. ఇక చదవాల్సినవి చాలా ఉన్నాయి (మొన్న నా బ్లాగులో ఫోటో పెట్టాగా) . ఎప్పుడవుతుందో ఏమో. అందుకే ఆ పుస్తకలన్నీ నా కంప్యూటర్ పక్కనే కబ్ బొర్డ్ లో పెట్టుకున్నా. కనీసం అప్పుడప్పుడు తీసి చదువుకోవచ్చు అని.
ఇప్పటికింతే .. ..
రవి
పొత్తూరి విజయలక్ష్మి గారికి ఒకప్పుడు అభిమానిని నేను. ఆ పుస్తకం దొరికితే చూడాలి.