వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 3)

(ముందు భాగం)

ఈ నవల గురించి చెప్పాలనుకున్నదంతా దాదాపు పైన కథా సంక్షిప్తంలోనూ, దానికిచ్చిన వివరణలోనూ వచ్చేసింది. ఇంకా మిగిలివుందనిపించింది అధ్యాయల వారీగా క్రింద చెప్తున్నాను. ముందుగా ఈ అధ్యాయాలకి నబొకొవ్ ఒక్కో వాక్యంలో చేసిన క్లుప్తీకరణ ఇది:

“The plot of Chapter One centers in Fyodor’s poems. Chapter Two is a surge toward Pushkin in Fyodor’s literary progress and contains his attempt to describe his father’s zoological explorations. Chapter Three shifts to Gogol, but its real hub is the love poem dedicated to Zina. Fyodor’s book on Chernyshevski, a spiral within a sonnet, takes care of Chapter Four. The last chapter combines all the preceding themes and adumbrates the book Fyodor dreams of writing some day: The Gift. ”

మొదటి అధ్యాయం: ఈ అధ్యాయంలో ఫియొదొర్ కవితలు ప్రధానంగా వుంటాయి. వీటిని విడి పంచదార పలుకుల్తో పోల్చవచ్చు. తీయదనం పూర్తిగా అంగిలినంటక ముందే కరిగిపోయే పలుకుల్లా పల్చనైన రుచి. అయితే అన్నీ కలిసి ఫియొదొర్ బాల్యచిత్రాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తాయి. ఈ కవితల్లో కొట్టొచ్చినట్టు కనిపించే మరో గుణమేమిటంటే, వేటికవే విడిగా ఎంతబాగున్నా, వీటిని ఆవరించివుండే వచనంతో పోలిస్తే అవి కాస్త రంగుతేలిపోయినట్టే కనిపిస్తాయి. దీన్ని బట్టీ ఫియొదొర్ రచనా పటిమ ఆ కవితలు రాసేటప్పటికీ, ఇప్పుడు మనం చదువుతోన్న “ద గిప్ట్” నవల రాసేటప్పటికీ ఏ స్థాయిలో పరిణతి చెందిందో మనకు అర్థమవుతుంది.

ఈ నవల ముగింపు పుష్కిన్‌కు నివాళిస్తుందని చెప్పాను. ఇది బాహటంగా తెలిసిపోయేదే. ముందుమాటలో నబొకొవ్‌ స్వయంగా ఈ సంగతి చెప్పేస్తాడు. అయితే ఈ నవల ప్రారంభమవటం కూడా ఆయన అభిమానించిన మరో రచయిత గొగోల్‌కు నివాళి నర్పిస్తూ ప్రారంభమవుతుందట. ఇది గొగోల్ రచనలతో బాగా పరిచయమున్న వారికి తప్ప స్ఫురించని నివాళి. నాకు బ్రైన్ బోయ్డ్ పుస్తకం ద్వారా తెలిసింది. గొగోల్ ప్రసిద్ధ రచన “డెడ్‌ సోల్స్” ప్రారంభమయ్యే తీరు నబొకొవ్‌ను చాలా ఆకర్షించేదట (నబొకొవ్ ఆంగ్లానువాదంలో ఈ ప్రారంభం యిలా సాగుతుంది).  ఒక కొత్త వ్యక్తి (చిచీకవ్) బస్తీలోకి బండి తోలుకుంటూ వస్తాడు. సారాకొట్టు దగ్గర ఉబుసుపోక నిలబడ్డ ఇద్దరు రైతులు అతని బండి ఎక్కడదాకా పోగలదో అంచనాలు కడతారు. తర్వాత ఒక యువకుడు ఆ బండికి ఎదురొస్తాడు. అతనా బండిని ఆసక్తిగా గమనిస్తూండగా, గాలి విసురుకి అతని టోపీ ఎగిరిపోబోతుంది. దాన్ని సర్దుకోవడంలో పడి ముందుకు సాగిపోతాడు. ఇక్కడ ఈ యువకుడి వర్ణన చాలా విశదంగా, ఒక ముఖ్య పాత్రని పరిచయం చేస్తున్న హడావిడితో వుంటుంది. కానీ అతను కథలో మళ్ళీ ఎక్కడా రాడు. ఈ రచనకు “మృతజీవులు” పేరిట కొ.కు చేసిన అనువాదంలో అతని వర్ణన ఇలా సాగుతుంది:

“అదీగాక బండీ హోటలును సమీపించే సమయానికి ఒక యువకుడు ఆ బండిని సమీపించాడు. అతను చాలా పొట్టిగా, బిగుతుగా ఉన్న తెల్ల కాన్వాస్ లాగూ, కింద వేళ్ళాడే అంచులు, చాలా ఫాషన్‌గా కత్తిరించిన కోటూ, ఎదురు రొమ్మున షర్టుకు కంచు పిస్తోలు అలంకరించిన పిన్నూ ధరించి ఉన్నాడు. ఆ యువకుడు వెనక్కు తిరిగి బండీని తేరిపారజూసి, తన టోపీ గాలికి ఎగిరిపోకుండా చేత్తో పట్టుకుని తన దారిన తాను వెళ్ళాడు.”

కథలో మళ్ళీ ఎక్కడా ప్రస్తావనే రాని ఈ యువకుణ్ణి ఇంత ఖచ్చితంగా వర్ణించటం నబొకొవ్‌ను ఆకర్షించింది. ఇది గొగోల్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేకతగా ఆయన భావించాడు. గొగోల్ మీద ఆయన రాసిన పుస్తకం “నికొలాయ్ గొగోల్”లో దీన్ని ఇలా వివరిస్తాడు:

“Another special touch is exemplified by the chance passerby—that young man portrayed with a sudden and wholly irrelevant wealth of detail: he comes there as if he was going to stay in the book (as so many of Gogol’s homunculi seem intent to do—and do not). With any other writer of his day the next paragraph would have been bound to begin: ‘Ivan, for that was the young man’s name.’ . . . But no: a gust of wind interrupts his stare and he passes, never to be mentioned again.”

నబొకొవ్ కూడా “ద గిప్ట్”లో దీన్ని అనుకరిస్తాడు. నవల మొదట్లో ఫియొదొర్ అద్దెకు దిగిన గదికి పైవాటాలో ఇద్దరు దంపతులు (లోరెంజోస్) అద్దెకు దిగుతారు. మొదటి పేజీలో వీళ్ళ వర్ణన ఎంత విశదంగా వుంటుందంటే, వీళ్ళది నవల్లో చాలా ముఖ్యమైన పాత్రేమో అని మనకనిపిస్తుంది. కానీ ఈ రెండు పాత్రలూ కథలో ఎక్కడా ప్రత్యక్షంగా కలగజేసుకోవు. ఈ అనుకరణే గొగోల్‌కు నబొకొవ్ ఇచ్చిన నివాళి. అయితే, ఈ విషయంలో ఆయన గొగోల్ కన్నా ఒక అడుగు ముందుకే వేసాడని చెప్పాలి. ఈ దంపతులు కథలో ప్రత్యక్షంగా భాగం కాకపోయినా, ఈ నవల సృష్టికి వాళ్ళే పరోక్ష కారణమవుతారు. ఎందుకంటే, విధి తననూ జినానూ కలపడానికి వేసిన పథకంలో భాగంగానే ఈ దంపతులు తన గది పైవాటాలో అద్దెకు దిగారని ఫియొదొర్ భావిస్తాడు. ఈ ఆలోచనే అతని నవలకు ప్రధాన ప్రేరణ అవుతుంది. ఇది బ్రైన్ బోయ్డ్ వివరణ.

రెండో అధ్యాయం: ఈ అధ్యాయంలో ఫియొదొర్ తండ్రి జీవితచరిత్ర సింహభాగం ఆక్రమిస్తుంది. అందులో మళ్ళీ ఆయన మధ్య ఆసియాలో చేసిన పరిశోధనాయాత్రలు ప్రధానం. ఈ యాత్రల వర్ణన సాగినన్ని పేజీలూ మన మనోఫలకంపై ఒక చిత్రమైన ప్రపంచం వచ్చి నిలుస్తుంది. అది నిజమూ అనిపించదు, కల్పనా అనిపించదు. ఫియొదొర్‌ ఎంతో ఆశపడినా తండ్రితో కలిసి ఈ యాత్రల్లో పాల్గొనే అవకాశం ఎప్పుడూ రాలేదనీ, ఆ తీరని కోరికే ఈ రచన ద్వారా తీర్చుకుంటున్నాడనీ ముందు చెప్పాను. ఇక్కడ తీరని కోరికలు తీర్చుకుంటున్నది ఫియొదొర్ ఒక్కడే కాదు. నబొకొవ్‌ కూడా సీతాకోకచిలుకల నమూనాల్ని సేకరించడానికి ఒక్కసారైనా మధ్యఆసియా అంతా చుట్టిరావాలని ఆశపడ్డాడు. కానీ బోల్షెవిక్ విప్లవం, దరిమిలా ప్రవాసం, అక్కడి దారిద్ర్యం, ఆయనకా అవకాశాన్ని దక్కనివ్వలేదు. ఇలాంటి యాత్రలు చేసిన పరిశోధకుల పుస్తకాలు మాత్రం చాలా ఆసక్తిగా చదివేవాడు. కాబట్టి ఈ అధ్యాయంలో మనకు కనిపించే మధ్య ఆసియా అంతా ఆయన ఊహల్లో రూపుదేలిందే. మరి ఇందులో గొప్పేముంది? ఈ నవల్లోనే ఫియొదొర్ ఒక చోట అన్నమాట ఇక్కడ అన్వయించుకోవచ్చు: Genius is an African who dreams up snow.

ఈ అధ్యాయం నాకో కొత్త సైడ్‌ఎఫెక్టు నిచ్చింది. సీతాకోకచిలుకల్ని గమనించడం. నబొకొవ్‌లా శాస్త్రీయమైన ఆసక్తి కాదు గానీ, దారంటా ఎప్పుడైనా తారసపడితే ఒక్క క్షణం పరిచయస్తుల్లాంటి గుర్తింపు. వాటిని ఒక్కసారి పట్టించుకోవటం మొదలుపెట్టామంటే, అదేంటో, ఎటు చూసినా అవే కనిపిస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే ఎక్కడ పడితే అక్కడ అవే!

ఈ అధ్యాయం చివర ఫియొదొర్ పాతగది నుంచి కొత్తగదికి మారతాడు. ఈ సందర్భంలో ఈ రెండు గదుల మధ్యనున్న దూరం రష్యాలో పుష్కిన్ వీధికీ, గొగోల్ వీధికి మధ్యనున్న దూరమంత వుందని చెప్తాడు (ఈ పేర్లతో రష్యాలో నిజంగానే రెండు వీధులున్నాయి). ఈ వాక్యం రెండు గదుల మధ్యా దూరాన్ని మాత్రమే సూచించదు; ఇప్పటిదాకా పుష్కిన్ తరహాలో స్వచ్ఛత, స్పష్టత, పారదర్శకత లక్షణాలుగా సాగిన ఫియొదొర్ రచనాశైలి, ఇకనుంచీ గొగోల్ తరహా పదునైన వ్యంగ్యానికి బదిలీ కాబోతోందని కూడా అన్యాపదేశంగా సూచిస్తుంది.

మూడో అధ్యాయం: ఈ అధ్యాయం రెండో అధ్యాయంలా మందకొడిగా కాకుండా, చురుగ్గా సాగుతుంది. కథనంతోపాటూ మనమూ ఫియొదొర్ జీవితంలో ఒక రోజుని అనుసరిస్తాం. అతను బారెడు పొద్దెక్కాకా తన కొత్త గదిలో నిద్రలేవటం, జినాకో కవిత రాయటానికుపక్రమించటం, తర్వాత భోజనం చేసి ట్యూషన్లు చెప్పుకోవటానికి బయల్దేరటం, ట్యూషన్ల మధ్య విరామంలో పుస్తకాల షాపుకెళ్ళి చెస్ మేగజైన్ కొనుక్కోవటం, చీకటిపడేదాకా అందులోని చెస్ పజిల్స్‌ని పరిష్కరించటం, రాత్రి జినాను కలవడానికి రైల్వే బ్రిడ్జి దగ్గరకు వెళ్లడం, ఇద్దరి మధ్యా కబుర్లూ. . . ఇలా ఈ రోజు గడుస్తుంది. ఒకపక్క వర్తమానం ఇలా సాగుతుండగానే, గతం కూడా మధ్య మధ్యలో వచ్చి జొరబడుతూంటుంది. ఈ గతంలో ఫియొదొర్‌‌కు కవిత్వంపై ఆసక్తి ఎలా మళ్ళిందీ, అది పరిణతి చెందిన తీరూ, పదహారేళ్ల వయసులో ఒక పెళ్ళయిన యువతితో అతని ప్రేమ (ఆమె తర్వాత ఒక ప్రమాదంలో చనిపోతుంది) . . . ఇలాంటి పాత జ్ఞాపకాల్తో బాటూ, జినాతో తొలిసారి మాట్లాడే సన్నివేశం మొదలైన ఇటీవలి జ్ఞాపకాలు కూడా వుంటాయి. తర్వాత జినాని ఒక పాత్రగా మరింత సమగ్రంగా మనకు పరిచయం చేసేందుకు ఆమె గతం, ఆమె ఇష్టపడే తండ్రి, ఆమె ద్వేషించే సవతి తండ్రీ, ఆమె విసుక్కునే ఆఫీసూ. . . వీటన్నింటి గురించీ కూడా విస్తారంగా వివరిస్తాడు ఫియొదొర్. తర్వాత కథనం చెర్నిషెవ్‌స్కీ పుస్తకం వైపు మళ్ళుతుంది. ఆ పుస్తకం రాయటానికి అతను పడిన ప్రయాస చూస్తాం. చాలా అనిశ్చితి తర్వాత పుస్తకం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ఈ శుభవార్తను జినాతో పంచుకోవటానికి ఫియొదొర్ ఆమె ఆఫీసుకు రావటంతో అధ్యాయం పూర్తవుతుంది.

ఫియొదొర్ స్వంత రచనలు, యాషా లాంటి వేరేవాళ్ళ కథలూ లేకుండా, నవలకు సంబంధించిన కథ మాత్రమే ప్రధానంగా నడిచే ఏకైక అధ్యాయం ఇది. అధ్యాయానికి సరిగ్గా మధ్యలో జినా కోసం ఫియొదొర్ రాసిన కవిత, బెర్లిన్ వీధి దీపాల క్రింద వాళ్ళిద్దరి సమావేశం ఉంటాయి. ఫియొదొర్ తన జినాని పాఠకుల ముందుకు అందంగా తీసుకురావటానికి ఎంత కష్టపడతాడో, ప్రేమికులుగా తామిద్దరికీ చెందినవి తమకే దాచుకోవడానికీ అంతే జాగ్రత్తపడతాడనిపిస్తుంది. వాళ్ళ మధ్య ఎప్పుడు ఏ కబుర్లు కొనసాగినా అవి మామూలు విషయాలే అయివుంటాయి. ప్రత్యేకంగా పాఠకుల కోసమే అల్లి ప్రదర్శిస్తున్నట్టూ వుంటాయి. మనల్ని గడప దాకా రానిస్తాడు గానీ, ఇక లోపలికి అడుగు పెట్టడమే తరువాయి అనిపించగానే, తమ పొదరింటి తలుపు మొహం మీదే మూసేస్తాడు. మొత్తం నవల్లో ఆమె పట్ల తన అనుభూతిని తిన్నగా వ్యక్తం చేసేది ఒకే ఒక్క పేరాలో, అది కూడా ప్రథమ పురుషలో (థర్డ్ పెర్సన్):

“What was it about her that fascinated him most of all? Her perfect understanding, the absolute pitch of her instinct for everything that he himself loved? In talking to her one could get along without any bridges, and he would barely have time to notice some amusing feature of the night before she would point it out. And not only was Zina cleverly and elegantly made to measure for him by a very painstaking fate, but both of them, forming a single shadow, were made to the measure of something not quite comprehensible, but wonderful and benevolent and continuously surrounding them.”

You Might Also Like

6 Comments

  1. Meher

    కల్పన గారూ,

    మీరు లింకివ్వడం మర్చిపోయినట్టున్నారు.

    నేను లొలీటా గురించి నా బ్లాగులో, ఇంత విస్తారంగా కాదు గానీ, 2007లో చదివిన పుస్తకాలన్నింటినీ మూకుమ్మడిగా సమీక్షించిన సందర్భంలో కొంత రాసాను. లింకు ఇది:

    http://loveforletters.blogspot.com/2007/12/blog-post.html

    అవును, మీరన్నట్టూ కొన్ని మంచి పరిచయాలున్నాయి. ఉదాహరణకి దాస్తొయెవ్‌స్కీ “క్రైం అండ్ పనిష్మెంట్” మీద కీత్ బైరన్ అనే ఆయన రాసిన ముందుమాట నాకు చాలా ఉపయోగపడింది:

    http://loveforletters.blogspot.com/2008/10/notes-on-narrative-of-crime-and.html

    స్టడీ గైడ్స్ ఆలోచన పట్ల నాకేం వ్యతిరేకత లేదు. ఎటువంటి సిద్ధాంతాల, ధోరణుల చత్వారపు కళ్ళద్దాలూ లేకుండా ఒక రచయితని యథాతథంగా చూసి ప్రేమించగలిగిన వాళ్ళు అతని రచనల గురించి ఏ కాస్త రాసినా ఖచ్చితంగా పదిమందికీ ఉపయోగపడతుంది. ఆ ఆలోచన బాగుంది. నాది సమ్మతమే.

    ~ మెహెర్

  2. kalpana

    మెహర్,
    The Annotated Lolita చదవలేదు. లోలిత కి ఏదో వివరణ అవసరమని కాదు. మీరేలా ఫీల్ అయ్యారని. మీరు రాసి వుంటే చదువుదామని. స్టడీ గైడ్స్ మీరు వొప్పుకోకపోయినా నేనైతే మంచి ఆలోచన అంటాను. వాటి కంటే ముఖ్యం గా లోతైన పరిశీలన తో వుండే ఇంట్రడక్షన్స్ మాత్రం మన తెలుగు పుస్తకాల్లో ఎప్పుడైనా చూడగలమా? నోబోకోవ్ ని ఇంత ప్రేమించేవాళ్ళు తెలుగుదేశం లో వున్నారని అనుకోలేదు. తన అసంపూర్తి నవల మీద ఇక్కడ మంచి చర్చ జరుగుతోంది. వీలైతే చూడండి. ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామం కదా.
    కల్పన

  3. Meher

    RK: thanks 🙂

    పూర్ణిమ: తెలుగులో స్టడీ గైడ్స్ సంస్కృతి వున్నట్టు నాకైతే తెలీదు. కొన్ని తెలుగు క్లాసిక్స్ మీద సిద్ధాంత గ్రంథాలు, వ్యాసాలూ వున్నాయి. కానీ వాటిల్లో చాలావరకూ చెరుకు పిప్పే. వాటి మూలాలకు రచయితలు ఏమాత్రం వుద్దేశించని నానా వికృతులూ, విపరీతార్థాలూ వాటిల్లో వుంటాయి. ఉదాహరణకి: శ్రీపాద కథల్లో ప్యూడలిస్టు వ్యవస్థ, మల్లాది కథల్లో వేశ్యా సంస్కరణ దృష్టి… యిలాంటి నవ్వు తెప్పించే శీర్షికల్తోనన్నమాట. ఇంగ్లీషు స్టడీ గైడ్స్ కూడా చాలావరకూ దీనికి మినహాయింపేం కాదు. అందుకే, స్టడీ గైడ్స్ మంచివా కావా అన్నది, ఆ గైడు ఎవరన్న దాన్ని బట్టీ వుంటుందనిపిస్తుంది నాకు. మన అభిరుచిని బట్టీ నిశితంగా ఎన్నుకోవాలి. లేకపోతే అవి, తాత్కాలికంగానైనా, మన సొంత దృష్టిని మ్యుటిలేట్ చేయగలవు.

    నేనిక్కడ రాసింది కూడా స్టడీగైడూ కాదు, సమగ్ర పరిచయమూ అనిపించటంలేదు. ఇది ఒక రకంగా ఋణం తీర్చుకోవడం (తీర్చగలిగినంత మేరకు తీర్చుకోవడం)లాంటిది. పుస్తకం చదివేవాళ్ళు చదువుతారు, లేనివాళ్ళు లేదు. కానీ బాధ్యత వుందనిపించింది. మరేదైనా పుస్తకానికి ఇంత విశ్లేషణ అవసరమనిపిస్తే తప్పకుండా రాస్తాను.

    >>> చారిత్రిక అవసరాన్ని గుర్తించి… 😛

    కల్పన గారూ, నబొకొవ్ లొలీటా మీద, ఆయన అసంపూర్తి నవల మీదా నేను పెద్దగా ఏం రాయలేదు. “లొలీటా” విషయంలో ఇంత వివరణ ఏమీ అవసరం లేదనిపిస్తుంది. కానీ నబొకొవ్ అందులో ఇమిడ్చిన పజిల్స్‌ని, పన్స్‌నీ, పాఠకుల్ని బుట్టలో పడేయటానికి అల్లిన పన్నాగాల్నీ తెలుసుకుంటూ, మరింత ఆస్వాదిస్తూ, ఆ పుస్తకాన్ని చదవాలంటే, Alfred Appel, Jr. అనే రచయిత రాసిన “The Annotated Lolita” బాగా పనికొస్తుంది. నాకీ మధ్యనే దొరికింది. దీన్ని పక్కన పెట్టుకుని “లొలీటా” మరొక్కసారి చదువుదామనుకుంటున్నాను.

    అమెజాన్ లింకు: http://www.amazon.com/Annotated-Lolita-Revised-Updated/dp/0679727299

    అయితే దీని సాయం లేకుండా అన్నొటేషన్స్ లేని పుస్తకం విడిగా ఒకసారి చదివేసి, రెండో పఠనానికి మాత్రమే దీన్ని ఉపయోగించడం మంచిది. లేకపోతే, మొదటి పఠనంలోనే మాటి మాటికీ పేజీలు తిప్పి వివరాలు చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి చదవడం అంటే, తొందర్లోనే విరక్తి పుడుతుంది.

    ~ మెహెర్

  4. kalpana

    మెహర్,
    నోబోకోవ్ లోలిత మీద, తన కొత్త అసంపూర్తి నవల మీద కూడా ఇలాగే ఏమైనా రాసారా? మీ బ్లాగ్ గురించి ఇప్పుడే వినటం. అక్క్దకు వచ్చు చూసి చెప్తాను. లేదా మీరు ఇక్క్ద లింక్ పెట్టినా పర్వాలేదు. ఇంట శ్రమ తీసుకొని, ఇంత వివరం గా రాయటం తోనే మీకు నోబోకోవ్ అంటే ఎంత ప్రేమనో అర్ధం అవుతుంది.
    పూర్ణిమ,
    స్టడీ గైడ్ మంచి ఆలోచన. ఇంగ్లిష్ పుస్తకాల్లో ఆ చివర్ణ ఇచ్చే కొన్ని ప్రశ్నల వల్ల మనం ఆ రచనాని ఎలా అర్ధం చేసుకుంటున్నాము, ఎలా అర్ధం చేసుకోవచ్చు రెండు విషయాలు తెలుస్తాయి.
    కల్పనరెంటాల

  5. Purnima

    తెలుగులో తెలుగు పుస్తకాలపై “స్టడీ గైడ్స్” లాంటి సంసృతి ఉందా? ఏదైనా సంక్లిష్ట రచనను అర్థం చేసుకోడానికి వీలుగా సూచనలతో కూడిన వ్యాఖ్యానం వచ్చిందా? ఉంటే తెలియజేయగలరు.

    మెహర్ గారు, మీరింకొన్ని వ్యాసాలు ఇదే తీరులో రాస్తే మేం “స్టడీ గైడ్” అన్న కాటగిరీ పెడతాం! 🙂

    మీ పుస్తక పఠనాసక్తి బ్లాగ్జగత్విదితమే! ఇంత శ్రమకోర్చి ఇంత సమగ్రంగా పుస్తకాన్ని, దాన్ని ఆస్వాదించాల్సిన తీరుని పరిచయం చేసినందుకు వేవేల నెనర్లు!

    ఇలాంటి వ్యాసాలు మరిన్ని రాయడానికి మీకు తగినంత ఓపిక, సమయం, మూడ్ అన్నీ కుదరాలని కోరుకుంటున్నాను. పుస్తకాల విషయంలో చారిత్రిక అవసరాన్ని గుర్తించి, ఆ బాధ్యతను భుజం మీద వేసుకున్నందుకు అభినందనలు! 🙂

  6. RK

    One of the best reviews on this site. Comprehensive!

Leave a Reply