2009లో నా పుస్తకాలూ! – 1

గుల్జార్: గుల్జార్ పాట వినకుండా నాకు పొద్దు గడవదు. ఆయన పాటల్లో కొన్ని నాకెంత ఇష్టమంటే మాటల్లో చెప్పలేను. ఇహ ఆయన పుస్తకాలేవైనా కనిపిస్తే మారు ఆలోచన లేకుండా చదివేయటం ఈ ఏడాదిలోనే అలవాటు చేసుకున్నాను.

ఏడాది మొదట్లోనే, గుల్జార్ రాసి, డైరెక్ట్ చేసిన, నషీరుద్దీన్ షా నటించిన టి.వి సీరియల్ని పుస్తకరూపంలో Mirza Ghalib: A Biographical Scenario చదివాను. సీరియల్ లో సీన్ ప్రకారం ఇక్కడ కథ చెప్పబడుతుంది. అసలే మిర్జా గాలిబ్! అందులోనూ గుల్జార్ చిత్రీకరణలో.. చదివితే తెలుస్తుంది అది ఎంతటి ఆనందమో! ఇది గాలిబ్ ని తెల్సుకోడానికి ఒక authentic బయోగ్రఫీనో కాదో నాకు తెలీదు. ఇదో సీరియల్ కాబట్టి లోతైన విశ్లేషణలుండే అవకాశం తక్కువ. కాకపోతే గాలిబ్ మొత్తం జీవనచిత్రం చాలా అందంగా ఆవిష్కరించబడిందీ అనిపించింది. ఓ కవి మరో కవిని, అందులోనూ తన ఆరాధ్య కవిని గురించి చెప్పే ప్రతీ వాక్యం పసందుగా ఉంటుంది. అంతకు మునుపే గాలిబ్ కవితలు చదివినా, ఈ రచన చదవటం వల్ల గాలిబ్, ఏ ఏ సమయాల్లో, ఏ ఏ పరిస్థితుల్లో స్పందనగా ఏ ఏ కవితలు రాశారో తెల్సుకునే వీలు కలిగింది. పుస్తకం చదివేసిన ఒక మూడు నాలుగు రోజుల వరకూ నేను గాలిబ్ కాలానికి చెందినాన్న (భ్రమ తాలూకూ) అనుభూతి పోలేదు. ఇదే ఊపులో గాలిబ్ పై మరిన్ని పుస్తకాలు చదవాలి, అందుకు తగిన ఉర్దూ వంటబట్టిచ్చుకోవాలనుకుంటూ ఆకాశంలో ఆశల హరివిల్లు గీశాను. కానీ, బొత్తిగా శ్రద్ధ చూపకపోవటం వల్ల, ఆ ఆశలు అలానే మిగిలిపోయాయి.

ఆ తర్వాత చదివిన పుస్తకం: Selected Poems Gulzar by Pavan K. Tr. Varma. ఇందులో గుల్జార్ కవితలు హిందీలోనూ, పవన్ చేసిన ఆంగ్లానువాదాలు పక్కపక్కనుంటాయి. హిందీ సినీ సంగీతాభిమానులకి గుల్జార్ లోని కవిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానివారికి గుల్జార్ ని పరిచయం చేయటం నాబోటి వారికి సాహసమే అవుతుంది. అయినా ప్రయత్నిస్తాను. జీవితాన్ని కాచి వడబోయడం అనే జాతీయాన్ని కాస్త మార్చి, జీవితాన్ని కాచి వడబోచి ఆ రసమో, కషాయమో మనకి అలానే ఇచ్చేయకుండా, అందులో కాస్త రుచిని పెంపొందించేవన్నీ వేసి, బాగా కలియబెట్టి వేడి వేడిగా మన చేతికి అందిస్తారు. మనం దాన్ని తాగుతున్నప్పుడు పెద్ద శ్రమ పడనవసరం లేదు. హాయిగా వెళ్లిపోతుంది లోపలికి. ఆ తర్వాత దాని పని అది లోపలే చేసుకుంటూ పోతుంది. ఆయన భావంలో చాలా సరళత ఉంటుంది, ఆయన ఉపయోగించే ఉపమానాలు అందరికీ తెల్సినవే! భాష కూడా సంక్లిష్టంగా ఏమీ ఉండదు.. కానీ అందులోని అంతరార్థం గ్రహించినప్పుడు మాత్రం మెదడు మొదలుకొని నరనరంలోనూ ఆ సారం వ్యాప్తి చెందుతుంది. అలా చెయ్యగలిగే గుల్జార్ ఎంత అనుభవజ్ఞులో అర్థమయ్యే సమయం – ఓ మహాద్భుతాన్ని చూసినట్టు అనిపించింది.

హిందీ సినిమాల్లో “ప్రేమ” చుట్టూ కొన్ని వేళ పాటలు వచ్చాయి. అందులో గుల్జార్‍దీ అందవేసిన చెయ్యే! ఈ పుస్తకం ద్వారా అయితే సినీకవికి ఎక్కువగా అవకాశం లేని అంశాలపై: పుస్తకాల గురించి, బంధాల గురించి, వృద్ధాప్యం గురించీ, వయస్సు గురించీ, నటన గురించీ, స్నేహం గురించీ కవితలు చదవటం నాకు భలే ఆనందాన్నీ, ఆలోచననీ పంచిపెట్టాయి.

ఈ పుస్తకమే “వావ్” అనుకుంటున్న సమయాన, Silences అన్న పుస్తకం కనిపించింది, అనుకోకుండా ఎదురొచ్చింది. మాటల పూదోటలో వికసించే గుల్జార్ కి మౌనంతో ఏం పనబ్బా అనుకున్నాను. ఆ కవితలు చదివితే అర్థమయ్యింది: ఆయన మాటల వెనుక ఎంత నిశ్శబ్ధం దాగుందో. ప్రతీ చిర్నవ్వుకీ కొన్ని వేల కన్నీటి బొట్లు ఖర్చవుతాయి – అదే జీవితం మన చేత కట్టించుకునే ఖరీదని అనుకున్నాను. ఆయన కవితల్లో ఎప్పుడూ subtleness ఉంటుంది.. చివరికి నిశ్శబ్ధానికి కూడా! అక్కసు వెళ్లగక్కాలన్నా ఆయన చిన్ని చిన్ని పదాలు చాలు, వెక్కి వెక్కి ఏడ్వటానికి.

“చావుదేముంది.. ఒక్క దెబ్బతో తీసుకుపోతుంది. జీవితం అలా కాదు కదా, ప్రతీ క్షణం చంపుతూనే ఉంటుంది” అన్న అర్థంలో ఆయన రాసిన కవిత జీవితం చదివితే ఊరేసుకుంటుందో, కాలర్ ఎగరేస్తుందో అని నాకో పెద్ద (ఊహ) అనుమానం. బతుకంటే నిరంతర చావా?! అన్న భావం ఉల్లిక్కిపడేలా చేసింది.

సైలెంన్స్ అన్నది గుల్జార్ కవితలకి ఆంగ్లానువాదాలు మాత్రమే! ఆయన ఒరిజినల్ కవితలు పక్కన లేకపోయేసరికి తిక్క పుట్టింది. అనువాదాలు బాగున్నాయా లేదా అన్నది పక్కకి పెడితే, ఆయన వాడే హిందీ, ఉర్దూ పదాల కలయిక గమ్మత్తుగా, తమాషాగా ఉంటాయి. అనువాదాలు చదివి, అసలు ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించి, చేత కాకపోవటం వల్ల కూడా కాస్త చికాకుగా అనిపించింది.

లాండ్‍మార్క్ లో నేను రీజినల్ సెక్షన్ వైపు పోనే పోను. తెలుగు పుస్తకాలా.. అక్కడ కొనాల్సిన అవసరం లేదు. హిందీ చదివేంత నాకు లేదు అని. ఓ రోజు మాత్రం ఊరికే చూద్దాం అనుకొని హిందీ పుస్తకాలు చూశాను. ఓ దాని మీద గుల్జార్ పేరు కనిపించింది. కొనేశాను. ఇంటికెళ్లి తీరిగ్గా పుస్తకం చూస్తే, అది గుల్జార్ కవితల పుస్తకం – అన్నీ హిందీలో! దానికి తోడు గుల్జార్ కవితలూ / సినీగేయాలపై ఒక భారీ వ్యాసం, అంతా హిందీలోనే! అలవాటు తప్పిపోయినందు వల్ల, అక్షరమక్షరం కూడుకొని, కూడుకొని చదివాను. భలే పసందుగా ఉంది. సుష్టిగా భోంచేసి కూర్చున్నాక, మనం తిన్న పదార్థాల మీద అందమైన వ్యాఖ్యానం ఎవరైనా చెబుతుంటే విన్నట్టు అనిపించింది. ఇంతకీ పుస్తకం పేరు చెప్పలేదు కదూ.. యార్ జులాహే!

డిసెంబరులో విడుదలైన మరో పుస్తకం “100 Lyrics” – అస్కార్ అవార్డు పొందిన సందర్భంగా, ఇందులో గుల్జార్ వి వంద హిందీ సినీ గీతాలూ, వాటి ఆంగ్లానువాదాలుంటాయి. మధ్యన మధ్యన గుల్జార్ తమ అనుభవాలని పంచుకుంటూ ఉంటారు, ఓ పాట గురించో, సంగీత దర్శకుని గురించో, ఆ పాట వెనుక తమాషా కథల గురించో! బుర్ర బొత్తిగా పనిచేయనప్పుడు ఏదైనా చదవాలనుకుంటే ఇలాంటి రచనలు బాగుంటాయని స్వీయానుభవం.

గుల్జార్ సినిమాలకి సంబంధించి కొన్ని పుస్తకాలు రాశారని తెల్సుగానీ, కథలు రాశారని, ఇది రాస్తున్నప్పుడే జ్ఞానోదయం అయ్యింది. ఈ ఏడాది వాటిని చదవాలి. వారి ఏ పుస్తకాల గురించి మీకు వివరాలు తెల్సినా నాకు తెలియజేయండి.. ప్లీజ్!

ఎటూ, హిందీ సినిమా పాటలకి చెందిన వారిని గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, “Talking Songs” అన్న జావేద్ అఖ్తర్ పుస్తకం గురించీ ఇక్కడే చెప్పటం నయమేమో! ఊసుపోక పుస్తకాల కొట్టుకెళ్లి, ఏముంటుందా అన్న ఆత్రంతో ఈ పుస్తకం తీసుకొని చదివి, వెనుక అట్ట మీద వెల చూసి “చదవటం అయ్యిపోయిందిగా.. ఇహ చదవటం దేనికని?” అక్కడే పెట్టేసి, ఇంటికొచ్చి దాని మీదో ఐదొందల పదాల వ్యాసం రాసి (ఈ వ్యాసం మిస్సింగ్ 🙁 ), పుస్తకాల కొట్టుకెళ్లిన ప్రతీ సారీ ఆ పుస్తకం కొంచెం కొంచెం చదువుతూ, అస్వాదిస్తూ, అందులోని మాటలు దాదాపుగా నాలో పాతుకుపోయి, అడిగినవారికీ (ఎవరూ లేరు!), అడగనివారికీ ఊకదంపుడు దంచేయటం ఈ పుస్తకం గురించి. టాకింగ్ సాంగ్స్ మొదటి అరవై పేజీల్లో జావేద్ అఖ్తర్ సినీకవిగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఆయన సినీగేయాలూ, వాటికి ఆంగ్లానువాదాలుంటాయి దాదాపు మరో రెండొందల పేజీల వరకూ! అరవై పెజీలకి మూడొందలా అని కొనలేదు! వదిలేసి వచ్చాక తెల్సింది, అందులోని మాటలు నామీద ఎంత ప్రభావం చూపించాయో! ఆయన కవిత్వం మీదా, జీవితం మీదా, సినిమాల మీద వ్యాఖ్యానం అంతా ఒక ఎత్తు, పరిచయ వ్యాసంగా జావేద్ పై షబానా ఆజ్మీ రాసినది మరో ఎత్తు. అన్నట్టు, షబానా మరేవైనా పుస్తకాలు రాశారా? తెలిస్తే చెప్పండి.

You Might Also Like

6 Comments

  1. Purnima

    Wow! Rushdie speaking on Calvino’s Cosmicomics.. can’t get better..

    http://www.npr.org/templates/story/story.php?storyId=93376041

    I quote:

    “If you have never read Cosmicomics, you have before you 12 of the most joyful reading experiences of your life.”

  2. పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..

    […] వీళ్ళెవ్వరూ కాకపోతే కొత్త మోజైన మిలన్ కుందేరా? కర్ట్ వాన్‍గట్? ఓహ్ నో.. కాల్వినో! […]

  3. రామ

    చాలా బాగుంది. మీరు చదివిన పుస్తకాల మాటేమో కాని, మీ సమీక్షలు చాలా తొందరగా చదివించాయి. తరవాతి పేజి నెంబర్ మీద నొక్కి, “ఇంకా లోడ్ అవదు ఏమిటిరా బాబూ” అనుకున్నా రెండు సార్లు :). విపులం గా వ్రాసినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో నాకు రెఫెరెన్సు గా తప్పక పనికి వస్తుంది ఈ లిస్టు (మొన్న చదివిన జంపాల గారి లిస్టు కూడా – ఇవన్నీ చూస్తూ ఒక మనిషి ఒక సంవత్సరం లో ఎన్ని చెయ్యచ్చో తెలుస్తోంది – కొండొకచో కిందటి ఏడాది నేను ఏమి చేసి ఉండల్సిందో కూడా).

  4. Rao S Vummethala

    Nice article. The author successfully takes along with her. Good work.
    Keep it up Poornima garu!

  5. సౌమ్య

    Good article!!

Leave a Reply