పుస్తకాలతో రెండేళ్ళ నా కథ

ఈనెల ఫోకస్ కి రాయడానికి నాకు పరమ సిగ్గేసింది. మరీ కరువు ప్రాంతాల వారి వ్యాసం అవుతుందేమో అని. కానీ, రాయాలనిపించింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా ఓ ఐడియా తట్టింది. 2008 లో చదివిన పుస్తకాల గురించి రాసిన వ్యాసం ఇప్పటిదాకా అలాగే దాక్కుందనీ, చరిత్రలో దానికి మోక్షం లేకుండా పోతుందని నా అంతరాత్మ పదేపదే ఘోషించడం గుర్తొచ్చింది. సరే, రెంటినీ కలిపి రాస్తే, నేనేదో చదివా అన్న ఫీలింగన్నా వస్తుందని, ఇలా మొదలుపెట్టాను. (2009 అని పెట్టి అదొక్కటే రాస్తే… సిగ్గులేదా? అని నా అంతరాత్మ తిడుతుందని నాకు తెల్సుగా! 😉 )

ఫ్రెష్నెస్ కోసం మొదట 2009 సంగతులు చెబుతా. మిగితా రెండు పేజీల్లో 2008 విశేషాలు ఉంటాయ్!
(అసలు విశేషాలు అక్కడే ఉంటాయ్ నా అభిప్రాయంలో. ఎందుకంటే, 2009 పుస్తక వియోగనామ సంవత్సరం!)

జనవరి: ’శ్రీశ్రీ కథలు’ తో మొదలుపెట్టి ’మహాప్రస్థానం’ తిరగేసి, శ్రీశ్రీ జపాన్ని ’అనంతం’ తో ముగించాను. ఆ తరువాత జపమాలాధారినై శ్రీశ్రీవి ఇంకేవన్నా చదువుదామని వెదికా కానీ, ఏవీ నచ్చలేదు. అయితే, కవిగా తప్ప నాకు శ్రీశ్రీ గురించి తెలీదు. ఈ పఠనానుభవం శ్రీశ్రీలోని ఇతర శ్రీశ్రీలను తెలుసుకోడానికి ఉపకరించింది. ’మోటార్ సైకిల్ డైరీస్’ సినిమా చూసి మూడేళ్ళ పైనే అయినా, దాని తాలూకా నొస్టాల్జియా నన్ను వదల్లేదు. అందులో భాగంగానే ’ట్రావెలింగ్ విద్ చే గువారా’ అన్న పుస్తకం చదివాను. మొటార్సైకిల్ డైరీస్ చే డైరీ అయితే, ఇది అతని సహచరుడు గ్రనడో డైరీ. గోపీచంద్ ’పోస్ట్ చేయని ఉత్తరాలు’ చాలారోజుల్నుంచి నాలో జరుగుతున్న సంఘర్షణకి అక్షరరూపం ఇచ్చినట్లు ఉండింది. భారద్దేశంలో ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్తలతో సంభాషణలు – ’మెన్ ఆఫ్ స్టీల్’ స్పూర్తివంతమైన పుస్తకం.

ఫిబ్రవరి: మునిమాణిక్యం వారి ’దాంపత్యోపనిషత్తు’ – నవ్వుల్లోనే ఫిలాసఫీ చెబుతూ – మ్యారేజీ మేడీజీ తరహాలో సాగింది. అయితే, సాంతం చదివాక, ఒకమ్మాయి ఇలాంటి పుస్తకం రాస్తే ఎలా ఉంటుందా? అని సందేహం. ’గిడుగురామ్మూర్తి చరిత్ర’ చదివాను – మంచి పుస్తకం. ’మా తాతయ్య చలం’ – చలం గురించి ఇదో పర్స్పెక్టివ్.

మార్చి, ఏప్రిల్ కలుపుకుని నేను చదివిన ఏకైక చెప్పుకోదగ్గ పుస్తకం : అరుణ్ శౌరీ ’ ఎమినెంట్ హిస్టారియన్స్...”. హుమ్… మొదటంతా బానే ఉన్నా, చివరికొచ్చేసరికి, ఓవర్డోసైపోయింది నాకు.

మే: అందరికీ మే నెల్లో ఎండలు. నాకు మే నెల్లో వానలొచ్చాయి. కొన్నాళ్ళ కరువు తరువాత ఈ నెలే కాస్త తీరిగ్గా పుస్తకాలు చదవగలిగాను. వాటిలో – గ్రహాం గూచ్ – ‘out of the wilderness‘, పాల్కీవాలా – ’we the nation‘, రోహిణీ గాడ్బోలే కలెక్ట్ చేసిన – ’Lilavathi’s Daughters‘, జాన్ నాష్ కథ – ’A beautiful mind‘ – నా మీద ఎంతో కొంత ప్రభావం చూపినవి. ’శరత్ సాహిత్యం పదో భాగం’ నన్ను విపరీతంగా నిరాశపరచిన పుస్తకం.

జూన్: రాజకీయాల నెల. మాయావతి పై రాసిన – ‘behenji‘, నాదెండ్ల భాస్కర రావు ఆత్మకథా చదివాను. టైంపాస్ పల్లీ బఠాణీ మిర్చీ బజ్జీ!!
అలాగే, ఆర్థర్ క్లార్క్ సై-ఫై కథలు – ’wind from the sun‘ చదివాను – ఇది మంచి కలెక్షన్.

జులై: ’చివరకు మిగిలేది’ చదివి కొంత నిరాశకు గురయ్యాను. ‘The Tenth Rasa: An anthology of Indian nonsense‘ పరిచయంలో ఆ నిరాశను మర్చిపోయాను. గత ఆరేడు నెల్లలో ఈ పుస్తకాన్ని చాలా సార్లు తిరగేశాను.

ఆగస్టు : ’in the land of invented languages‘ తో మొదలైంది. ఈ పుస్తకం కూడా నన్ను చాలా ప్రభావితం చేసింది. విపరీతంగా నచ్చింది. ఆ తరువాత చదివిన పెర్ల్ ఎస్.బక్ నవల ’గుడ్ ఎర్త్’ కూడా చాలా రోజులు వెంటాడింది. ఆ మధ్యనొచ్చి, విపరీతమైన హైప్ కి గురైన అలీసేథీ మొదటి నవల ’విష్ మేకర్’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

సెప్టెంబర్: – డ్రై నెల.

అక్టోబర్: ’స్టే హంగ్రీ స్టే ఫూలిష్’ – ఐఐఎమ్ పాత విద్యార్థుల సొంత వ్యాపారాలు-సక్సెస్ కథా కమామిషు. స్పూర్తివంతమైన పుస్తకం. హర్ష్ మండర్ – ’unheard voices‘ ఆలోచనల్లో పడేసి బేసిక్ డౌట్స్ మళ్ళీ మొలకెత్తించింది.

నవంబర్: మొదటిసారి ’persepolis‘ గ్రాఫిక్ నవల చదివా. నాకు చాలా నచ్చింది. ఆపకుండా చదివించింది. చలం ’పురూరవ’, శారదా శ్రీనివాసన్ గారి గొంతుక విన్నాక చదవడంతో, ఆవిడే నిండిపోయారు నా పఠనానుభూతి నిండా. మాలతి గారి ’From my front porch‘ మన తెలుగు కథల్నే ఇంగ్లీషు ద్వారా పరిచయం చేయించింది. ’modern reading – a miscellany‘ సెలెక్ట్ బుక్ షాపు వారి అరవై ఏళ్ళు పూర్తైన సందర్భంగా రిలీజైన పుస్తకం. పరమ డైవర్సిటీ వ్యాసాల్లో. ఇదో ఆసక్తికరమైన అనుభవం. Ogden Nash పొయెట్రీ కలెక్షన్ – మళ్ళీ మళ్ళీ తిరగేస్తూనే ఉన్నా. మళ్ళీ మళ్ళీ తిరిగొస్తూనే ఉన్నా.

డిసెంబర్: ’వెరోనికా డిసైడ్స్ టు డై’ – ఐ డిసైడ్ నాట్ టు క్రై! విల్ డ్యూరంట్ ’A case for india‘ అవాక్కయ్యేలా చేసింది. హొవార్డ్ రోథ్మన్ ‘50 companies that changed the world‘ చదివాను. పాత లిస్టే అనుకోండి – అయినా, మంచి ప్రయత్నం. ఇక – ఎంటర్ ’కోతి కొమ్మచ్చి’ రెండు భాగాలు. నాకు తెగ నచ్చేశాయి. అకిరా కురోసవా ఆత్మకథ ‘something like an autobiography’ తప్పక చదవాల్సిన పుస్తకం.

ఒక చెంచాడు భవసాగరమీదడానికి సముద్రంలో ఈత నేర్చుకోడానికెళ్ళా మరి. దాంతో దెబ్బతినేశా. అంతే! అందుకే సిగ్గుగా ఉందన్నది! ఇక, 2008 సంగతులు చదవండి…మీతో పాటు నేనూనూ… నాక్కూడా ఓసారి గుర్తుతెచ్చుకున్నట్లు ఉంటుంది 😉

You Might Also Like

7 Comments

  1. Sreenivas Paruchuri

    పురూరవ రేడియో నాటకం:
    http://www.eemaata.com/em/issues/200811/1350.html

    పురూరవ పుస్తకం:
    http://www.eemaata.com/em/issues/200811/1353.html

    త్వరలో “కాలాతీత వ్యక్తులు”, మరియు మరిన్ని రేడియో నాటకాలు “ఈమాట”లో వినగలరు 🙂

    — శ్రీనివాస్

  2. jagan mohan

    Sujaatha Garuu..
    I am searching for the book ‘Puruurava” from a long time. Can you please send that soft copy (if u have ) to my mail id . I felt very happy to hear that you have the CD of that . If there is any possibilty to send ..please send it to my mail id ..
    jagan.d.mohan@gmail.com

  3. మాలతి

    బాగుంది పుస్తకాలజాబితా. ఇంప్రెసివ్. ..:)

  4. Praveen

    I agree with Sowyma, even i had a similar experience with Chavaraki Migiledi. I strongly feel we should have some background (not know exactly what kind of) to connect with that book. One of my friend who is a great fan of that book had wrote a book on Amrutam (one of the character in the novel). When i said that i am not excited after reading that book then he replied ” keep it with you only.. at some stage of your life you will connect with that book” . Not sure when that will happen :))

  5. సుజాత

    సౌమ్యా,
    పురూరవ నాటకం విన్నారా? శారదా శ్రీనివాసన్ గొంతులో… అంటే అర్థం కాలేదు.

    రేడియో నాటకం కావాలంటే నా దగ్గరుంది సీడీ!

    నన్నెప్పుడూ వెంటాడేవి రెండు నవలలు ఒకటి- కాలాతీత వ్యక్తులు, రెండు- చివరకు మిగిలేది .
    మొత్తానికి బావుంది మీ భవసాగరమీత!

  6. సౌమ్య

    @budugoy: ఏమిటోనండీ… నాకు నేను ఊహించినంత అద్భుతంగా అనిపించలేదు ఆ పుస్తకం. వీలయితే దాని గురించి ఇక్కడ రాసేందుకు ప్రయత్నిస్తాను….

  7. budugoy

    “చివరకు మిగిలేది” చదివి నిరాశకు గురయ్యారా? ఏలా? ఏమా కథ?

Leave a Reply