2009లో నా పుస్తకాలూ! – 1

Milan Kundera రచనలు:

milan_kunderaమీరో పరాయి దేశంలో ఉన్నారు. బతకడానికి మీరా దేశపు బాష వంటబట్టించుకున్నారు. మీ భాష పదే పదే గుర్తొస్తున్నా, దాన్ని లోపలకి నొక్కేసి అందరకీ అర్థమయ్యేలా ఆ భాషే మాట్లాడుతున్నారు. ఉన్నట్టుండి మీకు మీ భాష వినిపించింది, పొడిపొడిగా కాదు. ఎవరో కమ్మగా, శ్రావ్యంగా, అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. ఆ మనిషి మీ కళ్ళముందుకొచ్చి మిమల్ని పలకరిస్తే అప్పుడు మీకెలా అనిపిస్తుంది? మిలన్ కుందేరా పుస్తకం ఒకటి చేతిలోకి తీసుకొని వెనుక అట్ట మీద కథా సారాంశం చదువుతుంటే నాకు అలానే అనిపించింది, నా మనోభాషను మరో మనిషి మాట్లాడుతున్నాడే అన్న పులకింతలోని ఆనందం.

పై ఉదాహరణలో భాష అంటే ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు, ఒక స్పానిష్ – ఇలాంటివేవో! కానీ ఒకరితో ఒకరు మాట్లాడేందుకు ఉమ్మడి భాషలానే ఒకరిని  ఇంకొక్కరు అర్థం చేసుకోవటానికి ఉమ్మడి భావజాలమూ ముఖ్యం. మిలన్ కుందేర్రా “ఇగ్నోరెన్స్” పుస్తకం వెనుక మాటల్ని చూసి నాకు అందుకే అంత ఆనందం కలిగింది. సాటి మనుషుల్లో మనకి నచ్చిన వాళ్లతో, మనమంటే ఇష్టమున్న వాళ్లతో కుబుర్లాడతాం, షికార్లకి పోతాం, సందడి చేస్తాం. బంధం బలపడుతున్న కొద్దీ మరెన్నో పంచుకుంటాం. ఆస్వాదిస్త్తాం. కాకపోతే ఈ ఆస్వాదించే విషయంలో ఎవరి అనుభూతులు వాళ్లవి. కలిసి చూస్తున్నది, చేస్తున్నది ఒక్కటే అయినా ఎవరి అనుభవాలు వాళ్లవి. పంచుకుంటున్నది ఒకే క్షణమైనా అది వదిలి వెళ్లే సారాంశం మాత్రం ఎవరికి వారికి ప్రత్యేకం. దీన్నే ఆధారంగా చేసుకొని మిలన్ ఒక చిట్టి నవలను రాశారు – అదే Ignorance!

కథాంశం నాకు నచ్చినది కాబట్టి, ఇహ కథ చదవడానికి పూనుకున్నాను. కథాంశం చుట్టూ తిరిగే కథా, అందులో పాత్రలూ కూడా సరళంగానే ఉంచేస్తూ, కథనం మాత్రం అనితర సాధ్యంగా సాగించారు. మిలన్ నరేషన్ భలే గమ్మత్తుగా కొనసాగుతుంది. థర్డ్ పార్టీ నరేషన్‍లోనే కొనసాగుతున్నట్టు అనిపిస్తున్న వేళలో “నేనున్నాననీ…” అంటూ రచయిత మధ్యలో వచ్చేస్తారు. తన అనుభవాలూ, ఆ అనుభవాల వెనుక చరిత్ర అన్నీ కూలంకషంగా పరిచయం చేస్తారు. మొదట్లో ఇలా కథ మధ్యలో కబుర్లు తమాషాగా అనిపించాయి. ఆయన రచనలు చదువుతూ పోయిన కొద్దీ, కథ కన్నా కబుర్ల మీద మక్కువ ఎక్కువయ్యింది. రచయితంటే దేవుడిలా ఉండాలి, కథలోకి, పాత్రల మధ్యలోకి ప్రవేశించకూడదు లాంటి నియమాల గురించి నాకు పెద్ద అవగాహన లేదు కానీ, రచయిత ప్రతీ క్షణం నాతో ఉన్నాడన్న ఫీల్ మాత్రం మహా బాగా నచ్చింది.

ప్రసిద్ధి చెందిన రచయితలు తొలిసారిగా మనకి తెల్సినప్పుడు, వాళ్లకి విపరీతంగా పేరునో, లాభాల్నో తెచ్చిపెట్టిన రచనల గురించే తెలుస్తూ ఉంటుంది. అలా కుందేరాకి మారు పేరుగా నిల్చిన రచన “The Unbearable Lightness of the Being.” కుందేరాను చదవాలనుకోగానే నేనూ ఈ రచనతోనే మొదలెట్టాలి అనుకున్నాను. కానీ నా అదృష్టం, నాకీ పుస్తకం దొరకలేదు. Ignorance తో మొదలెట్టాను. ఒక (సొంత) ఫిలాసఫికల్ పాయింట్ తీసుకొని నేపధ్యంలో ఒక దేశ చరిత్రను పెట్టి, ఓ ఇద్దరి ముగ్గిరి జీవితాల్లో జరిగిన విశేషాలని, అనుభవాలనీ కథగా అల్లిన తీరుకి నేను కుందేరా ఫంకా అయ్యిపోయాను, ఇగ్నోరెన్స్ చదువుతూనే! ఆ తర్వాత Identity అనే నవల చదివాను. ఆయన అన్ని రచనల్లో నాకు విపరీతంగా నచ్చిన రచన ఇదే! నాలుగైదు పాయల్ని తీసుకొని జడ అల్లినట్టు ఉంటుంది శైలి. మధ్యమధ్యన కామెడీ, సెటైర్, ఐరనీలు సిద్ధం. మనుషులనీ, మనుషులు బతకాల్సిన పరిస్థితులనీ గురించి వ్యాఖ్యాన్నించటంలో ఈయనకి ఈయనే సాటి!

Laughable Loves అనేది కుందేరా కథల సంపుటి. ఆయన నవల్ల కన్నా నాకు కథలే ఎక్కువ ఇష్టం. మిలన్ ని చదవాలనుకుంటే ఇక్కడ నుండి మొదలెట్టటం మంచిదేమో అని నాకనిపిస్తూ ఉంటుంది. కథలో క్లుప్తత, పాత్ర్ర చిత్రీకరణలో సరళత వల్ల కథలు చిన్నగానూ, చక్కగానూ ఉంటాయి. చదవటం పూర్తి చేశాక ఒక రకమైన భావప్రకంపనకి గురి చేయటం, చదివిన చాన్నాళ్ళ వరకూ గుర్తుండిపోవటం మంచి కథకు లక్షణాలని నేననుకుంటాను. ఆ లక్షణాలు వీటికున్నాయి.

ఆ తర్వాత Immortality చదివాను. బతుకు, చావులు వ్యతిరేకపదాలు, mutually exclusive అనుకునే వాళ్లు ఈ రచన తప్పక చదవాల్సిందే! “ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, మన మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు” అన్న సంతాప సభ వాక్యాల తీవ్రతను ఈ నవల ఆవిష్కరిస్తుంది. అమరత్వానికి సంబంధించిన విషయాల మీద కొత్త వెలుగు ప్రసరిస్తుంది. జీవితం – మృత్యువు విడదీయరాని అనుబంధాన్ని నొక్కి చెప్తుంది. ఈ నవల్లో ఒక ముఖ్య పాత్ర “మృత్వువు” అనే చెప్పచ్చు. నాకు ఈ రచన చాలా నచ్చుతుంది. ముఖ్యంగా Goethe and Hemingway (అవును, మనకు తెల్సున్న ఆ ఇద్దరే) మధ్య మరో లోకంలో జరిగే సంభాషణలు నాకు మరీ ఇష్టం.

అప్పటికీ నాకింకా “The Unbearable Lightness of the Being.” అనే పుస్తకం చేతికి చిక్కలేదు. ఇహ, లాభం లేదనుకొని, ఉండబట్టలేక పి.డి.ఎఫ్ ఫార్మెట్ లో చదవటం మొదలెట్టాను. “నేనిప్పుడే ఒక పుస్తకం మొదలెట్టాను, ఇందులో నాకు నచ్చిన లైన్లు అన్నీ నీకు కాపీ పేస్ట్ చేస్తాను” అని ఆన్‍లైన్ ఉన్న ఫ్రెండ్ కి చెప్పాను. ఒకటీ అరా లైన్లు వదిలేసి దాదాపుగా మొదట్టి నాలుగైదు పేజీలూ పేస్ట్ చేశాను.. ప్రతీ వాక్యం ఓ ఆలోచనను రేకెత్తిస్తూ, ప్రతీ ఆలోచనా జీవితాన్నీ, ప్రపంచాన్నీ ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. నా అభిప్రాయం ప్రకారం ఇది కాస్త హెవీ రీడింగే! కుందేరాను చదివిన స్వానుభవం వల్ల నేనిచ్చే సలహా, ఈ ఒక్క పుస్తకంతో ఆయన రచనల్ని చదవటం ఆపేయవద్దు.

“The Book of Laughter and Forgetting” – కుందేరా రచనల్లో ప్రసిద్ధి చెందిన మరో నవల! కానీ నన్నెందుకో తీవ్రంగా నిరాశపరిచింది. ఎక్కువ అంచనాల వల్లో, లేక టైటిలు బట్టి నేను ఊహించుకున్నది దొరక్కపోవటం వల్లనో నాకీ రచన అసలు నచ్చలేదు. మొక్కుబడికన్నట్టు పూర్తి చేశానన్న మాటే కానీ, ఇప్పుడు ఏం నచ్చలేదో రాద్దామన్నా ఏం గుర్తు రావటం లేదు. మళ్లీ చదవాలీ పుస్తకం.

ఏదో పిచ్చి పట్టినట్టు ఒకే రచయిత పుస్తకాలన్నీ ఏకధాటిగా చదవటం నాకు ఇదే మొదటిసారి. కుందేరాలో ఇదివరకెన్నడూ నేనెరుగని వైవిధ్యం – కథల్లోనూ, కథనంలోనూ – వల్ల అనుకుంటా! మీరిప్పటి వరకూ మిలన్ కుందేరాని చదవకపోయుంటే, ఒకసారి ప్రయత్నించి చూడమంటాను.

“Human time does not turn in a circle; it runs ahead in a straight line. That is why man cannot be happy: happiness is the longing for repetition.”

You Might Also Like

6 Comments

  1. Purnima

    Wow! Rushdie speaking on Calvino’s Cosmicomics.. can’t get better..

    http://www.npr.org/templates/story/story.php?storyId=93376041

    I quote:

    “If you have never read Cosmicomics, you have before you 12 of the most joyful reading experiences of your life.”

  2. పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..

    […] వీళ్ళెవ్వరూ కాకపోతే కొత్త మోజైన మిలన్ కుందేరా? కర్ట్ వాన్‍గట్? ఓహ్ నో.. కాల్వినో! […]

  3. రామ

    చాలా బాగుంది. మీరు చదివిన పుస్తకాల మాటేమో కాని, మీ సమీక్షలు చాలా తొందరగా చదివించాయి. తరవాతి పేజి నెంబర్ మీద నొక్కి, “ఇంకా లోడ్ అవదు ఏమిటిరా బాబూ” అనుకున్నా రెండు సార్లు :). విపులం గా వ్రాసినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో నాకు రెఫెరెన్సు గా తప్పక పనికి వస్తుంది ఈ లిస్టు (మొన్న చదివిన జంపాల గారి లిస్టు కూడా – ఇవన్నీ చూస్తూ ఒక మనిషి ఒక సంవత్సరం లో ఎన్ని చెయ్యచ్చో తెలుస్తోంది – కొండొకచో కిందటి ఏడాది నేను ఏమి చేసి ఉండల్సిందో కూడా).

  4. Rao S Vummethala

    Nice article. The author successfully takes along with her. Good work.
    Keep it up Poornima garu!

  5. సౌమ్య

    Good article!!

Leave a Reply