ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
రాసిన వారు: జంపాల చౌదరి
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
*****************************************
నాలుగైదేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌గారి ద్రౌపది నవల ధారావాహికంగా వస్తుండేది. మొదట్లో నేను సరిగా పట్టించుకోలేదు గాని, ఒక మిత్రుడు బాగుంది, చదవమని సూచించటంతో పాత సంచికలు వెలికితీసి చదవటం మొదలుబెట్టాను. మొదటి ప్రకరణం ప్రారంభించిన తీరు నన్ను కొద్దిగా ఆశ్చర్యపరిచింది. ఉత్కంఠనూ కలిగించింది. మిగతా పుస్తకాన్ని ఆసక్తిగా చదివించింది. కొన్నాళ్ళకి ద్రౌపది పుస్తకంగా వచ్చింది; రెండో ముద్రణకూ నోచుకొంది. 2007 జూన్‌లో లక్ష్మీప్రసాద్‌గారు చికాగో వచ్చినప్పుడు ద్రౌపది గురించి కొద్దిగా చర్చ జరిగింది. ఈ మధ్యే ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు వచ్చిందని తెలిసి ఆనందించాను. అప్పటినుంచీ బ్లాగులతో సహా వివిధ మీడియారంగాలలో ఈ విషయం సమస్యాత్మక చర్చనీయాంశం అయింది. చర్చల్లో పాల్గోంటున్న చాలామంది మాట్లాడుతున్న విషయాలకు నేను చదివిన నవలకు పోలికలు తక్కువగా కనిపించాయి. చర్చల్లో పాల్గొంటున్న చాలామంది ఈ పుస్తకం చదవనేలేదని, పురాణ పాత్రలకు ఆధునిక భాష్యాలు చెప్పటంపై తమకు ఉన్న భావనల ఆధారంగానే మాట్లాడుతున్నారని నాకు అనిపించింది. అయినా అనుమాన నివృత్తికోసం ఈ పుస్తకాన్ని మళ్ళీ చదివాను.
ముందు పుస్తకాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసి, ఆ తర్వాత ప్రస్తుతం నడుస్తున్న వివాదంలోని కొన్ని అంశాల గురించి మాట్లాడుతాను.
కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ఈ కథ ప్రారంభమౌతుంది. యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది.
ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. కర్ణుడు తన భర్తలకి అన్న అనే విషయం ద్రౌపదిని విస్మయపరిచింది. ఈ విషయం ముందే తెలిసిఉంటే తనకూ కర్ణుడికీ మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండేవన్న సందేహం ఆమెకు కల్గింది. ఆమె అంతకు ముందు కర్ణుని రెండుసార్లే చూసింది. ఆ రెండు సందర్భాలలోనూ ఆమెకు కర్ణుడిపట్లా తిరస్కారభావమో, అసహ్యమో కల్గాయి. తాను కర్ణుని రెండు సార్లే కలసినా తనజీవితమంతా కర్ణుని చుట్టే తిరిగినట్లుందని ఆమెకు తోచింది. ఆమె కర్ణుని మొదటిసారి చూసింది తన స్వయంవర సమయంలో. సూతపుత్రుడన్న కారణంతో కర్ణుని మత్స్యయంత్రం చేదించటానికి ప్రయత్నం చేయకుండా ఆమే ఆపించింది. ఆ తరువాత ఆమె కర్ణుని చూసింది కౌరవసభలో. ఆరోజున తనను అవమానించటంలో కర్ణుడు ప్రముఖ పాత్రే వహించాడు. కర్ణుని హీనునిగా తలపోస్తున్న ద్రౌపదికి, కుంతి, కృష్ణుడు చివరిరోజుల్లో పశ్చాతప్త హృదయుడైన కర్ణుడి ఉదాత్తప్రవర్తన గురించి ఆమెకు తెలిపారు. మరణించిన కర్ణుడు అదృష్టవంతుడు. అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది. అతనికి అద్భుత, విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది. తమకూ, కర్ణుడికీ ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కల్గింది. అతన్ని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవలసి వచ్చింది.
పట్టమహిషైన ద్రౌపదికి తన జీవనపథమ్మీద, తన వివాహంపైన ఉన్న ధర్మశంకలను, కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు), కృష్ణుడు తీర్చారు. పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆమె పాతివ్రత్యానికి మెచ్చిన మౌద్గల్యుడు ఆమెతో ఏకకాలంలో ఐదురూపాల్లో (త్రిమూర్తులు, ఇంద్రుడు, మన్మథుడు) రమించాడు. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. ఆమెను పార్థునికివ్వాలన్న తలపుతో ఉన్న ద్రుపదుడు, పాండవులు మరణించారన్న మాట విని, ఆమెకు స్వయంవరం ప్రకటించాడు.
ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.
అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది.
ఇదంతా మనకు తెలిసిన మహాభారత గాధే. ఈ ఘట్టాలన్నీ ఇంతకుముందు మనం కథలుగా విన్నవే. ఐతే ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటి?
ఈ పుస్తకం కేవలం పాండవ కౌరవుల కథ మాత్రమే కాదు. ఇది ప్రధానంగా ద్రౌపది దృక్పథం నుంచి చెప్పబడిన కథ. ద్రౌపది మనోభావాల కథ. ఆమెకెదురైన విపరీత పరిస్థితులకు ఆమె స్పందనల కథ. ఈ కథలో ద్రౌపది ఒక నిస్తేజమైన, నిస్సహాయమైన, అణిగిమణగి ఉన్న పాత్ర కాదు. రక్తమాంసాలూ, జవసత్వాలూ, నిండు మనసుతో సజీవమైన మహిళ. ఆమె అసాధారణ సౌందర్యరాశి — రూపేచ లక్ష్మి. సునిశితంగా ఆలోచించగల్గి, రాజనీతి తెలిసిన ఆమె ధర్మజునికి, ఇతర పాండవులకు కరణేషు మంత్రి. తన పతులపై విపరీతమైన అనురాగం కలిగిన ఆమె సోదరులైదుగురికీ శయనేషు రంభ. అనేక అవమానాలను, తన పతుల తప్పిదాలను సహించిన ఆమె క్షమయా ధరిత్రి.
ఈ పుస్తకంలో నాకు నచ్చిన అంశాలు.
తెలిసిన కథను మనకు మళ్ళీ చెప్పటానికి రచయిత ఎంచుకొన్న క్రమం – మనకు పరిచయమైన క్రమంలో నడవదు ఈ కథ. ఉపపాండవుల మరణశోకంతో ద్రౌపది దుఃఖిస్తుండటంతో ఈ కథను మొదలుబెట్టడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కల్గించింది.
తన ఐదుగురు భర్తల గురించి ద్రౌపది విశ్లేషణ – పాండవు లైదుగురి వ్యక్తిత్వాలను ద్రౌపదితో ప్రథమ సమాగమపు సమయంలో వారి ప్రవర్తనలద్వారా ఆవిష్కరిస్తాడు రచయిత. వారి మనస్తత్వాలను ఆకళింపు చేసుకొని వారి మనోభావాలను దెబ్బ తీయకుండా ద్రౌపది ప్రవర్తించే విధానాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించారు.
కుంతికీ ద్రౌపదికీ ఉన్న సాన్నిహిత్యం – ఈ నవలలో ద్రౌపదికి ముఖ్యస్నేహితురాలు ఆమె అత్తగారే. ద్రౌపది వలే కుంతికూడా విలక్షణమైన పురుష సంబంధాలు కల్గినదే. ద్రౌపది మానసిక సంఘర్షణలను, సందిగ్ధాలనూ అర్థం చేసుకొని ద్రౌపదికి మానసిక సాంత్వనను కలిగించటానికి కుంతి ప్రయత్నిస్తుంటుంది.
ఈ నవలలో చాలా విలక్షణమైనది కృష్ణకూ, కృష్ణునికీ ఉన్న సంబంధం. ఇద్దరికీ ఒకరిపట్ల ఒకరిపై విపరీతమైన మమకారం. మానసికంగా వారిద్దరూ అతిసన్నిహితులు.
ఈ కథ చెప్పటంలో లక్ష్మీప్రసాద్‌గారి శైలి ప్రత్యేకించి మెచ్చుకోదగింది. చదువరిలో ఉత్కంఠను రేకెత్తించి పుస్తకాన్ని కడవరకూ చదివింపచేస్తుంది. ఆయన వాక్యాలూ, సన్నివేశాలూ ఉద్విగ్నంగా వడివడిగా పరిగెడతాయి.
ఈ పుస్తకానికి సాహిత్య ఆకాడెమి బహుమతి వచ్చాక వినిపిస్తున్న విమర్శలు.
అ) ఈ పుస్తకంలో శృంగారం మితిమించి ఉంది. ద్రౌపది శరీర వర్ణనలు, ఐదుగురి భర్తలతో ఆమె గడపిన మొదటిరాత్రుల వర్ణనలు ఉచితంగా లేవు. ఈ పుస్తకంలో ద్రౌపదిని ఉత్త కాముకిగా, స్వైరిణిగా చిత్ర్రెకరించారు:
241 పేజీలున్న ఈ పుస్తకంలో ద్రౌపది తన భర్తలతో కూడిన పంచరాత్రుల వర్ణనలు ఐదు ప్రకరణాలలో 13 పేజీలలో ఉంటాయి. ఆ శృంగార వర్ణన కానీ, ద్రౌపది సౌందర్య వర్ణన కానీ – నా అభిప్రాయంలో – సగటు ప్రబంధాల్లో ఉన్న వర్ణనలకన్నా గానీ, లేక ప్రస్తుతం వారపత్రికలలో కనిపించే శృంగారకథలకన్నా గానీ తక్కువగానే ఉన్నాయి. శృంగారాన్నీ, కామక్రీడల వర్ణనల్నే ప్రధానాంశం చేయాలని రచయిత భావించి ఉంటే, ఈ పుస్తకంలో దానికి చాలా అవకాశాలే ఉన్నాయి. ఈ పంచరాత్రులు కూడా పాండవులైదుగురి విభిన్న తత్వాలను ద్రౌపది అర్థం చేసుకోవటంకోసమే వినియోగించుకొన్నారు రచయిత. ఉదాహరణకు ద్రౌపదీ అర్జునుల మొదటిరాత్రి గురించిన మూడున్నర పేజీల ప్రకరణంలో, వారి శృంగార క్రీడ వర్ణన ఏడు లైన్ల పేరాగ్రాఫుకు మాత్రమే పరిమితమయ్యింది; మిగతా మూడుంబావు పేజీలు వారిద్దరి మనస్తత్వాలూ, మానసిక సన్నిహిత్యాల చిత్రణే. ఈ పుస్తకంలో ముద్దులూ, బిగికౌగలింతలూ, సుఖాలింగనాలూ వగైరా చాలాచోట్ల కనిపించినా, అవన్నీ కథాగమనంలో కలసిపోయినవే. పుస్తకంలో ఉన్న శృంగారం చాలావరకూ పరస్పర అనురాగరక్తులూ, యవ్వనవంతులూ ఐన భార్యాభర్తల మధ్య పెళ్ళయిన తర్వాత పడగ్గదిలో జరిగిందే. కామకార్యకలాపాల వర్ణనకోసమే ఈ పుస్తకం చదివితే నిరాశ తప్పదు; వేరే పుస్తకాలూ, పత్రికలూ చాలానే ఉన్నాయి వాటికోసమైతే.
ద్రౌపదిని శృంగారానురక్తగా చిత్రించటం, తన భర్తలతో భోగించటంపై ఆమెకు ఉన్న మక్కువను అనేక సందర్భాల్లో చెప్పిన మాట నిజమే. ఆమె పూర్వజన్మ వృత్తాంతాలను వర్ణించేటప్పుడు కూడా ఆమెకు ఉన్న కామేఛ్చ ప్రధానంగా కనబడిన మాట వాస్తవమే. ఐతే. ఇది తన కల్పన కాదనీ, ఆదిపర్వంలోని పంచేంద్రోపాఖ్యానంలోనే ఈ కథ ఉందనీ విపులంగా ముందుమాటలో చెప్పారు రచయిత.
ఈ పుస్తకంలో ద్రౌపది చాలా బలమైన ఉద్వేగాలు (strong passions) కల వ్యక్తి. ఇది ఒక్క శృంగార విషయంలోనే కాదు. ఆమె రాగవిరాగాలలోనూ, అగ్రాహానుగ్రహాలలోనూ కూడా అంతే. రచయిత ముందుమాట ప్రకారం ఈ నవలా రచనోద్దేశం: “ఈ జన్మలో ద్రౌపదిగా ఏ కోరికలు ఈడేర్చు కోవటానికి పరమశివుని వరప్రసాదంగా జన్మించిందో, ఆ కోరికలు తీరాయా లేదా అన్న విషయం చర్చిస్తూ, ద్రౌపది మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, ప్రశంసనీయమైన ఆమె ఆత్మవిశ్వాసాన్ని, మహిళాలోకానికే మకుటాయమానంగా నిల్చిన ఆమె సౌశీల్యాన్ని, కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, శ్రీకృష్ణుని సఖిగా, మహారాజ్ఞిగా, రాజనీతిజ్ఞురాలిగా, విదుషీమణిగా, ఉత్తమ ఇల్లాలుగా, గృహిణిగా వివిధరూపాలలో పరిఢవిల్లిన ఆమె వ్యక్తిత్వ గరిమను వివరించటమే”. ఈ పుస్తకం ఆసాంతమూ చదివినవారెవరికైనా ద్రౌపది కామేచ్ఛ మాత్రమే కనిపిస్తే వారితో తన దృక్పథం పంచుకోవటంలో రచయిత విఫలమైనట్లే. ఐతే దీనికి కారణం పాఠకుడా, రచయితా అన్నది ఆలోచించవలసిన విషయం.
ఆ) కృష్ణుడికీ, ద్రౌపదికీ మధ్య రచయిత సూచించిన సంబంధం అనుచితంగా ఉంది. కృష్ణుణ్ణి ద్రౌపది సఖుడుగా భావించటం ఆమె కృష్ణుడితో శారీరక సంబంధం కోరటాన్ని సూచిస్తుంది.
ఈ పుస్తకంలో కృష్ణుడికీ, ద్రౌపదికీ మధ్య ఉన్న సంబంధం – మామూలుగా మనం చదివే- అన్నాచెల్లెళ్ళ సంబంధం కాదు. అర్జునుడికి కృష్ణుడితో ఉన్న అసాధారణ సంబంధం లాంటిదే ఇది. ఇందులో స్నేహమూ, సానిహిత్యమూ ఎక్కువ. ఎక్కడా ఈ సంబంధంలో శారీరక కామేచ్ఛ ఉన్నట్లు రచయిత చూపించలేదు. భగవంతుడిలో భక్తుడు (పురుషులు కూడా) అమితప్రేమతో ఏకమయ్యేట్టి వర్ణనల వల్లే ఉంటుంది ఈ పుస్తకంలో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం. ద్రౌపదికి, సత్యభామకు జరిగిన సంభాషణలో ఇది మరింత విశదీకరించబడుతుంది. సఖుడు, ప్రేమ అన్న పదాలు శారీరక సంబంధాలకు మాత్రమే పరిమితం కావు.
ఇ) కుంతి పాత్ర చిత్రణ బాగాలేదు. ఆమెను పంచభర్తృకగా చూపటం; ఆమె ఆ భర్తలతో ఎక్కువకాలం సుఖించకపోవటం తలచుకొని బాధపడుతున్నట్టుగా చూపటం ఉచితంగా లేదు.
ఈ పుస్తకంలో కుంతి పాత్ర చిత్రణ కొద్దిగా అస్పష్టంగానే ఉంది. ద్రౌపదికీ ఆమెకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉన్నట్టు చూపించారు రచయిత. ఐతే ఆమె తన ప్రవర్తనను గూర్చి ఏమనుకొంటుందో చెప్పటంలో ఏకసూత్రత లేనట్లుగా అనిపించింది.
ఈ) వ్యాసుడి పాత్ర చిత్రణ అనుచితంగా ఉంది.
విదురుని తల్లితో సమాగమ సందర్భంలో వ్యాసుడు ఆమెతో జరిపిన సంభాషణ అసందర్భంగానూ, అనుచితంగానూ ఉంది. ఈ కథాగమనానికి అంత ఉపయుక్తం కాని ఈ సంఘటన, సంభాషణ రెండూ వర్జ్యనీయమే.
ఉ) ద్రౌపదికి కర్ణుడిపట్ల కామవాంఛలున్నట్లు వ్రాయటం ద్రౌపది వ్యక్తిత్వాన్ని కించపరచడమే.
ఈ నవలలో ఎక్కడా కూడా ద్రౌపదికి కర్ణుడిపై వాంఛ ఉన్నట్టు వ్రాయలేదు. ఆమెకు మొదట కర్ణుడంటే సూతపుత్రుడన్న తిరస్కార భావం; ఆ తర్వాత కురుసభలో అతని ప్రవర్తన చూశాక అతడంటే కోపం, అసహ్యం. భారత యుద్ధానికి ముఖ్యకారణం కర్ణుడి ప్రతీకార వాంఛే అని ఆమె నమ్మకం. కర్ణుడు కుంతీపుత్రుడని తెలిసినప్పుడు కూడా, “తనతో వివాహమాడేందుకు అలాంటి నీచుడికి అర్హత ఉన్నదా…” అనుకొంటుంది ఈ పుస్తకంలో ద్రౌపది. కర్ణుడి మరణానంతరం కుంతి, కృష్ణుడు కర్ణుడితో తమ సంభాషణలు వివరించాక అతని పట్ల జాలి, గౌరవం కలిగినట్లు చూపిస్తారు రచయిత.
ఊ) పుస్తకం ముఖచిత్రం ఉదాత్తంగా లేదు.
నా దగ్గర ఉన్న పుస్తకం, రెండో ప్రచురణ (జనవరి 2008); రెండు ముద్రణలకూ ఒకటే ముఖచిత్రం వాడారో లేదో నాకు తెలియదు. నా దగ్గర ఉన్న పుస్తకం ముఖచిత్రం: సాంప్రదాయ పద్ధతిలో ఆభరణాలు అలంకరించుకొన్న ఒక హిందూ యువతి (రవివర్మ సంప్రదాయంలో చిత్రీకరించబడింది అనిపించింది) ముఖం, మెడ వరకూ కనిపిస్తూ ఉంటుంది; కొంత వెనుకగా, అదే ముఖం కొద్దిగా తక్కువ పరిమాణంలో, లేతగా కనిపిస్తుంటుంది. చిత్రకారుడు (పేరు కనిపించలేదు) వాడిన రంగులు పాతరోజుల్లో శివకాశినుంచి వచ్చే పౌరాణిక కేలెండర్ బొమ్మలను గుర్తుకు తెచ్చాయి.
ఈ ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. నాకైతే ఎలాంటి అనౌచిత్యమూ కనిపించలేదు.
ఎ) ఇంతకన్నా మంచి పుస్తకాలు చాలా ఉండగా ఈ పుస్తకానికే ఇవ్వాలా? (ఈ అభ్యంతరంలోనే, ఇతర పర్యాయ ప్రశ్నలు: ఈ అవార్డును దళిత రచయితకో తెలంగాణా రచయితకో ఇవ్వచ్చుగా?)
అవార్డులు, అవి ఇచ్చే సంస్థ నిర్ణయించుకొన్న పరిమితుల, నిబంధనల పైనా, న్యాయనిర్ణేతల అభిరుచులపైనా ఆధారపడి ఉంటాయి.
సాహిత్య అకాడెమి పరిమితుల, నిబంధనల గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు.
అభిరుచుల వరకూ మాత్రం లోకో భిన్న రుచిః. న్యాయ నిర్ణేతలు మారితే ఏ అవార్డు ఎంపికైనా మారే అవకాశం ఎక్కువగానే ఉంటుంది.
ఈ సంవత్సరం బహుమతికోసం ఏ పుస్తకాలు పరిగణించబడ్డాయో నాకు తెలీదు. ఇలాంటి బహుమతుల్లో కూడా ఒక కోటా పద్ధతి ఉండాలని వాదించేవారితో నేను ఏకీభవించను.
ఏ అవార్డుకైనా ఎంత గౌరవం ఇవ్వాలి అన్నది కూడా వ్యక్తిగత అభిరుచులపైనే ఆధారపడి ఉంటుంది. ఒక సంస్థ కొన్ని సంవత్సరాల క్రమంలో చేసిన అవార్డు ఎంపికలు మన అభిరుచులకి సరిపోతే మనం ఆ సంస్థ ఇచ్చే అవార్డులకు గౌరవం ఇస్తాము. లేకపొతే వాటిని పట్టించుకోవటం మానేస్తాం.
నేను అభిమానించే రచయితలకూ, పుస్తకాలకు పూర్వం చాలాసార్లు కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతులు వచ్చాయి; అంచేత నాకు ఈ సంస్థ అవార్డులంటే ఇప్పటికీ మంచి అభిప్రాయమే ఉంది.
ఈ పుస్తకంలో కొన్ని విషయాలపట్ల నాకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ, మొత్తమ్మీద పుస్తకాభిమానులందరూ చదవవలసిన పుస్తకమేనని నా అభిప్రాయం. ఎంతగానో పరిశ్రమించి, పరిశోధించి, చక్కటి పుస్తకం వ్రాసినందుకు శ్రీ లక్ష్మీప్రసాద్‌కు నా అభినందనలు.
ఈ పుస్తకాన్ని విమర్శించదలచుకొన్న వారు పుస్తకం ఒకసారి కూలంకషంగా చదివాక విమర్శిస్తే అర్థవంతంగా చర్చించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. విమర్శించటానికి పుస్తకాన్ని చదవాలా అనేవారికి నమస్కారం.
******************
ఈ పుస్తకం ఇప్పుడు కినిగె.కాం లో ఈ-పుస్తకంగా లభ్యం. లంకె ఇక్కడ.
chavakiran
ఈ పుస్తకం ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగె లభిస్తుంది. వివరాలకు ఈలింకు చూడండి. http://kinige.com/kbook.php?id=620
nsprasad
analysis of and comments are good, but we have to respct the indian/hindu culture particularly draupadhi is such character should not shown in this way, she is highly respectable position, her role as mother /sister/daughter/daughter in law is respectable in all the time during mahabharat katha.Draupadhi charcter is as high as himalayas, but after reading the entire novel the shown charter has given way to think rather than normal.
Srinivas Chimata
Chowdary gaaru,
Today, I clicked on all your articles in this blog and this one has instantly attracted me. Teh author gave me a copy when he was here in 2008 (for SiliconAndhra’s Kuchipudi celebrations). When I was reading a few episodes in the Andhrajyothy online paper earlier, I was very curious to know what would be in the next episode. So, I was all excited to read the book in one go.
pAndavulu vanavAsam ku veLLETappuDu arjanuDu isukanu nEla meeda challaTam gurinchi manchi justification icchAru rachayata. I never understand why Balayya (played as Arjanudu in pAnDava vanavAsam movie) was doing it in the “vidhi vanchitulai” song. 🙂
One point I did not like in this book is that Drutaraastrudu feels sad for being blind, as he can not enjoy the nakedness of Drowpadi (during her vastrApaharaNam) or some thing like that. This particular line literally killed the character of Drutaraastrudu.
A wonderful analysis by you.. Kudos to your pristine Telugu!!!
Srinivas Chimata
ChimataMusic.com
Gokul narni
There was another essay from a different point of view on the draupadi novel. It was also published in vividha of Andhra Jyothy during that time.
Can somebody collect it and place it for completelness?
Thanks.
Gokul
Jampala Chowdary
గోకుల్ గారూ: మీరే ఆ వ్యాసమేదో, ఎక్కడ దొరుకుతుందో చూసి, ఇక్కడ ఒక లింకు పెడితే ఉపయుక్తమైన పని చేసినవారౌతారు.
పుస్తకం » Blog Archive » సత్యభామ – యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొత్త పౌరాణిక నవల
[…] చెలరేగింది (ఈ విషయంపై నా వ్యాసం ఇక్కడ చూడవచ్చు). ఆ వివాదం అలా సాగుతూ […]
పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు
[…] రవీంద్రనాథ్ 7. రవ్వలకొండ – వంశీ 8. ద్రౌపది – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ 9. […]
Samera Kumar Peddiraju
Kameswararao Garu chakkaga chepparu.
The standard of the NOVEL can be easily assessed, when it is having a TV actress face on the cover page. The standard of the writer of the NOVEL is limited to only to that extent.
This NOVEL is NOT “retold” and swakapola kalpitam of the writer. Naturally it is as per the STANDARDS of the writer.
Getting the Sahitya Academy Awarad depends on how best one can lobby. Everybody knows that.
So discussing on a NOVEL like this at length is not desired.
Sujay says ఇతిహాసాల్లో ఉదాత్త పాత్రల జోలికి వెళ్లకుంటేనేమి. Boss, this is the one of the ways to be in the lime light.
Sameera Kumar
ysreeranganayaki
if a book attains attention it is good, thought provoking, any writer develops new vision it leads innovation,,otherwise no use to write best wishes to authour
gks raja
జంపాల గారి విశ్లేషణ చదివాక “ద్రౌపది” పుస్తకం తప్పక చదవాలనుకుంటున్నాను.
M.S.V.S.P.VARMA
ఈ నవలలో కొన్ని పేజిలు చదివినా అర్థం అవుతుంది, ఇది అశ్లీల నవల కాదని ,విశదంగా అన్ని కోణాల నుంచి అవిష్కరించినందుకు ధన్యవాదాలు
veeranjaneyulu
it is good
rama devi
gurucharan das gari “difficulty of being good” book takuva price lo ekadina dorukutundemo telupagalaru…
rama devi
Srinivas Nagulapalli
మంచి ప్రశ్న వేసారు- “నవలకు అవార్డు వస్తే విలువ పెరుగుతుందా?” ఇది పొందిన నవల గురించి కన్నా, ఇచ్చిన అవార్డు విలువ గురించే ఎక్కువ. నవల విలువ పడ్డా, అసలే లేకపోయినా ఎవరికి కావాలి. కొనడం మానేస్తాం, చదవడం ఆపేస్తాం. ఇంకా దూరం పోతే అంతకన్నా నీరసమైనవాటితో పోల్చి రచయితకు ఇంకా బాగా ప్రయత్నించమని ప్రోత్సాహం కూడా ఇవ్వొచ్చు. జనాల టాక్సు డబ్బులతో ఇచ్చే అవార్డు యొక్క విలువ దిగజార్చినందుకే జనాల విమర్శలు, ఆవేదనలు. దానికితోడు పల్లెత్తుమాటతోనైనా అవార్డు ఇవ్వడాన్ని సమర్థించని న్యాయనిర్ణేతల, పండితమ్మన్యుల అభిప్రాయాలు.
=======
విధేయుడు
-శ్రీనివాస్
సుజయ్
నాతో చేయికలుపుతారని నమ్ముతున్నాను. ద్రౌపది నవల మన తెలుగు నవల. కొంత కాలం క్రితం వీక్లీలో సీరియల్గా వచ్చింది. ఆ సమయంలో ఎవరూ ఇంతగా విమర్శించనది… ఎవరూ పట్టించుకోనిది… అవార్డు వచ్చిన తరువాత రివ్యూలతో, విమర్శలతో ఆ నవల ప్రాముఖ్యత పెంచుతున్నారు. కాదా? నవలకు అవార్డువస్తే విలువ పెరుగుతుందా? విలువలు పెరుగుతాయా? మహాత్మగాంధీ గురించి ఒక కొత్త పుస్తకం వస్తే… అందులో ఆయన శీలాన్ని శంకించే ప్రయత్నం జరిగితే, జాతిపిత స్థానంనుండి ఆయనను దించివేస్తామా? ద్రౌపది పాత్ర కూడా అంతే. ఆమెకు ఐదుమందితో వంతులవారిగా సంసార సుఖం పొందుతున్న విషయం మనకు తెలిసి ఆమెను పతివ్రతగా చూడడం లేదా? ఇతిహాసాల్లో ఉదాత్త పాత్రల జోలికి వెళ్లకుంటేనేమి.
కామేశ్వర రావు
ద్రౌపది నవల నేను చదవలేదు కాబట్టి దాని గురించి నో కామెంట్స్. అయితే దీని మీద బేతవోలువారి వ్యాసం నాకు కాస్త విడ్డూరంగా అనిపించింది! చాలా సందేహాలు వచ్చాయి. దీన్ని గురించి పెద్దలెవరైనా చెప్తారేమోనని ఇక్కడ రాస్తున్నాను.
1. “వివాహానికి ముందు ఈమెకూ ద్రుపదుడికీ తన కరస్పర్శతో దృష్టినిచ్చి పూర్వజన్మ వృత్తాంతాలను కళ్లకు కట్టించాడు. సమాధాన పడ్డాకనే ద్రుపదుడూ, ద్రౌపదీ అంగీకరించారు.”. నాకు తెలిసి వ్యాసుడు పూర్వజన్మ వృత్తాంతాలను కళ్ళకు కట్టించింది ఒక్క ద్రుపదుడికే, ద్రౌపదికి కాదు. ద్రౌపదికి కూడా ఈ దివ్యదృష్టి నివ్వడం వ్యాసభారతంలో ఉందా?
2.”అయితే ఆశ్చర్యమేమంటే వ్యాసభారతంలోనే సఖీ సంప్రదాయం స్పష్టంగా చాలా చోట్ల కనిపించడం”. ఇది కాస్త విడ్డూరంగా ఉంది. “సఖి” అన్న పదాన్ని పట్టుకొని వ్యాసభారతంలో సఖీ సంప్రదాయం స్పష్టంగా చాలా చోట్ల కనిపిస్తుంది అనడం సాహసం కాదూ? సఖీ సంప్రదాయం ఎప్పట్నుంచీ వచ్చిందీ, దాని సారమేమిటి, వ్యాసభారత కాలానికి ఇది ఉందా, ఇవేవీ బేతవోలువారు ఆలోచించలేదనుకోవడానికి నాకు ఆశ్చర్యంగా ఉంది! అలా ఆలోచించి కూడా ఇలా అన్నారా? ద్రౌపది “ప్రియ సఖీ” అన్న శ్లోకాన్ని ప్రస్తావించారు కాని, ఉద్యోగ పర్వంలో అదే ఘట్టంలో “నీకు అభిమన్యుడు ఎలాగో ధర్మ దృష్టితో నా పిల్లలూ అంతే” అన్న ద్రౌపది మాటని ప్రస్తావించ లేదు! మళ్ళీ వారే నాలిక కరుచుకొని, ఉత్తరహరివంశంలో ఉదాహరణ ఇచ్చారు. “రక్తసంబంధం లేని సోదర స్నేహానికి ఇది వాడుక అనుకుంటాను” అని ఒక అనుమానం వ్యక్తం చేసారు! ఇంత చేసి మళ్ళీ “కొత్తదనం కోసం అంటాడో, వ్యాసుడికోసం అంటాడో ఈయన!” అని వ్యాసుణ్ణి ఎందుకు లాగినట్టు? కొత్తదనం కోసం అంటే తప్పేముంది? దానికి వ్యాసుడి ఆమోద ముద్రపడాలన్న తాపత్రయం ఎందుకు? ఆలోచించాల్సిన విషయం ఇది కొత్త దృష్టికోణమైనా, దీని వల్ల ఆ కథకి కాని పాత్రకి కాని కొత్తగా ఒరుగుతున్నది ఏమైనా ఉందా అన్న విషయం. మూలంలో ఉన్న ఖాళీలని ఏమైనా పూరిస్తోందా? లేదా ఈ కాలం జనాలకి కొత్తగా ఏమైనా ఉపయోగకరమైన విషయం స్ఫురింప జేస్తోందా? అదీ అసలైన విషయం. దీని గురించి వారు కాని, ఇతర విమర్శకులు కానీ ఏమీ చెప్పకపోవడం నాకు నిరాశ కలిగించింది. కేవలం “కొత్త” ఒక్కటే దానికున్న గొప్పదనమా?
3. చివర ద్రౌపది ప్రాణం కృష్ణుని వేణుగానంలో లీనమైపోయింది అనడం బేతవోలుగారు అన్నట్టు మహోదాత్తమైన ముగింపే అనుకుందాం. అయితే దీనికి కోసం సఖి సంప్రదాయం ప్రవేశ పెట్టడం అవసరం లేదే!
4. అలాగే “ఆదిపరాశక్తి”, “స్వర్గలక్ష్మి” గురించి ప్రస్తావించి చివరకి మళ్ళీ నాలిక కరుచుకున్నారు! ద్రౌపది స్వర్గ రాజ్య లక్ష్మి. పాండవులు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని అంశలు. కృష్ణుడు ఆ లోకానికి ఉపేంద్రుడు. అయితే ఏమిటి? ఈ అవతారంలో కృష్ణుడు పాండవులకి బావ. కాబట్టి ద్రౌపది అతనికి వరసకి చెల్లెలే. అందుకే ఇంతా చెప్పి, “దేవతామూర్తులకు ఒక అవతారంలో లేదా ఒక పురాణంలో ఏర్పడ్డ బంధుత్వాలను మరొక అవతారంలోకీ లోకంలోకీ పురాణంలోకీ విస్తరింపజెయ్యకూడదు అని మన పెద్దలు ఒక నియమం పెట్టారు” అని మళ్ళీ నాలిక కరుచుకున్నారు.
5. ధర్మరాజు ద్యూత సమయంలో ద్రౌపదికి పంపిన సందేశం అతని రాజకీయ దురాలోచనగా నిశ్చయించేసారు బేతవోలువారు. ఇది రాజకీయ దురాలోచన అని అనుకోవడానికి ఎంత ఆస్కారం ఉన్నదో, అది ధర్మరాజు ధర్మదృష్టితో, ద్రౌపది అడిగిన ప్రశ్నకి సమాధానగా మాత్రమే అన్న మాటలని కూడా అనుకోవచ్చు. మన ధర్మం మనం నిర్వర్తిస్తే, దుర్యోధనుని దుర్మార్గం ప్రజలే తెలుసుకుంటారని అతని ఉద్దేశమని కూడా అనుకోవచ్చు. అలా అనుకోకపోతే, ధర్మరాజుకే తుది నిర్ణయం వదిలిని భీష్మాదుల పాత్రల వ్యక్తిత్వాలన్నింటినీ శంకించాల్సి వస్తుంది.
6. “అసలు ద్రౌపది జీవితంలో శృంగార రసానుభవానికి అవకాశం ఉన్నది ఎంతకాలం?” ఇది మరో విడ్డూరమైన ప్రశ్న, సమాధానమూను! వనవాస కాలం పన్నెండేళ్ళూ ద్రౌపదికి శృంగార రసానుభవమే లేదని ఇతని ఉద్దేశమా?! ఇది లేకపోతే పాఠకులు పిచ్చెక్కిపోతారా? అంటే వ్యాసభారతం చదివి పాఠకులు పిచ్చెక్కిపోతారనా?! వ్యాసభారతంలో (ఆ తర్వాత ఆంధ్రభారతంలోనూ) శృంగార రసాన్ని బేతవోలువారు గుర్తించనే లేదని నేను అనుకోలేను!
7. “ఇతిహాసంలోని అన్ని అంతరువులనూ స్పృశించి, అర్థం లేని ఆధునికత వైపు పోకుండా నిలబడి” – ఈ నవల స్పృశించిన ఇతిహాసంలోని “అంతరువులు” ఏమిటో మచ్చుకు కొన్నైనా వివరించి ఉంటే బాగుండేది. అలాగే అర్థవంతమైన ఆధునికత ఏమిటుందో కూడాను.
Srinivas Nagulapalli
(Please delete earlier one-formatting looks bad,hope this is better)
లింకు చూపించినందుకు జంపాల గారికి మరో సారి కృతజ్ఞతలు.
అవధానంలో దుష్కర ప్రాసకు ఏం పదం వేస్తారో అన్న కుతూహలం లాగా,
రచ్చకెక్కిన వాక్యాలపై బేరా గారు ఏం పదాలతో రాస్తారన్న ఆసక్తి
ఆసాంతం చదివించింది. ఆ పదాలేవి? “దిష్టిచుక్క, నాగరకం”!
రచయిత తన తక్షణ కర్తవ్యంగా ఎత్తిచూపిన ఘట్టాలను “నాగరకం”
చెయ్యమని కోరుకోవడం, మరియు
“శృంగారం మోతాదు మించింది. పాఠకుల దృష్టి చెదిరి అసలు లక్ష్యం –
మనస్తత్త్వ చిత్రణ- అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది” ,
“..-వ్యాసుడి దాసీసంగమ ఘట్టంలోనూ ఇంతే”,
“వీటిని ఎంతో నాగరకంగా ఇంకా గాఢంగా ఇంకా గూఢంగా పోషించవచ్చు,
చిత్రించవచ్చు”
అన్నవి చదివితే, “హితస్య సహితం సాహిత్యం” గురించి ఎంతో తెలిసిన
బేరా మేష్టారు సాక్షరంగా సాహిత్య అవార్డుకు ఎంపిక చేయడం
ఆశ్చర్యంకన్నా విచారం. ఒక టీచరుగా దీన్ని తిరిగి రాయించకుండా పాసు
మార్కులైనా వేస్తారా అనిపించే వ్యాఖ్యలతో అవార్డుకు సిఫార్సు
చేయగలరా, చేసారా అన్నదీ మిగిలిపోయిన ప్రశ్నే.
“మనిషి మంచితనం మగువ దగ్గర తెలుస్తుందని సామెత” అని బేరా గారు
చెప్పడం చాలా ప్రస్తుతం. మనిషి మంచితనమే కాదు, నవలా రచయిత
మంచితనం కూడా.
ఇదంతా మగువ గురించే కాబట్టి చివరిగా దేవదాసు పాట “ఎవరికోసం,
ఎవరికోసం”. కాదు అట్లాంటి మాట. ఈ పుస్తకం వల్ల పాఠకునికి తెలియని
విషయం ఏం తేటతెల్లం అయ్యింది, ఇదివరకే అకాడమీ అవార్డు గ్రహీత
అయిన రచయితకు ఈ అవార్డు వల్ల లేని కీర్తి ఏం వచ్చింది, తెలుగు
సాహిత్యానికి ఏం మేలు చేసింది, ఏం ప్రోత్సాహాం దేనికి ఇచ్చింది, ఏం
సంతోషం ఎవరికి మిగిల్చింది-అన్న ప్రశ్నలకు మరో తెలుగు సామెత
మదిలో మెదిలింది. “చదివితే ఉన్న మతి పోయిందట”.
=====================
విధేయుడు
-శ్రీనివాస్
చౌదరి జంపాల
శ్రీ శ్రీనివాస్ నాగులపల్లి కోరిన బేతవోలు రామబ్రహ్మంగారి వ్యాఖ్యానం ఈ వారం వివిధలో –
http://www.andhrajyothy.com/unicodevividhashow.asp?qry=2010/mar/1/vividha/1vividha1&more=2010/mar/1/vividha/vividhamain
Srinivas Nagulapalli
అవార్డులపై భేదాభిప్రాయాలు సహజమైనా దీనిదొక విశిష్టత. భారతరత్న,జ్ఞానపీఠాలు ఫలానా వారికివ్వలేదనే బాధ, ఇతరులకిచ్చారన్న దానికన్నా ఎక్కువ. ఇక్కడ ఉల్టా స్థితి! దేనికో ఇవ్వనందుకు కాదు, దీనికే ఇచ్చారన్న ఏడుపే ఎక్కువ. పోనీ దీనికివ్వాలని లేక ఇవ్వొచ్చని, పొగిడినవారు లేరు. ప్రఖ్యాత విమర్శకుడు బేరా గారి ప్రత్యేక మౌనం మరో విడ్డూరం.
ఇక ఈ పుస్తక సమీక్షా పద్దతిపై ఒక మాట. ఎన్ని పేజీలున్నయి, ఎన్ని లైన్ల శృంగారం ఉంది, వేరే ప్రబంధాలతో పోలిస్తే సగటు వర్ణనలకన్నా ఇదెట్లా ఉంది, ఎన్ని వర్జనీయాలు- ఈ పద్దతి- ఎన్ని మెతుకులుడికాయి, వేరేవాటితో పోలిస్తే పంటికిందికొచ్చిన రాళ్ళు సగటున ఎన్ని, రాళ్ళ సైజెంత- అన్న బేరీజు లాగుంది.
ఎంత బాగుందో బాలేదో పుస్తకంలోని బోలెడు వాక్యాలు, పేరాలు,పత్రికల్లో, ఇతర వ్యాసాలలో వ్యాఖ్యల్లో ఉటంకిస్తూ చూపిస్తుంటే, మళ్ళీ దాన్నే కొని మళ్ళీ వాటినే చదవడం పైసలు, టైము దండగే కదా!
=====
విధేయుడు
-శ్రీనివాస్
అశిరా
ద్రౌపది చదివిన వాళ్ళు ఆ పుస్తకం ఎలా ఉన్నదీ వాళ్ళకు నచ్చినది ఇదీ, నచ్చనిది ఇదీ అని విమర్శించినా చర్చించినా బాగుంటుంది కాని అవార్డు ఎందుకు ఇచ్చారు అన్న దాని మీద చర్చ అనవసరమేమో!!
ఏ అవార్డు గురించి అయినా కూడా భేదాభిప్రాయాలు తప్పవేమో కదా. న్యాయనిర్ణేతల అభిప్రాయంతో అందరూ ఏకీభవించే సందర్భాలు చాలా తక్కువనుకుంటా !
Srinivas Nagulapalli
News at:
http://www.eenadu.net/story.asp?qry1=3reccount=27
ఈ రచ్చ చూసి నా దోస్తు ఒకడు గుర్తొచ్చాడు. అతనికి పాడడం ఇష్టం. నాకు భయం.
కాని అతని పద్ధతి చాలా ఇష్టం. పాడడానికి ఆయన వంద డాలర్లు మాత్రమే
అడుగుతాడు. ఆపడానికి మాత్రం వెయ్యి డాలర్లు. అట్లే రాసినందుకు కాదు,
రాయకుండా వుండడానికి ప్రభుత్వం అవార్డిచ్చి సన్మానిస్తే చాలా అహింసా
పూర్వకంగా, కాదు, బహు ప్రశంసా పూర్వకంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది.
================
విధేయుడు
-శ్రీనివాస్
Srinivas Nagulapalli
I love reading Be.Ra criticisms, reviews, intros, prefaces. Many do.
Even if one disagrees, his scholarship, way with words, attention to
detail and elegant expression- all well known and respected.
Irrespective of whole controversy-judge or not, award or not-he is a
great critic. His thoughts on the work would only be natural and in
line with what he does all the time, any way, often unasked. And does
well. Such a one being silent is odd. Still hope to read his thoughts.
—-
Regards
-Srinivas
జంపాల చౌదరి
@Srinivas Nagulapalli: Nothing unusual about the members of the adjudicating committee not responding to criticisms. In my experience, it would be unusual to see such a response.
Srinivas Nagulapalli
Less of opinion, more of news about petition against book getting
award at: http://www.andhrabhoomi.net/state/drowpadi-court-case-235
Even its best supporters not arguing it deserves award- any award!
So who is going to argue against petitioner! And academy award judges-
kArA, bErA continue unusual silence. May be out of no choice- as by
opening their mouths, not Droupadi’s, but Academy’s any remaining
vestige of prestige may get disrobed.
—-
Regards
-Srinivas